కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముప్ఫై సంవత్సరాల తర్వాత అసాధారణమైన పునఃకలయిక

ముప్ఫై సంవత్సరాల తర్వాత అసాధారణమైన పునఃకలయిక

ముప్ఫై సంవత్సరాల తర్వాత అసాధారణమైన పునఃకలయిక

ఇద్దరు యువకులు 1967వ సంవత్సరంలో అనుకోకుండా కలుసుకున్నారు. అమెరికాలోని మిచిగాన్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో వారిద్దరూ రూమ్‌మేట్‌లుగా నియమించబడ్డారు. ఒహాయోలోని లీమాకు చెందిన డెన్నిస్‌ షీట్స్‌, అటవీశాస్త్రాన్ని చదవడానికి వచ్చిన 18 సంవత్సరాల క్రొత్త విద్యార్థి. ఇరవై రెండు సంవత్సరాల మార్క్‌ రూజ్‌ న్యూయార్క్‌లోని బఫెలొ నగరం నుండి వచ్చాడు. ఆయన సివిల్‌ ఇంజనీరింగ్‌ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి.

ఆ సమయంలో వారి స్నేహం స్వల్పకాలికమైనదిగా, శాశ్వతం కానిదిగా అనిపించివుండవచ్చు. ఈ యువకులిద్దరూ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించలేదు; తమ తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ఇద్దరూ చెరో మార్గాన వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాలకంటే ఎక్కువ కాలం గడిచింది. తర్వాత, ఒక రోజు డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఈ ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా మరోసారి కలుసుకున్నారు. కొంతవరకు, ఈ ఆశ్చర్యకరమైన కలయిక అనుకోకుండానే జరిగింది. అయితే ఈ కలయికకు మరో విషయం కూడా కారణమయ్యింది. అదేమిటి? సమాధానాన్ని కనుక్కోవడానికి, వేరు వేరుగా సాగిన వారిద్దరి జీవితాలను మనం పరిశీలిద్దాం.

డెన్నిస్‌ యుద్ధానికి వెళ్ళడం

కాలేజీలో తన మొదటి సంవత్సరం తర్వాత డెన్నిస్‌ తిరిగి ఇంటికి వచ్చేశాడు. తర్వాత, 1967వ సంవత్సరం డిసెంబరు నెలలో ఆయనను అమెరికా సైన్యంలో చేర్చుకున్నారు, 1968 జూన్‌లో ఆయన వియత్నామ్‌కు పంపించబడ్డాడు. అక్కడ ఆయన యుద్ధానికి సంబంధించిన భయంకరమైన ఘోరాలను చూశాడు. 1969వ సంవత్సరంలో తన సైనిక నియామకం ముగిసినప్పుడు, ఆయన అమెరికాకు తిరిగివెళ్ళాడు. చివరికి ఒహాయోలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే, ఆయనకు అది సంతృప్తినివ్వలేదు.

“అలాస్కాకు వెళ్ళి అక్కడ స్థిరపడి వ్యవసాయం చేయాలన్నది నా చిన్ననాటి స్వప్నం” అని డెన్నిస్‌ వివరిస్తున్నాడు. కాబట్టి 1971లో ఆయన తన ఉన్నత పాఠశాల స్నేహితుడితో కలిసి ఆ కలను నిజం చేసుకోవడానికి బయలుదేరాడు. అయితే స్థలాన్ని సంపాదించుకొని వ్యవసాయం చేసే బదులు ఆయన ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. కొంతకాలం, ఆయన టెంట్‌లో నివసిస్తూ అడవులకు నిప్పంటుకుంటే తెలియజేసే వ్యక్తిగా పనిచేశాడు. ఆయన గెడ్డం పెంచుకుని జుట్టు పొడుగ్గా పెంచుకుని గంజాయి పొగత్రాగడం ప్రారంభించాడు.

