కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కాపీ కొట్టడంలో తప్పేముంది?

కాపీ కొట్టడంలో తప్పేముంది?

యువత ఇలా అడుగుతోంది . . .

కాపీ కొట్టడంలో తప్పేముంది?

“కాపీ కొట్టడం తప్పని అందరికీ తెలుసు కానీ అది చాలా సులభమైన పని.”

—జిమ్మీ, 17 ఏండ్లు.

పరీక్షలు వ్రాసేటప్పుడు మీ తోటి విద్యార్థి పేపర్లోకి తొంగిచూడాలని మీకెప్పుడైనా అనిపించిందా? అలా అనిపించిందంటే మీకే కాదు, చాలామందికి అలా అనిపిస్తుంది. 12వ తరగతి చదువుతున్న జేన తన తోటి విద్యార్థుల్లో చాలామంది నిస్సిగ్గుగా కాపీ ఎలా కొడతారో చెబుతోంది: “వాళ్ళు కాపీ కొట్టిన విధానాల గురించి గొప్పలు చెప్పుకుంటారు, మీరు కాపీ కొట్టలేదంటే మిమ్మల్ని వింతగా చూస్తారు!”

అమెరికాలో జరిపిన ఒక సర్వేలో, తమ తరగతుల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకునే విద్యార్థుల్లో 80 శాతం టీనేజర్లు కాపీ కొట్టినట్లు అంగీకరించారు, “ఉన్నత శ్రేణులు పొందే” ఈ విద్యార్థుల్లో 95 శాతం ఎన్నడూ పట్టుబడలేదు. మిడిల్‌ స్కూలు, హైస్కూలుకు చెందిన 20,000 కంటే ఎక్కువమంది విద్యార్థులపై సర్వే నిర్వహించిన జోసెఫ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎథిక్స్‌ ఇలాంటి నిర్ధారణకు వచ్చింది: “నిజాయితీ, యథార్థతలకు సంబంధించిన విషయాలు దినదినానికి దిగజారిపోతున్నాయి.” కాపీ కొట్టే అలవాటు ఎంతగా వ్యాప్తి చెందిందో చూసి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి చెందారు! స్కూలు డైరెక్టర్‌ గరీ జె. నీల్స్‌ చివరకు ఇలా అన్నాడు: “కాపీ కొట్టని వారు అల్ప సంఖ్యలో ఉన్నారు.”

పాఠశాలకు సంబంధించిన విషయాల్లో తమ పిల్లలు గౌరవనీయంగా ప్రవర్తించాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే విషాదకరంగా చాలామంది యౌవనులు కాపీ కొట్టడం ద్వారా తమ నిజాయితీని పాడుచేసుకుంటారు. వాళ్ళు ఎలాంటి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు? కొందరు యౌవనులు ఎందుకు కాపీ కొడతారు? మీరు ఆ అలవాటుకు దూరంగా ఎందుకు ఉండాలి?

హైటెక్‌ కాపీ

ఆధునిక కాలంలో కాపీ కొట్టే వ్యక్తి అవినీతికరమైన పద్ధతులు ఎన్నైనా ఉపయోగిస్తాడు. నిజానికి ఇతరుల నుండి హోమ్‌వర్క్‌ను కాపీ చేసుకోవడం లేదా పరీక్షకు జవాబులున్న చీటీలు తీసుకెళ్ళడం అనేవి, నేటి హైటెక్‌ కుయుక్తులతో పోలిస్తే చాలా అల్పమైన మోసాలుగా అనిపిస్తాయి. ఈ కుయుక్తులలో, పరీక్షలోని ప్రశ్నలకు మరోచోట ఉన్న వ్యక్తినుండి జవాబులను పొందే పేజర్లను ఉపయోగించడం, “అదనపు” సమాచారంతో ప్రోగ్రాం చేయబడిన కాలిక్యులేటర్లను వాడడం, చిన్న సైజు కెమెరాలను బట్టల్లో దాచుకొని బయట తనకు సహాయం చేసే వ్యక్తికి ప్రశ్నలను పంపించడం, హైటెక్‌ కాలిక్యులేటర్ల ద్వారా దగ్గర్లోని తోటి విద్యార్థులకు సందేశాలు పంపించడంవంటి వాటితోపాటు, దాదాపు అన్ని సబ్జక్టుల పూర్తి టర్మ్‌ పేపర్లు లభ్యమయ్యే ఇంటర్‌నెట్‌ సైట్లు కూడా ఉన్నాయి!

