కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెనీలా సుదీర్ఘ చరిత్రగల పరిమళ పదార్థం

వెనీలా సుదీర్ఘ చరిత్రగల పరిమళ పదార్థం

వెనీలా సుదీర్ఘ చరిత్రగల పరిమళ పదార్థం

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

అజ్టెక్‌ జాతి ప్రజలు ఎండబెట్టిన ఆ కాయల రంగును సూచించడానికి దాన్ని ట్లిల్‌క్సోచెట్ల్‌, “నల్ల పుష్పం” అని పిలిచేవారు. క్సొకొయాట్ల్‌ లేదా చాకొలెట్‌ అనే కోకోతో చేసిన పానీయాన్ని పరిమళింపజేయడానికి వారు వెనీలాను ఉపయోగించేవారు. మెక్సికోకు చెందిన అజ్టెక్‌ చక్రవర్తి మాంటెజ్యూమా 1520వ సంవత్సరంలో స్పెయిన్‌ విజయ యోధుడు ఎర్నాన్‌ కార్టిస్‌కు ఆ పానీయాన్ని ఇచ్చినట్లు చెప్పబడుతోంది. అప్పుడు కార్టిస్‌ కోకో గింజలను, వెనీలా కాయలను యూరప్‌కు పరిచయం చేశాడు. వెనీలాతో పరిమళింపజేయబడిన వేడివేడి చాకొలెట్‌ పానీయం యూరప్‌ రాజవంశస్థుల మధ్య ప్రసిద్ధి చెంది ఆదరణ పొందింది. అయితే, 1602లో ఎలిజబెత్‌ మహారాణి I కోసం మందులను తయారుచేసే వ్యక్తి అయిన హగ్‌ మార్గన్‌ ఇతర పదార్థాలను పరిమళింపజేయడానికి వెనీలాను ఉపయోగించవచ్చని సూచించాడు. ఆ తర్వాత, 1700లలో వెనీలాను మద్యపానీయాల్లో, పొగాకులో, పరిమళ ద్రవ్యాల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.

అయితే, అజ్టెక్‌ సామ్రాజ్యం ఉనికిలోకి రాకముందే, మెక్సికోలోని వెరాక్రూజ్‌కు చెందిన టొటొనాక్‌ ఇండియన్లు వెనీలా కాయలను పండించి, కోసి, ఎండబెట్టేవారు. * 1800ల తొలి సంవత్సరాల్లోనే వెనీలా మొక్క వ్యవసాయం కోసం యూరప్‌కు తీసుకెళ్ళబడింది, అక్కడినుండి అది హిందూ మహాసముద్రానికి చెందిన ద్వీపాలకు తీసుకెళ్ళబడింది. ఆ మొక్కలనుండి కాయలను ఉత్పత్తి చేయడానికి ఉద్యానశాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నాలు చాలామట్టుకు విఫలమయ్యాయి ఎందుకంటే ఆ పువ్వులపై సహజంగా పుప్పొడిని చల్లేందుకు మెలిపొనా జాతి తుమ్మెదలు ఆ ప్రాంతంలో లేవు. కాబట్టి 16వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకూ వెనీలా వ్యాపారంలో మెక్సికో ఏకస్వామ్యం చేసింది. 1841వ సంవత్సరంలో, ఫ్రెంచ్‌ ద్వీపమైన రీయూనియన్‌లో మునుపు బానిసగా ఉండిన ఎడ్మాండ్‌ ఆల్‌బియస్‌ అనే వ్యక్తి, కాయలను ఉత్పత్తి చేసేలా పువ్వులపై చేతితో పుప్పొడిని చల్లే ఆచరణాత్మకమైన పద్ధతిని నేర్చుకున్నాడు. దానితో వెనీలాకు సంబంధించిన వాణిజ్యపరమైన వ్యవసాయం మెక్సికో బయట ఇతర దేశాల్లో కూడా ప్రారంభమయ్యింది. మునుపు ఫ్రాన్స్‌ స్వాధీనంలో ఉన్న రీయూనియన్‌, కామోరోస్‌ వంటి ద్వీపాలు నేడు వెనీలా కాయలను ఉత్పత్తి చేసే ముఖ్య ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అయితే మడగాస్కర్‌ ప్రధాన ఉత్పత్తిదారు.

