నీరంతా ఎక్కడికి వెళుతోంది?
నీరంతా ఎక్కడికి వెళుతోంది?
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! రచయిత
భయం! అదే నా మొదటి ప్రతిస్పందన. నా బాత్‌రూమ్‌లో ఉన్న డ్రైనేజీ రంధ్రం నుండి పైకివస్తున్న బూడిదరంగు ద్రవం నా అపార్ట్‌మెంట్‌ను దుర్వాసనగల బురదగుంటలా మార్చివేస్తానని బెదిరిస్తోంది. సహాయం కోసం నేను వెంటనే ప్లంబర్‌కు ఫోన్ చేశాను. భయంతో నా నోరు ఎండిపోయింది, నీళ్ళు మెల్లగా నా సాక్సుల్లోకి వెళుతుండగా ఆందోళనతో వేచివున్న నేను, ‘ఈ నీళ్ళన్నీ ఎక్కడనుండి వచ్చాయి?’ అని ఆశ్చర్యపోయాను.
డ్రైనేజీలో ఇరుక్కున్న చెత్తను నెమ్మదిగా తీసివేస్తూ ప్లంబర్ ఇలా వివరించాడు: “ఒక సాధారణ పట్టణవాసి ప్రతీరోజు 200 నుండి 400 లీటర్ల నీటిని ఉపయోగిస్తాడు. ప్రతీ పురుషుడు, స్త్రీ, శిశువు ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 లీటర్ల నీరు ఉపయోగిస్తారు.” “నేను అన్ని నీళ్ళు ఎందుకు ఉపయోగిస్తాను? ఖచ్చితంగా నేను అన్ని నీళ్ళు త్రాగనే!” అని అన్నాను. “అది నిజమే, కానీ మీరు ప్రతిరోజు స్నానం చేస్తారు, టాయిలెట్‌లో నీళ్ళు ఉపయోగిస్తారు, బహుశా వాషింగ్ మెషీన్ లేదా గిన్నెలు తోమే మెషీన్ ఉపయోగిస్తారు. ఈ విధంగా, మరితర విధాల్లో ఆధునిక జీవనవిధానం మన తాతామామ్మలు ఉపయోగించిన నీటికంటే రెండు రెట్లు ఎక్కువ నీటిని మనం ఉపయోగించేలా చేస్తుంది” అని ఆయన చెప్పాడు. అప్పుడు అకస్మాత్తుగా నా మనస్సులో ఈ ప్రశ్న మెదిలింది, ‘మరి ఆ నీరంతా ఎక్కడికి వెళుతోంది?’
మనం నివసిస్తున్న దేశం లేదా పట్టణం మీద ఆధారపడి రోజు మనం వాడి పారేసే నీరు వేర్వేరుగా ఉపయోగించబడుతుందని నేను తెలుసుకున్నాను. కొన్ని దేశాలలో ఇది ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారింది. (23వ పేజీలోని బాక్సులను చూడండి.) స్థానిక వ్యర్థజల శుద్ధీకరణ ప్లాంట్‌కు నాతో వచ్చి దానిలో పర్యటించి నీరంతా ఎక్కడికి వెళుతోందో, మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ డ్రైనేజీలో లేదా టాయిలెట్‌లో ఏదైనా పడేసేముందు జాగ్రత్తగా ఆలోచించడం ఎందుకు అవసరమో స్వయంగా మీరే తెలుసుకోండి.
వ్యర్థజల శుద్ధీకరణ ప్లాంట్‌ను సందర్శించడం
వ్యర్థజల శుద్ధీకరణ ప్లాంట్, సందర్శించడానికి ఆకర్షణీయమైన ప్రదేశంలా అనిపించడం లేదే అని మీరనుకుంటున్నారని నాకు తెలుసు. నిజమే నేను మీతో ఏకీభవిస్తున్నాను. అయితే, మన నగరం దాని సొంత మురికిలో కొట్టుకుపోకుండా ఉండడానికి మనలో చాలామందిమి ఇలాంటి ప్లాంట్‌ల మీద ఆధారపడతాము—ఇలాంటి ప్లాంట్‌లు సరిగ్గా పనిచేయడానికి మనమందరం మన వంతు మనం చేయాలి. ఇప్పుడు, ప్రఖ్యాతిగాంచిన సిడ్నీ ఓడరేవుకు దక్షిణాన ఉన్న మలబార్‌లోని ప్రాథమిక శుద్ధీకరణ ప్లాంట్‌ను చూద్దాము. నా బాత్‌రూమ్‌లోని నీరు ఈ ప్లాంట్‌కి ఎలా చేరుతుంది?