ప్రమాదకరమైన ఈ ధోరణిని మార్చేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ లక్ష్యం అంత సులభమైనది కాదు. ఎందుకంటే మోసమని పరిగణించబడే విషయాన్ని ప్రతి విద్యార్థి లేక ఉపాధ్యాయుడు అంగీకరించడు. ఉదాహరణకు విద్యార్థుల బృందాలు ఒక ప్రాజెక్టులో కలిసి పనిచేసేటప్పుడు నిజాయితీతో కూడిన తోడ్పాటుకు నిజాయితీ లేని సహకారానికి మధ్య తేడా అంత స్పష్టంగా కనబడకపోవచ్చు. ఇక కొందరైతే పనంతా ఇతరులతోనే చేయించడం ద్వారా బృందం చేసే కృషిని తమ లబ్ధి కోసం ఉపయోగించుకుంటుండవచ్చు. “అలాంటి విద్యార్థుల్లో కొందరు చాలా బద్ధకస్తులు​—వాళ్ళు ఏమీ చేయరు! వాళ్ళు కూడా అందరిలాగే గ్రేడు పొందుతారు. అది కూడా మోసమేనని నేను భావిస్తున్నాను!” అని యూజీ వాపోతున్నాడు, ఆయన ఒక కమ్యూనిటీ కాలేజీలో చదువుకుంటున్నాడు.

వాళ్ళెందుకు కాపీ కొడతారు?

సరిగ్గా సిద్ధపడకపోవడమే అనేకమంది విద్యార్థులు కాపీ కొట్టడానికి ప్రధాన కారణమని ఒక సర్వేలో తేలింది. మరికొందరు విద్యార్థులు స్కూల్లో పోటీ మనస్థత్వం వల్ల లేదా తల్లిదండ్రులు వారి నుండి ఎక్కువగా ప్రతీక్షించడం వల్ల ఒత్తిడికిలోనై కాపీకొట్టడం తప్ప వేరే గత్యంతరం లేదనే నిర్ధారణకు వస్తారు. “మా తల్లిదండ్రులకైతే గ్రేడ్సు సంపాదించడమే అన్నిటికంటే ప్రాముఖ్యం” అని 13 ఏండ్ల సామ్‌ అంటున్నాడు. “‘నీకు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంగ్లీష్‌ పేపర్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు?’ అని వాళ్ళు నన్నడుగుతారు, అది నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది!”

మంచి గ్రేడ్లను తెచ్చుకోవాలన్న ఒత్తిడే కొందరిని కాపీ కొట్టడానికి నడిపిస్తుంది. ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ టీనేజర్‌ అనే పుస్తకం ఇలా అంటోంది: “తీవ్రమైన ఒత్తిడిగల ఈ వ్యవస్థలో సమన్వయం లేకుండాపోయింది, మంచి గ్రేడ్లను పొందాలన్న ఒత్తిడి నేర్చుకున్నామన్న తృప్తి లేకుండా చేస్తోంది, కొన్నిసార్లు అది అవినీతికి దారితీస్తోంది.” చాలామంది విద్యార్థులు దీనితో ఏకీభవిస్తారు. ఎంతైనా పరీక్షలో తప్పాలనీ అంతకంటే ముఖ్యంగా మొత్తం కోర్సు తప్పాలనీ ఎవరూ కోరుకోరు. “కొందరు విద్యార్థులైతే తాము ఫెయిల్‌ అవుతామేమోనని చాలా భయపడతారు, వాళ్ళకు జవాబులు తెలిసినప్పటికీ, అవి సరైనవో కావో నిశ్చయపరచుకునేందుకు కాపీ కొడతారు” అని హైస్కూలు విద్యార్థి జిమ్మీ అంటున్నాడు.

నిజాయితీ ప్రమాణాలను విడిచిపెట్టేందుకు ఇష్టపడే చాలామంది విద్యార్థులు, కాపీ కొట్టడంలో ఎలాంటి హానీ లేదని అనిపించేలా చేయగలరు. కొన్నిసార్లు అది పూర్తిగా లాభదాయకమైనదని కూడా అనిపించవచ్చు. “నిన్న నా తరగతిలో ఒక అబ్బాయి పరీక్షలో కాపీ కొట్టడం నేను చూశాను, ఇవ్వాళ మా టీచర్‌ నుండి పేపర్లు తీసుకుంటున్నప్పుడు చూస్తే ఆ అబ్బాయికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి” అని 17 ఏండ్ల గ్రేగ్‌ చెబుతున్నాడు. తోటివారిలో ప్రబలంగా ఉన్న కాపీ కొట్టే అలవాటుకు అనేకమంది ప్రభావితులవుతారు. “‘వేరేవాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి’ అని కొందరు విద్యార్థులు భావిస్తారు” అని యూజీ అంటున్నాడు. కానీ అది సరైనదేనా?

