కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాగ్నకార్ట స్వేచ్ఛ కోసం మానవుని అన్వేషణ

మాగ్నకార్ట స్వేచ్ఛ కోసం మానవుని అన్వేషణ

మాగ్నకార్ట స్వేచ్ఛ కోసం మానవుని అన్వేషణ

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన సరీ అనే మండలంలోని ఆకర్షణీయమైన భూతల సుందర పరిసరాల గుండా థేమ్స్‌ నది ప్రవహిస్తుంది. ఆ నది ఒడ్డుకు సమీపాన ఉన్న పచ్చిక మైదానంలో ఒక స్మారక చిహ్నం ఉంది, అది 13వ శతాబ్దంలో జరిగిన ఒక ఘటనను జ్ఞాపకం చేస్తుంది. రన్నీమీడ్‌ అనే ఈ మైదానంలో ఇంగ్లాండు రాజు జాన్‌ (1199-1216 వరకు పరిపాలించాడు) తనను వ్యతిరేకిస్తున్న బేరన్లను (ఇంగ్లాండులో ప్రభుబిరుదుగల భూస్వామివర్గం) కలుసుకున్నాడు, శక్తివంతులైన ఈ భూస్వాములు రాజు దురాగతాలకు అసంతుష్టితో ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాలకు ఉపశమనంగా కొన్ని హక్కులను ఆమోదించాలని ఆ బేరన్లు అడిగారు. వారు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో రాజు చివరకు ఒక పత్రంపై తన రాజ ముద్రను వేశాడు, ఆ తర్వాత ఆ పత్రమే మాగ్నకార్టగా (మహదధికార ప్రధాన పత్రము) ప్రఖ్యాతిగాంచింది.

ఆ పత్రం “పాశ్చాత్య దేశాల చరిత్రలో అత్యంత విశేషమైన ఏకైక చట్టబద్ధ వివరణ పత్రం” అని ఎందుకు వర్ణించబడింది? దీని జవాబు స్వేచ్ఛ కోసం మానవుని అన్వేషణ గురించి ఎంతో వెల్లడి చేస్తుంది.

బేరన్ల ప్రకరణాలు

జాన్‌ రాజు రోమన్‌ క్యాథలిక్‌ చర్చి విషయంలో సంకటంలో పడ్డాడు. ఆయన స్టీఫన్‌ లాంగ్టన్‌ను కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌గా (మతాచార్యుడు) అంగీకరించడానికి నిరాకరించడం ద్వారా పోపు ఇన్నోసెంట్‌ IIIను ప్రతిఘటించాడు. తత్ఫలితంగా చర్చి, రాజుకు తన మద్దతును ఉపసంహరించుకోవడమే కాక ఆయనను చర్చి నుండి కూడా బహిష్కరించింది. అయితే జాన్‌ సమాధానపడడానికి ప్రయత్నించాడు. ఆయన తన రాజ్యాలైన ఇంగ్లాండును, ఐర్లాండును పోపుకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు పోపు, రాజు చర్చికి విశ్వసనీయంగా ఉంటూ ప్రతి సంవత్సరం కప్పం చెల్లించాలనే ప్రాతిపదికన ఆ రాజ్యాలను జాన్‌కు తిరిగి ఇచ్చేశాడు. జాన్‌ ఇప్పుడు పోపు చేతిలో కీలుబొమ్మ అయ్యాడు.

రాజు కష్టాలకు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఆయన తన 17 ఏండ్ల పరిపాలనలో 11 సార్లు భూస్వాములపై అదనపు పన్నులను విధించాడు. చర్చిపట్ల ఉన్న విరోధ భావం, ఆర్థిక విషయాలు అన్నీ కలిసి రాజు నమ్మదగినవాడు కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించేందుకు దారితీశాయి. అలాంటి అనుమానాలను రూపుమాపడానికి జాన్‌ వ్యక్తిత్వం ఏమి దోహదపడలేకపోయిందని స్పష్టమవుతోంది.