నేను టాయిలెట్‌లో లేదా సింక్‌లో నీళ్ళు పోసినప్పుడు, స్నానం చేసినప్పుడు ఆ నీరు వ్యర్థజల శుద్ధీకరణ ప్లాంట్ వైపు ప్రయాణిస్తుంది. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఈ నీరు ప్రతిరోజూ శుద్ధీకరణ ప్లాంట్‌లోకి వేగంగా ప్రవహించే 480 కోట్ల లీటర్ల నీటితో కలుస్తుంది.
ఈ శుద్ధీకరణ ప్లాంట్ చూడడానికి అసహ్యంగా దుర్వాసనతో ఎందుకుండదో వివరిస్తూ ప్లాంట్ కమ్యూనిటీ లైసన్ అధికారి రాస్ నాకు ఇలా చెప్పాడు: “ప్లాంట్‌లోని అధికభాగం భూమిలోపల ఉంది. వాయువులను బంధించి గాలిని శుద్ధిచేసే స్క్రబ్బర్‌లలోకి (కుండ ఆకారంలో ఉండే పెద్ద చిమ్నీల వరుస) వాటిని పంపించడానికి అది సహాయపడుతుంది. ఈ స్క్రబ్బర్‌లు దుర్వాసనలను నిర్మూలిస్తాయి. ఆ తర్వాత ఈ శుభ్రపర్చబడిన గాలి వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. ప్లాంట్ చుట్టూ వేలాది గృహాలు ఉన్నప్పటికీ దుర్వాసన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఒక సంవత్సరంలో నాకు కేవలం పది ఫోన్ కాల్‌లు మాత్రమే వస్తాయి.” రాస్ ఇప్పుడు
తీసుకువెళ్ళబోయే ప్రాంతమే ఈ “దుర్వాసన సమస్యలకు” మూలం అనడంలో సందేహం లేదు.వ్యర్థజలం అంటే ఏమిటి?
ప్లాంట్ లోపలికి దిగుతుండగా మార్గదర్శకుడు ఇలా చెప్పాడు: “వ్యర్థజలం అంటే 99.9 శాతం నీరు మరియు మానవ మలవిసర్జనం, రసాయనాలు, చిన్నచిన్న పనికిరాని వస్తువులు. 55,000 హెక్టారుల [1,30,000 ఎకరాల] వైశాల్యంగల ప్రాంతంలో ఉన్న ఇళ్ళ నుండీ కర్మాగారాల నుండీ పోగుచేయబడిన వ్యర్థజలం, 20,000 కిలోమీటర్ల [12,000 మైళ్ళ] పొడవున్న పైపుల ద్వారా ప్రయాణించి సముద్ర మట్టానికి రెండు మీటర్ల [6 అడుగుల] దిగువన ఉన్న ప్లాంట్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ, నీటిలో ఉన్న గుడ్డపీలికలు, రాళ్ళు, కాగితాలు, ప్లాస్టిక్ తీసివేయబడడానికి అది అనేక పొరలగుండా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత గ్రిట్ చాంబర్‌లలో (ఇసుక, రాళ్ళు తీసివేయబడే చాంబర్‌లు) నీటిలోకి గాలిబుడగలను వదలడం జరుగుతుంది. అప్పుడు సేంద్రియ పదార్థాలన్నీ నీటిలోని గాలిబుడగల ద్వారా పైకి
తేలతాయి, బరువుగల ఇసుక రాళ్ళ వంటివి నెమ్మదిగా అడుగుకు చేరతాయి. ఇలా అడుగుకు చేరిన పదార్థాలన్నీ లాండ్‌ఫిల్ ప్రాంతానికి (చెత్త వేయడానికి భూమిలో త్రవ్వబడిన గుంట) పంపించబడతాయి. మిగిలిన వ్యర్థజలం 15 మీటర్ల [50 అడుగుల] ఎత్తులోవున్న సెడిమెంటేషన్ (ఘనపదార్థాలు అడుక్కి చేరడానికి వీలున్న) ట్యాంక్‌లకు పంపించబడుతుంది.ఈ ట్యాంక్‌లు దాదాపు ఒక సాక్కర్ ఫీల్డ్ పరిమాణంలో ఉంటాయి, గాలిని శుద్ధిచేసే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఇరుగుపొరుగు ప్రజలు ఎంతగా ఫిర్యాదు చేయవచ్చో ఈ స్థలంలో మీరు గ్రహిస్తారు. ఈ ట్యాంక్‌లలోకి నీరు నెమ్మదిగా ప్రవహిస్తుండగా పైకి తేలిన నూనె, చమురు తీసివేయబడతాయి. మెత్తని ఘనపదార్థాలు అడుగుకు చేరుకుంటాయి, పెద్ద పెద్ద యాంత్రిక బ్లేడ్‌లు ఈ పదార్థాన్ని తీసివేస్తాయి. తర్వాత అది మరింత శుద్ధీకరించబడడానికి పంపించబడుతుంది.