1972వ సంవత్సరంలో డెన్నిస్‌ ఆంకరేజ్‌ని వదిలి, లౌసీయానాలోని న్యూ ఆర్లియన్స్‌లో ఈస్టర్‌ పండుగలోని చివరి మంగళవారం జరిగే ఉత్సవాలను చూడడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆర్కన్‌సాస్‌ అడవుల్లో ఒక చిన్న కుటీరం కట్టుకున్నాడు. అక్కడ ఆయన ఇళ్ళు కట్టడానికి పునాదులు వేసి స్తంభాలు నిర్మించే పనిచేశాడు. 1973వ సంవత్సరం జూన్‌ నెలలో, డెన్నిస్‌ దారినపోయే వాహనాలలో లిఫ్టులు అడుగుతూ దేశమంతటా ప్రయాణించి జీవిత సంకల్పమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.

యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో మార్క్‌

డెన్నిస్‌ వెళ్ళిపోయిన తర్వాత మార్క్‌ విశ్వవిద్యాలయంలో కొన్ని సెమిస్టర్‌ల వరకు ఉన్నాడు, కానీ ఆ తర్వాత యుద్ధానికి మద్దతునిచ్చే వ్యవస్థలో తాను ఒక భాగంగా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన బఫెలోకు తిరిగి వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు ఒక ఉక్కు కర్మాగారంలో అగ్రకార్మికుడిగా పనిచేశాడు. యుద్ధ ప్రయత్నాలను బట్టి అసంతృప్తి చెంది ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి, ఒక మోటర్‌సైకిల్‌ కొనుక్కొని దేశమంతటా ప్రయాణించి కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోకు వెళ్ళాడు. డెన్నిస్‌ మార్క్‌ అప్పుడు గ్రహించకపోయినప్పటికీ, వారిరువురు ఒకే సమయంలో శాన్‌ ఫ్రాన్సిస్కోలో కొంతకాలం పాటు ఉన్నారు.

డెన్నిస్‌లాగే మార్క్‌ కూడా గెడ్డం పెంచుకుని జుట్టు పొడుగ్గా పెంచుకుని గంజాయి వాడడం మొదలుపెట్టాడు. కానీ మార్క్‌ తిరుగుబాట్లలో, అసమ్మతిని తెలుపుతూ చేసే పాదయాత్రల్లో పాల్గొంటూ యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో పూర్తిగా మునిగిపోయాడు. సైన్యంలో చేరకుండా తప్పించుకున్నందుకు ఎఫ్‌.బి.ఐ అతని కోసం గాలిస్తోంది. కాబట్టి వారి నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని సంవత్సరాల పాటు మారుపేర్లతో తిరిగాడు. ఆయన శాన్‌ ఫ్రాన్సిస్కోలో తన జీవితాన్ని ఒక హిప్పీలా గడిపాడు. అక్కడ, 1970వ సంవత్సరంలో ఇద్దరు యెహోవాసాక్షులు అతని ఇంటికి వచ్చారు.

మార్క్‌ ఇలా వివరిస్తున్నాడు: “నేను కొంత ఆసక్తిని చూపించానని వారికి అనిపించినట్లుంది, కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చారు. అప్పుడు నేను ఇంట్లో లేను, అయితే వాళ్లు నా కోసం పచ్చరంగులో ఉన్న ఒక బైబిలును, మూడు పుస్తకాలను వదిలి వెళ్ళారు.” అయితే మార్క్‌ రాజకీయ వ్యవహారాల్లో, జీవితాన్ని అనుభవించడంలో పూర్తిగా మునిగిపోయాడు కాబట్టి వాటిని చదవడానికి సమయం కేటాయించలేదు. అంతేకాకుండా అతన్ని ఎఫ్‌.బి.ఐ వెంటాడుతోంది. కాబట్టి మరో మారుపేరుతో ఆయన వాషింగ్‌టన్‌కు వెళ్ళాడు. ఆయనకు విశ్వవిద్యాలయంలో పరిచయమైన స్నేహితురాలు కాథీ యానిస్‌కివిస్‌ ఆయనను అక్కడ కలుసుకుంది.