చివరకు ఆ దేశానికి ఉత్తరాన ఉండే బేరన్లు పన్నులు చెల్లించడానికి నిరాకరించినప్పుడు అల్లకల్లోలం చెలరేగింది. వాళ్ళు లండన్‌కు చేరుకొని రాజుకు తమ రాజభక్తిని పరిత్యజిస్తున్నట్లు ప్రకటించారు. విండ్‌సర్‌లోని తన రాజభవనంలో ఉన్న రాజుకు, తూర్పున స్టేన్స్‌ నగరానికి సమీప పట్టణంలో మకాం వేసిన బేరన్లకు మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక వాదోపవాదాలు జరిగాయి. తెరవెనక జరిగిన మంతనాలు, రెండు పట్టణాలు రన్నీమీడ్‌ మైదానంలో ముఖాముఖిగా కలుసుకోవడానికి నడిపించాయి. ఇక్కడ 1215, జూన్‌ 15, సోమవారంనాడు 49 ప్రకరణాలున్న ఒక పత్రంపై జాన్‌ తన రాజముద్రను వేశాడు. అదిలా ఆరంభమౌతుంది: ‘బేరన్లు కోరుతున్న, రాజు అంగీకరిస్తున్న ప్రకరణాలు ఇవి.’

చట్టం ఇచ్చిన స్వేచ్ఛ

అయితే జాన్‌ ఉద్దేశాలపై నమ్మకం లేదన్న విషయం త్వరలోనే వెల్లడయ్యింది. రాజును పోపును అనేకమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, రోములో ఉన్న పోపును కలవడానికి రాజు రాయబారులను పంపించాడు. ఆ పోపు రన్నీమీడ్‌ ఒప్పందం చెల్లదని, అది రద్దయిందని ప్రకటిస్తూ వెంటనే మతాధికార శాసనాలను (పాపల్‌ బుల్స్‌) జారీచేశాడు. దానితో ఇంగ్లాండులో అంతర్యుద్ధం చెలరేగింది. అయితే దాని తర్వాతి సంవత్సరంలో జాన్‌ అకస్మాత్తుగా మరణించడంతో తొమ్మిదేండ్ల ఆయన కొడుకు హెన్రీ రాజ్యాధికారానికి వచ్చాడు.

యువకుడైన హెన్రీ మద్దతుదార్లు రన్నీమీడ్‌ ఒప్పందాన్ని మళ్ళీ జారీచేసే ఏర్పాటు చేశారు. మాగ్నకార్ట అనే ఒక చిన్నపుస్తకం ప్రకారం, సవరించబడిన ఆ ప్రతి “నిరంకుశపాలనను అణచివేయడానికి ఒక ఉపకరణంగావున్న పత్రం నుండి, రాజుకూ ఆయన సంబంధితులకూ సరైన దృక్పథాలుగల వ్యక్తులు మద్దతునివ్వగలిగే ప్రకటన పత్రంగా శరవేగంతో మార్చివేయబడింది.” హెన్రీ పరిపాలనలో ఆ ఒప్పందం పలుమార్లు మళ్ళీ మళ్ళీ జారీచేయబడింది. ఆయన తర్వాత రాజైన ఎడ్వర్డ్‌ I మాగ్నకార్టను 1297, అక్టోబరు 12న మరొకసారి ధ్రువీకరించినప్పుడు, చివరకు దాని ప్రతి ఒకటి ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యతగల దస్తావేజుల జాబితా అయిన శాసనాల పట్టికలో చేర్చబడింది.

