బ్రిటన్‌కు చెందిన బాడ్జర్ అడవుల భూస్వామి
బ్రిటన్‌కు చెందిన బాడ్జర్ అడవుల భూస్వామి
బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత
ఒక నల్లపక్షి పాట అడవుల నిశ్శబ్దాన్ని ఛేదించింది. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా నేను క్రిందికి ఒరిగిపడిన సిల్వర్ బిర్చ్ చెట్టు మీద కూర్చొని, వర్షం పడిన తర్వాత సాయంత్రపు గాలిలో వ్యాపించివున్న తడిసిన చెట్ల వాసనను ఆస్వాదిస్తున్నాను.
నా వైపు కాస్త గాలి వీచేలా కూర్చోవడానికి నేను నా స్థానాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడికి బాడ్జర్‌లను చూడడానికి వచ్చాను. బాడ్జర్ కళ్ళు, తెల్లని అంచువున్న దాని చెవులు చిన్నగా ఉంటాయి, కానీ దానికున్న అమోఘమైన వినికిడి శక్తినీ వాసన పసిగట్టే శక్తినీ ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదని నేను నేర్చుకున్నాను. నేను శబ్దం చేసినప్పుడు విన్నా లేక నా వాసన దానికి తెలిసినా, వెంటనే అది భూమి లోపలకి వెళ్ళిపోయి ఇక రాత్రంతా బయటకు రాదని నాకు తెలుసు.
యూరోపియన్ బాడ్జర్ దాగివుండే స్వభావంగల పెద్ద జంతువు. అది దాదాపు ఒక మీటరు పొడవు, 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండి, దాని సగటు బరువు దాదాపు 12 కిలోలు ఉంటుంది. దాని శరీరం మీది వెంట్రుకలు బూడిద రంగులో గరుకుగా ఉండి ముఖమూ కడుపు భాగాలు నల్లగా ఉంటాయి, నల్లని చిన్న కాళ్ళూ బూడిద రంగులో చిన్న గుబురు తోక ఉంటాయి. ప్రతి పాదానికి బలమైన గోళ్ళతో ఐదు వేళ్ళు ఉంటాయి.
దాని ముట్టె దగ్గర మొదలయ్యి చెవుల వెనక వరకూ ఉండే మూడు వెడల్పాటి తెల్లని చారలు ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా ఒక వివాదాంశంగా ఉన్నాయి. ఈ చారల సహాయంతో చాలా చీకటిగా ఉన్న రాత్రివేళల్లో కూడా బాడ్జర్‌లు తమ జాతి జంతువులను గుర్తుపట్టగలవని కొందరు అంటారు, కానీ బాడ్జర్‌లు ఒకదానినొకటి తమ వాసనను బట్టి గుర్తుపడతాయని మనకు తెలుసు. ఈ చారలు ఉండడానికి కారణమేదైనప్పటికీ అవి బాడ్జర్‌ను ఒక అందమైన జంతువుగా చేస్తాయి.
గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు బాడ్జర్‌ను ప్రేమగా “ఓల్డ్ బ్రాక్” అని పిలుస్తారు, బ్రిటీషు గ్రామీణ ప్రాంతాలలో బాడ్జర్‌లు సర్వసాధారణంగా కనిపిస్తాయి. అలవాటుగా త్రవ్వుతూ ఉండే బాడ్జర్ తన ఇంటిని నిర్మించుకోవడానికి ఎడతెగక సొరంగాలను, మార్గాలను, గదులను తవ్వుతుంది. దాని ఇంటి వృత్తవ్యాసం 30 మీటర్ల వరకూ ఉండగలదు, తికమక పెట్టేంత క్లిష్టంగా ఉండే సొరంగాలు 300 మీటర్ల పొడవు ఉండగలవు! బాడ్జర్ నిశాచర జంతువు, దాని ఇంటిలోని గదులు పగటి పూట ప్రాముఖ్యంగా నిద్రపోవడానికి ఉపయోగించబడతాయి. పడుకోవడానికి నాచు, ఎండిపోయిన ఆకులతో తాజాగా పరుపు వేయబడిన ప్రత్యేకమైన గదులను ఆడ బాడ్జర్ తన పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు ఉపయోగిస్తుంది.