చివరికి, 1971వ సంవత్సరంలో ఎఫ్‌.బి.ఐ మార్క్‌ను పట్టుకొంది. ఇద్దరు ఎఫ్‌.బి.ఐ ఏజెంట్‌లు ఆయనను వాషింగ్‌టన్‌ డి. సి. నుండి న్యూయార్క్‌కు వెళ్ళే విమానంలో ఎక్కించి, ఆయన అక్కడనుండి కెనడాలోని టోరెంటో వరకూ వెళ్ళేలా నిశ్చయపర్చుకున్నారు. ఎఫ్‌.బి.ఐ మార్క్‌ను సమాజానికి ఒక ప్రమాదంగా పరిగణించలేదు కానీ ఆయనను కేవలం దేశం నుండి బయటకు పంపించివేయాలనుకున్నారని స్పష్టమౌతోంది. ఆ తర్వాతి సంవత్సరం ఆయనా కాథీ వివాహం చేసుకున్నారు, వారు కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో ఉన్న గెబ్రియోలా ద్వీపానికి వెళ్ళారు. వారు సమాజానికి దూరంగా ఉండాలని కోరుకున్నారు, కానీ జీవితం మరింత అర్థవంతంగా ఉండాలని వారికనిపించింది.

వారు సాక్షులు కావడం

డెన్నిస్‌ జీవిత సంకల్పం కోసం వెదుకుతూ దేశమంతటా ప్రయాణిస్తున్నాడని మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పర్యటన ఆయనను మాంటానకు తీసుకువెళ్ళింది, అక్కడ షనూక్‌ పట్టణం వెలుపల ఒక రైతు దగ్గర కోతకోయడంలో సహాయం చేసే ఉద్యోగం లభించింది. ఆ రైతు భార్య, కూతురు యెహోవాసాక్షులు. వాళ్ళు డెన్నిస్‌కు చదవడానికి తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికను ఇచ్చారు. ఎంతో కాలం గడవక ముందే, సాక్షులు నిజమైన మతాన్ని ఆచరిస్తున్నారని ఆయనకు నమ్మకం కుదిరింది.

తనతోపాటు ఒక బైబిలును తీసుకుని డెన్నిస్‌ ఆ పొలాన్ని వదిలి మాంటానలోని కాలిస్పెల్‌ నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన మొదటిసారిగా యెహోవాసాక్షుల కూటానికి హాజరయ్యాడు. ఆ కూటం తర్వాత ఆయన తనకు బైబిలు అధ్యయనం కావాలని అడిగాడు. తర్వాత కొద్ది రోజులకు ఆయన తన జుట్టు కత్తిరించుకుని గెడ్డం గీసుకున్నాడు. 1974వ సంవత్సరం జనవరి నెలలో ఆయన మొట్టమొదటిసారిగా ప్రకటనా పనిలో పాల్గొన్నాడు, అదే సంవత్సరం మార్చి 3వ తేదీన మాంటానలోని పాల్సన్‌ నగరంలో ఒక మంచినీటి తొట్టిలో బాప్తిస్మం తీసుకున్నాడు.

మరోవైపు, గెబ్రియోలా ద్వీపంలో నివసిస్తున్న మార్క్‌, కాథీ తమకు సమయం ఉంది కాబట్టి బైబిలును పరిశోధించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ను చదవడం ప్రారంభించారు కానీ చాలా పురాతనమైన ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడం వారికి కష్టంగా అనిపించింది. అప్పుడు, సాక్షులు తనకు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చిన బైబిలు, పుస్తకాలు తన దగ్గర ఇంకా ఉన్నాయని మార్క్‌కు గుర్తొచ్చింది. నిత్యజీవమునకు నడుపు సత్యము, బైబిలు నిజంగా దేవుని వాక్యమా? (ఆంగ్లం) అనే పుస్తకాలతోపాటు బైబిలును చదివారు. తాము నేర్చుకున్న విషయాలను బట్టి మార్క్‌, కాథీ ఎంతో ప్రభావితమయ్యారు.

