కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రకారం, గర్భ సంబంధిత కారణాల మూలంగా ప్రతి సంవత్సరం ఐదు లక్షలకంటే ఎక్కువమంది స్త్రీలు మరణిస్తున్నారు. అంతేగాక, సంవత్సరానికి ఆరు కోట్లకంటే ఎక్కువమంది స్త్రీలు గర్భధారణ మూలంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారిలో మూడు వంతులమంది జీవితాంతం బాధపెట్టే హానికి లేదా అంటువ్యాధులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్‌) నివేదిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది స్త్రీలు గర్భం దాల్చడం, ప్రసవించడం, తమను తాము నిర్లక్ష్యం చేసుకోవడం వంటి పునరావృతమయ్యే పరిస్థితుల్లో చిక్కుకుపోయి, తద్వారా పూర్తిగా అలసిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. అవును, గర్భం ధరించడం హానికరం కాగలదు, చివరికి ప్రమాదకరం కూడా కావచ్చు. ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?

గర్భధారణకు ముందు ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రణాళిక వేసుకోవడం. తమకు ఎంతమంది పిల్లలు కావాలనేది భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవలసిన అవసరం ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, చిన్న చిన్నపిల్లలుండి వాళ్ళలో ఒకరు ఇంకా పాలు త్రాగే వయస్సులో ఉండగానే మరో బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలు సర్వసాధారణంగా కనిపిస్తుంటారు. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని, బాగా ఆలోచిస్తే ఒక బిడ్డకు మరో బిడ్డకు మధ్య ఎడం ఉండేలా చూసుకునేందుకు వీలుంటుంది, దానితో స్త్రీకి కాస్త ఉపశమనం లభిస్తుంది, అప్పుడామె ప్రసవించిన తర్వాత తిరిగి తేరుకోగలుగుతుంది.

పోషకాహారం. కోయెలిషన్‌ ఫర్‌ పాసిటివ్‌ ఔట్‌కమ్‌ ఇన్‌ ప్రెగ్నెన్సీ అనే ఒక ఐక్యసంస్థ ప్రకారం, ఒక స్త్రీ తన గర్భధారణకు ముందు, హానికరమైన పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగిన నష్టం నుండి కోలుకొని బిడ్డకు అవసరమైన మంచి పోషకాహార నిల్వలను వృద్ధిచేసుకోవడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. ఉదాహరణకు, తల్లి కాబోతున్న స్త్రీలో ఫోలిక్‌ ఆమ్లము తగినంతగా ఉంటే, న్యూరల్‌ ట్యూబు సరిగా మూసుకోనందువల్ల కలిగే స్పైనా బిఫిడా (వెన్నుపాము వద్ద నెరద అసంపూర్ణంగా ఉండి అందులోని భాగాలు బయటకు కనబడే లోపముతో పుట్టడం) అనే ప్రమాదం చాలామేరకు తగ్గుతుంది. గర్భస్థ పిండం యొక్క న్యూరల్‌ ట్యూబు గర్భధారణ జరిగిన 24 వ రోజు నుండి 28వ రోజు లోపల అంటే తాము గర్భం ధరించామని చాలామంది స్త్రీలు గ్రహించడానికి ఎంతో ముందే మూసుకుపోతుంది కాబట్టి గర్భం దాల్చాలనుకుంటున్న కొంతమంది స్త్రీలు తమ శరీరానికి ఫోలిక్‌ ఆమ్లమును చేకూర్చేవాటిని తీసుకుంటారు.

