కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎందుకు మళ్ళీ ప్రారంభమైంది?

ఎందుకు మళ్ళీ ప్రారంభమైంది?

ఎందుకు మళ్ళీ ప్రారంభమైంది?

దాదాపు 40 సంవత్సరాల క్రితం, సాధారణంగా కీటకాల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్‌, డెంగ్యూ వంటి వ్యాధులు భూమ్మీది అధికశాతం ప్రాంతాలనుండి దాదాపు నిర్మూలించబడ్డాయని తలంచబడింది. కానీ ఆ తర్వాత ఊహించనిది జరిగింది, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు మళ్ళీ వ్యాపించడం ప్రారంభించాయి.

ఎందుకు? వ్యాధులను వ్యాప్తిచేసే కొన్ని కీటకాలు, అవి మోసుకువెళ్ళే సూక్ష్మక్రిములు తమను అదుపుచేయడానికి ఉపయోగించబడే క్రిమిసంహారకాలను, మందులను నిరోధించే శక్తిని పెంపొందించుకోవడం ఒక కారణం. క్రిమిసంహారకాలను అధికంగా ఉపయోగించడమే కాక మందులను తప్పుగా ఉపయోగించడంవల్ల, నిరోధక శక్తిని పెంపొందించుకొనే సహజ ప్రక్రియ బలపర్చబడింది. “పేద కుటుంబాల్లోని చాలామంది మందులను తీసుకువెళ్ళి తమ రోగలక్షణాల నుండి ఉపశమనం కలుగజేయడానికి సరిపడా మందులను మాత్రమే వాడి, మిగతా మందులను మరోసారి ఆ జబ్బువస్తే వాడడానికి దాచిపెట్టుకుంటారు” అని మస్కిటో అనే పుస్తకం చెబుతోంది. చికిత్స ఇలా మధ్యలోనే ఆగిపోవడం వలన, బలమైన సూక్ష్మక్రిములు మందులను నిరోధించే శక్తిగల కొత్త తరం సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేయడానికి ఆ వ్యక్తి శరీరంలోనే ఉండిపోయే అవకాశముంది.

వాతావరణంలో వచ్చిన మార్పు

కీటక సంక్రమిత వ్యాధులు మళ్ళీ తలెత్తడానికి మరో ముఖ్య కారణం ప్రకృతిలో, సమాజంలో ఏర్పడిన మార్పు. భూవ్యాప్తంగా వాతావరణంలో కలిగిన మార్పు దీనికి ఒక మంచి ఉదాహరణ. భూవ్యాప్తంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరగడం వలన, వ్యాధులను సంక్రమించే కీటకాల పరిధి విస్తృతమయ్యి అవి ప్రస్తుతం శీతల ప్రాంతాలకు చేరుతున్నాయని కొంతమంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అలా జరుగుతుందనడానికి కొంత రుజువు ఉంది. హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌లోని సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ ద గ్లోబల్‌ ఎన్‌విరాన్‌మెంట్‌కు చెందిన డా. పౌల్‌ ఆర్‌. ఎప్స్‌టీన్‌ ఇలా చెప్పారు: “కీటకాలు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు (మలేరియా మరియు డెంగ్యూ జ్వరంతో పాటు) నేడు ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ప్రబలుతున్నట్లు నివేదించబడుతోంది.” కోస్టారికాలో, డెంగ్యూ జ్వరం పర్వతాలు దాటి అవతలకు వ్యాపించింది, ఇప్పటివరకూ ఈ పర్వతాలు డెంగ్యూను పసిఫిక్‌ తీరప్రాంతానికి మాత్రమే పరిమితం చేశాయి, కానీ ఇప్పుడు ఆ వ్యాధి దేశమంతటా వ్యాపించింది.