వెనీలాను పండించడం

వెనీలా గింజలు నిజానికి ఒక ఆర్చిడ్‌కు (పూలమొక్క) వచ్చే పండ్లు. 20,000 కంటే ఎక్కువ రకాలున్న ఆర్చిడ్‌లలో కేవలం వెనీలా ఆర్చిడ్‌ మాత్రమే తినదగిన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మొక్క పైకి పాకే తీగ, పాకడానికి దానికి ఏదో ఒక విధమైన ఆధారం కావాలి, అలాగే కొంత నీడ కూడా ఉండాలి. సహజంగా అయితే అది ఉష్ణమండలంలో తడిగా ఉండే పల్లపు భూముల అడవుల్లోని చెట్లపైకి పాకుతుంది. మెక్సికోలో సాంప్రదాయబద్ధంగా మొక్కలను పెంచే క్షేత్రాలలో ఈ మొక్కలు పాకడానికి పిచొకొ వంటి స్థానిక చెట్లను ఉపయోగిస్తారు, అయితే ఇటీవల నారింజ చెట్లను ఉపయోగించి కూడా కొంత విజయం సాధించబడింది.

వెనీలా ఆర్చిడ్‌, గుత్తులుగా పెరిగి మైనంలా ఉండే ఆకుపచ్చ పసుపు రంగులు కలిసినట్లుండే పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి పువ్వు సంవత్సరంలో ఒక్క రోజు కొన్ని గంటలు మాత్రమే తెరుచుకుని ఉంటుంది. ఈ పుష్పాలలో పుప్పొడిని చల్లే నాజూకైన పనిని టొటొనాక్‌ ఇండియన్లు చేస్తుండగా చూడడం అద్భుతంగా ఉంటుంది. వారు ప్రతి గుత్తిలో కేవలం కొన్ని పుష్పాలలో మాత్రమే పుప్పొడిని చల్లుతారు. లేకపోతే అది దాని సారాన్నంతటినీ కోల్పోయే అవకాశముంది, అలాగైతే మొక్క బలహీనమై దానికి వ్యాధులు సంక్రమించవచ్చు. అలా పుప్పొడి చల్లడం మూలంగా కాసే చిన్న గింజలున్న పొడవైన పచ్చని కాయలు ఆరు నుండి తొమ్మిది నెలల తర్వాత పూర్తిగా పండకముందే కోయబడతాయి.

ఎండబెట్టే ప్రక్రియ

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తాజా వెనీలా కాయలకు రుచి గానీ పరిమళం గానీ ఉండదు. విశిష్టమైన పరిమళం, రుచి కలిగిన వెనిలిన్‌ను విడుదల చేసేముందు ఆ కాయలు విస్తృతమైన ఎండబెట్టే ప్రక్రియకు గురవ్వాలి. ఈ ప్రక్రియ, మానవులు పుప్పొడి చల్లవలసిన అవసరత, వెనీలాను అత్యంత ఖరీదైన పరిమళ పదార్థాలలో ఒకదానిగా చేస్తాయి. మెక్సికోలో సాంప్రదాయబద్ధంగా ఎండబెట్టే పద్ధతిలో, కాయలను మొదటిసారిగా ఎండబెట్టడానికి ముదురురంగు దుప్పట్ల మీద పరుస్తారు. నేడు సాధారణంగా మొదటిసారి ఎండబెట్టడానికి కాయలను అవెన్‌లో పెడతారు. ఆ తర్వాత వెనీలాను దుప్పట్లలో, ఎస్తెరాలలో లేదా చాపల్లో చుట్టిన ప్రత్యేకమైన డబ్బాలలో మెత్తబడడానికి పెడతారు. తర్వాత, వెనీలా కాయలను మళ్ళీ ఎండబెట్టి ఆ తర్వాత మెత్తబడడానికి పెట్టి, అవి ముదురు గోధుమరంగు వచ్చేవరకు అలా చేస్తారు. ఆ తర్వాత వాటిని డబ్బాల్లో లేదా మైనపు కాగితంతో కప్పిన పరుపుల్లో ఉంచి 45 రోజుల వరకూ మామూలు ఉష్ణోగ్రతలో ఎండబెడతారు. ఆ తర్వాత కాయలు తమ గుణాలను మార్చుకుని పూర్తి పరిమళాన్ని పెంపొందించుకునేందుకు దాదాపు మూడు నెలల వరకూ మూతగల డబ్బాలలో ఉంచబడతాయి. కాబట్టి, వెనీలాను ఉత్పత్తి చేయడం చాలా శ్రమతో కూడిన పని.