మరో ఆవశ్యకమైన పోషకాహారం ఇనుము. వాస్తవానికి, ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు మామూలు కన్నా రెండింతలు ఎక్కువ ఇనుము అవసరమవుతుంది. ఆమె శరీరంలో తగినంత ఇనుము లేకపోతే ఆమెలో రక్తహీనత ఏర్పడవచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామంది స్త్రీలకు ఈ సమస్య ఉంది. పదే పదే గర్భం దాల్చడం వల్ల ఈ పరిస్థితి మరింత దుర్భరమవుతుంది, ఎందుకంటే గర్భానికీ గర్భానికీ మధ్య ఇనుమును తిరిగి నిల్వచేసుకునేంత సమయం ఆమెకు లభించకపోవచ్చు. *

వయస్సు. ఇరవయ్యవపడిలో గర్భవతులైన స్త్రీలకంటే పదహారేళ్ళ కన్నా చిన్న వయస్సులో గర్భవతులైన అమ్మాయిలు మరణించే అవకాశం 60 శాతం అధికంగా ఉంది. మరో వైపున 35 ఏండ్లు దాటిన స్త్రీలు, డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి జన్మతః వచ్చే లోపాలుగల బిడ్డలకు జన్మనిచ్చే సాధ్యత ఎక్కువగా ఉంది. చాలా చిన్న వయసులో తల్లులైనవారు లేదా పెద్ద వయసులో గర్భవతులైనవారు ప్రిఎక్లామ్పిషియాకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గర్భం దాల్చిన 20వ వారం తర్వాత రక్తపోటు అధికం కావడం, శరీర ధాతువుల్లో నీరుచేరడం, మూత్రంలో మాంసకృత్తుల శాతం అధికమవడం ఈ వ్యాధి లక్షణాలు, దీని మూలంగా తల్లికి బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇన్ఫెక్షన్‌లు. మూత్రావయవాలకు, గర్భకోశానికి, యోనికి, జీర్ణకోశానికి, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌లు గర్భంతో ఉన్నప్పుడు మరింత అధికమై నెలలు నిండకుండానే ప్రసవం కావడం, ప్రిఎక్లామ్పిషియా వంటి ప్రమాదాలను అధికం చేస్తాయి. ఎలాంటి వ్యాధి సంక్రమించినా గర్భధారణ జరగక ముందే చికిత్స చేయించడం మంచిది.

గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రసవానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు. గర్భంతోవున్న కాలమంతా క్రమంగా వైద్యుడ్ని సంప్రదించడం ప్రసూతిలో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్లినిక్‌లకు, హాస్పిటల్‌లకు క్రమంగా వెళ్ళే అవకాశం అంతగాలేని దేశాల్లో సహితం, మంచి శిక్షణ పొందిన మంత్రసానులు అందుబాటులో ఉంటుండవచ్చు.

ప్రసవానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే పరిస్థితుల గురించి శిక్షణ పొందిన సిబ్బందిని జాగృతపరచవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే గర్భంలో కవలలు ఉండడం, రక్తపోటు పెరగడం, గుండెకు కాలేయానికి సంబంధించిన సమస్యలు, మధుమేహ వ్యాధి. కొన్ని దేశాల్లో, బిడ్డ జన్మించిన మొదటి నెలలో బిడ్డకు సోకగల ధనుర్వాతాన్ని నివారించడానికి, తల్లి తాను గర్భంతో ఉన్నప్పుడే ధనుర్వాతాన్ని అరికట్టే మందు తీసుకునే అవకాశం ఉంది. ఆమె గర్భం ధరించిన 26వ వారం నుండి 28వ వారం లోపల, గ్రూప్‌ బి స్ట్రెప్టోకోకస్‌ పరీక్ష కూడా చేయించుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు పెద్ద పేగులలో గనుక ఉంటే, ప్రసవ సమయంలో అవి బిడ్డకు సోకే అవకాశం ఉంది.