ఆ హక్కుల పత్రం రాజు అధికారాలకు కళ్ళెం వేసింది. ఆయన కూడా తన పౌరులందరిలాగే న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని అది షరతుపెట్టింది. ప్రసిద్ధికెక్కిన 20వ శతాబ్దపు చరిత్రకారుడు, ఇంగ్లాండు ప్రధానమంత్రి అయిన విన్‌స్టన్‌ చర్చిల్‌ అభిప్రాయం ప్రకారం మాగ్నకార్ట, “రాజుకు కావలసిన బలాన్నిచ్చే అధికారాలుగల వ్యవస్థనేగాక, ఒక నిరంకుశ పరిపాలకుడు లేదా అవివేకి అధికార దుర్వినియోగం చేయకుండా అడ్డుకొనే ఆంక్షలుగల వ్యవస్థను” స్పష్టంగా నిర్దేశించింది. నిజంగా అవి ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు! కానీ ఈ పత్రం ఒక సాధారణ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? ఆ సమయంలోనైతే చాలా తక్కువ. మాగ్నకార్ట కేవలం “స్వేచ్ఛగల వ్యక్తులు” అంటే వాస్తవానికి ఆ కాలంలో అల్ప సంఖ్యాకులైన ఓ మోస్తరు ఉన్నత వర్గానికి చెందినవారి హక్కుల గురించి మాత్రమే వివరించింది. *

మాగ్నకార్ట గురించి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “దాని చరిత తొలి దశలోనే అది దౌర్జన్యానికి వ్యతిరేక చిహ్నంగా, పోరాటానికి పిలుపుగా మారింది. ఆ తర్వాతి ప్రతి తరం దాన్ని, ప్రమాదంలోపడిన తన సొంత స్వేచ్ఛను పరిరక్షించేదిగా అభివర్ణించుకుంది.” ఈ ప్రాధాన్యతను సూచిస్తూ ఇంగ్లాండు పార్లమెంటు ప్రతి సమావేశాన్ని మాగ్నకార్టను దృఢపరచడంతో ప్రారంభించేది.

17వ శతాబ్దపు ఇంగ్లాండులోని న్యాయవాదులు మాగ్నకార్టలోని అధికరణాలను జ్యూరీ ద్వారా విచారణ చేయడం, బందీ హాజరు ఉత్తరువు (హేబియస్‌ కార్పస్‌), * న్యాయస్థానం ఎదుట సమానత్వం, నిరంకుశ నిర్బంధం నుండి స్వేచ్ఛ, పన్నులపై పార్లమెంటు నియంత్రణ వంటి హక్కులకు, ప్రయోజనాలకు ఆధారంగా ఉపయోగించారు. అందుకే బ్రిటీష్‌ స్టేట్స్‌మన్‌ విలియం పిట్‌, మాగ్నకార్టను ‘ఇంగ్లాండు రాజ్యాంగానికి బైబిలు’ వంటిదని భావించాడు.

అన్వేషణ కొనసాగింది

“గతంలో అనేకసార్లు మాగ్నకార్ట రాజ్యాంగ ప్రాధాన్యత, హక్కులపత్రం ఏమి చెబుతున్నదనే దానిపైకంటే అది ఏమి చెప్పిందని తలంచబడిందో దానిపైనే ఎక్కువగా ఆధారపడింది” అని లార్డ్‌ బింగ్‌హమ్‌ అంగీకరించారు. ఆయన 1996 నుండి 2000 వరకు ఇంగ్లాండుకు, వేల్స్‌కు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఏది ఏమైనా ఆ హక్కుల పత్రంలోని స్వేచ్ఛకు సంబంధించిన ఆదర్శాలు ఆ తర్వాత ఇంగ్లీషు మాట్లాడే అందరి మధ్యా విస్తరించుకుపోయాయి.

1620లో ఇంగ్లాండును వదలి అమెరికాకు వలసపోయినవారు తమతోపాటు మాగ్నకార్ట కాపీని తీసుకువెళ్ళారు. 1775లో అమెరికాలోని బ్రిటీష్‌ కాలనీలు ప్రభుత్వంలో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా పన్నులు విధిస్తున్నందుకు ఎదురుతిరిగినప్పుడు, ఇప్పుడు మసాచూసెట్స్‌ అని పిలువబడుతున్న రాష్ట్ర శాసనసభ, అలాంటి పన్నులు మాగ్నకార్టకు విరుద్ధం అని ప్రకటించింది. వాస్తవానికి అప్పట్లో ఉపయోగంలో ఉన్న మసాచూసెట్స్‌ సాధికార ముద్ర మీద ఒక మనిషి ఒక చేత్తో కత్తిని మరో చేత్తో మాగ్నకార్టను పట్టుకొని ఉన్నట్లుగా చిత్రించబడి ఉండేది.

