కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ సమస్య ఎందుకు పెరిగిపోతోంది?

ఈ సమస్య ఎందుకు పెరిగిపోతోంది?

ఈ సమస్య ఎందుకు పెరిగిపోతోంది?

ప్రపంచంలోని అతిపెద్ద నేర కార్యరంగాల్లో మత్తుమందుల దొంగవ్యాపారం, ఆయుధాల దొంగరవాణా మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తుండగా, మానవ వ్యాపారం మూడవ స్థానంలో ఉందని మీకు తెలుసా? ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ చెబుతున్నదాని ప్రకారం, అన్ని విధాల వ్యభిచారాల్లోనూ స్థిరమైన పెరుగుదల ఉంది.

లాటిన్‌ అమెరికాలోని ఒక దేశంలో వ్యభిచారం చట్టవ్యతిరేకమే అయినప్పటికీ, అక్కడ చిన్నవయసులోనే వేశ్యావృత్తిలోకి దిగినవారు 5,00,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు ఆ దేశపు కాంగ్రెషనల్‌ కమిటీ ఆఫ్‌ ఎంక్వయిరీ నివేదించింది.

మరో దేశంలోని వీధుల్లో, ప్రాముఖ్యంగా మత్తుమందుల దొంగవ్యాపారం జరిగే ప్రాంతాల్లో దాదాపు 3,00,000 మంది బాల వేశ్యలున్నారు.

ఆసియా దేశాల్లో, బానిసత్వంతో పోల్చదగిన పరిస్థితుల్లో దాదాపు పది లక్షలమంది అమ్మాయిలు వేశ్యలుగా ఉపయోగించబడుతున్నట్లు నివేదించబడింది. కొన్ని దేశాలు, బాల వేశ్యావృత్తికీ సెక్స్‌ పర్యటనకూ కేంద్రస్థానాలుగా పేరుపొందాయి.

ఎయిడ్స్‌ వంటి, లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల విటులు పిల్లల కోసం ఎంతో ఎక్కువ డబ్బు చెల్లించడానికి ఇష్టపడుతున్నారు, పిల్లలయితే కన్యలుగా ఉండే సాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి ద్వారా వ్యాధి సోకే సాధ్యత తక్కువగా ఉంటుందని పరిగణించబడుతోంది. “ఎయిడ్స్‌ భయం మూలంగా పురుషులు మరీ చిన్న అమ్మాయిలు అబ్బాయిలు కావాలనుకుంటున్నారు, అది సమస్యను మరింత జటిలం చేస్తోంది” అని బ్రెజిల్‌ న్యాయశాఖకు చెందిన లూయీస నాజీబ్‌ ఇలూఫ్‌ వివరిస్తోంది. ఆమె ఇంకా ఇలా అన్నది: “బాలికలపై, టీనేజర్లపై లైంగిక అత్యాచారం జరపడం అనేది బ్రెజిల్‌లోని పేద స్త్రీలలో అత్యంత గంభీరమైన సామాజిక సమస్యగా ఉంది.”

పేదరికం, బాల వేశ్యావృత్తి

దారిద్ర్యం, పేదరికం ఉండే పరిసరాల్లో బాల వేశ్యావృత్తి బాగా వర్ధిల్లుతుంది. తన దేశంలో, పిల్లలపై అత్యాచారం జరపడానికి, బాల వేశ్యావృత్తికి, “కుటుంబ పతనానికి సుస్పష్టమైన సంబంధం ఉంది. దారిద్ర్యం, ఆకలి యొక్క ఫలితాలే అవి” అన్నది ఒక ప్రభుత్వాధికారి అభిప్రాయం. తాము తమ పిల్లల్ని వేశ్యలుగా అమ్ముకోవడానికి కారణం పేదరికమే అని కొంతమంది తల్లిదండ్రులు ఆరోపిస్తారు. దిక్కులేని పిల్లలు వేశ్యావృత్తి మాత్రమే తమ మనుగడకు మార్గమని భావిస్తారు కాబట్టి వారు దాన్ని ఆశ్రయిస్తారు.

ఒక అమ్మాయి అల్లరి మూకతో కలవడం ద్వారా చివరికి వేశ్యగా మారవచ్చునని ఓ ఎస్టాడో డె ఎస్‌. పౌలో అనే వార్తాపత్రిక వివరిస్తోంది. తినడానికి ఏదైనా సంపాదించుకోవడానికి ఆమె దొంగతనాలు చేస్తూ అప్పుడప్పుడు మాత్రమే తన ఒళ్ళు అమ్ముకుంటుండవచ్చు. ఇక ఆ తర్వాత ఆమె వేశ్యావృత్తినే చేపడుతుంది.