ఇలా శుద్ధీకరించబడిన వ్యర్థజలం భూగర్భంలో మూడు కిలోమీటర్ల పొడవున్న సొరంగం ద్వారా సముద్రంలోకి ప్రయాణిస్తుంది. అక్కడ ఈ నీరు సముద్రపు నేలనుండి—సముద్రపు అలల క్రింద 60 నుండి 80 మీటర్ల క్రిందనుండి—బయటకు వచ్చి సముద్రపు నీటిలో కలిసిపోతుంది. బలమైన సముద్రపు అలలు ఈ వ్యర్థజలాన్ని వ్యాపింపజేస్తాయి, సముద్రపు ఉప్పు నీటికున్న శుభ్రపరిచే సహజ గుణం శుద్ధీకరణ ప్రక్రియను ముగిస్తుంది. శుద్ధీకరణ ప్లాంట్‌లో మిగిలిపోయిన పదార్థం, ఆక్సిజన్ లేకుండా ఉండే ఎనరోబిక్ డైజెస్టర్‌లు అని పిలువబడే పెద్ద ట్యాంక్‌లలోకి పంపించబడుతుంది. ఈ ట్యాంక్‌లలోని సూక్ష్మక్రిములు సేంద్రియ పదార్థాలను మూలపదార్థాలుగా వేరుపరిచి మీథేన్ వాయువు, బురద తయారయ్యేలా చేస్తాయి.
బురద నుండి మట్టి
ఆ దుర్వాసన నుండి దూరంగా వస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ నేను రాస్‌తోపాటు శుభ్రమైన గాలిని పీల్చుకోవడానికి పైకి వచ్చి, ఎయిర్‌టైట్ బురద ట్యాంక్‌లలో ఒకదాని పైకి ఎక్కిన తర్వాత ఆయన ఇలా కొనసాగించాడు: “సూక్ష్మక్రిముల ద్వారా ఉత్పత్తి చేయబడిన మీథేన్ వాయువు ఎలక్ట్రిక్ జెనరేటర్లకు విద్యుచ్ఛక్తిని అందించడానికి ఉపయోగించబడుతుంది, ప్లాంట్ పనిచేయడానికి అవసరమయ్యే విద్యుచ్ఛక్తిలో 60 శాతం కంటే ఎక్కువ శక్తిని మీథేన్ వాయువే సరఫరా చేస్తుంది. ఇక ఆ బురద రోగక్రిములు లేకుండా శుభ్రపరచబడి, దానిలో సున్నం కలుపబడుతుంది. ఇప్పుడు ఆ బురద మొక్కలకు పోషణనిచ్చే బయోసాలిడ్‌లు సమృద్ధిగా ఉన్న ఉపయోగకరమైన పదార్థంగా తయారయ్యింది. మలబార్ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఒక్కటే ప్రతి సంవత్సరం 40,000 టన్నుల బయోసాలిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. పది సంవత్సరాల క్రితమైతే శుద్ధీకరించబడని బురద కాల్చివేయబడేది లేక సముద్రంలో పడవేయబడేది; కానీ ఇప్పుడు అది మరింత ప్రయోజనకరంగా ఉపయోగించబడుతోంది.”