ఒక బాడ్జర్ ఇంటికి భూమి పైభాగంలో అనేక ప్రవేశమార్గాలు ఉంటాయి, ఈ ప్రవేశమార్గాలు ఎక్కువగా ఆల్డర్ చెట్లకు దగ్గరగా లేదా ముండ్లపొదలలో ఉంటాయి. ఇంగ్లాండులోని కొన్ని బాడ్జర్ గృహాలకు
50 కంటే ఎక్కువ ప్రవేశమార్గాలు ఉన్నాయి, ఇవి 150 సంవత్సరాలకంటే ఎక్కువకాలం క్రితం నిర్మించబడినవని తెలుస్తోంది, వీటిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక తరాల బాడ్జర్‌లు నివసించేందుకు స్థలం ఉంది. బాడ్జర్‌లు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు, కానీ వాటి సాధారణ జీవితకాలం రెండు లేక మూడు సంవత్సరాలు మాత్రమే.ప్రవేశమార్గాల వద్ద భూమిలోపలినుండి పైకి తీయబడిన మట్టి, రాళ్ళ కుప్పలతో ఎత్తుగా ఉండడంవల్ల ఒక బాడ్జర్ ఇంటిని గుర్తుపట్టడం కష్టమేమీ కాదు. దాని ఇంటిలోనుండి బయటకు విసిరివేయబడ్డ వాటిని చూస్తే, బాడ్జర్ ఎంత బలమైన జంతువో మీకు అర్థమవుతుంది.
ప్రస్తుతం బాడ్జర్‌లు ఒక ఇంటిలో నివసిస్తున్నాయా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు మొదట బాడ్జర్‌ల మరుగుదొడ్ల కోసం వెదకండి—ఇవి దాని ఇంటి చుట్టూ 15 నుండి 23 సెంటీమీటర్ల వెడల్పు ఉండి 23 సెంటీమీటర్ల లోతు ఉండే గుంతలు. అక్కడ వాటి పేడ ఉంటే ప్రత్యేకించి అది తాజాగా ఉంటే బాడ్జర్‌లు ఆ ఇంటిలో నివసిస్తున్నాయని దానర్థం. ఇంటినుండి బయటకు వెళ్ళే మార్గాలు బాగా తొక్కబడి ఉన్నాయా చూడండి, వేసవి నెలల్లో బాగా తొక్కబడిన మొక్కల కోసం చూడండి. బురదగా ఉన్న ప్రాంతంలో బాడ్జర్ అడుగుజాడల కోసం చూడండి లేదా వాటి ఇంటికి దగ్గర్లో ఉన్న చెట్ల మీద మట్టి గుర్తుల కోసం గోళ్ళతో గీరిన గుర్తుల కోసం చూడండి. ఈ జంతువులు ఆ చెట్ల వద్ద వళ్ళు విరుచుకోవడానికి పిల్లిలా తమ బలమైన గోళ్ళతో రెండు కాళ్ళమీద నిలబడడంవల్ల ఆ గుర్తులు ఏర్పడతాయి. ఒకవేళ ఆ ఇల్లు చాలా పెద్దదైతే మన పరిశీలన కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే బాడ్జర్‌లు వేరే ప్రవేశమార్గాన్ని లేక బయటకు వెళ్ళే మార్గాన్ని ఉపయోగిస్తుండవచ్చు. కాబట్టి ఉదయాన్నే వెళ్ళి ప్రతి రంధ్రానికి అడ్డంగా ఒక కర్రను పెట్టండి. మరుసటి రోజు ఉదయం, బయటకు వచ్చే జంతువులు ఏ మార్గాన్ని ఉపయోగించాయో మీకు తెలుస్తుంది—రంధ్రాలకు అడ్డంగా పెట్టిన కర్రలు ప్రక్కకు తోసివేయబడి ఉంటాయి.
ఆహారాన్వేషణలో, సింధూర పండ్ల కోసం లేదా బీచ్‌చెట్ల పండ్ల కోసం వెదకడానికీ వాసన ద్వారా పసిగట్టి కుందేలు పిల్లల్ని వాటి రంధ్రాల్లో నుండి త్రవ్వి బయటకు తీయడానికి లేదా కందిరీగల గూళ్ళలో నుండి వాటి లార్వాలను పట్టుకుని తినడానికి బాడ్జర్‌లు రాత్రివేళ చాలా దూరం ప్రయాణిస్తాయి. దాని ప్రధాన ఆహారం ఏమిటి? వానపాములు! బాడ్జర్ దాదాపు దేన్నైనా తింటుంది—అడవి పళ్ళు, పువ్వుల మొగ్గలు, పుట్ట గొడుగులు, దిమ్మెసలతో సహా అన్నింటినీ తింటుంది. జూలై నెలలో బాగా వర్షం పడిన తర్వాత ఒక రాత్రి నేను బాడ్జర్‌లను పరిశీలించడం నాకు ఇంకా గుర్తుంది. అవి ఆ రాత్రి తమ ఇంటినుండి దూరంగా వెళ్ళలేదు, ఎందుకంటే ఏపుగా పెరిగిన గడ్డిలో వర్షం మూలంగా బయటికొచ్చిన రుచికరమైన నల్లనత్తలు సమృద్ధిగా ఉన్నాయి.
