కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ

భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ

భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ

ప్రపంచమంతటా ప్రయాణించిన అసాధారణమైన ఒక “కాయ” ఉంది. అది ఆహారాన్ని, పానీయాన్ని రెండింటినీ అందిస్తుంది. అది కాసే చెట్టు విశిష్ట ఆకృతి ఉష్ణమండల ద్వీపాలకు గుర్తింపు చిహ్నంగా ఉంది. ఇంతకు మనం ఏ కాయ గురించి మాట్లాడుతున్నాం? అదే కొబ్బరికాయ​—⁠భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో అది ఒకటి.

ఉష్ణమండలాల్లో జీవించని ప్రజలకు, ఈ నారికేళము ఉష్ణప్రాంతాల్లో వారు గడిపిన ఒక విహారదినాన్ని గుర్తుకు తెచ్చే చిహ్నం మాత్రమే కావచ్చు. కానీ ఉష్ణమండలాల్లో నివసించేవారికి ఈ చెట్టు ఎంతో విలువైనది. ఇండోనేషియన్లు దీని ఉత్పత్తుల గురించి “సంవత్సరంలో ఎన్ని రోజులున్నాయో దీనికి అన్ని ప్రయోజనాలున్నాయి” అని ఘంటాపథంగా చెబుతారు. ఫిలిప్పీన్‌లోని ప్రజలు ఇలా అంటారు: “ఒక వ్యక్తి కొబ్బరిచెట్టును నాటుతున్నాడంటే ఆయన గృహోపకరణాలను, బట్టలను, ఆహారపానీయాలను, తనకు నివాసాన్ని, తన సంతానానికి పిత్రార్జితాన్ని నెలకొల్పుకుంటున్నాడన్నట్లే.”

ఈ నానుడి అతిశయోక్తి ఏమీ కాదు. కొబ్బరి​—⁠జీవ వృక్షం (ఆంగ్లం) అనే పుస్తకం చెబుతున్నదాని ప్రకారం కొబ్బరిచెట్టు, “ఆహారము, నీరు, వంటనూనెలను ఇవ్వడం మాత్రమే కాక దీని మట్టలు ఇంటి కప్పుకు, దీని పీచును తాళ్ళు, పీచుపట్టలు నేయడానికి, దీని పెంకులు గృహోపకరణాలు, భూషణాలు, దీని పూలగుచ్ఛంలోని తియ్యని కణరసము చక్కెర, మద్యం తయారుచేయడానికి ఉపయోగపడతాయి.” ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “సరిగ్గా కోస్తే దీని కలపను కూడా ఉపయోగించుకోవచ్చు.” నిజానికి హిందూ మహాసముద్రంలోని మాల్దీవ్‌ ద్వీప నివాసులు కొబ్బరి ఉత్పత్తులతోనే తమ పడవలను నిర్మించుకుంటారు, వాటిపైనే అరేబియా, ఫిలిప్పీన్‌ ప్రాంతాలకు సముద్రయానం చేశారని చెబుతుంటారు. అయితే కొబ్బరికాయ దాన్ని సాగుచేసేవారందరికంటే గొప్ప సముద్రయానిగా నిరూపించుకుంది.

సాగరంలో పయనించే విత్తనం

తగిన వర్షాలుంటే గనుక కొబ్బరిచెట్టు ఉష్ణమండలాల్లోని సముద్రతీరాల్లో బాగా పెరుగుతుంది. బహుళ ప్రయోజనకారియైన ఈ నారికేళమును స్థానిక ప్రజలు నాటగలిగినప్పటికీ, కొబ్బరికాయ ఈ భూతలంపైనున్న కొన్ని మారుమూల ప్రాంతాలకు తానే స్వయంగా ప్రయాణించింది. విత్తనాలు అనేక విధాలుగా వ్యాపింపజేయబడతాయి, కానీ కొబ్బరికాయ సాగర జలాలను ఉపయోగించుకుంటుంది. ప్రపంచ ప్రయాణికురాలిగా దాని సాఫల్యతకు కారణమదే.