మోసకరమైన వ్యసనం

కాపీ కొట్టడాన్ని దొంగతనంతో పోల్చిచూడండి. చాలామంది దొంగతనాన్ని ఆశ్రయిస్తున్నారనే వాస్తవం దొంగతనాన్ని అంగీకారయోగ్యం చేస్తుందా? ముఖ్యంగా దొంగిలించబడిన డబ్బు మీదే అయితే అది ‘ఎంత మాత్రం అంగీకారయోగ్యమైనది కాదు’ అని మీరు అంటుండవచ్చు! కాపీ కొట్టడం ద్వారా మనం​—బహుశా నిజాయితీగా ప్రవర్తించేవారి నుండి ప్రయోజనం పొందుతూ​—అర్హులం కానిదానికి కీర్తిని తెచ్చుకుంటున్నాం. (ఎఫెసీయులు 4:27, 28) “అది ఏ మాత్రం సరైనది కాదు” అని ఇటీవలే హైస్కూలు పూర్తి చేసిన టామీ అంటున్నాడు. “నిజానికి మీకు తెలియనప్పుడు మీరు ‘నాకీ విషయాలు తెలుసు’ అని అంటున్నారు, కాబట్టి మీరు అబద్ధం చెబుతున్నట్లే.” ఈ విషయంపై బైబిలు దృక్కోణం కొలొస్సయులు 3:9 లో “ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి” అని స్పష్టంగా సూచించబడింది.

కాపీ కొట్టే అలవాటు, విడిచిపెట్టడం కష్టమయ్యే వ్యసనంగా కూడా మారవచ్చు. “తాము పాస్‌ అవ్వాలంటే చదవాల్సిన అవసరం కూడా లేదని కాపీ కొట్టేవాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు పూర్తిగా కాపీ కొట్టడంపైనే ఆధారపడతారు. ఆ తర్వాత తాము సొంతంగా జీవించడం ఆరంభించాక విజయవంతంగా జీవించడమెలాగో వాళ్ళకు తెలియదు” అని జేన అంటోంది.

గలతీయులు 6:7లో నమోదైన “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రం ఆలోచింపజేసేదిగా ఉంది. స్కూల్లో కాపీ కొట్టడం వల్ల వచ్చే పరిణామాల్లో తప్పుచేశాననే పరితాపం, మీ స్నేహితుల నమ్మకాన్ని కోల్పోవడం వంటివి ఉండవచ్చు, అంతేకాదు మీరు నేర్చుకునే ప్రక్రియను తప్పించుకోవడం వల్ల నేర్చుకునే మీ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. మరణానికి గురయ్యేలా క్యాన్సర్‌ శరీరమంతా ఎలా వ్యాపిస్తుందో, కాపీ కొట్టే ఈ అలవాటు కూడా మీ జీవితంలోని ఇతర అంశాల్లోకి కూడా వ్యాపించి అత్యంత విలువైన సంబంధాలను నాశనం చేసే అవకాశముంది. మోసాన్ని అసహ్యించుకునే దేవునితో మీకున్న సంబంధాన్ని అది తప్పకుండా ప్రభావితం చేస్తుంది.​—సామెతలు 11:1.

మోసగించడంపై ఆధారపడేవారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. (సామెతలు 12:19) వారి చర్యల ద్వారా వారు, ప్రాచీన యెరూషలేము పట్టణంలోని దుష్ట పాలకులు వహించినటువంటి స్థానాన్ని వహిస్తున్నారు: “అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము.” (యెషయా 28:15) అయితే వాస్తవానికి మోసం చేసే వ్యక్తి తన చర్యలను దేవునికి కనబడకుండా దాచలేడు.​—హెబ్రీయులు 4:13.

కాపీ కొట్టకండి!

అనేక సందర్భాల్లో యౌవనులు కాపీ కొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు, ఎంతో చాతుర్యాన్ని చూపిస్తారు​—వాటినే నిజాయితీగా చదువు నేర్చుకోవడంలో చూపిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 18 ఏండ్ల అబీ ఇలా చెబుతోంది: “కాపీ కొట్టడానికి బదులు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తే వారు బహుశా మంచి గ్రేడ్లను తెచ్చుకోవచ్చు.”