బాడ్జర్‌లు సాధారణంగా జూలై నెలలో జతగూడతాయి, ఫిబ్రవరి నెలలో ఒక్కసారికి నాలుగు లేదా అయిదు పిల్లలు పుడతాయి. పిల్లలకు మూడు నెలల వయసున్నప్పుడు ఇంటి ప్రవేశమార్గం దగ్గర ఆడుకుంటూ కనిపిస్తాయి. పిల్లలు బయటికి వచ్చినప్పుడు ఆడ బాడ్జర్, మగ బాడ్జర్ కలిసి గదిలో ఎండిపోయిన ఆకులు, నాచుతో తయారుచేయబడిన పురుపును మారుస్తాయి. బాడ్జర్‌లు పరిశుభ్రమైన జంతువులు, అవి తమ ఇళ్ళను చాలా శుభ్రంగా ఉంచుకుంటాయి. సాధారణంగా అవి తమ పరుపులను వసంత ఋతువు శరదృతువుల్లో బయట ఆరబెడతాయి, అయితే సంవత్సరంలోని ఏ నెలలోనైనా సరే అలాగే చేస్తుంటాయి. తల్లి బాడ్జర్, తండ్రి బాడ్జర్ ఎండిపోయిన పాత గడ్డిని, ముండ్లపొదల ఆకులను బయటకు తీసివేసి వాటి స్థానంలో తాజా గడ్డిని, ముండ్లపొదల ఆకులను పెడతాయి—అవి ఒక్క రాత్రిలో దాదాపు 30 మూటల గడ్డిని సమకూరుస్తాయి. ఈ మూటలను అవి తమ గడ్డానికి ముందు కాళ్ళకు మధ్య ఉంచుకుని వెనక్కి నడుస్తూ తమ ఇంటి ప్రవేశమార్గం వరకూ ఈడ్చుకువచ్చి ఆ తర్వాత లోపలికి తీసుకువెళతాయి.
తమ ప్రాంతానికి గుర్తుపెట్టడానికి, బాడ్జర్‌లు తమ తోక క్రిందవున్న రసగ్రంధి నుండి వచ్చే ఘాటైన వాసనగల ద్రవాన్ని గడ్డి, రాళ్ళు, కంచె కర్రల మీద స్రవింపజేస్తాయి. గుర్తుపట్టడం కోసం అవి ఇతర బాడ్జర్‌ల మీద కూడా స్రవింపజేస్తాయి. ఈ వాసనను బట్టి, ఒక బాడ్జర్ వెనక్కి నడుస్తున్నప్పుడు తన ఇంటి ప్రవేశమార్గాన్ని సులభంగా కనుక్కోగలదు.
నల్లపక్షి పాట క్రమంగా ఆగిపోయింది, చీకటిపడుతున్న అడవుల్లో అంతా నిశ్శబ్దం అయిపోయింది. నేను ఊపిరి పీల్చుకోవడానికి కూడా సాహసించకుండా కదలకుండా కూర్చున్నాను, అప్పుడు ఓరకంట చూడగా తెలుపు నలుపు చారలతో బాడ్జర్ తల కనిపించింది. ఆ రాత్రివేళ బాడ్జర్ తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కొన్ని క్షణాలపాటు తన ఇంటి ప్రవేశమార్గం వద్ద నుంచుని ప్రమాదం ఉంటే పసిగట్టడానికి సాయంత్రపు గాలి వాసన చూసింది—ఒక భూస్వామి తనకు వారసత్వంగా లభించిన భూసంపత్తిలో నడవడానికి వెళ్ళే ముందు చూసినట్లే. (g02 11/8)
[12, 13వ పేజీలోని చిత్రం]
పిల్లలు జన్మించేటప్పుడు ఉపయోగించే గది
నిద్రపోయే గది
పరుపు
[13వ పేజీలోని చిత్రం]
బాడ్జర్ పిల్లలు
[13వ పేజీలోని చిత్రాలు]
బాడ్జర్ ఆహారంలో సింధూర పళ్ళు, పుట్టగొడుగులు, వానపాములు చేరివుంటాయి
[13వ పేజీలోని చిత్రసౌజన్యం]
బాడ్జర్ చిత్రాలు: © Steve Jackson, www.badgers.org.uk