కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎంపిక చేసుకునే స్వాతంత్రాన్ని మనమెలా వినియోగించుకోవాలి?

ఎంపిక చేసుకునే స్వాతంత్రాన్ని మనమెలా వినియోగించుకోవాలి?

బైబిలు ఉద్దేశం

ఎంపిక చేసుకునే స్వాతంత్రాన్ని మనమెలా వినియోగించుకోవాలి?

దేవుడు మొదటి మానవులైన ఆదాము హవ్వలకు ఎంపిక చేసుకునే సామర్థ్యాన్నిచ్చాడు. ఆయన ఏదెను తోట బాధ్యతను ఆదాముకు అప్పగించాడు. ఆదాము నిర్వహించవలసిన పనుల్లో జంతువులకు పేర్లు పెట్టే స్వాతంత్ర్యం కూడా ఉంది. (ఆదికాండము 2:15, 19) అంతకంటే ప్రాముఖ్యంగా, ఆదాము హవ్వలు తాము దేవునికి విధేయంగా ఉండాలా వద్దా అనేది కూడా నిర్ణయించుకోవచ్చు.​—ఆదికాండము 2:17, 18.

అప్పటినుండి మానవులు కోటానుకోట్ల నిర్ణయాలు తీసుకున్నారు—వాటిలో అనేకం సరైనవి, కొన్ని అనుచితమైనవి, మిగతావైతే పూర్తిగా హానికరమైనవి. మానవుడు చేసిన కొన్ని మూర్ఖపు ఎంపికలు వినాశకరమైన ఫలితాలకు దారితీశాయి. అయినప్పటికీ ఎంపిక చేసుకునే మన స్వాతంత్ర్యం విషయంలో దేవుడు ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. మనం మంచి నిర్ణయాలు తీసుకునేందుకు దేవుడు ప్రేమపూర్వకమైన ఒక తండ్రిగా బైబిలు ద్వారా సహాయాన్ని అందిస్తాడు. తప్పుడు ఎంపికల వల్ల వచ్చే పరిణామాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తాడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామని బైబిలు చెబుతోంది.​—గలతీయులు 6:7.

వ్యక్తిగత విషయాల్లో తీసుకునే నిర్ణయాలు

కొన్ని విషయాల్లో దేవుడు మనకు నిర్దిష్టమైన మార్గనిర్దేశాన్ని అందిస్తూ తన చిత్తాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడు. కానీ మన వ్యక్తిగత విషయాలన్నింటినీ నియంత్రించేందుకు బైబిలు, నిబంధనలను పెట్టడంలేదు. బదులుగా మనలో ప్రతి ఒక్కరికి విభిన్నమైన అభిరుచులు, కోరికలు ఉండడాన్ని అనుమతిస్తూ అది విస్తృతమైన మార్గనిర్దేశాన్నిస్తుంది. ఉదాహరణకు అది వినోద కాలక్షేపం గురించి ఏమి చెబుతోందో గమనించండి.

లేఖనాలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని పిలుస్తున్నాయి. (1 తిమోతి 1:8-11, NW) “నవ్వుటకు . . . నాట్యమాడుటకు” సమయము ఉందని ఆయన వాక్యం చెబుతోంది. (ప్రసంగి 3:1, 4) దావీదు రాజు ఇతరుల ఆనందం కోసం సంగీతం వాయించాడని బైబిలు మనకు చెబుతోంది. (1 సమూయేలు 16:16-18, 23) యేసు ఒక వివాహపు విందుకు హాజరవడమే కాక, నీటిని ద్రాక్షారసముగా మార్చడం ద్వారా ఆయన ఆ సందర్భానికి తోడ్పడ్డాడు.​—యోహాను 2:1-10.

అయినా బైబిలు యుక్తంగానే ఇలా హెచ్చరిస్తోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) “సరసోక్తు[లు],” అనైతిక కార్యకలాపాలు దేవుని మనస్సు నొప్పించడమే కాక ఆయనతో మన సంబంధాన్ని పతనం చేయగలవు. (ఎఫెసీయులు 5:3-5) సామాజిక విందులు, వినోదాలు జరిగినప్పుడు అదుపులేకుండా మద్యం సరఫరా చేస్తే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశముంది. (సామెతలు 23:29-35; యెషయా 5:11, 12) యెహోవా దేవుడు దౌర్జన్యాన్ని కూడా అసహ్యించుకుంటాడు.​—కీర్తన 11:5; సామెతలు 3:31.

ఈ బైబిలు వచనాలు, వినోద కాలక్షేపాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడో మనం కూడా అలాగే దృష్టించేందుకు మనకు దోహదపడతాయి. ఎంపిక చేసుకునేటప్పుడు క్రైస్తవులు బైబిలును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు. మనలో ప్రతి ఒక్కరం మన సొంత ఎంపికల విషయంలో మంచి లేక చెడు పరిణామాలను ఎదుర్కొంటామన్నది నిస్సంశయం.​—గలతీయులు 6:7-10.