అయితే ఎక్కువ ఉష్ణోగ్రతగల వాతావరణం వల్ల ఇతర పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కొన్ని ప్రాంతాల్లో అది నదులను నీటి గుంటలుగా మార్చివేస్తుంది, వేరే ప్రాంతాల్లో అది వర్షాలను, వరదలను కలుగజేయడం వల్ల ఆ వర్షపు నీరు గుంటల్లో నిలిచిపోతుంది. ఈ రెండు పరిస్థితుల్లో కూడా నీరు నిలిచివున్న గుంటలు దోమల సంతాన్పోత్తికి అనువైన స్థలాలుగా ఉపయోగపడతాయి. వేడి వాతావరణం దోమలు పుట్టే సమయాన్ని తగ్గించడం వల్ల వాటి సంతానోత్పత్తి శాతం పెరుగుతుంది, ఆ వాతావరణం రుతుకాలాన్ని పొడిగించడంవల్ల దోమలు ఎక్కువౌతాయి. వేడి వాతావరణంలో దోమలు మరింత చురుగ్గా ఉంటాయి. వాతావరణపు వేడి దోమల కడుపులోకి కూడా ప్రవేశించి వ్యాధులు కలుగజేసే సూక్ష్మక్రిముల సంతానోత్పత్తి వేగాన్ని పెంచుతుంది, అప్పుడు ఆ దోమలు ఒక్కసారి కుట్టినా మనుష్యులకు వ్యాధి సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి. అయితే చింతించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

కీటక సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని చూపే ఉదాహరణ

కీటక సంక్రమిత వ్యాధుల వ్యాప్తికి మానవ సమాజంలోని మార్పులు కూడా తోడ్పడవచ్చు. అదెలా సాధ్యమో అర్థం చేసుకోవడానికి మనం కీటకాల పాత్ర గురించి మరిన్ని వివరాలు పరిశీలించాలి. చాలా వ్యాధుల విషయంలో, వ్యాధి సంక్రమించే ప్రక్రియలో కీటకం కేవలం ఒకేఒక పాత్రను పోషిస్తుంది. ఒక జంతువు గానీ పక్షి గానీ తన శరీరంపై రోగకారక కీటకాలను మోసుకువెళ్ళడం లేదా వాటి రక్తంలో సూక్ష్మక్రిములకు ఆశ్రయమివ్వడం ద్వారా వ్యాధికి ఆశ్రయంగా ఉండవచ్చు. సూక్ష్మక్రిములకు ఆశ్రయమిచ్చిన తర్వాత కూడా అవి జీవించివుండగలిగితే అవి ఆ వ్యాధికి నివాసస్థలాలుగా తయారవుతాయి.

లైమ్‌ వ్యాధి విషయాన్నే తీసుకోండి, 1975లో గుర్తించబడిన ఈ వ్యాధి మొదట అమెరికాలోని కనెక్టికట్‌లో లైమ్‌ ప్రాంతంలో కనుగొనబడినందుకు దానికి ఆ పేరు పెట్టబడింది. లైమ్‌ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు ఒక వంద సంవత్సరాల క్రితం యూరప్‌నుండి వచ్చిన ఓడల్లోని పశువులతో లేదా ఎలుకలతోపాటు ఉత్తర అమెరికాకు చేరివుంటాయి. ఒక చిన్న ఇక్సోడస్‌ టిక్‌ పురుగు, లైమ్‌ వ్యాధిగల జంతువునుండి రక్తాన్ని పీల్చుకున్న తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిములు ఆ టిక్‌ పురుగు జీవించినంతకాలం దాని కడుపులో ఉండిపోతాయి. ఆ తర్వాత ఆ టిక్‌ పురుగు వేరే జంతువును గానీ మనిషిని గానీ కుట్టినప్పుడు అది తన కడుపులోని సూక్ష్మక్రిములను వారి రక్తంలోకి చేరవేయగలదు.

