కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెదవులను వారెలా చదువుతారు?

పెదవులను వారెలా చదువుతారు?

పెదవులను వారెలా చదువుతారు?

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

ఉగ్రవాదులుగా అనుమానించబడిన ఇద్దరు వ్యక్తులు ఒక పబ్లిక్‌ పార్క్‌లో మాట్లాడుకుంటుండగా వీడియో తీయబడింది. వాళ్ళేమి మాట్లాడుకుంటున్నారో ఎవ్వరూ వినలేకపోయారు​—⁠అయినప్పటికీ పోలీసులు వాళ్ళను అరెస్టు చేశారు, తర్వాత వారికి అనేక సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. వీడియో తీయబడిన వారి సంభాషణను పెదవులను చదవగల ఒక స్త్రీ చదివింది. ఆ స్త్రీ బ్రిటన్‌లో ఒక నైపుణ్యంగల సాక్షి అని ప్రభుత్వంచేత గుర్తింపు పొందింది, బ్రిటీషు పోలీసుల “శక్తివంతమైన రహస్య ఆయుధం” అని ఆమె వర్ణించబడింది.

పెదవులను చదివే కళ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి నేను మైక్‌, క్రిస్టీనాలను కలవడానికి వెళ్ళాను. క్రిస్టీనాకు మూడేళ్ళ వయస్సు నుండి చెవుడు. తర్వాత ఆమె చెవిటివారి పాఠశాలకు హాజరయ్యింది, అక్కడ ఆమెకు పెదవులను చదవడం నేర్పించబడింది. మైక్‌ పెదవులను చదవడం తనంతట తానే నేర్చుకున్నాడు, ఆయన క్రిస్టీనాను వివాహం చేసుకున్న తర్వాత ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు.

పెదవులను చదవడం ఎంత కష్టం? “మీరు పెదవులు, నాలుక, క్రింది దవడల ఆకారం మీదా వాటి కదలికల మీదా అవధానముంచాలి” అని మైక్‌ చెబుతున్నాడు. క్రిస్టీనా ఇలా అంటోంది: “మీతో మాట్లాడుతున్న వ్యక్తి వైపు మీరు జాగ్రత్తగా చూడాలి, పెదవులను చదివే మీ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ మీరు ఆ వ్యక్తి ముఖకవళికలకు శరీర కదలికలకు కూడా అవధానమిస్తారు.”

నేను నేర్చుకున్న దాని ప్రకారం, మాట్లాడే వ్యక్తి చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, అరవడం లేదా పెదవులను మరీ అతిగా కదల్చడం. ఇలాంటి కృతకమైన కదలికలు తికమకపెడతాయి, వాటి అసలు ఉద్దేశం నెరవేరకుండా చేస్తాయి. పెదవులను చదవడం బాగా నేర్చుకున్న తర్వాత పెదవులను చదివే వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి యొక్క స్థానిక ఉచ్చారణరీతులను గుర్తించడం కూడా సాధ్యమే. అయితే, ఇదంతా సులభం కాదు! పెదవులను చదివే కళను నేర్పించడంలో ప్రావీణ్యతగల హియరింగ్‌ కన్‌సర్న్‌ అనే సంస్థ సూటిగా ఇలా చెబుతోంది: “పెదవులను చదవడానికి అభ్యాసం, అభ్యాసం, మరింత అభ్యాసం అవసరం.”

అయితే కొన్నిసార్లు ఒక బస్సులో లేదా ట్రెయిన్‌లో ఇతరులు మాట్లాడుకుంటున్నప్పుడు తనకు తెలియకుండానే తాను వారి పెదవులను చదువుతున్నానని గ్రహించినప్పుడు తనకు చాలా సిగ్గుకరంగా అనిపిస్తుందని క్రిస్టీనా ఒప్పుకుంటుంది. ఆమె చెయ్యగలిగినదల్లా వెంటనే ప్రక్కకు చూడడమే. కానీ ఆమె సామర్థ్యం ఒక రక్షణగా ఉండగలదు. క్రిస్టీనా ఇప్పుడు టీవీలో సాక్కర్‌ మ్యాచ్‌లను చూడదు, ఎందుకంటే కొంతమంది ఆటగాళ్ళు అంటున్న వాటిని చూసినప్పుడు ఆమెకు ఎన్నోసార్లు చాలా అసహ్యమనిపించింది.

బ్రిటీషు పోలీసుల “రహస్య ఆయుధం” యొక్క నైపుణ్యాలను చాలా కొద్దిమంది మాత్రమే సంపాదించుకోగలరు. కానీ వినగల శక్తిని పోగొట్టుకున్నప్పుడు, పెదవులను చదవడం కూడా పెంపొందించుకోదగిన ఒక విలువైన కళగా ఉండగలదు. (g02 10/8)

[31వ పేజీలోని చిత్రం]

క్రిస్టీనా

[31వ పేజీలోని చిత్రం]

మైక్‌