కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”

“మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”

“మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”

దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! రచయిత

“భూమ్మీది ఏ యుద్ధం కూడా ఎయిడ్స్‌ మహమ్మారి అంతటి వినాశనకరమైనది కాదు.”​—⁠యు.ఎస్‌. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌, కాలిన్‌ పావెల్‌.

ఎయిడ్స్‌కు (అక్వైర్డ్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ సిండ్రోమ్‌) సంబంధించిన మొదటి అధికారిక నివేదిక 1981 జూన్‌ నెలలో వెల్లడయ్యింది. “ఎయిడ్స్‌ మహమ్మారి మొదలైన తొలిరోజుల్లో ఆ సమస్యతో వ్యవహరించిన మాలో ఎవ్వరూ ఆ మహమ్మారి ఇంత విస్తృతంగా వ్యాపిస్తుందని ఊహించలేదు” అని జాయింట్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ (యు.ఎన్‌.ఎయిడ్స్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాయట్‌ చెబుతున్నారు. 20 సంవత్సరాలలో అది మునుపెన్నటికంటే తీవ్రమైన మహమ్మారిగా తయారయ్యింది, అది పెరుగుతూనే ఉంటుందనడానికి సూచనలు కనిపిస్తున్నాయి.

360 లక్షలకంటే ఎక్కువమందికి హెచ్‌ఐవి (హ్యూమన్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ వైరస్‌) సోకిందనీ, ఎయిడ్స్‌ ప్రభావాలవల్ల మరో 220 లక్షల మంది చనిపోయారనీ అంచనా వేయబడింది. * 2000వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది ఎయిడ్స్‌ వల్ల చనిపోయారు. ఈ మహమ్మారి మొదలైనప్పటి నుండి అదే అతిపెద్ద వార్షిక మొత్తం. ప్రత్యేకించి ధనిక దేశాలలో యాంటిరెట్రొవైరల్‌ డ్రగ్‌ థెరపీ ఉపయోగించినప్పటికీ పరిస్థితి ఇలా ఉంది.

ఎయిడ్స్‌ ఆఫ్రికా అంతటా వ్యాపించడం

సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలలో 253 లక్షలమందికి హెచ్‌ఐవి సోకినట్లు అంచనా వేయబడింది, కాబట్టి ఆ ప్రాంతం ఈ మహమ్మారికి కేంద్రస్థానంగా తయారయ్యింది. కేవలం ఆ ప్రాంతంలోనే 2000వ సంవత్సరంలో 24 లక్షలమంది ఎయిడ్స్‌ ప్రభావాల వల్ల చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారి మొత్తంలో ఇది 80 శాతం. ఈ ప్రాంతంలో మరణాలకు ఎయిడ్సే ప్రధాన కారణం. *

ప్రపంచంలోని ఏ దేశంలోకన్నా దక్షిణాఫ్రికాలోనే హెచ్‌ఐవి సోకిన ప్రజలు అత్యధికంగా అంటే 47 లక్షలమంది ఉన్నారని అంచనా వేయబడింది. ఇక్కడ ప్రతి నెలా 5,000 మంది శిశువులు హెచ్‌ఐవి పాజిటివ్‌తో జన్మిస్తున్నారు. 2000, జూలై నెలలో డర్బన్‌ నగరంలో నిర్వహించబడిన 13వ అంతర్జాతీయ ఎయిడ్స్‌ సమావేశంలో ప్రసంగిస్తూ, దక్షిణాఫ్రికా మాజీ ప్రధాని నెల్సన్‌ మండేలా ఇలా అన్నారు: “దక్షిణాఫ్రికాలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు, అంటే సగం మంది యౌవనస్థులు ఎయిడ్స్‌తో చనిపోతారని తెలుసుకొని మేము విస్తుపోయాము. ఎంతో భయానకమైన విషయం ఏమిటంటే, గణాంకవివరాలు మనకు చెబుతున్న ఈ రోగుల సంఖ్యనూ దానితోపాటు ఉన్న మానవ బాధనూ . . . మనం నిరోధించగలిగి ఉండేవాళ్ళమే, మనం వాటిని ఇప్పటికీ నిరోధించవచ్చు.”

ఇతర దేశాలలో ఎయిడ్స్‌ చేస్తున్న భీకరదాడి

ప్రాచ్య యూరప్‌లోని, ఆసియాలోని, కరబియన్‌ దీవులలోని జనాభాలో ఎయిడ్స్‌ ఉన్నవారి శాతం వేగంగా పెరుగుతోంది. 1999 సంవత్సరాంతానికి ప్రాచ్య యూరప్‌లో ఎయిడ్స్‌ రోగుల సంఖ్య 4,20,000. 2000వ సంవత్సరాంతానికి ఆ సంఖ్య కనీసం 7,00,000కు పెరిగిందని అంచనా వేయబడింది.

అమెరికాలోని ఆరు పెద్ద నగరాలలో నిర్వహించబడిన సర్వే, స్వలింగ సంయోగులైన యౌవన పురుషులలో 12.3 శాతం మందికి హెచ్‌ఐవి ఉందని వెల్లడి చేసింది. అంతేకాకుండా, హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్నవారిలో కేవలం 29 శాతం మందికి మాత్రమే తమకు ఆ వ్యాధి ఉందని తెలుసు. ఆ సర్వేను నిర్వహించిన మహమ్మారుల నిపుణురాలు ఇలా చెప్పింది: “హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్న పురుషులలో ఇంత తక్కువమందికి మాత్రమే తమకు ఆ వ్యాధి ఉందని తెలుసని కనుగొని మేము చాలా అధైర్యపడ్డాము. అంటే క్రొత్తగా ఆ వ్యాధి సోకిన ప్రజలు తమకు తెలియకుండానే ఆ వైరస్‌ను ఇతరులకు సంక్రమింపజేస్తున్నారని దానర్థం.”

స్విట్జర్లాండ్‌లో 2001, మేలో జరిగిన ఎయిడ్స్‌ నిపుణుల కూటంలో ఈ వ్యాధి “మానవ చరిత్రలోకెల్లా అత్యంత వినాశనకరమైన మహమ్మారి” అని ప్రకటించబడింది. ముందు నివేదించబడినట్లు, ఎయిడ్స్‌ చేస్తున్న భీకరదాడి ప్రత్యేకించి సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలలో తీవ్రంగా ఉంది. మా తర్వాతి ఆర్టికల్‌ దానికి కారణాన్ని పరిశీలిస్తుంది. (g02 11/8)(g02 11/08)

[అధస్సూచీలు]

^ ఇక్కడ ఉపయోగించబడిన సంఖ్యలు యు.ఎన్‌. ఎయిడ్స్‌ ప్రచురించిన అంచనాలకు సంబంధించినవి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

ఎంతో భయానకమైన విషయం ఏమిటంటే . . . ఈ రోగుల సంఖ్యనూ దానితోపాటు ఉన్న మానవ బాధనూ . . . మనం నిరోధించగలిగి ఉండేవాళ్ళమే, మనం వాటిని ఇప్పటికీ నిరోధించవచ్చు.​—⁠నెల్సన్‌ మండేలా

[2, 3వ పేజీలోని చిత్రం]

హెచ్‌ఐవి ఉన్న ప్రజలలో చాలామందికి తమకు ఆ వ్యాధి ఉందని తెలియదు

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

UN/DPI Photo 198594C/Greg Kinch