కొబ్బరికాయ పక్వానికి వచ్చినప్పుడు నేల రాలుతుంది. కొన్ని సందర్భాల్లో పక్వానికి వచ్చిన కాయ నేల రాలినప్పుడు నీటివైపు దొర్లుకుపోతుంది. ఆ తర్వాత పొంగే అలలు ఆ కొబ్బరికాయను సముద్రంలోకి లాక్కుపోవచ్చు. పీచుతో కూడిన ఈ కాయ డొక్కలో విస్తృతంగా గాలి నిండివుంటుంది కాబట్టి, కొబ్బరికాయ నీటిపైన సులభంగా తేలియాడుతుంది. అది పసిఫిక్‌ మహాసముద్రంలోని ఒక ప్రవాళద్వీపంలో ఉన్నట్లయితే, అది అవతలి ఒడ్డుకు మాత్రమే కొట్టుకుపోతుండవచ్చు. కానీ అది సముద్రంలో పడినట్లయితే, ఆ కొబ్బరికాయ అత్యంత సుదూర స్థలాలకు ప్రయాణించగలదు.

ఇతర అనేక విత్తనాలను నశింపజేసే ఉప్పునీరు, గట్టిగావుండే కొబ్బరికాయ డొక్కను భేదించేందుకు చాలాకాలం పడుతుంది. కొబ్బరికాయలు సముద్రంలో మూడు నెలలవరకు క్షేమంగా ఉండగలుగుతాయి​—⁠కొన్నిసార్లు వేల కిలోమీటర్ల దూరం కొట్టుకుపోతాయి​—⁠అయినప్పటికీ అనుకూలంగా ఉండే తీరానికి చేరుకుంటే మొలకెత్తడంలో కృతకృత్యమవుతాయి. బహుశా ఈ విధంగానే ప్రపంచంలోని అనేక ఉష్ణమండలాల్లోని తీరప్రాంతాలకు కొబ్బరికాయ వలసపోయి ఉండవచ్చు.

ఉష్ణమండలాల రుచి

ఉష్ణమండలాల్లో నివసించని ప్రజలు కొబ్బరికాయను చాక్లెట్లలో లేదా బిస్కట్లలో రుచి కోసం ఉపయోగించే పదార్థంగానే భావిస్తుండవచ్చు. కానీ ఆగ్నేయ ఆసియాకు వెళ్ళి చూడండి, కొబ్బరికాయ నిజంగానే బహుళ ప్రయోజనకారి అని మీరు తెలుసుకుంటారు. పసిఫిక్‌ అండ్‌ సౌత్‌ఈస్ట్‌ ఏషియన్‌ కుకింగ్‌ అనే పుస్తకం ప్రకారం, “హవాయి నుండి బాంగ్‌కాక్‌ వరకు అన్ని ప్రాంతాల్లోను ద్వీపాల్లోను చేసే వంటకాల్లో కొబ్బరికాయ అత్యావశ్యక మూలపదార్థం.” ఆ ప్రాంతాల్లో నివసించేవారికి “కొబ్బరికాయ ఒక జీవితావసరం, దాన్నుండి వారు అనేక రూపాల్లో, దాదాపు లెక్కలేనన్ని వంటకాల ద్వారా, రుచుల ద్వారా . . . పౌష్టికాహారాన్ని పొందుతారు” అని కూడా ఆ పుస్తకం వ్యాఖ్యానిస్తోంది.

ఉష్ణప్రాంతాల్లోని వంటగదుల్లో కొబ్బరి ఉన్నతస్థానంలో ఉండడానికి చాలా స్పష్టమైన కారణముంది: అది నీటిని, పాలను, వంటనూనెను ఇస్తుంది. పచ్చగా ఉన్న పచ్చికాయలో నిండుగా ఉండే స్వచ్ఛమైన తియ్యని ద్రవాన్ని కొబ్బరినీళ్ళు అంటారు. అవి కమ్మగా ఉండి ఉత్తేజాన్నిచ్చే పానీయం, ఉష్ణప్రాంతాల్లో రోడ్డు పక్క దుకాణాల్లో అవి తరచుగా అమ్మబడతాయి. అంతేకాదు కొబ్బరికోరులో నీళ్ళు కలిపి దానిలోని ద్రవాన్ని పిండితే కొబ్బరిపాలు కూడా లభ్యమవుతాయి. కొబ్బరిపాలను సూప్‌లలో, పులుసుకూరల్లో, పిసికిన పిండిలో కలిపితే వాటి రుచీ సారమూ పెరుగుతాయి.