మార్క్‌ ఇలా వివరిస్తున్నాడు: “ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళని ఒక క్రైస్తవుల గుంపు గురించి సత్యము పుస్తకంలో ప్రస్తావించబడిన వాస్తవం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇలాంటి వారు నిజమైన క్రైస్తవత్వాన్ని ఆచరిస్తున్నారని నాకనిపించింది.” ఆ తర్వాత మార్క్‌, కాథీ ఇద్దరూ, కాథీ కుటుంబ సభ్యులను సందర్శించడానికి​—⁠అక్కడకు వెళ్ళడంవల్ల అరెస్ట్‌ చేయబడే ప్రమాదం ఉన్నప్పటికీ​—⁠మిచిగాన్‌లోని హోటన్‌కు వెళ్ళారు. అక్కడ ఇంకా హిప్పీల అవతారంలోనే వారు సాక్షుల కూటానికి హాజరయ్యారు. వారు బైబిలు అధ్యయనాన్ని అంగీకరించి, మిచిగాన్‌లో ఉన్న నెలలో అధ్యయనం చేశారు.

గెబ్రియోలా ద్వీపానికి తిరిగి వచ్చిన తర్వాత, బ్రిటీష్‌ కొలంబియాలోని ననైమోలో వారు ఒక సాక్షిని వీధిలో కలిసి, తమకు బైబిలు అధ్యయనం కావాలని అడిగారు. అదే రోజు ఒక సాక్షుల గుంపు వారిని కలవడానికి పడవలో వచ్చారు, బైబిలు అధ్యయనం ప్రారంభమైంది. మూడు నెలల తర్వాత మార్క్‌, కాథీ ప్రకటనా పని ప్రారంభించారు. ఆ తర్వాత మూడు నెలలు గడిచాక 1974వ సంవత్సరం మార్చి 10వ తేదీన వారిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటికి డెన్నిస్‌ బాప్తిస్మం తీసుకుని వారం రోజులు అయ్యింది!

పూర్తికాల సేవలో డెన్నిస్‌

డెన్నిస్‌ 1974వ సంవత్సరం సెప్టెంబరు నెలలో పయినీరు అంటే పూర్తికాల సేవకుడయ్యాడు. ఆయన ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “నేను పయినీరు సేవ చేస్తూ సంతోషంగానే ఉన్నప్పటికీ నేను నా పరిచర్యను విస్తృతం చేసుకోవాలనుకున్నాను; కాబట్టి 1975వ సంవత్సరం జూలై నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేయడానికి దరఖాస్తు పెట్టాను. ఆ సంవత్సరం డిసెంబరు నెలలో నేను అక్కడకు ఆహ్వానించబడ్డాను.”

డెన్నిస్‌ అందుకున్న మొదటి నియామకం, మునుపు టవర్స్‌ హోటల్‌గా ఉన్న భవనాన్ని ప్రధాన కార్యాలయం సభ్యులు ఉండడానికి నివాస భవనంగా మార్చడం. టైల్‌లను అమర్చేవారిని పర్యవేక్షిస్తూ ఆయన అక్కడ అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని ఇష్టపడి ఆయన కాలిఫోర్నియాకు వెళ్ళాడు. 1984వ సంవత్సరంలో కాథడ్రెల్‌ సిటీ సంఘంలో పెద్దగా సేవచేస్తున్నప్పుడు ఆయన కాథీ ఎన్జ్‌ అనే పయినీరు సహోదరిని వివాహం చేసుకున్నాడు.

దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు తమ జీవితాలను నిరాడంబరంగా ఉంచుకోవాలని డెన్నిస్‌, కాథీ తీర్మానించుకున్నారు. కాబట్టి దక్షిణ కాలిఫోర్నియాలో విజయవంతమైన లాభదాయకమైన నిర్మాణ వృత్తిలో ఎక్కువ డబ్బు సంపాదించుకునేందుకు వచ్చిన అవకాశాలను డెన్నిస్‌ తరచూ తిరస్కరించాడు. 1988వ సంవత్సరంలో ఆయనా, కాథీ యెహోవాసాక్షుల అంతర్జాతీయ నిర్మాణ పనిలో సహాయం చేసేందుకు దరఖాస్తు పెట్టారు. ఆ సంవత్సరం డిసెంబరులో, అర్జెంటీనాలోని బ్యూనోస్‌ ఐర్స్‌లో బ్రాంచి నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే నియామకం వారికి లభించింది.