ఈశాన్య అమెరికాలో లైమ్‌ వ్యాధి సర్వసాధారణమైనది, అది ఆ ప్రాంతంలో ఎంతోకాలంగా ఉంది. లైమ్‌ వ్యాధి సూక్ష్మక్రిములకు స్థానికంగా ముఖ్య నివాస్థలం తెల్ల కాళ్ళ ఎలుక. ఈ ఎలుకలు టిక్‌ పురుగులకు ప్రత్యేకించి వృద్ధిచెందే దశల్లోని టిక్‌ పురుగులకు ఆశ్రయాలుగా కూడా ఉపయోగపడతాయి. ఎదిగిన టిక్‌ పురుగులు జింక శరీరంపై నివసించడానికి ఇష్టపడతాయి, అవి అక్కడే ఆహారం తింటాయి, జతకడతాయి. ఎదిగిన ఆడ టిక్‌ పురుగు రక్తంతో కడుపు నింపుకున్న తర్వాత గుడ్లు పెట్టడానికి నేలపైకి జారుతుంది, ఆ గుడ్లలోనుండి బయటకు వచ్చిన లార్వా ఈ జీవ ప్రక్రియను మళ్ళీ ప్రారంభిస్తాయి.

పరిస్థితుల్లో వచ్చిన మార్పు

రోగకారకాలు మానవులకు వ్యాధులు సంక్రమింపజేయకుండానే ఎన్నో సంవత్సరాల పాటు జంతువులతో, కీటకాలతో కలిసి ఉనికిలో ఉన్నాయి. కానీ పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యాధిని సమాజమంతటా అనేకులకు వ్యాపించే వ్యాధిగా మార్చివేయగలదు. లైమ్‌ వ్యాధి విషయంలో ఎలాంటి మార్పు జరిగింది?

గతంలో మాంసభక్ష్య జంతువులు జింకల సంఖ్యను అదుపులో ఉంచడం ద్వారా టిక్‌ పురుగుల వల్ల మానవులకు వ్యాధులు సంక్రమించే అవకాశాలను పరిమితం చేయడంలో సహాయపడేవి. అమెరికా తూర్పు ప్రాంతాల వలస ప్రజలు సేద్యం చేసుకోవడానికి అడవులను నరికివేసినప్పుడు జింకల సంఖ్య మరింత తగ్గిపోవడంతో వాటిని వేటాడే జంతువులు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. కానీ 1800ల మధ్యకాలంలో వ్యవసాయం పశ్చిమ ప్రాంతానికి మారినప్పుడు రైతులు ఈ పొలాలను విడిచిపెట్టి పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాంతంలో మళ్ళీ అడవులు పెరగనారంభించాయి. జింకలు తిరిగి వచ్చేశాయి కానీ వాటిని వేటాడే మాంసభక్ష్య జంతువులు తిరిగిరాలేదు. కాబట్టి జింకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, వాటితోపాటు టిక్‌ పురుగులు కూడా పెరిగాయి.

కొంతకాలానికి లైమ్‌ వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు తిరిగివచ్చి ఆశ్రయాలుగా ఉపయోగపడే జంతువులపై నివాసమేర్పరచుకొని దశాబ్దాల తర్వాత మానవులకు ప్రమాదంగా పరిణమించాయి. అయితే అడవులకు దగ్గర్లో గ్రామాలు వెలసినప్పుడు పిల్లలు, పెద్దలు కూడా అధిక సంఖ్యలో టిక్‌ పురుగుల కాటుకు గురయ్యారు. టిక్‌ పురుగులు మానవులపై దాడిచేయడం ఆరంభించడంతో మానవులకు లైమ్‌ వ్యాధి సంక్రమించడం ప్రారంభమయ్యింది.