అనుభవం లేని దేశపు ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని రూపొందించడానికి సమకూడినప్పుడు, చట్టం ఇచ్చే స్వేచ్ఛా సూత్రాన్ని వారు సమర్థించారు. ఈ అంగీకారం ఆధారంగానే అమెరికా హక్కుల బిల్లు ఏర్పడింది. ఆ విధంగా 1957లో మాగ్నకార్ట గౌరవసూచకంగా అమెరికన్‌ బార్‌ అసోసియేషన్‌ రన్నీమీడ్‌ మైదానంలో ఒక స్మారక చిహ్నాన్ని నిలబెట్టింది, దానిపైన “చట్టం ఇచ్చే స్వేచ్ఛకు చిహ్నమైన మాగ్నకార్ట జ్ఞాపకార్థం” అని చెక్కబడి ఉంది.

1948లో అమెరికన్‌ స్టేట్స్‌వుమన్‌ ఎలియానర్‌ రూసెవెల్ట్‌ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విశ్వ ప్రకటనను రూపొందించేందుకు సహాయం చేసింది, తద్వారా అది “అన్ని చోట్ల ఉన్న అందరికీ వర్తించే అంతర్జాతీయ మాగ్నకార్ట” అవుతుందని ఆమె ఆశించింది. నిజంగానే మాగ్నకార్ట చరిత్ర, మానవాళి స్వేచ్ఛ కోసం ఎంతగా తహతహలాడుతున్నదో స్పష్టంగా చూపిస్తోంది. ఉన్నతమైన అభిలాషలున్నప్పటికీ నేడు అనేక దేశాల్లో మానవుని ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. అందరికీ స్వేచ్ఛను ఇవ్వడం తమకు అసాధ్యమని మానవ ప్రభుత్వాలు పదే పదే చూపించాయి. లక్షలాదిమంది యెహోవాసాక్షులు ఒక భిన్న ప్రభుత్వమైన దేవుని ప్రభుత్వం కింద చట్టం ఇవ్వనున్న ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛను ఇప్పుడు విలువైనదిగా ఎంచడానికి అదొక కారణం.

బైబిలు దేవుని గురించి గమనార్హమైన ఒక విషయం చెబుతోంది: “ప్రభువుయొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:​17) దేవుని రాజ్యం మానవాళికి ఇచ్చే స్వాతంత్ర్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈసారి యెహోవాసాక్షులు మిమ్మల్ని సందర్శించినప్పుడు దాని గురించి వారినెందుకు అడగకూడదూ? పరవశింపజేసే, స్వేచ్ఛను కలిగించే జవాబు మీకు దొరుకుతుండవచ్చు. (g02 12/22)

[అధస్సూచీలు]

^ “‘స్వేచ్ఛగల వ్యక్తి’ అనే పదానికి 1215లో అయితే పరిమిత భావమే ఉన్నా, 17వ శతాబ్దానికల్లా అది దాదాపు ప్రతి ఒక్కరినీ సూచించేది.”​—⁠హిస్టరీ ఆఫ్‌ వెస్టర్న్‌ సివిలైజేషన్‌

^ “శరీరమును కలిగియుండాలి” అన్నది లాటిన్‌ భాషలో దాని అక్షరార్థ భావం, హేబియస్‌ కార్పస్‌ అనే ఈ ఉత్తరువు చట్టపరమైన ఆజ్ఞాపత్రం, ఇది ఒక వ్యక్తి నిర్బంధించబడడానికి గల కారాణాలను విచారించడానికి ఆ వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచమని ఇవ్వబడే రిట్‌ ఉత్తరువు.