తల్లి కాబోయే స్త్రీ, తన ఆరోగ్య వివరాలతో సహా తాను అందజేయగల సమాచారాన్నంతటినీ ఆరోగ్య సిబ్బందికి అందజేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె నిస్సంకోచంగా ప్రశ్నలు కూడా అడగాలి. ఇక్కడ పేర్కొనబడిన పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి: బాహ్య జననాంగము నుండి రక్తస్రావం, హఠాత్తుగా ముఖంలో మంటతోకూడిన వాపు, తీవ్రంగా లేదా క్రమంగా వచ్చే తలనొప్పి, వ్రేళ్ళలో నొప్పి, హఠాత్తుగా కంటిచూపు దెబ్బతినడం లేదా చూపు మందగించడం, విపరీతమైన కడుపు నొప్పి, ఆగకుండా వాంతులవడం, వణుకు లేదా జ్వరం, గర్భస్థ పిండం తరచుగా లేదా విపరీతంగా కదలడం, జననాంగము నుండి స్రావం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, లేదా అస్వాభావికమైన రీతిలో మూత్ర విసర్జన తగ్గిపోవడం.

మత్తుపానీయాలు, మత్తుపదార్థాలు. తల్లి మత్తుపానీయాలు, (పొగాకుతో సహా) మత్తుపదార్థాలు తీసుకోవడం బిడ్డకు మానసిక వైకల్యం, శారీరక అవకతవకలు, చివరికి ప్రవర్తనకు సంబంధించిన లోపాలు ఏర్పడే ప్రమాదాన్ని అధికం చేస్తుంది. మత్తుపదార్థాలకు అలవాటుపడిన తల్లులకు పుట్టిన బిడ్డల్లో, మత్తుపదార్థాలు తీసుకోవడం మానుకున్నప్పుడు ఆ తల్లులకు కలిగే బాధాకరమైన రోగలక్షణాల వంటివే కనిపించిన దాఖలాలున్నాయి. అప్పుడప్పుడూ ఒక గ్లాసు వైన్‌ త్రాగడంవల్ల ఎలాంటి హానీ కలుగదని కొంతమంది ప్రజలు విశ్వసిస్తున్నప్పటికీ గర్భంతోవున్న కాలంలో వాటిని అసలు ముట్టుకోకుండా ఉండడమే మంచిదని నిపుణులు సాధారణంగా సిఫారసు చేస్తారు. ధూమపానం చేసేవారు వదిలే పొగను పీల్చుకునే విషయంలో కూడా కాబోయే తల్లులు జాగ్రత్త వహించాలి.

మందులు. గర్భం గురించి తెలిసిన, మున్ముందు తలెత్తగల ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసిన వైద్యుడు సిఫారసు చేస్తేనే తప్ప ఏ మందు తీసుకోకూడదు. కొన్ని విటమిన్‌ సప్లిమెంట్లు హానికరం కూడా కావచ్చు. ఉదాహరణకు, విటమిన్‌ ఎ అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులో వైకల్యం ఏర్పడే అవకాశముంది.

బరువు పెరగడం. గర్భిణీ స్త్రీ మరీ ఎక్కువ బరువు పెరగకూడదు. క్రూసేస్‌ ఫుడ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ డైట్‌ థెరపి ప్రకారం, సాధారణ బరువుతో జన్మించిన బిడ్డకన్నా, తక్కువ బరువుతో జన్మించిన బిడ్డ మరణించే ప్రమాదం 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరోవైపున, ఇద్దరి కోసం తినడం కేవలం శరీరం పెరిగిపోయేలా చేస్తుందంతే. సరైన విధంగా బరువు పెరగడం​—⁠ఇది నాలుగవ నెల నుండి మరింత స్పష్టంగా కనిపిస్తుంది​—⁠తల్లి కాబోయే స్త్రీ పెరుగుతున్న తన అవసరానికి తగినంత తింటోందని సూచిస్తుంది. *

