కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“క్రూరాతిక్రూరమైన నేరం”

“క్రూరాతిక్రూరమైన నేరం”

“క్రూరాతిక్రూరమైన నేరం”

మారియా * 14 ఏండ్ల పిన్న వయసులోనే వేశ్యగా మారింది. నువ్వు చాలా అందంగా ఉంటావు, పురుషులు నిన్ను బాగా ఇష్టపడతారు అని చెప్పిన తన సొంత తల్లి ఒత్తిడితోనే ఆమె ఈ నికృష్టమైన జీవన విధానాన్ని చేపట్టింది. డబ్బు బాగా సంపాదించుకోవచ్చని కూడా ఆమె తల్లి చెప్పింది. సాయంవేళల్లో మారియాను ఆమె తల్లి ఒక మోటల్‌కు తీసుకువెళ్ళేది, అక్కడే వాళ్ళు పురుషులను కలుసుకునేవారు. డబ్బు వసూలు చేసుకోవడానికి ఆమె తల్లి అక్కడికి దగ్గర్లోనే ఉండేది. ప్రతి రాత్రి మారియా ముగ్గురు నలుగురు వ్యక్తులతో గడిపేది.

మారియా ఇంటికి దగ్గర్లోనే ఉండే 13 ఏండ్ల కరీనా కూడా బలవంతంగా వేశ్యావృత్తిలోకి నెట్టబడింది. వాళ్ళ సమాజంలోని అనేక కుటుంబాల్లాగే, చెరకు పనివారైన కరీనా కుటుంబం తమ పరిమిత ఆదాయానికి తోడు మరింత సంపాదించుకోవచ్చునని ఆమెను వేశ్యావృత్తిలోకి దించారు. మరో ప్రాంతంలో, ఎస్టెల్లా చదవడం వ్రాయడం రాకపోయినా చిన్నవయస్సులోనే బడికి వెళ్ళడం మానేసి వేశ్యగా తయారయ్యింది. డేసీ అనే అమ్మాయిపై ఆమె బంధువులే అనేకసార్లు అత్యాచారం చేశారు. ఆమె మొదటిసారి తన సొంత అన్న చేతుల్లో అత్యాచారానికి గురైనప్పుడు ఆమెకు ఆరేళ్ళు. ఆమె తన 14వ ఏట వేశ్యగా మారింది.

ప్రపంచంలోని అనేక భాగాల్లో, బాల వేశ్యావృత్తి అనే సమస్య భీతిగొలిపే ఒక వాస్తవం. దాని ఫలితాలు విషాదకరమైనవి. ఇలా చిన్నతనంలోనే వేశ్యలుగా మారినవారు​—⁠ఎప్పుడూ వేశ్యావృత్తిలో ఉండేవారైనా లేక అప్పుడప్పుడు ఆ పని చేసేవారైనా​—⁠తరచూ నేరాలకు పాల్పడతారు, మత్తుమందులకు కూడా అలవాటు పడతారు. తాము అలాంటి హేయమైన జీవితాల నుండి తప్పించుకునే అవకాశం అంతగా లేదనీ లేక అసలే లేదనీ గ్రహించి వారిలో చాలామంది నిరాశ చెందుతారు, తమ జీవితాలు వ్యర్థమని భావిస్తారు.

బాల వేశ్యావృత్తి వల్ల కలిగే నాశనకరమైన ప్రభావాలను ప్రముఖ వ్యక్తులు గుర్తిస్తున్నారు. బ్రెజిల్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఫెర్నాండూ ఏన్రీక్‌ కార్డోసూ సరిగ్గానే ఇలా పేర్కొన్నాడు: “పిల్లలతో వేశ్యావృత్తి చేయించడం క్రూరాతిక్రూరమైన నేరం.” దీని గురించి బ్రెజిల్‌కు చెందిన ఒక వార్తాపత్రిక ఈ గంభీరమైన వ్యాఖ్యానాన్ని ప్రచురించింది: “అలాంటి ఆచారం మూలంగా [డబ్బు] వస్తుంది కాబట్టి దాన్ని సామాన్యమైనదిగా, సహించదగినదిగా, అంగీకారయోగ్యమైనదిగా చివరికి ఎంతో కోరదగినదిగా పరిగణించే దేశాలు, దానివల్ల కలిగే నాశనాన్ని ప్రతిరోజు అనుభవిస్తాయి. అది తీసుకువచ్చే ఏ విధమైన ఆర్థిక లాభమైనా, దాని మూలంగా కలిగే వ్యక్తిగత, కుటుంబ, సామాజిక నాశనాలతో పోలిస్తే అది ఎందుకూ పనికిరాదు.”

బాల్య వేశ్యావృత్తిని ఆపాలని కోరుకుంటున్న వారికి ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలున్నప్పటికీ సమస్య అధికమవుతూనే ఉంది. ఈ ఘోరమైన పరిస్థితికి కారణమేమిటి? అలాంటి నేరకార్యాలను ఎందుకు ఎంతోమంది సహించడమే గాక వాటికి మద్దతు కూడా ఇస్తున్నారు? (g03 2/08)

[అధస్సూచి]

^ దీనిలోని, దీని తర్వాతి ఆర్టికల్లలోని పేర్లు మార్చబడ్డాయి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

“పిల్లలతో వేశ్యావృత్తి చేయించడం క్రూరాతిక్రూరమైన నేరం.”​—బ్రెజిల్‌ మాజీ ప్రెసిడెంట్‌ ఫెర్నాండూ ఏన్రీక్‌ కార్డోసూ

[4వ పేజీలోని బ్లర్బ్‌]

“బాధితుల వయస్సు, లింగం, జాతి, సామాజిక స్థితి లేదా వర్గం ఏదైనప్పటికీ అన్ని రకాలైన లైంగిక అత్యాచారాలు మానవుల గౌరవానికి భంగం కలిగిస్తాయి, కాబట్టి అవి ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తాయి.”​—యునెస్కో సోర్సెస్‌.