కొన్నిసార్లు టీనేజర్లు వేశ్యావృత్తి చేయడానికి ఇతర దేశాలకు పంపించబడతారు. “కొన్ని ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉన్న పేదరికాన్ని బట్టి చూస్తే, వలస వెళ్ళిన వేశ్యలు తమ కుటుంబాలకు పంపే డబ్బు చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. యౌవనస్థులు, చిన్నపిల్లలు అందజేసే ‘సేవల’ నుండి ప్రయోజనం పొందడానికి సంపన్న దేశాల నుండి పర్యాటకులు ఉద్దేశపూర్వకంగా వస్తున్నందువల్ల, ఈ దేశాల్లో కూడా వేశ్యావృత్తి ప్రోత్సహించబడుతోంది” అని యునెస్కో సోర్సెస్‌ నివేదిస్తోంది.

లాటిన్‌ అమెరికాలోని ఒక నగరంలో వేశ్యలుగా ఉన్న వీధిబాలలకు ఎదురుకాగల ప్రమాదాలను వర్ణిస్తూ, టైమ్‌ పత్రిక ఇలా నివేదిస్తోంది: “కొంతమంది బాల వేశ్యలు కేవలం 12 ఏండ్ల పిల్లలే. తరచూ వాళ్ళు విభాగిత కుటుంబాల్లో నుండి వచ్చినవారై ఉంటారు, వాళ్ళు పగలు ఎక్కడ కాస్త స్థలం దొరికితే అక్కడ నిద్రపోతారు, ఇక రాత్రుల్లో, నావికులు సమయం గడిపే డిస్కోలను దర్శిస్తూ తిరుగుతుంటారు.”

ఒక బాల వేశ్య తాను సాధారణంగా అయితే ఎన్నడూ అంగీకరించని ఘోరమైన అవమానాలకు మత్తుమందుల ప్రభావం క్రింద తలొగ్గుతుండవచ్చు. ఉదాహరణకు, వేజా అనే పత్రిక ప్రకారం, పోలీసులు 92 వీడియో టేపులను కనుగొన్నారు, వాటిలో ఒక వైద్యుడు 50 కంటే ఎక్కువమంది స్త్రీలపై జరిపిన క్రూరాతిక్రూరమైన చిత్రహింస రికార్డు చేయబడి ఉంది, అలా హింసించబడినవారిలో కొంతమంది చాలా చిన్న పిల్లలు.

వాస్తవం ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ యౌవనస్థురాలైన ఒక వేశ్య ఇలా అన్నది: “నేను పని కోసం వెతికితే, కనీసం తిండికి సరిపడేంత కూడా సంపాదించుకోలేను ఎందుకంటే నాకే వృత్తివిద్యా రాదు. నేనేం చేస్తున్నానో నా కుటుంబానికి తెలుసు, ఈ జీవన విధానాన్ని మార్చుకోవడం నాకిష్టం లేదు. ఇది నా శరీరం, దాన్ని నాకిష్టమొచ్చినట్లు ఉపయోగించుకుంటాను.”

అయినా ఈ అమ్మాయిలు వ్యభిచారాన్ని ఎన్నడూ తమ లక్ష్యంగా ఏర్పరచుకోలేదు. ఒక సమాజ సేవకురాలు చెబుతున్నట్లుగా, యౌవనస్థులైన చాలామంది వేశ్యలు “వివాహం చేసుకోవాలని కోరుకుంటారు,” “అందాల రాకుమారుడి” గురించి కలలు కంటారు. వాళ్ళు వ్యభిచార జీవితాన్ని ప్రారంభించడానికి దారితీసే క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక పరిశోధకురాలు ఇలా అంటోంది: “అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, వారిలో అత్యధికులు తమ సొంత ఇళ్ళలోనే మానభంగానికి గురయ్యారు.”

బాల వేశ్యావృత్తికి అంతమా?

అయితే అభాగ్యులైన ఈ పిల్లలకు నిరీక్షణ ఉంది. అన్ని వయస్సుల వేశ్యలు తమ జీవనశైలిని మార్చుకున్నారు. (7వ పేజీలో ఉన్న, “ప్రజలు మారవచ్చు” అనే బాక్సు చూడండి.) దేవుని వాక్యమైన బైబిలు మంచి పొరుగువారిగా, నమ్మకమైన కుటుంబ సభ్యులుగా ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి సహాయం చేసింది. ఒకప్పుడు జారులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, లోభులుగా, త్రాగుబోతులుగా ఉన్న ప్రజల గురించి మనమిలా చదువుతాము: “మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”​—1 కొరింథీయులు 6:9-11.

బైబిలు కాలాల్లోలాగే నేడు తమ జీవితాలను సరైన మార్గంలోకి మళ్ళించుకుంటున్నవారు ఉన్నారు. అయినా, లైంగిక అత్యాచారమనే మహమ్మారిని మట్టుబెట్టడానికి ఇంకా ఎంతో అవసరం. కొన్ని ప్రభుత్వాలు, ఇతర సంస్థలు సెక్స్‌ పర్యటనకు, బాల వేశ్యావృత్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కానీ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి వాస్తవానికి మానవుడు చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు. లైంగిక దుర్నీతికి మూలకారణాలైన తలంపులను, దృక్పథాలను శాసనకర్తలు నివారించలేరు.

అయితే, మానవ ప్రయత్నాలు కాదుగానీ ఈ సమస్యలన్నిటిని పరిష్కరించే మూలం మరొకటుంది, అదే దేవుని రాజ్యం. దాని గురించి తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది. (g03 02/08)

[6వ పేజీలోని బ్లర్బ్‌]

బాల వేశ్యావృత్తికి తరచూ పేదరికం దోహదపడుతుంది

[6వ పేజీలోని బాక్సు]

అధిక మూల్యం

డేసీ తన అన్నలలో ఒకరి చేతిలో లైంగిక అత్యాచారానికి గురైనప్పుడు, ఆమె వయస్సు ఆరేళ్ళే. ఫలితంగా, ఆమె తన పెద్దన్నయ్యతోనే ఉండి, 14 ఏండ్లు వచ్చినప్పుడు ఒక నైట్‌క్లబ్‌లో పని చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత, డేసీ అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకున్న తర్వాత ఆమె యజమానులు ఆమె తమకు కొంత డబ్బు రుణపడి ఉందని చెప్పి ఆమెను వేశ్యగా పని చేయమని బలవంతం చేశారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఆమె ఇంకా అప్పుల్లోనే ఉంది, ఇక ఎన్నటికీ తాను ఆ అప్పు నుండి విముక్తి పొందలేనన్నట్లు భావించింది. అయితే, ఒక నావికుడు ఆమె అప్పు తీర్చేసి, ఆమెను మరో నగరానికి తీసుకువెళ్ళాడు, అక్కడ ఆయన ఆమెనొక బానిసలా చూసేవాడు. ఆమె ఆయనను వదిలేసి, మరో వ్యక్తితో మూడు సంవత్సరాలపాటు కలిసి జీవించింది, ఆ తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. గంభీరమైన వైవాహిక సమస్యల కారణంగా ఆమె మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

చివరికి ఆమె, ఆమె భర్త బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించారు. కానీ డేసీ తాను యెహోవాసాక్షిగా మారడానికి అనర్హురాలినని భావించింది. అవసరమైన మార్పులు చేసుకునే వారిని యెహోవా దేవుడు అంగీకరిస్తాడని ఆమెకు బైబిలు నుండి చూపించినప్పుడు, ఆమె తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుంది. డేసీ సరైనది చేయడానికి గట్టి కృషి చేసింది, కానీ అది సరిపోతుందని ఆమెకు అనిపించేదికాదు, దానితో ఆమె ఎంతో కృంగిపోయేది. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆమె లైంగిక అత్యాచారం కారణంగా, బాల వేశ్యగా తాను గడిపిన జీవితం కారణంగా తనకు కలిగిన వేదనను అధిగమించి మానసిక సమతుల్యాన్ని సంపాదించుకొని దాన్ని కాపాడుకోవడానికి కావలసిన సహాయాన్ని స్వీకరించింది.

