ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
ఆవులించడంలోని ఆనందాన్ని అనుభవించండి!
గర్భధారణ జరిగిన 11 వారాలకే గర్భంలోని శిశువు ఆవులించడం మొదలుపెడుతుందని స్పానిష్ వారపత్రిక సాలూడ్ వివరిస్తోంది. నిజానికి సస్తన జంతువులలోని అధికశాతం జంతువులు, కొన్ని పక్షులు, సరీసృపాలు అనైచ్ఛికంగా ఆవులిస్తుంటాయని తెలుస్తోంది. మనం ఆవులించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు, అయితే వళ్ళు విరుచుకోవడం వంటి పనులు సాధారణంగా ఆవులించడంతో సంబంధం కలిగివున్నాయని పరిశోధకులు గమనించారు. ఈ కదలికలు “రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని అధికం చేయడంతో పాటు కండరాలకు, కీళ్ళకు విశ్రాంతినిస్తాయి” అని వారు అంటున్నారు. మన దవడలను గట్టిగా పట్టివుంచడం ద్వారా ఆవులింతను నిరోధిస్తే, దానివల్ల వచ్చే ప్రయోజనాలను మనం కోల్పోతాము. కాబట్టి పరిస్థితులు అనుమతిస్తే మనం ఆవులించేటప్పుడు “సహజంగా మన దవడలను ముఖ కండరాలను సడలించుకోవాలి” అని పరిశోధనా జట్టు సలహా ఇస్తుంది. ఒక మంచి ఆవులింత మీ రోజును ఉత్సాహవంతం చేస్తుందేమో! (g02 11/8)
నిద్రపోయే స్విఫ్ట్ పక్షులు తమ స్థానంలోనే ఎలా ఉంటాయి
ఫ్ట్ పక్షులు ఎగిరేటప్పుడు నిద్రపోవడమే కాకుండా, గాలితోపాటు వేరే ప్రాంతానికి కొట్టుకొనిపోకుండా తమ క్షేత్రంలోనే ఉండగలవు. అవి అలా ఎలా చేయగలుగుతున్నాయో కనుగొనడానికి స్వీడన్‌లోని లుండ్ విశ్వవిద్యాలయానికి చెందిన పక్షిశాస్త్ర నిపుణులు యోహాన్ బెక్‌మాన్, థామస్ ఆలర్‌స్టామ్‌లు స్విఫ్ట్ పక్షులు రాత్రిళ్ళు చేసే సంచారాలను కనిపెట్టడానికి రాడార్‌ను ఉపయోగించారు. జర్మన్ వైజ్ఞానిక పత్రిక బిల్డ్ డార్ విస్సన్‌షాఫ్ట్ నివేదించిన ప్రకారం, ఒక ప్రత్యేకమైన ఎగిరే పద్ధతి ద్వారా స్విఫ్ట్ పక్షులు తమ స్థానంలోనే ఉండగలవని పరిశోధకులు గమనించారు. ఈ పక్షులు 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడినుండి గాలికి ఒక కోణంలో ఎగురుతాయి, కొన్ని నిమిషాలకు ఒకసారి క్రమంగా తమ దిశను మారుస్తుంటాయి. ఇలా క్రమంగా దిశలు మార్చడం వల్ల అవి తమ క్షేత్రంలోనే అటూ ఇటూ కదులుతుంటాయి. అయితే, గాలి నెమ్మదిగా వీచేటప్పుడు స్విఫ్ట్ పక్షులు నిద్రపోయే సమయాన్ని వృత్తాలలో తిరుగుతూ గడుపుతాయని గమనించబడింది. (g02 11/22)
ఇంటిపని ప్రయోజనకరమైన వ్యాయామం
ఇంటిని వ్యాక్యూమ్ క్లీనింగ్ చేయడం, కిటికీలను కడగడం, శిశువులను కూర్చోపెట్టే చిన్న బండిని తోసుకెళ్ళడం వంటి పనులను ఆరోగ్యకరమైన వ్యాయామాలుగా వర్గీకరించవచ్చా? ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ వద్ద ఇటీవల నిర్వహించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అవును అన్నది ఆ ప్రశ్నకు జవాబు. పరిశోధకులు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగల పిల్లలున్న ఏడుగురు తల్లులు తమ దినచర్య చేస్తున్నప్పుడు ఎంత ఆక్సిజన్‌ను పీల్చుకుంటున్నారో తెలుసుకోవడానికి వారికి గ్యాస్ అనలైజర్‌లను ఏర్పాటు చేశారు అని ద కాన్‌బెర్రా టైమ్స్ వార్తాపత్రిక వివరిస్తోంది. ఆ పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం, “ఇంటిలో చేసే కొన్ని పనులు ఎంత తీవ్రతతో చేయబడతాయి అంటే ఆరోగ్యానికి కొంత ప్రయోజనాన్ని చేకూర్చేందుకు అవి సరిపోతాయి అని కనుగొనబడిన విషయాలు సూచిస్తున్నాయి.” “ఒక స్త్రీ చేసే ఇంటిపని, వడిగా నడవడం, సైకిల్ తొక్కడం లేదా ఈదడం వంటి తక్కువ తీవ్రతగల వ్యాయామాలకు దాదాపుగా సమానం” అని ప్రొఫెసర్ వెండీ బ్రౌన్ కనుగొన్నట్లు ఆ నివేదిక చెబుతోంది. “ఇది కేవలం ప్రాథమిక పరిశోధన మాత్రమే, అయితే స్త్రీలు రోజంతా ఇంటిపని చేస్తూ తిరుగుతుంటే మీరు వారిని నిష్క్రియులుగా పరిగణించలేరన్నది మాత్రం స్పష్టమౌతోంది” అని బ్రౌన్ చెప్పింది. (g02 11/8)
“మనం నివారించగల వ్యాధి”
“ఆస్టియోపోరోసిస్ అనేది మనం నివారించగల వ్యాధి” అని ఆస్ట్రేలియాకు చెందిన ద సన్-హెరాల్డ్ వార్తాపత్రిక చెబుతోంది. “దాన్ని చాలావరకూ నివారించవచ్చు. అయినా, 2020వ సంవత్సరానికల్లా హాస్పిటళ్ళలో ప్రతి మూడు పరుపుల్లో ఒకదాని మీద, ఎముకలు విరిగిన స్త్రీలు ఉంటారని అంచనా వేయబడుతోంది.” ఆస్టియోపోరోసిస్ ఆస్ట్రేలియా అనే సంస్థ ద్వారా విడుదల చేయబడిన ఒక నివేదిక, ఎముకలలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడేటట్లు ఎముకలు బలహీనమయ్యేటట్లు చేసే ఈ వ్యాధి “అధిక కొలస్ట్రాల్, ఎలర్జీలు, సాధారణ జలుబు కంటే ఎక్కువగా వ్యాపించివుంది. మధుమేహం, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేయడానికి అయ్యే ఖర్చుకంటే ఎక్కువ దీని చికిత్సకు ఖర్చవుతుంది. తుంటి ఎముక విరగడం వల్ల చనిపోయిన స్త్రీల సంఖ్య, స్త్రీలకు వచ్చే కాన్సర్‌లన్నిటి మొత్తం సంఖ్యకంటే ఎక్కువగా ఉంది” అని చెబుతోంది. ప్రొఫెసర్ ఫిలిప్ సామ్‌బ్రూక్ ప్రకారం, ఆస్ట్రేలియాలోని స్త్రీలలో సగం మందికి, పురుషుల్లో మూడవ వంతు మందికి వారి జీవిత కాలంలో ఒకసారి ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముక విరుగుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. “నివారించడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే, జీవితపు మొదటి మూడు దశాబ్దాలలో తగినంత కాల్షియమ్‌ను తీసుకోవడం ద్వారా వ్యాయామం చేయడం ద్వారా ఎముకలను బలపర్చుకోవడమే” అని ఆ వార్తాపత్రిక తెలియజేస్తోంది. పొగత్రాగడాన్ని, అధికంగా మద్యపానాన్ని లేదా కెఫేన్‌ను సేవించడాన్ని నివారించడం ద్వారా ఆస్టియోపోరోసిస్ వల్ల బాధపడే ప్రమాదాన్ని చాలామట్టుకు తగ్గించవచ్చు. క్రమంగా వ్యాయామం చేయడం, కాల్షియమ్ మరియు విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వంటివి ప్రయోజనకరమైన అలవాట్లు. (g02 11/22)
