కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పిల్లలపై అత్యాచారం త్వరలోనే అంతమవుతుంది!

పిల్లలపై అత్యాచారం త్వరలోనే అంతమవుతుంది!

పిల్లలపై అత్యాచారం త్వరలోనే అంతమవుతుంది!

“మానవ హక్కుల విశ్వ ప్రకటనలో, బాల్యదశ ప్రత్యేకమైన శ్రద్ధ, సహాయం పొందవలసిన దశ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది,” అని బాలల హక్కులపై సదస్సులోని పరిచయ వ్యాఖ్యానం పేర్కొంటున్నది. కుటుంబ ప్రాముఖ్యత గురించి అది ఇంకా ఇలా అంటోంది: “ఒక బాలుడి లేక బాలిక వ్యక్తిత్వం సంపూర్ణంగా, సర్వసామరస్యంగా వికసించాలంటే అతడు లేక ఆమె కుటుంబ వాతావరణంలో అంటే సంతోషం, ప్రేమ, అవగాహన ఉన్న వాతావరణంలో పెరగాలి.” అయితే ఆదర్శవంతమైన ఈ పరిస్థితిని సాధించడం ఎంతమాత్రం సాధ్యంకావడం లేదు.

పిల్లల కోసం శ్రేష్ఠమైన లోకాన్ని తీసుకురావాలనే విషయం గురించి కేవలం మాట్లాడితే సరిపోదు. నైతిక పతనం విస్తృతంగా ఉంది, చాలామంది ప్రజలు ఈ పరిస్థితిని సర్వసాధారణమైనదిగానే పరిగణిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసినంత మాత్రాన, విస్తృతంగా వ్యాపించివున్న దుర్నీతిని, దురాశను అదుపు చేయడం సాధ్యంకాదు. చివరికి తల్లిదండ్రులు కూడా ప్రేమ చూపించడానికి, తమ పిల్లలను కాపాడడానికి బదులు తరచూ వాళ్ళు విచ్చలవిడి వాతావరణం ఏర్పడడానికి దోహదపడుతున్నారు. అటువంటప్పుడు బాల వేశ్యావృత్తి అంతమవుతుందనే విషయంలో మనకెలాంటి నిరీక్షణ ఉంది?

పిల్లలందరికీ ప్రేమపూర్వక గృహము, సురక్షితమైన భవిష్యత్తు లభించేలా చూడడంలో ఈ భ్రష్ట విధానం విఫలమైనప్పటికీ త్వరలోనే మన సృష్టికర్త బాల వేశ్యావృత్తితో సహా అన్ని విధాల కుటిలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని నిర్మూలిస్తాడు. త్వరలోనే, యెహోవా దేవుడు తన రాజ్యం ద్వారా మానవుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు, ఇది లోకానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. భ్రష్టులు, ద్రోహులు దేవుని తీర్పును తప్పించుకోలేరు. తోటి మానవులను ప్రేమించే ప్రజలు మాత్రమే దేవుని నూతనలోకంలో జీవించడానికి మిగిలి ఉంటారు. “యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”​—సామెతలు 2:21, 22.

పిల్లలూ పెద్దవారూ కించపరచబడకుండా, లైంగిక అత్యాచారానికి గురికాకుండా జీవించగలిగినప్పుడు కలిగే ఉపశమనం గురించి ఆలోచించండి! చివరికి, దోచుకోబడడం మూలంగా దౌర్జన్యానికి గురికావడం మూలంగా కలిగే మానసిక, శారీరక హాని కూడా గతించిన విషయమవుతుంది. మునుపు లైంగిక అత్యాచారానికి గురైన వారు కలతపరిచే జ్ఞాపకాలు గానీ పర్యవసానాలు గానీ లేకుండా జీవించగలుగుతారు. “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.”​—యెషయా 65:17.

అప్పుడు, ఏ బాలుడు లేదా బాలిక చెడు వ్యవహారానికి లేదా లైంగిక అత్యాచారానికి గురికారు. సంతోషం, ప్రేమ, అవగాహన ఇక కేవలం కలగా మిగిలిపోవు. దేవుని నూతనలోకంలోని నివాసుల గురించి, యెషయా 11:9, NW ఇలా తెలియజేస్తోంది: “వారు ఏ విధమైన హాని చేయరు, ఏ విధమైన నాశనము చేయరు.”