[7వ పేజీలోని బాక్సు]

ప్రజలు మారవచ్చు

యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, బాధలనుభవిస్తున్న వారిని, పాపులను చూసి జాలిపడ్డాడు. వేశ్యలు, ఏ వయస్సు వారైనప్పటికీ, వారు తమ జీవన విధానాన్ని మార్చుకోవచ్చునని ఆయన అర్థం చేసుకున్నాడు. చివరికి యేసు మతనాయకులతో ఇలా అన్నాడు: “సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదు[రు].” (మత్తయి 21:31) తమ జీవన విధానాన్ని బట్టి అసహ్యించుకోబడినప్పటికీ సరైన హృదయపరిస్థితిగల అలాంటి వారు దేవుని కుమారుని యందు తమకున్న విశ్వాసాన్ని బట్టి క్షమించబడ్డారు. పశ్చాత్తాపపడిన పాపులు దేవుని రాజ్య ఆశీర్వాదాలను పొందేందుకు, వేశ్యలుగా తాము గడుపుతున్న జీవితాలను మార్చుకోవడానికి సుముఖత చూపించారు. ఆ తర్వాత, వారు దేవుని నీతియుక్తమైన కట్టడలకు అనుగుణంగా జీవించారు. నేడు కూడా, అన్ని వర్గాల ప్రజలు దేవుని వాక్య సత్యాన్ని అంగీకరించి, తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు.

మొదటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన మారియా, కరీనా, ఎస్టెల్లా అనే ముగ్గురమ్మాయిలకు ఏమి జరిగిందో పరిశీలించండి. మారియా వేశ్యగా కొనసాగమని తన తల్లి చేస్తున్న ఒత్తిడిని ఎదిరించడమేగాక, మత్తుమందుల అలవాటును మానుకోవడానికి ఎంతో తీవ్రంగా పోరాడవలసి వచ్చింది. ఆమె ఇలా వివరిస్తోంది: “నేను వేశ్యగా జీవిస్తున్నాను కాబట్టి నేనెందుకూ పనికిరాను అని నాలో కలిగే భావాలను అణచివేయడానికి నేను మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాను.” యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంలో తనకెలాంటి ఆహ్వానం లభించిందో మారియా ఇలా వివరిస్తోంది: “సంఘ సభ్యులు చూపించిన ప్రేమకు నేనెంతో ప్రభావితురాలినయ్యాను. అందరూ​—పిన్నలూ పెద్దలూ​—నాతో గౌరవపూర్వకంగా వ్యవహరించారు. వివాహిత పురుషులు తమ భార్యలకు నమ్మకంగా కట్టుబడి ఉండడాన్ని నేను గమనించాను. వారు నన్ను తమ స్నేహితురాలిగా అంగీకరించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.”

కరీనాకు 17 ఏండ్లున్నప్పుడు యెహోవాసాక్షులు ఆమెను కలిశారు. ఆమె వేశ్యగా తన వృత్తిని కొంతకాలంపాటు కొనసాగించినప్పటికీ బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది. క్రమంగా, ఆమె బైబిలు సత్యాల విలువను గ్రహించడం మొదలుపెట్టింది. కాబట్టి దూరానున్న ఒక నగరానికి తరలి వెళ్ళాలని ఆమె నిశ్చయించుకుంది, అక్కడామె యెహోవాసాక్షి అయ్యింది.

బాల్యంలోనే వేశ్యావృత్తి, అల్లరితోకూడిన ఆటపాటలు, విపరీతమైన త్రాగుడు వంటివాటిలో నిమగ్నమైన ఎస్టెల్లాకు బైబిలుపై ఆసక్తి కలిగింది. అయితే ఆమె, దేవుడు తనను ఎన్నడూ క్షమించడనే నిర్ధారణకు వచ్చింది. కానీ కొంతకాలానికి, పశ్చాత్తాపపడే వారిని యెహోవా దేవుడు క్షమిస్తాడని ఆమె అర్థం చేసుకుంది. ఇప్పుడు వివాహమై, ముగ్గురు పిల్లలతో, క్రైస్తవ సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఎస్టెల్లా ఇలా చెబుతోంది: “బురదలో నుండి నన్ను బయటికి తీసి పరిశుభ్రమైన తన సంస్థలోకి నన్ను అంగీకరించినందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని, దానికి నేనెంతో సంతోషిస్తున్నాను.”

ఈ వృత్తాంతాలు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెన[న్నది]” దేవుని చిత్తమనే బైబిలు వ్యాఖ్యానాన్ని సమర్థిస్తున్నాయి.​—1 తిమోతి 2:4.

[7వ పేజీలోని చిత్రం]

బాల వేశ్యలు సాధారణంగా మత్తుపదార్థాలకు అలవాటుపడతారు

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Jan Banning/Panos Pictures, 1997