అదే విధంగా క్రైస్తవులు తాము ధరించే బట్టల విషయంలో, వివాహాల విషయంలో, తల్లిదండ్రులుగా తమ బాధ్యతల విషయంలో, వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా బైబిలు సూత్రాలకు అనుగుణంగా జ్ఞానవంతమైన నిర్ణయాలను తీసుకొమ్మని ప్రోత్సహించబడుతున్నారు. వీటితోపాటు లేఖనాల్లో నిర్దిష్టంగా ప్రస్తావించబడని విషయాలు కూడా ఉన్నాయి. అయితే లేఖనాల్లోని సూత్రాలు మనస్సాక్షి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేందుకు వారికి సహాయపడతాయి. (రోమీయులు 2:14, 15) క్రైస్తవులు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలన్నింటిలో ఈ ప్రమాణాన్ని అనుసరించాలి: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”​—1 కొరింథీయులు 10:31.

ఎంపిక చేసుకునే అంశంలో మనం ‘పరులజోలికి పోక సొంత కార్యములను’ చూసుకోవడమనే సూత్రాన్ని గురించి ఆలోచించడం మంచిది. (1 థెస్సలొనీకయులు 4:10-12) క్రైస్తవులకు తరచుగా దేవుని చిత్తానికి విరుద్ధం కాని పలు ఎంపికలు చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఆ కారణంగా ఒక క్రైస్తవుని ఎంపిక ఇతరులు చేసుకునే ఎంపికలకు భిన్నంగా ఉండవచ్చు. తన సేవకులు ఒకరినొకరు తీర్పు తీర్చుకోవడం దేవునికి అసంతృప్తి కలిగిస్తుంది. (యాకోబు 4:11, 12) బైబిలు జ్ఞానవంతంగా ఇలా హితవు చెబుతోంది: “మీలో ఎవడును . . . పరులజోలికి పోవువాడుగా . . . బాధ అనుభవింప తగదు.”​—1 పేతురు 4:15.

దేవుణ్ణి సేవించాలనే నిర్ణయం

దేవునికి విధేయంగా ఉండడంలోని ప్రయోజనాలను బైబిలు నొక్కి చెబుతోంది. అయినా దేవుడు తనను ఆరాధించమని ప్రజలను బలవంతం చేయడు. బదులుగా తన ఆరాధకులవమని ఆయన మానవులను ఆహ్వానిస్తున్నాడు. ఉదాహరణకు బైబిలు ఇలా చెబుతోంది: “రండి నమస్కారము చేసి సాగిలపడుదము; మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.”​—కీర్తన 95:7.

అలాంటి ఆహ్వానం ఒకటి ప్రాచీన ఇశ్రాయేలుకు ఇవ్వబడింది. 3,500 సంవత్సరాల కంటే పూర్వం ఇశ్రాయేలు జనాంగం సీనాయి పర్వతం ముందు నిలబడి ఉన్నప్పుడు, దేవుడు మోషే ధర్మశాస్త్రంలో విశదీకరించబడిన నిజమైన మత వ్యవస్థ గురించి ఆ లక్షలాది మందికి తెలియజేశాడు. అప్పుడు వారికి, దేవుణ్ణి సేవించాలా వద్దా అనేది ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారెలా ప్రతిస్పందించారు? ముక్త కంఠంతో వాళ్ళిలా అన్నారు: “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము.” (ఇటాలిక్కులు మావి) (నిర్గమకాండము 24:7, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యెహోవాను ఆరాధించాలన్నది వారు స్వయంగా తీసుకున్న నిర్ణయం.

దేవుని రాజ్య సువార్తను ప్రకటించడాన్ని యేసు మొదటి శతాబ్దంలో ప్రారంభించాడు. (మత్తయి 4:17; 24:14) ఆ పనిలో పాల్గొనమని ఆయన ఎవరినీ ఎన్నడూ బలవంతం చేయలేదు. బదులుగా ఆయన “నన్ను వెంబడించం[డి]” అని ఇతరులను ప్రేమతో ఆహ్వానించాడు. (మార్కు 2:14; 10:21) చాలామంది ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆయనతోపాటు ప్రకటించడం ప్రారంభించారు. (లూకా 10:1-9) కొంతకాలం తర్వాత కొందరు యేసును వదిలి వెళ్ళిపోవడానికి ఎంపిక చేసుకున్నారు. యూదా ఇస్కరియోతు ఆయనను వంచించడానికి ఎంపిక చేసుకున్నాడు. (యోహాను 6:66; అపొస్తలుల కార్యములు 1:25) అటుపిమ్మట అపొస్తలుల నేతృత్వంలో ఇంకా అనేకమంది శిష్యులయ్యారు, వాళ్ళు భయంతో కాక తమ స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకొని శిష్యులయ్యారు. వారు ‘సరైన వైఖరిగలవారు’ కాబట్టే ‘విశ్వాసులయ్యారు.’ (అపొస్తలుల కార్యములు 13:48, NW; 17:34) నేడు కూడా నిజ క్రైస్తవులు దేవుని వాక్యానికి ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తూ, యేసు బోధనలను అనుసరిస్తారు.

ఎంపిక చేసుకునే మన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టమవుతోంది. మనం జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయకరంగా ఆయన బైబిలు ద్వారా మార్గదర్శకాన్ని కూడా అందజేస్తాడు. (కీర్తన 25:12) ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని సూత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం దేవునికి మన “తర్కించే శక్తితో పవిత్ర సేవ” చేయగలుగుతాం.​—రోమీయులు 12:1, NW. (g03 3/08)