వాస్తవానికి పేదరికం, మత్తుపదార్థాల వినియోగం, సంతోషరహితమైన కుటుంబాలు, నైతిక చెడుతనం ఇక ఉండని సమయం ఎంత ఆనందకరంగా ఉంటుందో కదా! శాంతి, నీతి, భద్రత రాజ్యమేలుతాయి. “నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.”​—యెషయా 32:17. (g03 2/08)

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ కుటుంబం విచ్ఛిన్నమవకుండా నిరోధించగలదు

● “పాఠశాలకు వెళ్ళే సంవత్సరాలను సద్వినియోగం చేసుకొని ఏదైనా వృత్తివిద్య నేర్చుకోమని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. వాళ్ళు తమ ఇష్టాలను నా మీద రుద్దడానికి ప్రయత్నించలేదు గానీ నాకవసరమైన కోర్సులున్న విద్యాలయాలను ఎంపిక చేసుకునేందుకు నాకు సహాయం చేశారు.”​—టైస.

● “నేను, మా చెల్లి కలిసి షాపింగ్‌కు వెళ్తున్నప్పుడు మా అమ్మ కూడా మాతోపాటు వచ్చేది. పొదుపుగా ఉండడానికి మాకు సహాయం చేయడమేగాక, మరీ ఆడంబరంగా ఉండే లేదా మరీ అభ్యంతరకరంగా ఉండే బట్టలు కొనుక్కోకుండా ఉండేందుకు కూడా మాకు సహాయం చేసేది.”​—బియాంక.

● “మేము పార్టీలకు వెళ్తున్నప్పుడు, అక్కడ ఎవరెవరు ఉంటారు, అక్కడ ఏ విధమైన సంగీతం ఉంటుంది, పార్టీ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలు మా తల్లిదండ్రులు అడిగి తెలుసుకునేవారు. చాలా పార్టీలకు కుటుంబమంతా కలిసి వెళ్ళేవాళ్ళం.”​—ప్రిసీల.

● “నా బాల్యంలోనూ కౌమారదశలోనూ నేను నా తల్లిదండ్రులు కలిసి చక్కగా సంభాషించుకునే వాళ్ళం. నాతోటి విద్యార్థి ఆ విషయాన్ని గమనించి, ‘నీవు మీ తల్లిదండ్రులతో ఏ విషయం గురించైనా ఇంత చక్కగా మాట్లాడడం చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను మా అమ్మతో మాట్లాడడానికి కూడా సంకోచిస్తాను, సాధారణంగా నేను తెలుసుకోవాలనుకునే విషయాలను ఇతరుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను’ అని నాతో అన్నది.”​—సామార.

● “కౌమారప్రాయంలో నేనెంతో ఉల్లాసంగా ఉండేదాన్ని. నేను ప్రజలను నమ్మేదాన్ని, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేదాన్ని. స్నేహితులతో బాగా కలిసిపోయేదాన్ని, వాళ్ళతో హాస్యభరితమైన విషయాల గురించి మాట్లాడడమంటే నాకిష్టం. ఇది నా వ్యక్తిత్వమని నా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు, వాళ్ళు నా ప్రవర్తనా విధానాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. కానీ మగవాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరైన విధంగా ప్రవర్తించాలని నేను అర్థం చేసుకోవడానికి వాళ్ళు నాకు ప్రేమపూర్వకంగా సహాయం చేశారు.”​—టైస.

● “చాలామంది ఇతర అమ్మాయిల్లాగే నేను కూడా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నేను ఒక అబ్బాయితో పరిచయం పెంచుకోవడాన్ని ఎప్పుడు ప్రారంభించవచ్చుననే విషయంలో మా నాన్నగారు ఒక నిర్దిష్ట వయస్సును ప్రతిపాదించారు. అది నాకేమీ అసంతృప్తి కలిగించలేదు. బదులుగా, నా తల్లిదండ్రులకు నేనంటే శ్రద్ధ ఉందనీ భవిష్యత్తులో ఎదురుకాగల హాని నుండి నన్ను కాపాడాలని వారు కోరుకుంటున్నారనీ నేను గ్రహించాను.”​—బియాంక.

● “ప్రాముఖ్యంగా నా తల్లిదండ్రుల మాదిరి వల్ల, వివాహబంధం చాలా అమూల్యమైనదని నేను గ్రహించాను. వాళ్ళ మధ్యన ఎప్పుడూ మంచి సంబంధం ఉండేది, వాళ్ళు ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకునేవాళ్ళు. నేను ఒక స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, కొన్ని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలనే విషయంలో మా అమ్మ నాకు సలహా ఇచ్చి, అది నా వైవాహిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించడం నాకు గుర్తుంది.”​—ప్రిసీల.

[10వ పేజీలోని చిత్రం]

దేవుని నూతనలోకంలో, పిల్లలెవరూ ఎన్నడూ అత్యాచారానికి గురికారు