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

మహదధికార ప్రధాన పత్రము

మాగ్నకార్ట (లాటిన్‌ భాషలో “మహదధికార ప్రధాన పత్రము”) “బేరన్ల ప్రకరణాలు”గా ప్రారంభమయ్యింది. 49 ప్రకరణాలున్న ఈ పత్రంపై జాన్‌ రాజు తన రాజముద్ర వేశాడు. తర్వాతి కొన్ని రోజుల్లో ఆ ఒప్పందం 63 ప్రకరణాలకు పరిణమించింది, రాజు మళ్ళీ దానిపై రాజముద్ర వేశాడు. ఇది 1217లో మళ్ళీ జారీచేయబడినప్పుడు దీనితోపాటు అటవీశాఖకు సంబంధించిన నియమాలుగల మరో చిన్న నిబంధనావళి కూడా ఉంది. అప్పటి నుండి ఆ ప్రకరణాలు మాగ్నకార్టగానే చలామణి అయ్యాయి.

ఆ 63 ప్రకరణాలు తొమ్మిది వర్గాల్లోకి వస్తాయి, వాటిలో బేరన్లు అన్యాయంగా ఎదుర్కొంటున్న బాధలతో, చట్టం న్యాయాల సంస్కరణతో, చర్చి స్వేచ్ఛతో వ్యవహరించేవి ఉన్నాయి. ఇంగ్లాండు పౌర స్వేచ్ఛా హక్కులకు చారిత్రక ఆధారమైన 39వ అధికరణ ఇలా ఉంది: “స్వేచ్ఛగల ఏ వ్యక్తిని కూడా బలాత్కారంగా తీసుకుపోకూడదు, జైల్లో వేయకూడదు, ఆయన హక్కులను గానీ ఆస్తులను గానీ జప్తుచేయకూడదు, వెలివేయడం లేదా బహిష్కరించడం చేయకూడదు, మరే విధంగానూ ఆయన గౌరవానికి భంగం కలిగించకూడదు, బలవంతం చేయకూడదు, ఇతరుల చేత బలవంతం చేయించకూడదు, ఆయన తోటిపౌరులు గానీ ఆ దేశచట్టంగానీ న్యాయబద్ధమైన తీర్పు తీర్చినప్పుడు మాత్రమే అలా చేయవచ్చు.”

[చిత్రం]

నేపథ్యంలో: మాగ్నకార్ట మూడవ సవరణ

[చిత్రసౌజన్యం]

బ్రిటీష్‌ గ్రంథాలయం అనుమతితో, హెన్రీ IIIవ రాజు యొక్క నమూనా 46144 తిరిగి జారీచేసిన మాగ్నకార్ట 1225

[26వ పేజీలోని చిత్రం]

జాన్‌ రాజు

[చిత్రసౌజన్యం]

Illustrated Notes on English Church History (Vols. I and II) అనే పుస్తకం నుండి

[26వ పేజీలోని చిత్రం]

జాన్‌ రాజు తన కిరీటాన్ని పోపు రాయబారి వశం చేస్తున్నాడు

[చిత్రసౌజన్యం]

The History of Protestantism (Vol. I) అనే పుస్తకం నుండి

[27వ పేజీలోని చిత్రం]

జాన్‌ రాజు తన బేరన్లతో కలిసి మాగ్నకార్టపై రాజ ముద్ర వేయడానికి ఒప్పుకున్నాడు, 1215

[చిత్రసౌజన్యం]

The Story of Liberty, 1878 అనే పుస్తకం నుండి

[28వ పేజీలోని చిత్రం]

ఇంగ్లాండులోని రన్నీమీడ్‌ మైదానంలోని మాగ్నకార్ట స్మారక చిహ్నం

[చిత్రసౌజన్యం]

ABAJ/Stephen Hyde

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన నేపథ్యం: బ్రిటీష్‌ గ్రంథాలయం అనుమతితో, కాటన్‌ అగస్టూస్‌ II జాన్‌ రాజు యొక్క మాగ్నకార్ట నమూనా 106 1215; జాన్‌ రాజు ముద్ర: Public Record Office, London