1989వ సంవత్సరంలో డెన్నిస్‌, కాథీ యెహోవాసాక్షుల నిర్మాణ పనిలో చిరకాలం సేవచేయడానికి ఆహ్వానించబడ్డారు. ఈ ప్రత్యేకమైన పూర్తికాల సేవలో వారు రెండుసార్లు సురినామ్‌, కొలంబియాలలో సేవచేశారు. వారు ఈక్వెడార్‌లోని మెక్సికోలోని బ్రాంచిల నిర్మాణపనిలో, డొమినికన్‌ రిపబ్లిక్‌లో అదేవిధమైన ప్రాజెక్టులో కూడా పనిచేశారు.

పూర్తికాల సేవలో మార్క్‌

1976వ సంవత్సరంలో, సైన్యంలో చేరకుండా తప్పించుకోవడానికి కెనడాకు పారిపోయిన వేలాదిమంది ఇతర అమెరికన్‌ యౌవనస్థులతోపాటు మార్క్‌ను అమెరికా ప్రభుత్వం క్షమించింది. మార్క్‌, అయన భార్య కాథీ తాము పరిచర్య కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి తమ జీవితాలను నిరాడంబరంగా ఉంచుకోవాలనుకున్నారు. కాబట్టి మార్క్‌ పార్ట్‌ టైమ్‌ సర్వేయర్‌గా పనిచేశాడు. వారి బాప్తిస్మానికి ముందు వారు చేసిన అప్పులను మార్క్‌, కాథీ నెమ్మదిగా తీర్చివేశారు.

1978వ సంవత్సరంలో ఒంటారియోలోని టోరెంటోలో ఒక క్రొత్త బ్రాంచి భవనాన్ని నిర్మించాలని కెనడాలోని సాక్షులు ప్రణాళిక వేస్తున్నప్పుడు మార్క్‌, కాథీ తమ సహాయాన్ని అందించే స్థితిలో ఉన్నారు. సర్వే చేయడంలో మార్క్‌ అనుభవజ్ఞుడు కాబట్టి, ఈ నిర్మాణ పనిలో భాగం వహించేందుకు వారు ఆహ్వానించబడ్డారు. 1981వ సంవత్సరం జూన్‌ నెలలో జార్జ్‌టౌన్‌లోని ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ వాళ్ళు అక్కడ పనిచేశారు. ఆ తర్వాత వాళ్ళు బ్రిటీష్‌ కొలంబియాకు వెళ్ళి అక్కడ యెహోవాసాక్షుల సమావేశ హాలు నిర్మించడంలో నాలుగు సంవత్సరాలపాటు సహాయం చేశారు. అది పూర్తైన తర్వాత, కెనడా బ్రాంచిని విస్తరింపజేయడంలో సహాయం చేసేందుకు వారు మళ్ళీ ఆహ్వానించబడ్డారు.

1986వ సంవత్సరంలో జార్జ్‌టౌన్‌లో కొన్ని నెలలు గడిపిన తర్వాత, కెనడా బ్రాంచి సభ్యులుగా ఉండిపోవడానికి మార్క్‌, కాథీ ఆహ్వానించబడ్డారు. వారు అప్పటినుండి బ్రాంచి సభ్యులుగా సేవచేస్తున్నారు, ఇంకా అనేక దేశాలలోని నిర్మాణ పనిలో భాగం వహించడానికి వారికి ఎన్నో అవకాశాలు లభించాయి. సర్వే చేయడంలో మార్క్‌కున్న అనుభవంవల్ల దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, కరబియన్‌ దీవులలో యెహోవాసాక్షుల సమావేశ హాళ్ళ, బ్రాంచి భవనాల నిర్మాణ పనిని సర్వే చేయడానికి ఆయన ఉపయోగించుకోబడ్డాడు.