నిజమే కాపీ కొట్టాలనే కోరిక చాలా బలంగా ఉంటుందని అంగీకరించవలసిందే. అయినా నీతిని దిగజార్చే ఈ అలవాటును మీరు విడిచిపెట్టాలి! (సామెతలు 2:10-15) దాన్ని మీరెలా విడిచిపెట్టగలరు? మొదటిగా మీరు స్కూలుకు ఎందుకు వెళ్తున్నారో గుర్తుంచుకోండి​—నేర్చుకోవడానికి. నిజమే మీరు బహుశా భవిష్యత్తులో ఎన్నడూ ఉపయోగించే అవకాశంలేని అనేక విషయాలను నేర్చుకోవడంలో పెద్ద ప్రయోజనం కనబడకపోవచ్చు. కానీ నేర్చుకునే ప్రక్రియను కాపీ కొట్టడం ద్వారా దారి మళ్ళించడంతో ఒక వ్యక్తి కొత్త విషయాలను నేర్చుకునే, పరిజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకునే తన సామర్థ్యాన్ని అడ్డుకుంటున్నాడు. నిజమైన అవగాహన ఊరకే ఎప్పటికీ కలుగదు; దాని కోసం కష్టపడాలి. బైబిలు ఇలా చెబుతోంది: “సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము.” (సామెతలు 23:23) అవును చదవడాన్ని, సిద్ధపడడాన్ని మీరు గంభీరంగా తీసుకోవాలి. “మీరు బాగా చదువుకుంటే, జవాబులు తెలుసుననే దృఢ నమ్మకం మీకు కలుగుతుంది” అని జిమ్మీ సూచిస్తున్నాడు.

కొన్నిసార్లు మీకు అన్ని జవాబులు తెలియకపోవడం వల్ల మార్కులు తక్కువ వచ్చే అవకాశముందన్నది నిజమే, అయినప్పటికీ మీరు మీ సూత్రాలతో రాజీపడకుండా ఉంటే, మీరు మీ అభివృద్ధికి ఏమి అవసరమో చూసుకునే అవకాశముంది.​—సామెతలు 21:5.

మొదట్లో ప్రస్తావించిన యూజీ ఒక యెహోవాసాక్షి. కాపీ కొట్టేందుకు తమకు సహాయం చేయమని తనను తోటి విద్యార్థులు ఒత్తిడి చేసినప్పుడు తనేమి చేస్తాడో ఆయన ఇలా వివరిస్తున్నాడు: “మొట్టమొదట​—నేనొక యెహోవాసాక్షినని వారికి తెలియజేస్తాను, యెహోవాసాక్షులు నిజాయితీగల ప్రజలని వాళ్ళకు తెలుసు కాబట్టి అలా తెలియజేయడం నాకెంతో సహాయపడుతుంది. పరీక్ష జరిగేటప్పుడు ఒక జవాబు చూపించమని ఎవరైనా నన్నడిగితే, నేను నిరాకరిస్తాను. ఆ తర్వాత దానికి కారణమేమిటో వివరిస్తాను.”

“మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు[న్నాము]” అని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులతో చేసిన వ్యాఖ్యతో యూజీ ఏకీభవిస్తున్నాడు. (హెబ్రీయులు 13:18) నిజాయితీకి సంబంధించిన ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకొని, మోసంతో రాజీపడకుండా ఉండడం ద్వారా మీరు పొందే మంచి గ్రేడ్లకు నిజమైన విలువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు ఇవ్వగలిగే శ్రేష్ఠమైన బహుమతుల్లో ఒకటి స్కూలు నుండి మీరు ఇంటికి తెస్తారు​—అదే క్రైస్తవ యథార్థతకు సంబంధించిన మంచి పేరు. (3 యోహాను 4) అంతేకాదు మీరు స్వచ్ఛమైన మనస్సాక్షిని కాపాడుకొని, యెహోవా దేవుని హృదయాన్ని సంతోషపరుస్తున్నారని తెలుసుకోవడం ద్వారా కూడా ఆనందాన్ని పొందుతారు.​—సామెతలు 27:11.

కాబట్టి కాపీ కొట్టడం ఎంత సర్వసాధారణమైనా దానికి దూరంగా ఉండండి! అలా ఉండడం ద్వారా మీరు ఇతరులతో, అత్యంత ప్రాముఖ్యంగా సత్యదేవుడైన యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకుంటారు.​—కీర్తన 11:7; 31:5. (g03 1/22)

[18వ పేజీలోని బ్లర్బ్‌]

కాపీ కొట్టే వ్యక్తి తాను నిజానికి దొంగతనం చేస్తున్నాననే విషయాన్ని అసలు గ్రహించడు

[18వ పేజీలోని బ్లర్బ్‌]

కాపీ కొట్టడం తరచూ అవినీతికి సంబంధించిన గంభీరమైన చర్యలకు దారితీస్తుంది

[19వ పేజీలోని బ్లర్బ్‌]

కాపీ కొట్టే వ్యక్తి తన చర్యలను దేవునికి కనబడకుండా దాచలేడు

[19వ పేజీలోని చిత్రం]

పరీక్షకు ముందు కష్టపడి చదవడం మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది