కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విద్వేషపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాను

విద్వేషపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాను

విద్వేషపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాను

హోసే గోమ్స్‌ చెప్పినది

దక్షిణ ఫ్రాన్సులోని రొన్యాక్‌ అనే చిన్న పట్టణంలో, 1964 సెప్టెంబరు 8న నేను జన్మించాను. నా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు అండలూసియన్‌ జిప్సీలు, వారు ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియా, మొరాకొల్లో జన్మించారు. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం, జిప్సీల సంస్కృతిలో అలాంటి కుటుంబాలు సర్వసాధారణం.

మా నాన్న చండశాసనుడు, నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఆయన మా అమ్మను కొట్టినప్పటి కొన్ని దృశ్యాలు కూడా ఉన్నాయి. చివరకు మా అమ్మ విడాకులు తీసుకోవాలనుకుంది, అలా విడాకులు తీసుకోవడం జిప్సీల్లో చాలా అరుదు. మా అమ్మ నన్ను, తమ్ముడిని, అక్కను తీసుకొని బెల్జియంకు వెళ్ళిపోయింది. అక్కడ మేము ఎనిమిది సంవత్సరాలపాటు ప్రశాంతంగా గడిపాము.

కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. నాన్నను చూడాలని పిల్లలందరం అడగడంతో అమ్మ మమ్మల్ని ఫ్రాన్స్‌కు తీసుకువచ్చింది, అక్కడ మేము మళ్ళీ నాన్నతో ఒక్కటయ్యాము. మా నాన్నతో జీవించడంలో నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బెల్జియంలో ఉన్నప్పుడు మేము మా అమ్మతోపాటు ప్రతీ చోటికి వెళ్ళేవాళ్ళం. కానీ మా నాన్నవైపు కుటుంబం వాళ్ళలో మగవాళ్ళు మగవాళ్ళతోనే వెళ్ళాలి. హక్కులన్నీ మగవాళ్ళకు, పనులన్నీ ఆడవాళ్ళకు అన్నదే వారి పురుషాధిక్య మనస్తత్త్వం. ఉదాహరణకు ఒకరోజు రాత్రి భోజనం తర్వాత గిన్నెలు కడగడంలో నేను మా ఆంటీకి సహాయం చేద్దామనుకుంటే మా అంకుల్‌ నన్ను ఆడంగివాడా అని తిట్టాడు. వాళ్ళ కుటుంబాల్లో గిన్నెలు కడిగే పని ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు. సమతుల్యతలేని ఆ ఆలోచనా ధోరణి ప్రభావం చివరకు నాపైన కూడా పడింది.

ఎక్కువకాలం గడవకముందే మా నాన్న ఉగ్ర స్వభావాన్ని మా అమ్మ మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలుసార్లు, నాన్న పిడిగుద్దులను తప్పించుకోవడానికి నేను మా తమ్ముడు కిటికీలోనుండి బయటికి దూకాల్సివచ్చింది. మా అక్క కూడా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది. ఆ కారణంగా నేను సాధ్యమైనంత వరకు ఇంటి బయటే ఎక్కువగా గడిపేవాడిని. నా 15 ఏండ్ల వయసులో, నా జీవితాన్ని నడిపించే మార్గదర్శకం నాకు లేకుండా పోయింది.

చివరకు నేను మహా ఉద్రేకినని పేరుగాంచాను. నేను రౌడీయిజమ్‌ చేయడంలో ఆనందించేవాడిని. కొన్నిసార్లు కావాలనే ఇతర యువకులను రెచ్చగొట్టేవాడిని, నేనెప్పుడూ ఒక కత్తో చైనో పట్టుకొని తిరిగేవాడిని కాబట్టి నన్ను ఎదిరించడానికి చాలా తక్కువమంది సాహసించేవారు. కొంతకాలానికి నేను కార్లు దొంగిలించి అమ్ముకోవడం ప్రారంభించాను. కొన్ని సందర్భాల్లోనైతే నేను వాటికి నిప్పంటించి అగ్నిమాపక దళం ఆ మంటల్ని ఆర్పుతుంటే చూస్తూ ఆనందిస్తుండేవాడిని. ఆ తర్వాత నేను దుకాణాలను గోదాములను కొల్లగొట్టడం ప్రారంభించాను. పలుమార్లు అరెస్టయ్యాను. అలా అరెస్టయినప్పుడల్లా సహాయం చేయమని దేవునికి ప్రార్థించేవాడిని!

అవును, నాకు దేవునిపై విశ్వాసముండేది. మేము బెల్జియంలో ఉన్నప్పుడు నేను ఒక మత సంబంధిత స్కూలుకు వెళ్ళేవాడిని. అందుకే నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు. అయినా దేవునిపై నాకున్న విశ్వాసం నా ప్రవర్తనపై ఎలాంటి ప్రభావమూ చూపించలేదు. నేను చేయవలసినదల్లా క్షమాపణ కోరడమేనని, అలా కోరితే నా పాపాలు క్షమించబడతాయని నేను అనుకునేవాడిని.

1984లో ఒక దొంగతనం చేసినందుకు నాకు 11 నెలల జైలు శిక్ష పడింది. మార్సేల్స్‌లోని బోమెట్‌ జైలుకు నన్ను పంపించారు. అక్కడ నేను నా ఒంటిమీద అనేక చోట్ల పచ్చబొట్లు వేయించుకున్నాను. వాటిలో “పగ, ద్వేషం” అనే పదాలు కూడా ఉన్నాయి. నేనక్కడ జైలులో మంచివాడిగా మారడానికి బదులు ప్రభుత్వం పట్ల, సమాజం పట్ల ద్వేషాన్ని అధికం చేసుకున్నాను. కేవలం మూడు నెలల తర్వాత నేను జైలు నుండి విడుదలయ్యాను, ఆ సమయానికి నాలో ద్వేషం అంతకుముందు కంటే ఎక్కువ పేరుకుపోయింది. ఆ తర్వాత జరిగిన ఒక విషాద ఘటన నా జీవనశైలినే మార్చివేసింది.

ప్రతీకారం నా లక్ష్యం అయింది

ఒకసారి మా కుటుంబానికి మరో జిప్సీ కుటుంబానికి గొడవయ్యింది. ఆ విషయాన్ని తేల్చుకోవడానికి మా పెదనాన్నలు, చిన్నాన్నలు, నేను కలిసి వారితో తలపడేందుకు నిర్ణయించుకున్నాం. రెండు కుటుంబాలు ఆయుధాలతో తలపడ్డాయి. అప్పుడు జరిగిన పోరాటంలో మా పెదనాన్న పియెర్‌, మా నాన్నవాళ్ళ కజిన్‌ ఒకాయన కాల్పుల్లో మరణించారు. వెర్రెత్తిపోయిన నేను చేతిలో తుపాకి పట్టుకొని వీధిలో నిలబడి క్రోధంతో గట్టిగా కేకలు వేశాను. చివరకు మా అంకుల్‌ ఒకాయన నా చేతుల్లోనుండి తుపాకి లాక్కున్నాడు.

నేను తండ్రిగా భావించిన మా పెదనాన్న పియెర్‌ను కోల్పోవడంతో నేను దుఃఖంతో క్రుంగిపోయాను. జిప్సీల ఆచారం ప్రకారం నేను శోకకాలాన్ని పాటించాను. చాలా రోజుల వరకు గడ్డం గీసుకోలేదు, మాంసాహారం ముట్టలేదు. టీవీ చూడడాన్ని, సంగీతం వినడాన్ని నిరాకరించాను. మా పెదనాన్న చావుకు ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాను, అయితే మా బంధువులు నా చేతికి తుపాకి చిక్కకుండా చేశారు.

సైన్యంలో చేరడానికి 1984 ఆగస్టులో నాకు పిలుపువచ్చింది. నేను నా 20వ ఏట లెబనన్‌లోని ఐక్యరాజ్య సమితి శాంతి దళంలో చేరాను. దాంట్లో చంపడం లేదా చావడం అనే ప్రమాదం ఉంది, దానికి నేను అంగీకరించాను. ఆ సమయంలో నేను హాషిస్‌ అనే మత్తుపదార్థాన్ని అధిక మోతాదులో కాల్చేవాడిని. అది నాకు క్షేమంగా ఉన్నాననే అనుభూతిని కలిగించడమే కాక, నాకు ఏదీ హాని కలిగించదు అని భావించేలా నన్ను తయారుచేసింది.

లెబనన్‌లో ఆయుధాలను సంపాదించడం చాలా సులభం కాబట్టి, నేను మా పెదనాన్న మరణానికి ప్రతీకారం తీర్చుకునే పథకం కోసం నౌక ద్వారా ఫ్రాన్సుకు ఆయుధాలు పంపించాలని నిర్ణయించుకున్నాను. స్థానికుల నుండి నేను మందు సామగ్రితోపాటు రెండు పిస్తోళ్ళు కొన్నాను. నేను ఆ పిస్తోళ్ళ భాగాలను మొత్తం విడదీసి వాటిని రెండు రేడియోల్లో దాచి ఇంటికి పంపించాను.

నా సైనిక సేవ పూర్తవడానికి సరిగ్గా రెండు వారాల ముందు, నేను మరో ముగ్గురు తోటి సైనికులు కలిసి సెలవు తీసుకోకుండా బయటకు వెళ్ళాము. మేము క్యాంపుకు తిరిగి రాగానే మమ్మల్ని జైల్లో వేశారు. జైల్లో ఉన్నప్పుడు కోపోద్రిక్తుడనైన నేను ఒక గార్డుమీద దాడి చేశాను. పేయో అని పిలువబడే జిప్సేతరుని చేత చులకనకు గురికావడం నాకు సహించరాని విషయం. దాని తర్వాతి రోజు ఒక ఆఫీసరుతో మరో హింసాత్మక పోరాటం జరిగింది. సైనిక సేవలోని మిగతా కాలం పూర్తయ్యేంతవరకు నన్ను లియోన్స్‌లోని మాంట్లూక్‌ జైలుకు పంపించారు.

జైల్లో​—నేను స్వేచ్ఛను కనుగొన్నాను

మాంట్లూక్‌ జైలులో నా మొదటి రోజున, ఆహ్లాదభరితంగా కనబడుతున్న ఒక యువకుడు నన్ను సాదరంగా పలకరించాడు. ఆయనొక యెహోవాసాక్షి అని, ఆయనతో పాటు ఆయనలాంటి విశ్వాసమే ఉన్న మరికొందరు కేవలం ఆయుధాలను చేపట్టనందుకు జైల్లో ఉన్నారని నాకు తెలిసింది. అది నన్ను విస్మయమొందించింది. నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను.

యెహోవాసాక్షులకు దేవుని పట్ల యథార్థమైన ప్రేమ ఉందని నేను తెలుసుకున్నాను, వారి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు నన్ను ప్రభావితం చేశాయి. నాకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండేవి. ముఖ్యంగా నేను తెలుసుకోవాలనుకున్నదేమిటంటే చనిపోయినవారు బ్రతికి ఉన్నవారితో కలల ద్వారా సంప్రదించగలుగుతారా అన్న విషయం, అలా జిప్సీల్లో అనేకమంది నమ్ముతారు. జాన్‌ పాల్‌ అనే ఒక యెహోవాసాక్షి మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంతో నాకు బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించాడు. *

నేను ఆ పుస్తకాన్ని ఎంతో ఆతృతతో ఒక్క రాత్రిలోనే చదివేశాను, అది నా హృదయాన్ని కదిలించింది. జైల్లో నేను నిజమైన స్వేచ్ఛను పొందాను! చివరకు జైలు నుండి విడుదలైన నేను ట్రైన్‌లో ఇంటికి బయలుదేరాను, నా బ్యాగు నిండా బైబిలు ప్రచురణలు ఉన్నాయి.

మా ఇల్లుండే ప్రాంతంలోని సాక్షులను కలుసుకోవడానికి నేను మార్టీగ్‌లో ఉన్న రాజ్యమందిరానికి వెళ్ళాను. అక్కడ ఎరిక్‌ అనే పూర్తికాల సేవకుడైన ఒక యువకునితో బైబిలు అధ్యయనం కొనసాగించాను. కొద్ది రోజుల్లోనే నేను సిగరెట్‌ కాల్చడం మానేశాను, నేర ప్రపంచంలోని నా తోటివాళ్ళను కలుసుకోవడం మానేశాను. నేను సామెతలు 27:11 వ వచనానికి అనుగుణంగా ప్రవర్తించాలని కృతనిశ్చయం చేసుకున్నాను, అదిలా చెబుతోంది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” నేను సంతోషపరచాలని కోరుకున్న యెహోవాలో ప్రేమామయుడైన ఒక తండ్రిని చూశాను.

మారడంలో ఉన్న సవాలు

క్రైస్తవ సూత్రాలను ఆచరించడం నాకంత సులభం కాలేదు. ఉదాహరణకు నేను మాదకద్రవ్యాలను తీసుకోవడం మళ్ళీ ప్రారంభించాను, అలా కొన్ని వారాలపాటు తంటాలుపడ్డాను. కానీ నాకెదురైన చాలా కష్టమైన సవాలేమిటంటే ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను వదిలేయడం. నేను ఎల్లప్పుడూ తుపాకి పట్టుకు తిరుగుతున్నానని, మా పెదనాన్నను చంపిన వారిపై ప్రతీకారం కోసం ఇప్పటికీ చురుగ్గా కుట్ర పన్నుతున్నానని ఎరిక్‌కు తెలియదు. వారిని వెతకడంలో రాత్రుళ్ళు గడిపేవాడిని.

ఈ విషయం నేను ఎరిక్‌తో చెప్పినప్పుడు, ఆయుధాలు ధరించి ప్రతీకారం కోసం ప్రయత్నిస్తూ దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం అసంభవమని ఆయన నాకు స్పష్టంగా వివరించాడు. నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రోమీయులు 12:19 లో “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి” అన్న అపొస్తలుడైన పౌలు మందలింపును నేను లోతుగా ధ్యానించాను. దానితోపాటు తీవ్రంగా చేసిన ప్రార్థన నేను నా భావాలను అదుపులో పెట్టుకునేందుకు సహాయపడింది. (కీర్తన 55:22) చివరకు నేను ఆయుధాలను విడిచిపెట్టేశాను. సంవత్సరం పాటు బైబిలు అధ్యయనం చేసిన తర్వాత, 1986 డిసెంబరు 26న, యెహోవా దేవునికి నేను చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించాను.

నా కుటుంబం ప్రతిస్పందించింది

నేను నా ప్రవర్తనలో చేసుకున్న మార్పు నా తల్లిదండ్రులు బైబిలు అధ్యయనం చేసేందుకు వారిని ప్రేరేపించింది. వారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు, మా అమ్మ 1989 జూలైలో బాప్తిస్మం తీసుకుంది. కాలక్రమేణా మా కుటుంబ సభ్యులు మరికొందరు బైబిలు సందేశానికి స్పందించి యెహోవాసాక్షులయ్యారు.

1988 ఆగస్టులో నేను పూర్తికాల సేవకుడనవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత మా సంఘ సభ్యురాలైన కాట్యా అనే ఒక యౌవన సహోదరిని ప్రేమించాను. మేము 1989 జూన్‌ 10న పెళ్ళి చేసుకున్నాము. పెళ్ళైన మొదటి సంవత్సరం మాకు చాలా కష్టంగా ఉండింది, ఎందుకంటే స్త్రీల పట్ల నా వైఖరిలో నేను ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాల్సివుంది. తమ భార్యలను గౌరవించమని భర్తలను ప్రోత్సహించే 1 పేతురు 3:7 వ వచనాన్ని అన్వయించుకోవడం నాకు చాలా కష్టమనిపించేది. నాలోని గర్వాన్ని తొలగించుకొని నా ఆలోచనలను మార్చుకునేందుకు కావలసిన శక్తినిమ్మని పదే పదే ప్రార్థించాల్సివచ్చేది. నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడ్డాయి.

మా పెదనాన్న మరణం నాకు ఇప్పటికీ ఎంతో బాధ కలిగిస్తుంది, ఆయన గురించి ఆలోచించినప్పుడు కొన్నిసార్లయితే కన్నీళ్ళను ఆపుకోలేను. ఆయన హత్యకు సంబంధించిన జ్ఞాపకాలతో చెలరేగే బలమైన భావోద్వేగాలతో నేను తంటాలుపడుతుంటాను. మేము గతంలో పగబెట్టుకున్న కుటుంబ సభ్యులెవరైనా ఎదురవుతారేమోనని, నా బాప్తిస్మం తర్వాత కూడా కొన్ని సంవత్సరాలపాటు భయపడ్డాను. వారు నా మీద దాడిచేస్తే నేనేం చేస్తాను? నేనెలా ప్రతిస్పందిస్తాను? నా పాత వ్యక్తిత్వం మళ్ళీ నన్ను వశపరచుకుంటుందా?

నేనొక రోజు సమీపంలోనే ఉన్న ఒక సంఘంలో ప్రసంగం ఇచ్చాను. అక్కడ నేను మా పెదనాన్నను చంపిన కుటుంబ బంధువు పేపాను చూశాను. ఆమెను చూడగానే నా క్రైస్తవ లక్షణాలు పరీక్షించబడ్డాయని నేను ఒప్పుకుంటాను. కానీ నేను నా భావాలను పక్కన పెట్టాను. ఆ తర్వాత పేపా బాప్తిస్మం తీసుకున్న రోజున నేనామెను కౌగిలించుకొని, యెహోవాను సేవించడానికి నిర్ణయించుకున్నందుకు ఆమెను అభినందించాను. జరిగినవన్నీ మరచిపోయి ఆమెను నా ఆధ్యాత్మిక సహోదరిగా అంగీకరించాను.

విద్వేషపు సంకెళ్ళనుండి విముక్తి పొందేందుకు నాకు సహాయం చేసినందుకు, నేను ప్రతిదినం యెహోవాకు కృతజ్ఞతలు చెబుతున్నాను. యెహోవా కరుణే గనుక లేకపోతే నేనీరోజు ఎక్కడుండేవాడిని? ఆయన మూలంగా నేను సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నాను. నాకొక భావి నిరీక్షణ కూడా ఉంది​—ద్వేషం, హింస లేని నూతనలోకం. అవును, దేవుని ఈ వాగ్దానం నెరవేరుతుందని నాకు దృఢ నమ్మకం ఉంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.”​—మీకా 4:4. (g03 1/08)

[అధస్సూచి]

^ యెహోవాసాక్షులు ముద్రించినది.

[15వ పేజీలోని చిత్రం]

ఐక్యరాజ్యసమితి శాంతి దళాలతో లెబనాన్‌లో, 1985

[16వ పేజీలోని చిత్రం]

నా భార్య కాట్యా, మా అబ్బాయిలు పియెర్‌ టిమియోలతో