శుభ్రత, ఇతర విషయాలు. మామూలుగానే స్నానం చేయవచ్చు, ఒళ్ళు కడుక్కోవచ్చు కానీ జననేంద్రియం లోపలికి నీటి ధారను పంపించడం (వజీనల్‌ డూష్‌) వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీ, జర్మన్‌ మీజల్స్‌ (ఎర్రని దద్దుర్లు) అని కూడా పిలువబడే రూబెల్లా వంటి వైరస్‌ సోకిన వారికి దూరంగా ఉండాలి. అంతేగాక, టాక్సొప్లాస్మొసిస్‌ను (తరచు పొర్లడము, మానసిక అభివృద్ధి ఆగిపోవడము) నిరోధించడానికి, సరిగ్గా ఉడకబెట్టని మాంసం తినకుండా, పిల్లుల మలముకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కడుక్కోవడం, పచ్చి ఆహార పదార్థాలను శుభ్రంగా కడగడం వంటి ప్రాథమిక శుభ్రతా చర్యలను పాటించడం చాలా ముఖ్యం. గర్భంతో ఉన్న చివరి వారాల్లో లేదా రక్తస్రావమున్నప్పుడు, కండరాలు ముడుచుకుపోయినప్పుడు, లేదా గతంలో గర్భస్రావం జరిగిన సందర్భాల్లో తప్ప లైంగిక సంబంధాలు సాధారణంగా ఎలాంటి ప్రమాదాన్ని కలిగించవు.

విజయవంతంగా ప్రసవం

గర్భంతో ఉన్న సమయంలో తన గురించి తాను బాగా శ్రద్ధ తీసుకునే స్త్రీకి ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు తలెత్తవు. సహజంగానే కాన్పు ఇంట్లో జరగాలా లేక హాస్పిటల్లో జరగాలా అనేది ఆమె అప్పటికే నిర్ణయించుకొని ఉండవచ్చు. ఏమి ఆశించాలి, నైపుణ్యంగల మంత్రసానితో లేదా డాక్టరుతో ఎలా సహకరించాలి అనేవి ఆమెకు తగినంతగా తెలిసివుంటాయి. ఎంపిక చేసుకునే సాధ్యత ఉన్నచోట్ల, ఏ స్థితిలో ప్రసవం జరగాలనేది, ఎలిషియాటమి, ఫోర్‌సెప్స్‌ ఉపయోగం, బాధానాశక మందులు, ఎలక్ట్రానిక్‌ ఫీటల్‌ మానిటరింగ్‌ వంటివాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకొని ఆ స్త్రీ ఎంపిక చేసుకున్న వాటి గురించి ఆ వ్యక్తికి తెలిసివుంటుంది. ఇటువంటి ఇతర విషయాల గురించి కూడా ఒక ఒప్పందానికి రావాలి: ఇంట్లో ప్రసవం సంక్లిష్టంగా తయారైనప్పుడు వారు ఏ హాస్పిటల్‌కు లేదా క్లినిక్‌కు వెళ్ళాలి? విపరీతంగా రక్తస్రావం అవుతున్నప్పుడు సరిగ్గా ఏమి చేయాలి? రక్తస్రావం మూలంగా అనేక ప్రసూతి మరణాలు సంభవిస్తుంటాయి కాబట్టి, రక్తం ఎక్కించుకోని రోగుల కోసం రక్త ప్రత్యామ్నాయాలు వెంటనే అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అంతేగాక సిజేరియన్‌ అవసరమైతే ఏమి చేయాలనే దాని గురించి ముందుగా ఆలోచించుకోవాలి.

పిల్లలు దేవుడిచ్చే ఆశీర్వాదమని, “స్వాస్థ్యము” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 127:⁠3) ఒక స్త్రీకి గర్భం గురించి ఎంతగా తెలిస్తే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం సమయంలో ఆమె అంతగా జాగ్రత్త తీసుకోగలుగుతుంది. గర్భం దాల్చడానికి ముందు, గర్భంతో ఉన్నప్పుడు తన గురించి తాను శ్రద్ధ తీసుకోవడం ద్వారా, ప్రసవానికి సంబంధించిన వివిధ అంశాల గురించి ముందుగా ఆలోచించుకోవడం ద్వారా, ఒక స్త్రీ తాను తల్లికాక ముందు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. (g03 1/08)

[అధస్సూచీలు]

^ కాలేయం, కాయధాన్యాలు, పచ్చని ఆకు కూరలు, జీడిపప్పు బాదంపప్పు వంటివి, బలవర్థమైన ధాన్యాలు వంటివాటిలో ఫోలిక్‌ ఆమ్లము ఉంటుంది. ఇనుము అధికంగా ఉన్న ఆహారపదార్థాల నుండి ప్రయోజనం పొందాలంటే వాటిని విటమిన్‌ సి ఉండే పదార్థాలతో అంటే తాజా పండ్ల వంటివాటితో కలిపి తీసుకోవడం మంచిది.

^ ఆరోగ్యవంతమైన బరువుతో గర్భం దాల్చిన స్త్రీ, గర్భము ఆఖరి దశ వచ్చేసరికి 9 నుండి 12 కేజీల వరకు బరువు పెరగాలని సిఫారసు చేయబడుతోంది. అయితే కౌమార ప్రాయులు లేదా సరైన పోషణలేని స్త్రీలు 12 నుండి 15 కేజీల బరువు పెరగాలి, ఎక్కువ బరువున్న స్త్రీలు మాత్రం కేవలం 7 నుండి 9 కేజీలే పెరగాలి.

[22వ పేజీలోని బాక్సు]

గర్భిణులకు సహాయపడే సలహాలు

● సాధారణంగా గర్భంతో ఉన్న స్త్రీ ఆహారంలో పండ్లు, కూరగాయలు (ముఖ్యంగా పచ్చనివి, నారింజరంగులోనివి, ఎర్రనివి), కాయధాన్యాలు (బీన్స్‌, సోయాబీన్స్‌, పప్పులు, శనగలు), గింజధాన్యాలు (గోధుమ, మొక్కజొన్న, ఓట్స్‌, బార్లీ​—⁠పూర్ణ ధాన్యం గానీ ఇతర పదార్థాలతో బలవర్థకం చేయబడినవి గానీ అయితే మంచిది), మాంసాహారం (చేప, కోడి, ఎద్దు, గుడ్లు, ఛీస్‌, పాలు​—⁠మీగడ తీసివేసిన పాలైతే మంచిది) వంటి పదార్థాలు ఉండాలి. క్రొవ్వు పదార్థాలను, శుద్ధీకరించబడిన చక్కెరలను, ఉప్పును మితంగా తీసుకుంటే మంచిది. నీళ్ళు సమృద్ధిగా తాగండి. కెఫేన్‌ ఉన్న పానీయాలకు, అలాగే భద్రపరచడానికి వాడే రసాయనిక పదార్థాలు (కృత్రిమ రంగులు, రుచులు వంటివి) గల ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. స్టార్చ్‌, మట్టి, తినకూడని ఇతర పదార్థాలు కుపోషణను కలిగించి, శరీరాన్ని విషపూరితం చేస్తాయి.

● ఎక్కువగా ఎక్స్‌రేలు తీయించుకోవడం, హానికరమైన రసాయనాలు వంటి వాతావరణం ద్వారా కలిగే అవకాశమున్న ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించండి. సెంట్లు, ఇంట్లో వాడే మరితర పదార్థాలను పరిమితంగా ఉపయోగించండి. విపరీతమైన వాతావరణాలకు గురి కావడం లేదా అతిగా వ్యాయామం చేయడం వంటి వాటి ద్వారా శరీరోష్ణోగ్రత పెరిగేలా చేసుకోకండి. ఎక్కువసేపు నిలబడకండి, విపరీతంగా కష్టపడకండి. ప్రయాణాల్లో సీట్‌బెల్టు పెట్టుకునేటప్పుడు సరైన స్థానంలో పెట్టుకోండి.