సహజమైన వెనీలానా లేక కృత్రిమమైనదా?

చెక్క గుజ్జునుండి తయారుచేసిన పదార్థాలతో కృత్రిమంగా కూడా వెనిలిన్‌ ఉత్పత్తి చేయబడుతుంది. వెనీలాతో తయారుచేయబడినవని అనుకున్న పదార్థాలపై ఉండే లేబుల్‌లను చదివితే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. ఉదాహరణకు అమెరికాలో, “వెనీలా” అని లేబుల్‌ ఉన్న ఐస్‌ క్రీమ్‌ శుద్ధమైన వెనీలా ద్రావణం నుండి మరియు/లేదా వెనీలా కాయల నుండి తయారుచేయబడుతుంది, అయితే “వెనీలా రుచి” అని లేబుల్‌ ఉన్న ఐస్‌ క్రీమ్‌లో 42 శాతం వరకూ కృత్రిమ రుచులు ఉండవచ్చు, “కృత్రిమ రుచి చేర్చబడినది” అని లేబుల్‌ ఉన్న ఐస్‌ క్రీమ్‌లలో కేవలం కృత్రిమ వెనీలా రుచులు మాత్రమే ఉంటాయి. అయితే భోజన పదార్థాల విషయంలో ఉత్తమాభిరుచికలవారు, నిజమైన వెనీలా రుచికి ప్రత్యామ్నాయం లేదని ధ్రువీకరిస్తారు.

తీరప్రాంతాలలోని వర్షాపాత అడవులు నాశనమవ్వడంవల్ల, ఇటీవల వరదలు రావడం వల్ల ఇప్పుడు మెక్సికో వెనీలాను అధికంగా ఉత్పత్తి చేయడం లేదు, అయినా ఇప్పటికీ దానిలో విలువైన నిధివుంది. వెనీలా కాయలను ఉత్పత్తి చేసే ఆర్చిడ్‌లకు మెక్సికోనే మూలస్థానంగా ఉంది. * పరిమళంలో రుచిలో మెక్సికన్‌ వెనీలా ఉత్తమమైనదని సాంప్రదాయబద్ధంగా అంగీకరించబడింది. పర్యాటకులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు కనిపిస్తుంది, వారు సహజమైన వెనీలా ద్రావణాన్ని తక్కువ ఖరీదుకు కొనుక్కోవడానికి తరచూ మెక్సికో సరిహద్దుల వద్దనున్న షాపులకు, మెక్సికో విమానాశ్రయంలోని పన్ను చెల్లించనవసరం లేని షాపులకు వస్తుంటారు. ఈసారి మీరు సహజమైన వెనీలానుండి తయారుచేసిన ఐస్‌ క్రీమ్‌ను తినేటప్పుడు, దాని సుదీర్ఘ చరిత్ర గురించీ దాన్ని ఉత్పత్తి చేయడంలో చేరివున్న పని గురించీ ఆలోచించండి, దాని రుచిని ఆనందించండి! (g02 09/22)

[అధస్సూచీలు]

^ వెనీలా కాయలు మధ్య అమెరికాలో కూడా స్థానికంగా పెరుగుతాయి.

^ రీయూనియన్‌, మడగాస్కర్‌, మారిషస్‌, సేషెల్స్‌లోని వెనీలా తోటలు, పారిస్‌లోని జార్డిన్‌ డెస్‌ ప్లాంటెస్‌ నుండి కొమ్మ తీసుకువచ్చి నాటడం ద్వారా రియూనియన్‌లోకి ప్రవేశపెట్టబడినదాని నుండి తమ వెనీలాను సేకరిస్తాయని చెప్పబడుతోంది.

[25వ పేజీలోని చిత్రాలు]

పుష్పాలలో పుప్పొడిని చల్లుతున్న టొటొనాక్‌ ఇండియన్‌ (ఎడమ వైపు) ఎండబెట్టే ప్రక్రియ తర్వాత వెనీలా కాయలను ఎంపిక చేయడం (కుడి వైపు). వెనీలా ఆర్చిడ్‌ (క్రింద)

[చిత్రసౌజన్యం]

Copyright Fulvio Eccardi/vsual.com