చిక్కుముడులు విప్పే “పరిశుద్ధురాలు”
“ఇటీవలి కాలాల్లో, విజయం సాధించలేని విషయాలకు యజమాని అయిన పరిశుద్ధుడు జూడ్ థడ్డేయస్; బాధలలో ఉన్నవారిని రక్షించే పరిశుద్ధురాలు రీటా; అప్పులలో ఉన్నవారిని కాపాడే పరిశుద్ధురాలు హెడ్‌విగ్; అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసే పరిశుద్ధుడు ఎక్స్‌పెడిటస్ లాంటివారు ప్రసిద్ధి చెందారు” అని వాజా వార్తాపత్రిక నివేదిస్తోంది. ఇప్పుడు బ్రెజిల్‌లోని క్యాథలిక్కుల మధ్య ప్రసిద్ధి చెందిన సరికొత్త “పరిశుద్ధురాలు,” “చిక్కుముడులు విప్పే స్త్రీ.” ఈ అసాధారణమైన పేరు, జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌లో ఉన్న చాపల్‌లో ఉన్న ఒక చిత్రం నుండి వచ్చింది, ఆ చిత్రంలో కన్య మరియ రిబ్బన్‌లోని ముడులను విప్పుతున్నట్లు ఉంది. వాణిజ్యపరమైన వ్యక్తుల ద్వారా ప్రోత్సహించబడిన ఈ “చిక్కుముడులు విప్పే స్త్రీ” భక్తులను సంపాదించుకుంది. ఈ భక్తులు తమ ఆరోగ్య, వివాహ, ఆర్థిక సమస్యలకు సంబంధించిన క్లిష్టమైన చిక్కుముడులు విప్పడంలో ఆమె సహాయాన్ని కోరతారు. అదే సమయంలో వారు చిత్రాలను, పూసలున్న జపమాలలను, ప్రతిమలను, కారు స్టిక్కర్‌లను కొనుగోలు చేసి లాభదాయకమైన వ్యాపారాన్ని కూడా కల్పించారు. “‘చిక్కుముడి విప్పే ఈ స్త్రీ’ వెర్రితనం హానికరమైనది కాదు, కానీ అది ఎంతో కాలం నిలవదు” అని బ్రెజిల్‌కు చెందిన అతిపెద్ద క్యాథలిక్ ష్రైన్ కార్యనిర్వాహకుడు డార్సి నికోల్ చెబుతున్నాడు. (g02 11/22)
అంతరిక్షంలో సువార్త
అంతరిక్షంలో జీవం ఉందా లేదా అన్న విషయంపై శాస్త్రజ్ఞులు ఇప్పటికీ చర్చలు జరుపుతుంటే, వాటికన్ అబ్సర్వేటరీలోని ప్రీస్టులు “ఈ విశ్వంలో దేవుడు సృష్టించిన ప్రాణులలో కేవలం భూనివాసులు మాత్రమే లేరు. దేవుడు అంతరిక్ష నివాసులను కూడా సృష్టించాడు” అన్న ముగింపుకు వచ్చారని బెర్లినర్ మార్జెన్‌పోస్ట్ వార్తాపత్రిక నివేదిస్తోంది. అబ్సర్వేటరీ డైరెక్టర్ అయిన జార్జ్ కొయినీ వివరించినట్లు, “కేవలం మనమే ఉండడానికి ఈ విశ్వం చాలా పెద్దది.” ఈ అంతరిక్ష నివాసులను సువార్తతో చేరుకోవడానికి అనేక మొనాస్ట్రీలు క్రొత్త నిబంధనను సాంకేతిక భాషలో అంతరిక్షానికి పంపిస్తున్నాయి. ఆ తర్వాత వాటికన్ తెలుసుకోవాలనుకుంటున్నది “యేసుక్రీస్తు ఇతర గ్రహాల మీద కూడా తనను తాను బయల్పర్చుకున్నాడా లేదా” అన్నదేనని ఆ వార్తాపత్రిక చెబుతోంది. “ఆ గ్రహ వాసులను కూడా యేసుక్రీస్తు రక్షించాడా లేదా” అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను అని కొయినీ అంటున్నాడు. (g02 11/22)
థర్మామీటర్ల నుండి విషం