రాస్ నా చేతికి ఒక బ్రోషుర్‌ను అందించాడు, అది ఇలా వివరిస్తోంది: “[న్యూ సౌత్ వేల్స్]లోని అడవుల్లో బయోసాలిడ్‌లు ఉపయోగించబడిన తర్వాత 20 నుండి 35 శాతం వరకూ ఎక్కువ పెరుగుదల కనిపించింది.” ‘బయోసాలిడ్‌లు వేయబడిన పొలాల్లో పెంచబడిన గోధుమలు 70 శాతం వరకూ అధిక పంటను ఉత్పత్తి చేశాయి’ అని కూడా అది నివేదించింది. కంపోస్టుగా చేయబడిన బయోసాలిడ్‌లు నా తోటలోని పూల మొక్కలను బలపర్చేందుకు ఉపయోగించడానికి కూడా సురక్షితమని నేను గ్రహించాను.
కళ్ళ ఎదుటి నుండి పోతే మదిలో నుండి పోయినట్లేనా?
పెయింట్, క్రిమిసంహారకాలు, మందులు లేదా నూనె డ్రైనేజీలో పడేస్తే శుద్ధీకరణ ప్లాంట్‌లోని సూక్ష్మక్రిములు చనిపోతాయి. అప్పుడు శుభ్రపరిచే ప్రక్రియకు భంగం కలుగుతుందని టూర్ ముగింపులో మన మార్గదర్శకుడు నాకు గుర్తుచేశాడు. ‘నూనె, కొవ్వు పదార్థాలు మన గుండెలోని ధమనుల్లో అడ్డంవచ్చినట్లే శుద్ధీకరణ ప్లాంట్‌లోని పైపుల్లోనూ అడ్డుతగలవచ్చనీ టాయిలెట్‌లో పడవేసిన డైపర్లు, బట్టలు, ప్లాస్టిక్ నిజంగా మాయమైపోవనీ అవి పైపుల్లో ఇరుక్కుంటాయనీ’ నొక్కి చెప్పాడు. చెత్తను టాయిలెట్‌లో పడేసి దాన్ని కనపడకుండా చేయవచ్చునేమో కానీ నీళ్ళు డ్రైన్‌లోనుండి బయటకు వచ్చినప్పుడు వెంటనే అది మదిలో మెదులుతుందని నాకర్థమయ్యింది. కాబట్టి ఈసారి మీరు స్నానం చేసినప్పుడు, టాయిలెట్‌లో లేదా సింక్‌లో నీళ్ళు పోసినప్పుడు ఆ నీరంతా ఎక్కడికి వెళుతుందో ఆలోచించండి. (g02 10/8)
[21వ పేజీలోని బాక్సు/చిత్రం]
వ్యర్థజలం నుండి త్రాగే నీరు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తక్కువ వర్షపాతంగల ప్రాంతమైన ఆరెంజ్ కౌంటిలోని లక్షలాది మంది నివాసులు, వ్యర్థజల సమస్యకు కనుగొనబడిన ఆధునిక పరిష్కారం నుండి ప్రయోజనం పొందుతున్నారు. ప్రతిరోజు లక్షల లీటర్ల వ్యర్థజలం నేరుగా సముద్రంలో పడవేయబడే బదులు, ఆ నీటిలోని అధికశాతం మళ్ళీ నీటి సరఫరా వ్యవస్థకు చేరుకుంటుంది. అనేక సంవత్సరాలుగా ఈ పనిని ఒక వ్యర్థజల శుద్ధీకరణ ప్లాంట్ నిర్వహిస్తోంది. ప్రాథమిక శుద్ధీకరణ తర్వాత నీరు రెండవ సారి, మూడవ సారి శుద్ధీకరించబడుతుంది. అంటే సాధారణ త్రాగే నీరు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా నీటిని శుద్ధీకరించడం అన్నమాట. అప్పుడు ఆ నీరు బావి నీటితో కలపబడుతుంది, ఆ తర్వాత అవి భూమిలోపల నీరు నిలిచే స్థలంలోకి వెళతాయి. భూమిలోపల ఉండే నీరు అయిపోకుండా ఈ నీరు అక్కడికి చేరుకుని భూగర్భంలో ఉన్న నీటిలో ఉప్పు నీళ్ళు కలిసిపోయి వాటిని పాడుచేయకుండా నివారిస్తుంది. ఆ జిల్లాలోని నీటి అవసరాల కోసం 75 శాతం వరకూ నీరు ఈ భూగర్భ సరఫరా నుండే తీసుకోబడుతుంది.