ఈ సంవత్సరాలన్నింటిలో ఆయనా కాథీ వెనిజులా, నికరాగ్వా, హయిటీ, గయానా, బార్బడోస్‌, బహామా దీవులు, డొమినికా, అమెరికా (ఫ్లోరిడా), డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశాలలో సేవచేశారు. ఈ ప్రత్యేక పూర్తికాల సేవ మార్క్‌ మరోసారి డెన్నిస్‌ను కలుసుకునేలా చేసింది.

డొమినికన్‌ రిప్లబిక్‌లో పునఃకలయిక

తమకు తెలియకుండానే మార్క్‌, డెన్నిస్‌ డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఒకేవిధమైన ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు. సాంటో డొమింగోలోని యెహోవాసాక్షుల బ్రాంచిలో ఒకరోజు అనుకోకుండా వారిద్దరు కలుసుకున్నారు. మీరు ఊహించుకోగలిగినట్లే, వారు మళ్ళీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. వారిప్పుడు మునుపటికంటే 33 సంవత్సరాలు ఎక్కువ వయస్సుగలవారు, తమతమ జీవితాల గురించి ఒకరికొకరికి చెప్పుకోవలసింది ఎంతో ఉంటుంది మరి. అంతకంతకూ పెరుగుతున్న ఆశ్చర్యంతో వారిద్దరూ ఇప్పటివరకూ మీరు చదువుతూ వచ్చిన విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే వారికి, వారు తమ అనుభవాలను పంచుకున్న వారందరికి వింతగా అనిపించిన విషయాలు వారిద్దరి జీవితాల మధ్య ఉన్న అనేక పోలికలే.

వారిద్దరూ హిప్పీల్లా జీవించి, చింతలతో ఉన్న వస్తుదాయకమైన ఆధునిక జీవితం నుండి పారిపోవడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్ళారు. డెన్నిస్‌ కాథీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు; మార్క్‌ కూడా కాథీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ మొదటిసారిగా యెహోవాసాక్షుల కూటానికి హాజరైనప్పుడు బైబిలు అధ్యయనానికి అంగీకరించారు. వారిద్దరూ 1974వ సంవత్సరం మార్చి నెలలో బాప్తిస్మం తీసుకున్నారు. ఇద్దరూ యెహోవాసాక్షుల బ్రాంచి కుటుంబాలలో సభ్యులయ్యారు​—⁠డెన్నిస్‌ అమెరికాలో, మార్క్‌ కెనడాలో. ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోడానికి ఇద్దరూ తమ తమ జీవితాలను నిరాడంబరంగా ఉంచుకునేందుకు కృషి చేశారు. (మత్తయి 6:​22) ఇద్దరూ అంతర్జాతీయ నిర్మాణ పనిలో భాగం వహించి, అనేక దేశాలలో నియామకాలను అందుకున్నారు. వారిద్దరు అనుకోకుండా డొమినికన్‌ రిపబ్లిక్‌లో కలుసుకోకముందు బైబిలు సత్యాలను స్వీకరించిన మాజీ స్నేహితులను ఎవ్వరినీ కలుసుకోలేదు.

ఈ గమనార్హమైన పోలికలకు కారణం విధిరాత అని మార్క్‌, డెన్నిస్‌ భావిస్తున్నారా? కానే కాదు. బైబిలు చెబుతున్నట్లు “కాలవశానికీ, అనూహ్య సంఘటనలకూ [మనమందరమూ] గురవుతామని”​—⁠కొన్నిసార్లు అవి ఆసక్తికరంగా ఉంటాయని వారికి తెలుసు. (ప్రసంగి 9:11, NW) అయితే వారి కలయికకు మరో విషయం సహాయపడిందని కూడా వారు గ్రహించారు: జీవిత సంకల్పం కోసం వారి అన్వేషణలు, యెహోవా దేవునిపట్ల వారికున్న ప్రేమ.