“కేవలం ఒక్క థర్మామీటర్‌లోని పాదరసం 11 ఎకరాల చెరువును కలుషితం చేయగలదు, పగిలిపోయిన థర్మామీటర్లు ప్రతి సంవత్సరం అమెరికా వ్యర్థజలాల నదికి 17 టన్నుల పాదరసాన్ని కలుపుతున్నాయి” అని నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక నివేదిస్తోంది. చేపలు ఆ పాదరసాన్ని లోపలికి తీసుకుంటాయి, ఆ చేపలను తిన్న మనుష్యుల శరీరంలోకి ఆ లోహం వెళ్ళి నాడీమండల వ్యవస్థను పాడుచేయగలదు. బాస్టన్‌తో సహా అనేక నగరాలలో ఇప్పటికే పాదరసం థర్మామీటర్లు నిషేధించబడ్డాయి, ఈ ప్రాంతాలలోని కొన్ని షాపుల్లో పాదరసం థర్మామీటర్లను తీసుకొని వాటికి బదులు డిజిటల్ థర్మామీటర్లు, ఇతర ప్రమాదరహితమైన ఉపకరణాలు ఇవ్వబడుతున్నాయి. (g02 10/8)
అతివేగంగా నడిచే రోలర్ కోస్టర్
“ప్రపంచంలోకెల్లా అతివేగంగా నడిచే రోలర్ కోస్టర్ ఫ్యుజిక్యూ హైలాండ్ అమ్యూస్‌మెంట్ పార్క్‌లో ప్రారంభించబడింది,” అని జపాన్ వార్తాపత్రిక ఐ.హెచ్.టి అసాహి షింబున్ నివేదించింది. “ప్రయాణం మొదలైన రెండు సెకన్ల లోపలే వేగం పుంజుకొని గంటకు 172 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రోలర్ కోస్టర్ పిరికివాళ్ళ కోసం కాదు. దానిలో కూర్చుంటే ఒక రాకెట్‌లోంచి బయటకు విసిరేసినట్లు ఉంటుంది. సాధారణంగా ఫైటర్ పైలట్‌లు మాత్రమే అనుభవించే గురుత్వాకర్షణ శక్తిని ఈ రోలర్ కోస్టర్‌లో ప్రయాణించే వారు కూడా అనుభవిస్తారు.” దీన్ని తయారు చేసిన కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెత్ రాబర్ట్‌సన్ ఇలా అన్నాడు: “ఒక విమానం ప్రయాణం ప్రారంభించినప్పుడు దానికి గురుత్వాకర్షణ శక్తి కంటే 2.5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అయితే ఈ రోలర్ కోస్టర్‌కు గురుత్వాకర్షణ శక్తి కంటే 3.6 రెట్లు ఎక్కువ శక్తి ఉంది.” ఈ రోలర్ కోస్టర్ “చిన్న విమానానికి ఉండే చక్రాల వంటి చక్రాల”పై ప్రయాణిస్తుంది, దానికి 50,000 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే మూడు ఎయిర్ కంప్రెస్సర్‌లు ఉన్నాయి, దీన్ని “ఒక చిన్న రాకెట్‌తో పోల్చవచ్చు.” (g02 9/22)
ఇండియాలో పొగాకు సంబంధిత హృద్రోగం
“హృదయ ధమని వ్యాధి ప్రభావ విస్తృతి పెరిగిపోతుందని [ఇండియాలోని] అనుభవజ్ఞులైన హృద్రోగ వైద్యనిపుణులు చెబుతున్నారు” అని ముంబయి న్యూస్‌లైన్ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. “జెస్లోక్ హాస్పిటల్‌లో హృద్రోగ వైద్యనైపుణ్యానికి డైరెక్టర్ అయిన డా. అశ్విన్ మెహతా చెప్పిన దాని ప్రకారం, భారతీయులకు జన్యుపరంగా హృద్రోగం వచ్చే అవకాశం ఉంది.” ఎక్కువమంది యౌవనస్థులు “అధికంగా పొగత్రాగడం వల్ల గుండె సమస్యలను” ఎదుర్కొంటున్నారు అన్నది ప్రత్యేకంగా చింతించవలసిన విషయం. బాంబే హాస్పిటల్‌లో కన్సల్‌టెంట్ హృద్రోగ వైద్యనిపుణుడు అయిన డా. పి. ఎల్. తివారి, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఏదో ఒక రోజు ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే ఎక్కువమంది హృద్రోగులు ఉంటారని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో 35 నుండి 49 సంవత్సరాల వయస్సుగల పురుషులలో 70 కంటే ఎక్కువ శాతం మంది పొగత్రాగుతారు, ఆ దేశంలో “సంపాదన తగ్గిపోతుంటే పొగత్రాగడం ఎక్కువైపోతోంది” అని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక నివేదిస్తోంది. సగటున, పొగత్రాగే ప్రతి వ్యక్తి “బట్టలు, ఇల్లు, ఆరోగ్యం, విద్య, వీటన్నింటికీ ఖర్చు పెట్టే డబ్బుకంటే రెండు రెట్లు ఎక్కువ డబ్బును సిగరెట్ల కోసం ఖర్చు పెడుతున్నాడు.” పొగాకు కోసం ఖర్చుచేయబడే డబ్బును ఆహారం కోసం ఖర్చు చేస్తే ఈ పేద దేశంలో పోషకాహారం లేని 105 లక్షల ప్రజలకు సరిపడినంత ఆహారం లభిస్తుందని అంచనా వేయబడింది. (g02 9/22)
ఎత్తైన భవనాలకు ఇప్పటికీ గిరాకీ ఉంది
“ట్విన్ టవర్స్ కూలిపోవడం, ఇంజనీర్లు ఆర్కిటెక్ట్‌లు తాము ఎన్నడూ అనుభవించని భయం కలిగించే విషయాన్ని అనుభవించేలా చేసింది” అని యు. ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ నివేదించింది. “ఆ భవనాలు కూలిపోవడం వల్ల కలిగిన తాత్కాలిక భయం తొలగిపోయి, ఎత్తైన భవనాలకున్న గిరాకీ ఎన్నటికీ తగ్గదు.” దానికిగల ఒక కారణం ఏమిటంటే కొన్ని ప్రాంతాలలో స్థలం కొరత ఉంటుంది, అది చాలా ఖరీదు కూడా. అంతేకాకుండా నగరాలకు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం. “ఒక ప్రాంతానికి ఖ్యాతినీ ప్రాముఖ్యతనూ ఇవ్వడానికి, ఆధునికత కోసం మరితర కారణాల కోసం” అసాధారణంగా ఎత్తైన భవనాలు నిర్మించబడుతున్నాయి అని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్న స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అధ్యక్షుడు విలియమ్ మిషేల్ చెబుతున్నాడు. అయితే, తమ భవనాలు మరింత సురక్షితంగా ఉండేలా ఎలా చెయ్యాలన్న విషయంలో ఆర్కిటెక్ట్‌లు చర్చలు జరుపుతున్నారు. బాంబు ప్రేలుళ్ళకు తాళుకోగలిగే గోడలను, కిటికీలను నిర్మించడం ద్వారా దాడులను తట్టుకోగల బలమైన భవనాలను నిర్మించవచ్చు, కానీ ఇవి భవనానికి మరింత బరువును చేరుస్తాయి మరియు చాలా ఖరీదైనవి కూడా. చైనాలో భవన నిర్మాణ నియమాల ప్రకారం, ప్రమాద సమయాల్లో ఆశ్రయం కల్పించడానికి ప్రతి పదిహేను అంతస్తులకు ఒక “ఆశ్రయ అంతస్థు” ఉండాలి, అది ఖాళీగా, గోడలు లేకుండా ఉండాలి. ఇతర ప్రాంతాలలోని నిర్మాణ నియమాల ప్రకారం, కేవలం ఫైర్ ఫైటర్‌లు ఉపయోగించడానికి పూర్తి పై అంతస్థు వరకూ ఒక లిఫ్టు ఉండాలి, పొగ లోపలకి రాకుండా ఉండేలా గాలి ఒత్తిడి అధికం చేయబడిన స్టేయిర్‌కేస్‌లు ఉండాలి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనంగా తయారవ్వగల షాంగయి వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్ రూపనిర్మాణకులు ఇప్పటికే తమ డిజైన్‌లో అదనపు జాగ్రత్తలు చేరుస్తున్నారు. (g02 9/22)