ఒక దండు దూసుకు వస్తోంది!
ఒక దండు దూసుకు వస్తోంది!
“ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బెలీజియన్ అనే గ్రామంలో మేము నివసిస్తున్నాము, ఆ గ్రామం చుట్టూ ఎక్కువగా చెట్లూ మొక్కలే కనబడతాయి. ఒకరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో, మా ఇంటిని ఒక దండు చుట్టుముట్టింది. ఆహారంకోసం గుంపులు గుంపులుగా తలుపు కింది నుండి, కనబడే ప్రతి పగులు నుండి చీమలు వచ్చాయి. అవి ఉన్న ఒకట్రెండు గంటలపాటు మేము మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం తప్ప ఏమీ చేయలేకపోయాము. మేము తిరిగి వచ్చేసరికి, ఇంట్లో వేరే ఏ కీటకమూ లేకుండా చేసి వెళ్ళిపోయాయి.”
బెలీజ్ వంటి ఉష్టమండల దేశాల్లో నివసించే చాలామందికి ఇది సర్వసాధారణమైన విషయం, అయినా అది పూర్తిగా అసంతృప్తి కలిగించే విషయమూ కాదు. ఇంట్లోనుండి బొద్దింకలను, ఇతర పురుగులను వదిలించుకోవడానికి ఇదొక పద్ధతి. దాని తర్వాత ఎలాంటి చిందరవందరా ఉండదు.
ఇక్కడ ప్రస్తావించిన చీమలు, చీమల దండు అని పిలవబడడం విశేషం, ఎందుకంటే వాటి జీవన విధానం, కార్యకలాపాలు అలాగే ఉంటాయి. * సంచారజాతికి చెందిన లక్షలాది ఈ చీమల దండ్లు తమ కోసం గూళ్లను కట్టుకోకుండా, తాత్కాలిక మజిలీలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ చీమలు పెద్ద పెద్ద గుంపులుగా ఏర్పడి వాటి కాళ్ళను ఒకదానితో ఒకటి పెనవేసి రాణి చీమ చుట్టూ, దాని పిల్లల చుట్టూ సజీవ తెర మాదిరి అల్లుకుంటాయి. ఈ తాత్కాలిక మజిలీ నుండి, దాడిచేసే దళాలు ఆహారం కోసం పొడవైన బారులుగా బయల్దేరతాయి. కీటకాలను, బల్లులవంటి చిన్న చిన్న ప్రాణులను ఇవి తింటాయి. ఈ దాడి చేసే దళాల నాయకులు ఆహారంపై దాడిచేయడానికి, కవాతుల్లాంటివి కూడా నిర్వహిస్తాయి. అనుసరించడానికి ఎటువంటి వాసన జాడ లేక, ముందు నడుస్తున్న చీమలు సంకోచిస్తూ ఆగినప్పుడు ఇది దృగ్గోచరమవుతుంది. వెనక ఉండే చీమలు ఆగకుండా ముందుకు కదుల్తాయి, అప్పుడు ముందరిస్థానంలోని ఇతర భాగాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోతాయి, తత్ఫలితంగా కవాతు చేస్తూ ముందుకుసాగే దండ్లలాంటివి క్రమంగా ఏర్పడతాయి.
ఈ చీమల దండు 36 రోజుల వ్యవధిలో పనిచేస్తాయి, దాడి చేసేందుకు దాదాపు 16 రోజులు పోతే మిగతా 20 రోజులు ఎటూ వెళ్ళకుండా అక్కడే ఉంటాయి, ఆ సమయంలోనే రాణి చీమ గుడ్లు పెడుతుంది. దాని తర్వాత కలిగే ఆకలి ఆ దండు మళ్ళీ దాడికి వెళ్ళేలా చేస్తుంది. అలా కవాతు చేసే దండ్లు, పక్షుల నుండి తప్పించుకొని పారిపోతున్న సాలె పురుగులను, వృశ్చికాలను, బొద్దింకలను, కప్పలను, బల్లులను తినడానికి వాటి చుట్టూ సుమారు పది మీటర్ల వెడల్పు వరకు వలయంగా ఏర్పడతాయి. పక్షులు పారిపోతున్న పురుగులనే వేటాడతాయి కానీ చీమలను వేటాడవు.
బైబిల్లో సామెతలు 30:24, 25 వచనాల్లో “జ్ఞానముగలవి” అని వర్ణించబడిన చీమలు, సృష్టిలోని అద్భుతాల్లో ఒకటి. (g03 6/8)
[అధస్సూచి]
^ ఈ ఆర్టికల్‌లో చర్చించబడినవి, మధ్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన ఎసిటోన్ జాతి చీమలు.
[29వ పేజీలోని చిత్రం]
దండులోని చీమ
[చిత్రసౌజన్యం]
© Frederick D. Atwood
[29వ పేజీలోని చిత్రం]
తమ కాళ్ళను మరొకదానితో పెనవేసుకోవడం ద్వారా వంతెన నిర్మాణం
[చిత్రసౌజన్యం]
© Tim Brown/www.infiniteworld.org