[23వ పేజీలోని బాక్సు]
నీటిని యుక్తంగా ఉపయోగించడానికి ఐదు మార్గాలు
◼ లీక్ అవుతున్న వాషర్‌లను మార్చండి—నీళ్ళు కారుతున్న కుళాయి సంవత్సరానికి 7,000 లీటర్ల నీటిని వృధా చేయగలదు.
◼ మీ టాయిలెట్ లీక్ అవ్వకుండా చూసుకోండి—అది సంవత్సరానికి 16,000 లీటర్ల నీటిని వృధా చేయగలదు.
◼ బాత్‌రూమ్‌లోని షవర్‌కు మంచి స్ప్రే నాజల్‌ను బిగించండి. ఒక సాధారణ షవర్ హెడ్ నిమిషానికి 18 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది; అయితే ఒక లో-ఫ్లో షవర్ హెడ్ నిమిషానికి 9 లీటర్ల నీటిని మాత్రమే విడుదల చేస్తుంది. అలా నలుగురు సభ్యులున్న కుటుంబం సంవత్సరానికి 80,000 లీటర్ల నీటిని ఆదా చేస్తుంది.
◼ మీ టాయిలెట్‌కు రెండు ఫ్లష్‌లు ఉన్నట్లైతే, సముచితమైనప్పుడు సగం ఫ్లష్‌ను మాత్రమే వాడండి—అలా చేస్తే, నలుగురు సభ్యులున్న కుటుంబానికి సంవత్సరానికి 36,000 లీటర్ల నీటికంటే ఎక్కువ నీరు ఆదా అవుతుంది.
◼ మీ ఇంట్లోని కుళాయిలకు ఎరేటర్‌లను ఏర్పాటు చేయండి—ఇవి చాలా తక్కువ ఖరీదుకే లభిస్తాయి. అవి నీటి ఉపయోగాన్ని తగ్గించకుండానే నీటి ప్రవాహాన్ని సగం వరకూ తగ్గిస్తాయి.
[23వ పేజీలోని బాక్సు]
ప్రపంచ వ్యర్థజల సంకటావస్థ
“120 కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలకు ఇప్పటికీ శుభ్రమైన త్రాగే నీరు లభించడం లేదు, 290 కోట్ల మంది ప్రజలకు తగిన పారిశుద్ధ్య సదుపాయాలు లేవు. దీనివల్ల ప్రతి సంవత్సరం 50 లక్షల మంది, ఎక్కువగా పిల్లలు, కలుషిత నీటివల్ల వచ్చే వ్యాధుల మూలంగా మరణిస్తున్నారు.”—నెదర్‌లాండ్స్‌లోని హేగ్‌లో నిర్వహించబడిన రెండవ ప్రపంచ నీటి సమావేశం.
[22వ పేజీలోని డయాగ్రామ్/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
మలబార్‌లో వ్యర్థజల శుద్ధీకరణ ప్రక్రియ ( రళీకృతం చేయబడిన దృశ్యం)
1. వ్యర్థజలం ప్లాంట్‌లోకి ప్రవేశిస్తుంది
2. పొరలగుండా ప్రయాణిస్తుంది
3. ఇసుక, రాళ్ళు తీసివేయబడే చాంబర్‌లు
4. లాండ్‌ఫిల్ ప్రాంతానికి
5. సెడిమెంటేషన్ ట్యాంక్‌లు
6. సముద్రానికి
7. ఎనరోబిక్ డైజెస్టర్‌లు
8. ఎలక్ట్రిక్ జెనరేటర్‌లు
9. బయోసాలిడ్‌లను నిల్వచేసే ట్యాంక్
[చిత్రాలు]
ఎనరోబిక్ డైజెస్టింగ్ ట్యాంక్‌లు బురదను ఉపయోగకరమైన ఎరువుగా, మీథేన్ వాయువుగా మారుస్తాయి
విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేయడానికి మీథేన్ వాయువు కాల్చబడుతుంది