కొబ్బరికాయల నుండి నూనె తీయాలంటే, రైతులు పక్వానికి వచ్చిన కాయలను పగలగొట్టి ఎండలో ఎండబెడతారు. దానిలోని కొబ్బరి ఎండిన తర్వాత, పెంకులో నుండి దాన్ని విడదీసి దాన్నుండి నూనె తీయవచ్చు. ఉష్ణమండలాల్లో కొబ్బరినూనె ప్రధానమైన వంటనూనె, కానీ పాశ్చాత్య దేశాల్లోనైతే అది మార్జరిన్‌, ఐస్‌క్రీము, కుకీల్లో తరచుగా ఉపయోగించబడుతుంది.

కొబ్బరికాయలను కోయడం ఏమంత సులభం కాదు. వాటిని కోసే వ్యక్తి తరచూ చెట్టెక్కి కాయలను కోస్తాడు. కొందరు కోతగాళ్ళు ఒక పొడవైన కాడిమానుకు చివరన ఒక కత్తిని కట్టి దాంతో కోస్తారు. ఇండోనేషియాలో ఈ పని చేయడానికి కోతులకు శిక్షణనిస్తారు. అత్యంత సులభమైన పద్ధతి​—⁠పక్వానికి వచ్చిన కాయల్నే కోయాలనుకునేవారు ఇష్టపడే పద్ధతి​—⁠ఏమిటంటే కాయ దానికదే నేల రాలేంతవరకు ఎదురుచూడడం.

అదెలా కోయబడినప్పటికీ, కొబ్బరికాయల బహుళ ప్రయోజనాలు దాన్ని ఒక చక్కని వాణిజ్య పంటగా, అనేకమందికి అమూల్యమైన ఆహారానికి ఆధారంగా చేశాయి. కాబట్టి ఇకపైన మీరు కొబ్బరిచెట్టును చూసినట్లయితే​—⁠అది ఫోటోలోనే గానీ ప్రత్యక్షంగానే గానీ​—⁠అది ఉష్ణమండలాల్లోని సముద్రతీరాలను కేవలం అలంకరించే భూషణప్రాయమైన చెట్టు మాత్రమే కాదని, భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమైన “కాయల్లో” ఒక కాయ కాసే చెట్టును మీరు చూస్తున్నారని గుర్తుంచుకోండి. (g03 3/22)

[24వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

కొబ్బరికాయ విశిష్టతలు

కొబ్బరి పీతకొబ్బరికాయను ఆస్వాదించేది కేవలం మానవులు మాత్రమే కాదు. కొబ్బరి పీత నేలలో చేసుకున్న రంధ్రాల్లో పగలు జీవిస్తుంది, కానీ అది రాత్రుళ్ళు కొబ్బరికాయల విందారగిస్తుంది. ఒక కొబ్బరికాయను పగలగొట్టడానికి మనుష్యులకు ఏదైనా సాధనం అవసరమవుతుంది, కానీ సమర్థవంతమైన ఈ పీత కొబ్బరికాయను ఒలుచుకునేందుకు దాన్ని పట్టుకొని అది పగిలేంతవరకు ఏదైనా ఒక బండకు కొట్టడానికి బాగా కష్టపడుతుంది. కొబ్బరికాయల ఆహారం ఈ ప్రాణికి సరిపోతున్నట్లు అనిపిస్తోంది​—⁠ఇది 30 కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంది!

సౌందర్య పోషకాల్లో కొబ్బరి కొబ్బరినూనె చర్మానికి మంచిది కాబట్టి, ఉత్పత్తిదారులు దీన్ని లిప్‌స్టిక్‌, సన్‌టాన్‌ లోషన్‌లలో ఉపయోగిస్తారు. మీరు బాగా నురుగు వచ్చే బయోడిగ్రేడెబల్‌ (ప్రకృతి వనరులతో చేసిన) సబ్బు గానీ షాంపూ గానీ ఉపయోగిస్తున్నట్లయితే, దాంట్లోని ప్రధాన ముడిపదార్థాల్లో కొబ్బరినూనె ఒకటై ఉంటుంది.

[చిత్రాలు]

మహాసముద్ర ప్రయాణాల్లోనూ కొబ్బరికాయ జీవించి ఉండగలుగుతుంది

కొబ్బరి పీత

కొబ్బరిమొక్క

[చిత్రసౌజన్యం]

Godo-Foto

[23వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన కుడిపక్క ఇన్‌సెట్‌: Godo-Foto