అస్థిర లోకంలో వ్యాధులు

పైన ప్రస్తావించబడిన పరిస్థితి వ్యాధులు పెంపొంది వ్యాప్తిచెందే విధానాల్లో ఒక విధానం మాత్రమే, మానవుని చర్యల వల్ల వ్యాధులు మళ్ళీ ఎలా వ్యాప్తిచెందుతాయో చూపించడానికి కేవలం ఇదొక ఉదాహరణ మాత్రమే. “క్రొత్తగా వచ్చిన వ్యాధుల్లో దాదాపు అన్నీ మానవుల జోక్యం వల్లనే మళ్ళీ ప్రారంభమయ్యాయి” అని పర్యావరణవేత్త యూజీన్‌ లిండెన్‌ తను వ్రాసిన ద ఫ్యూచర్‌ ఇన్‌ ప్లెయిన్‌ సైట్‌ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. మరికొన్ని ఉదాహరణలు: ఆధునిక ప్రయాణ సౌకర్యాల ప్రజాదరణా వాటి వేగమూ రోగకారకాలను, వాటికి ఆశ్రయాలుగా పనిచేసే రోగగ్రస్థ ప్రాణులను భూమంతటా వ్యాప్తిచేయగలవు. పెద్ద మరియు చిన్న ప్రాణుల నివాస స్థలాలకు కలుగుతున్న హానీ జీవవైవిధ్యానికి ప్రమాదంగా పరిణమిస్తోంది. “వాయు కాలుష్యం జల కాలుష్యం వల్ల జంతువుల మరియు మానవుల నిరోధక శక్తి బలహీనమవుతోంది” అని లిండెన్‌ చెబుతున్నాడు. డా. ఎప్స్‌టీన్‌ వ్యాఖ్యానాన్నే ఆయన ఉల్లేఖించాడు: “ప్రాథమికంగా మానవుడు పర్యావరణాన్ని పాడుచేయడం వలన వ్యాధులను అదుపులో ఉంచే భూగోళపు రోగనిరోధక శక్తి బలహీనమైంది, దానివల్ల సూక్ష్మక్రిములు పెచ్చరిల్లేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.”

రాజకీయ అస్థిరత యుద్ధాలకు నడిపిస్తుంది, యుద్ధాలు పర్యావరణకు హానికలిగించి ఆరోగ్య సంరక్షణను, ఆహార పంపిణీ అంతర్‌వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి. అంతేకాక అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీకి చెందిన బయోబుల్లెటిన్‌ ఇలా సూచిస్తోంది: “కుపోషణతో బలహీనంగా ఉన్న శరణార్థులు తప్పనిసరిగా తరచూ జనంతో కిటకిటలాడే అపరిశుభ్ర శరణార్థి శిబిరాల్లో నివసించాల్సి ఉంటుంది, ఆ పరిస్థితులు వారిని ఎన్నో రకాల అంటువ్యాధులకు గురిచేసే ప్రమాదంలో పడవేస్తాయి.”

ఆర్థిక అస్థిరత వలన మనుష్యులు జాతీయ సరిహద్దులు దాటి వలసవెళతారు లేదా సరిహద్దు లోపలే అప్పటికే అధిక జనాభాగల నగరాలకు తరలి వెళతారు. “రోగకారక క్రిములకు జనసమ్మర్ధ ప్రాంతాలు ఇష్టం” అని బయోబుల్లెటిన్‌ వివరిస్తోంది. నగర జనాభా పెరుగుతున్నంత వేగంగా “అవసరమైన ప్రాథమిక విద్య, పోషకాహారం, టీకా కార్యక్రమాలు వంటి ప్రజా ఆరోగ్య చర్యలు పెరగలేవు” అని అది చెబుతోంది. జనసమ్మర్ధం కారణంగా మురికి నీటి పారుదల, పారిశుద్ధ్య సౌకర్యాలపై అధిక భారం మోపబడడం వలన వ్యక్తిగత పరిశుభ్రత కష్టమవడమే కాక కీటకాలు, ఇతర రోగవాహకాలు పెచ్చరిల్లే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఆశారహితమైనది కాదని తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తోంది. (g03 5/22)

[11వ పేజీలోని బ్లర్బ్‌]

“క్రొత్తగా వచ్చిన వ్యాధుల్లో దాదాపు అన్నీ మానవుల జోక్యం వల్లనే మళ్ళీ ప్రారంభమయ్యాయి”

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

అమెరికాపై దాడిచేస్తున్న వెస్ట్‌ నైల్‌ వైరస్‌

ముఖ్యంగా దోమల ద్వారా మనుష్యులకు సంక్రమించే వెస్ట్‌ నైల్‌ వైరస్‌ మొదటిసారిగా 1937వ సంవత్సరంలో ఉగాండాలో గుర్తించబడింది, కానీ ఆ తర్వాత అది మధ్యప్రాచ్యం, ఆసియా, ఓషియానియా, ఐరోపాలో కూడా గమనించబడింది. ఈ వైరస్‌ 1999వ సంవత్సరం వరకూ పశ్చిమార్థగోళంలో కనుగొనబడలేదు. అయితే అప్పటినుండి అమెరికాలో 3,000 కంటే ఎక్కువమందికి ఈ వ్యాధి సంక్రమించిందని, 200 కంటే ఎక్కువమంది దానివల్ల చనిపోయారని నివేదించబడింది.

ఈ వైరస్‌ సంక్రమించినవారిలో కొందరికి ఫ్లూ జ్వరానికి సంబంధించిన రోగలక్షణాలు కనపడే అవకాశం ఉంది, కానీ అధికశాతం ప్రజలకు మాత్రం ఈ వ్యాధి తమకు ఉందన్న సంగతే తెలియదు. ఈ వైరస్‌ సంక్రమించినవారిలో కొద్దిశాతం మందికి మాత్రం మెదడు వాపు వ్యాధి, స్పైనల్‌ మెనిన్‌జైటిస్‌తో పాటు ఇతర ప్రమాదకరమైన వ్యాధులు వృద్ధిచెందుతాయి. అయితే ఇప్పటివరకూ వెస్ట్‌ నైల్‌ వైరస్‌ను నిరోధించే టీకా గానీ ఆ వ్యాధిని నయం చేయడానికి నిర్దిష్టమైన చికిత్స గానీ అందుబాటులో లేదు. ఈ వ్యాధి సంక్రమించిన దాతనుండి అవయవాలు లేదా రక్త మార్పిడి చేసుకోవడం ద్వారా వెస్ట్‌ నైల్‌ వైరస్‌ సంక్రమించే అవకాశం ఉందని యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ హెచ్చరిస్తోంది. “వెస్ట్‌ నైల్‌ వైరస్‌ ఉందా లేదా అని రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఎలాంటి మార్గమూ లేదు” అని ర్యూటర్స్‌ న్యూస్‌ సర్వీస్‌ 2002లో నివేదించింది.

[చిత్రసౌజన్యం]

CDC/James D. Gathany

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రం]

మిమ్మల్ని మీరెలా కాపాడుకోవచ్చు? కొన్ని సలహాలు

ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే సలహాల కోసం తేజరిల్లు! ప్రపంచవ్యాప్తంగా కీటకాలు, కీటక సంక్రమిత వ్యాధులు ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సంప్రదించింది. వారిచ్చిన సలహాలు మీ ప్రాంతంలో కూడా సహాయకరంగా ఉండవచ్చు.

పరిశుభ్రత​—మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం

మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి

“ఆహార పదార్థాలను నిల్వచేసే పాత్రలను మూసి ఉంచండి. వండిన ఆహారాన్ని వడ్డించే సమయం వరకూ దానిపై మూతపెట్టండి. ఆహార పదార్థాలు కింద పడితే వెంటనే తుడిచివేయండి. గిన్నెలను కడగకుండా రాత్రంతా ఉంచకండి లేదా ఉదయం పడవేయవలసిన వ్యర్థ ఆహారపదార్థాల్ని ఇంటిబయట ఉంచకండి. వాటిని కప్పిపెట్టండి లేదా పాతిపెట్టండి ఎందుకంటే కీటకాలు, ఎలుకలు రాత్రిపూట ఆహారం కోసం వెదుకుతాయి. ఇంట్లో మట్టి నేల ఉంటే దానిపై పల్చని కాంక్రీట్‌ పొర వేయడం మంచిది, అప్పుడు ఇంటిని శుభ్రం చేసి కీటకాలను దూరంగా ఉంచడం సులభమౌతుంది.”​—ఆఫ్రికా.

“పళ్ళను లేదా కీటకాలను ఆకర్షించే వేటినైనా ఇంటికి దూరంగా నిల్వచేయండి. పెంపుడు జంతువులను అంటే మేకలు, పందులు, కోళ్ళు వంటివాటిని ఇంటి బయట ఉంచడం మంచిది. ఇంటి బయట ఉన్న మరుగుదొడ్లను మూసి ఉంచండి. జంతువుల పేడను వెంటనే భూమిలో పాతిపెట్టండి లేదా ఈగలు రాకుండా ఉండడానికి దానిపై సున్నం జల్లండి. పొరుగువారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ మీరు జాగ్రత్త వహించడం వల్ల మీ ఇంట్లోను, ఇంటి పరిసరాల్లోను కీటకాల సంఖ్యను అదుపుచేయగలరు, అలాగే మంచి మాదిరిని కూడా ఉంచగలరు.”​—దక్షిణ అమెరికా.

[చిత్రం]

ఆహారపదార్థాలను లేదా చెత్తను కప్పి ఉంచకపోవడం, కీటకాలను మీతోపాటు భోజనానికి ఆహ్వానించడంలాంటిది

వ్యక్తిగత పరిశుభ్రత

“సబ్బు ఖరీదైన వస్తువేమీ కాదు కాబట్టి చేతులను కడుక్కోవడం, బట్టలను ఉతుక్కోవడం తరచూ చేస్తుండండి, ప్రత్యేకించి పరులను లేదా జంతువులను ముట్టుకున్న తర్వాత అలా చేయండి. చనిపోయిన జంతువులను ముట్టుకోకండి. మీ చేతులతో మీ నోటిని, ముక్కును, కళ్ళను ముట్టుకోకండి. బట్టలు శుభ్రంగా ఉన్నట్టు కనిపించినా వాటిని క్రమంగా ఉతుకుతూ ఉండండి. కొన్ని పరిమళాలు కీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి సువాసనగల సబ్బులను, వ్యక్తిగత పరిశుభ్రత కోసం వాడే ఇతర వస్తువులను ఉపయోగించకండి.”​—ఆఫ్రికా.

నివారణా పద్ధతులు

దోమల సంతానోత్పత్తి ప్రాంతాలను తొలగించండి

నీళ్ళ ట్యాంక్‌లను, బట్టలు నానబెట్టిన టబ్బులను కప్పివుంచండి. నీరు నిలువ ఉండే పాత్రలన్నింటినీ తొలగించండి. మొక్కల కుండీల్లో నీళ్ళు నిలిచివుండకుండా చూసుకోండి. నాలుగు రోజుల కంటే ఎక్కువకాలం నీరు నిలిచివుండే ఎలాంటి గుంటలోనైనా దోమలు సంతానోత్పత్తి చేయగలవు.​—ఆగ్నేయ ఆసియా.

కీటకాలు ఉండే ప్రదేశాలకు వెళ్ళడం తగ్గించండి

కీటకాలు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడే సమయాలు, స్థలాలకు దూరంగా ఉండండి. ఉష్ణమండల ప్రాంతాల్లో సూర్యుడు త్వరగా అస్తమిస్తాడు కాబట్టి చాలా దైనందిన కార్యకలాపాలు చీకట్లోనే జరుగుతాయి, ఆ సమయాల్లోనే చాలా కీటకాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలంగా ఉన్నప్పుడు బయట కూర్చోవడం, పడుకోవడంవల్ల మీకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.​—ఆఫ్రికా.

[చిత్రం]

దోమలు ఎక్కువగా ఉన్న దేశాల్లో బయట పడుకోవడమంటే, మీరే దోమలకు భోజనమని ఆహ్వానించడంలాంటిది

ప్రత్యేకించి అడవులకు వెళ్ళినప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే దుస్తులను ధరించండి. మీ దుస్తులకు, చర్మానికి కీటకాలను తరిమే మందులను పూసుకోండి, ఆ మందును వాడడానికి ఇవ్వబడిన సూచనలను పాటించండి. బయటకు వెళ్ళివచ్చిన తర్వాత మీ లేదా మీ పిల్లల శరీరాలపై టిక్‌ పురుగులు ఉన్నాయేమో పరిశీలించండి. మీ పెంపుడు జంతువులను ఆరోగ్యవంతంగా, కీటకాలు లేకుండా ఉంచండి.​—ఉత్తర అమెరికా.

పాడి పశువులతో ఎక్కువ సమయం గడపకండి, కీటకాలు వాటినుండి మానవులకు వ్యాధులను సంక్రమింపజేయగలవు.​—మధ్యస్థ ఆసియా.

కుటుంబ సభ్యులందరూ దోమ తెరలను, కీటకసంహారినిలో నానబెట్టిన దోమ తెరలను వాడితే మంచిది. కిటీకీలకు మెష్‌లు వేయించండి, వాటికి రంధ్రాలు లేకుండా చూసుకోండి. ఇంటి చూరు క్రింద కీటకాలు ప్రవేశించగల సందులను మూసివేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కొంత డబ్బు ఖర్చవుతుంది కానీ మీరు మీ పిల్లలను హాస్ప్పిటల్‌కు తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు లేదా కుటుంబాన్ని పోషించే వ్యక్తి పనిచేయలేనంతగా అనారోగ్యానికి గురైనప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.​—ఆఫ్రికా.

[చిత్రం]

క్రిమిసంహారినిలో నానబెట్టిన దోమ తెరలు, మందులు, హాస్పిటల్‌ బిల్లుల కంటే చౌకగా లభిస్తాయి

మీ ఇంట్లో కీటకాలు దాగివుండగల ప్రదేశాలు ఉంటే వాటిని తొలగించండి. గోడలకు, లోకప్పుకు ప్లాస్టరింగ్‌ చేయించండి, బీటలను రంధ్రాలను మూసివేయండి. కొబ్బరిమట్టలు లేదా గడ్డి కప్పు క్రింది భాగాన్ని కీటకాలు చొరబడని బట్టతో కప్పండి. చిందరవందరగా ఉన్న వస్తువులను అంటే కుప్పలుగా ఉన్న కాగితాలను, బట్టలను, గోడలపై దగ్గర దగ్గరగా వేలాడదీసిన చిత్రాలను తీసివేయండి, అక్కడ కీటకాలు దాగివుంటాయి.​—దక్షిణ అమెరికా.

కొంతమంది ప్రజలు కీటకాలను, ఎలుకలను ఇంటికి వచ్చే అతిథులుగా దృష్టిస్తారు. అవి అతిథులు కావు! అవి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా చూడండి. కీటకాలను తరిమివేసే మందులను, క్రిమిసంహారకాలను వాడండి, కానీ సూచనల ప్రకారమే వాడండి. ఈగలను పట్టే వలల్ని, వాటిని చంపేందుకు ఉపయోగించే వస్తువులను వాడండి. సృజనాత్మకంగా ఉండండి: ఒక స్త్రీ బట్టతో గొట్టంలా చేసి దానిలో ఇసుక నింపి, కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా దాన్ని తలుపు క్రింది సందులో పెట్టింది.​—ఆఫ్రికా.

[చిత్రం]

కీటకాలు మన అతిథులుగా ఉండకూడదు. వాటిని తొలగించండి!

నివారణోపాయాలు

సరైన పోషక ఆహారం, విశ్రాంతి తీసుకొని వ్యాయామాలు చేయడం ద్వారా మీ రోగ నిరోధక శక్తిని కాపాడుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి.​—ఆఫ్రికా.

ప్రయాణికులు: కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించిన తాజా సమాచారాన్ని ముందుగానే తెలుసుకోండి. ప్రజా ఆరోగ్య విభాగాలు, ప్రభుత్వ ఇంటర్నెట్‌ సైట్లలో మీకు ఆ సమాచారం లభిస్తుంది. ప్రయాణం చేసే ముందు మీరు సందర్శించబోయే ప్రాంతానికి తగిన వ్యాధి నిరోధక చికిత్సను తీసుకోండి.

మీకు అనారోగ్యంగా అనిపిస్తే

వెంటనే వైద్య చికిత్స తీసుకోండి

రోగ నిర్ధారణ ముందుగానే జరిగితే చాలా వ్యాధులకు చికిత్స చేయడం సులభం

తప్పుడు రోగ నిర్ధారణ విషయంలో జాగ్రత్తగా ఉండండి

రోగవాహకాల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి, అవసరమైతే ఉష్ణమండలానికి సంబంధించిన వ్యాధుల గురించి తెలిసిన వైద్యులను సంప్రదించండి. మీ రోగలక్షణాలన్నింటినీ, మీరు ఎక్కడెక్కడికి ప్రయాణించారు, గతంలో ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనే విషయాలను మీ వైద్యునికి తెలియజేయండి. అవసరమైతేనే యాంటిబయోటిక్‌ మందులను వాడండి, మీ చికిత్సా కోర్సును చివరివరకూ పాటించండి.