డెన్నిస్‌, మార్క్‌ వీరిద్దరి చరిత్ర, బైబిలు సత్యాన్ని నేర్చుకునే యథార్థ హృదయులందరికీ ఒకేవిధంగా ఉండే కొన్ని విషయాలను కూడా ఉన్నతపర్చింది. డెన్నిస్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “యెహోవాకు ప్రజల జీవన పరిస్థితులు తెలుసని, వారి హృదయాలు సరైన మనోవైఖరిని సంతరించుకున్న వెంటనే ఆయన వారిని తనవైపుకు ఆకర్షించుకుంటాడని మార్క్‌, నేను అనుభవించిన విషయాలు చూపిస్తున్నాయి.”​—2 దినవృత్తాంతములు 16:9; యోహాను 6:44; అపొస్తలుల కార్యములు 13:48, NW.

మార్క్‌ ఇలా అంటున్నాడు: “ఒక వ్యక్తి యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా తన జీవితాన్ని సరిచేసుకుని, తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని, ఆయన సేవచేయడానికి ముందుకువస్తే యెహోవా తన ప్రజల ప్రయోజనార్థం సత్యారాధనను వృద్ధిచేయడానికి ఆ వ్యక్తి నైపుణ్యాలనూ సామర్థ్యాలనూ ఉపయోగించుకోగలడు అని గ్రహించి అర్థంచేసుకోవడాన్ని మా అనుభవం మాకు నేర్పింది.”​—ఎఫెసీయులు 4:8.

తన ప్రజలు పూర్ణమనస్సుతో చేసే సేవను యెహోవా ఆశీర్వదిస్తాడని కూడా వారి అనుభవం చూపిస్తోంది. డెన్నిస్‌, మార్క్‌ తాము నిస్సందేహంగా ఆశీర్వదించబడ్డామని భావిస్తున్నారు. “ప్రత్యేక పూర్తికాల సేవలో రాజ్యానికి సంబంధించిన విషయాల కోసం పనిచేయడం ఒక ఆధిక్యత. ప్రపంచమంతటి నుండి వచ్చిన క్రైస్తవ సహోదర సహోదరీలతోపాటు పనిచేస్తుండగా ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఆనందాన్ని పొందేందుకు అది మాకు అవకాశాన్నిచ్చింది” అని డెన్నిస్‌ అంటున్నాడు.

మార్క్‌ ఇలా అంటున్నాడు: “ఆయన రాజ్యాన్ని మొదటి స్థానంలో ఉంచేవారిని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కెనడా బ్రాంచి కుటుంబంలో సభ్యునిగా సేవచేయడాన్ని, అంతర్జాతీయ నిర్మాణ పనిలో భాగం వహించడాన్ని నేను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంగా పరిగణిస్తున్నాను.”

అసాధారణమైన పునఃకలయికా? అవును, ఎందుకంటే మార్క్‌ అంటున్నట్లు: “మేమిద్దరం కలుసుకోవడం ఇంత అద్భుతమైన విషయంగా ఉండడానికి నిజమైన కారణం ఏమిటంటే, మేమిద్దరం అసాధారణమైన దేవుడైన యెహోవాను తెలుసుకున్నాము, ఆయనను ప్రేమిస్తున్నాము, ఆయనను సేవిస్తున్నాము.” (g02 10/22)

[17వ పేజీలోని చిత్రం]

డెన్నిస్‌, 1966

[17వ పేజీలోని చిత్రం]

మార్క్‌, 1964

[19వ పేజీలోని చిత్రం]

దక్షిణ డకోటాలో డెన్నిస్‌, 1974

[19వ పేజీలోని చిత్రం]

ఒంటారియోలో మార్క్‌, 1971

[20వ పేజీలోని చిత్రం]

డెన్నిస్‌, మార్క్‌ అనుకోకుండా మళ్ళీ కలుసుకొని కొన్ని రోజులైన తర్వాత, తమ తమ భార్యలతో, 2001