[చిత్రం]

కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల రోగలక్షణాలు ఇతర వ్యాధుల్లా ఉండవచ్చు. మీ వైద్యునికి పూర్తి వివరాలను తెలియజేయండి

[చిత్రసౌజన్యం]

భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

కీటకాలు హెచ్‌ఐవిని వ్యాప్తిచేస్తాయా?

కీటక శాస్త్రజ్ఞులు, వైద్య శాస్త్రజ్ఞులు ఒక దశాబ్దం కంటే ఎక్కువకాలం పాటు అధ్యయనమూ పరిశోధనా చేసిన తర్వాత కూడా దోమలు లేదా ఇతర కీటకాలు హెచ్‌ఐవిని అంటే ఎయిడ్స్‌ వైరస్‌ను సంక్రమింపజేస్తాయనడానికి రుజువు లభించలేదు.

ఉదాహరణకు దోమల విషయాన్ని పరిశీలిస్తే, వాటి నోటి రంధ్రాలు తిరిగి రక్తం ఎక్కించడానికి వీలుగావుండే సూదిలా ఒకే రంధ్రం కలిగివుండవు. దానికి బదులు దోమలు ఒక రంధ్రం నుండి రక్తాన్ని తీసుకుంటాయి మరో రంధ్రం నుండి లాలాజలాన్ని విసర్జిస్తాయి. ఆ తర్వాత దోమ జీర్ణ వ్యవస్థ ఆ రక్తంలోని మూలపదార్థాలను వేరుచేసి వైరస్‌ను నాశనం చేస్తుందని జాంబియాలోని మొంగూలో డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లో హెచ్‌ఐవి నిపుణుడైన థామస్‌ డమాస్సో వివరించారు. దోమల మలంలో హెచ్‌ఐవి ఉండదు. మలేరియా పరాన్నజీవుల్లా హెచ్‌ఐవి, దోమల లాలాజల గ్రంథుల్లోకి ప్రవేశించదు.

హెచ్‌ఐవి సంక్రమించడానికి ఒక వ్యక్తి వ్యాధిని వ్యాప్తిచేయగల అనేక రేణువులకు గురికావాలి. ఒక దోమ రక్తాన్ని పీల్చుకోవడానికి అంతరాయం కలిగి నేరుగా మరో వ్యక్తి దగ్గరకు వెళ్తే దాని నోటి రంధ్రాల్లో మిగిలివున్న రక్తం ఎంతో తక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి అది హానికరమైన ప్రభావం చూపడానికి సరిపోదు. నిపుణుల ప్రకారం హెచ్‌ఐవి పాజిటివ్‌ రక్తంతో నిండివున్న దోమను ఒక పుండుపై రుద్దినప్పుడు కూడా ఆ వ్యక్తికి హెచ్‌ఐవి సంక్రమించదు.

[చిత్రసౌజన్యం]

CDC/James D. Gathany

[7వ పేజీలోని చిత్రాలు]

జింకలమీదుండే టిక్‌ పురుగు (కుడివైపున పెద్దదిగా చేయబడిన చిత్రంలో చూపించబడింది) మనుష్యులకు లైమ్‌ వ్యాధిని సంక్రమింపజేస్తుంది

ఎడమవైపు నుండి కుడివైపుకు: ఎదిగిన ఆడ పురుగు, ఎదిగిన మగ పురుగు, పూర్తిగా ఎదగని పురుగు, అన్నీ అసలు పరిమాణంలో చూపించబడ్డాయి

[చిత్రసౌజన్యం]

అన్ని టిక్‌ పురుగులు: CDC

[10, 11వ పేజీలోని చిత్రాలు]

వరదలు, అపరిశుభ్ర పరిస్థితులు, మానవులు వలస వెళ్ళడం వంటివి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి

[చిత్రసౌజన్యం]

FOTO UNACIONES (from U.S. Army)