కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య

కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య

కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య

లాటిన్‌ అమెరికాలో ఒక గృహంలో నిద్రకు వేళయ్యింది. తల్లి తన కొడుకును నిద్రపుచ్చి ప్రేమగా దుప్పటి కప్పి గుడ్‌ నైట్‌ చెప్పింది. అయితే ఆ చీకట్లో, మూడు సెంటిమీటర్ల కంటే తక్కువ పొడవున్న మెరిసే నల్లని కిస్సింగ్‌ బగ్‌ ఒకటి పైకప్పు బీటనుండి బైటకు వచ్చి పరుపు మీదకు జారింది. మెల్లగా అది నిద్రపోతున్న బాబు ముఖంమీదికి పాకి ఆ అబ్బాయి లేత చర్మంమీద నొప్పి తెలియకుండా కుట్టింది. ఆ కీటకం ఒకవైపు రక్తంతో తన కడుపు నింపుకుంటూ అదే సమయంలో పరాన్నజీవులతో నిండివున్న మలం విసర్జించింది. ఆ బాబు నిద్రలోనే తన ముఖం గోక్కొని రోగక్రిములతో నిండివున్న ఆ మలాన్ని తన గాయంపై రుద్దుకున్నాడు.

దాని ఫలితంగా ఆ బాబుకి ఛాగాస్‌ వ్యాధి సంక్రమించింది. ఒకటి రెండు వారాల్లోపు వాడికి బాగా జ్వరం వచ్చి శరీరం వాచింది. ఒకవేళ వాడికి జ్వరం, శరీర వాపు తగ్గినా ఆ పరాన్నజీవులు వాడి గుండెను, నాడీవ్యవస్థను, శరీర జీవాణువుల్ని ఆక్రమించి వాడి శరీరంలోనే నివాసమేర్పరచుకొనే అవకాశముంది. ఎలాంటి రోగ లక్షణాలు లేకుండానే 10 నుండి 20 సంవత్సరాలు గడిచిపోవచ్చు. కానీ ఆ తర్వాత వాడి జీర్ణకోశ నాళంలో పుండ్లుపడి, మెదడుకు ఇన్ఫెక్షన్‌ వచ్చి, చివరకు గుండె ఆగి చనిపోవచ్చు.

ఈ కల్పిత కథ ఛాగాస్‌ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో వాస్తవికంగా వివరిస్తోంది. లాటిన్‌ అమెరికాలో కోట్లాదిమంది ఇలా మృత్యు కాటుకు గురయ్యే ప్రమాదంలో ఉండవచ్చు.

బహుపాద సహచరులు

“మనిషికొచ్చే ముఖ్యమైన జ్వరాల్లో అధికశాతం కీటకాలు చేరవేసిన సూక్ష్మక్రిములు కలుగజేసేవే” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా నివేదిస్తోంది. ప్రజలు సాధారణంగా అసలైన కీటకాలను అంటే షడ్పాద ఈగలు, త్రుళ్లు పురుగులు, దోమలు, పేలు, దిమ్మెసలనే కాక అష్టపాద తపుటి పురుగులను, టిక్‌ పురుగులను సూచించడానికి కూడా “కీటకం” అనే పదాన్ని ఉపయోగిస్తారు. శాస్త్రజ్ఞులు వీటన్నింటినీ ఆర్థ్రోపోడా అనే విభాగంలో అంటే జంతు ప్రపంచంలోని అతిపెద్ద విభాగంలో ఒక భాగంగా పేర్కొంటారు, దానిలో కనీసం 10,00,000 తెలిసిన జాతులున్నాయి.

కీటకాల్లో అధికశాతం మనుష్యులకు హానిరహితమైనవి, కొన్ని ఎంతో ప్రయోజనకరమైనవి కూడా. ప్రజలకు, జంతువులకు ఆహారంగా ఉపయోగపడే మొక్కలూ చెట్లూ చాలామట్టుకు కీటకాలు లేకుండా పరాగ సంపర్కము చేయలేవు, పళ్ళను ఉత్పత్తి చేయలేవు. కొన్ని కీటకాలు వ్యర్థపదార్థాలను రీసైకిల్‌ చేయడానికి సహాయపడతాయి. చాలా కీటకాలు కేవలం మొక్కలనే తింటాయి, నిర్దిష్టమైన కొన్ని కీటకాలు మాత్రం ఇతర కీటకాలను తింటాయి.

మనుష్యులకు, జంతువులకు బాధకలిగే విధంగా కుట్టి లేదా విస్తారంగా ఉండి రొదతో విసిగించే కీటకాలు ఉన్నాయి. కొన్ని కీటకాలు పొలాలకు తీవ్ర నష్టం కూడా కలుగజేస్తాయి. అయితే దారుణమేమంటే వ్యాధులను, మరణాన్ని వ్యాప్తిచేసే కీటకాలూ ఉన్నాయి. “17వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం తొలికాలం వరకూ మనుష్యులు వ్యాధులకు గురై మరణించడానికి ఇతర కారణాలన్నింటిని కలిపితే వాటికంటే” ఎక్కువగా కీటక సంక్రమిత వ్యాధులే కారణమని యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన డాన్‌ గుబ్లర్‌ నివేదించాడు.

ప్రస్తుతం దాదాపు ప్రతి ఆరుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కీటక సంక్రమిత వ్యాధితో బాధపడుతున్నాడు. కీటక సంక్రమిత వ్యాధులు మనుష్యులను బాధపెట్టడమే కాక ప్రత్యేకించి అలాంటి వ్యాధులతో వ్యవహరించేందుకు ఆర్థిక వనరులంతగాలేని వర్థమాన దేశాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతాయి. అలాంటి వ్యాధి ఒక్కసారి వ్యాపించినా దాని నివారణ చాలా ఖర్చుతో కూడిన పని. 1994లో పశ్చిమ ఇండియాలో వచ్చిన అలాంటి తెగులు స్థానిక మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షలాది డాలర్ల ఖర్చు తెచ్చిందని చెప్పబడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఓ.) ప్రకారం, ఇలాంటి ఆరోగ్య సమస్యలను అదుపు చేయనంతకాలం ప్రపంచంలో ఉన్న నిరుపేద దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందలేవు.

కీటకాలు మనల్నెలా వ్యాధిగ్రస్థుల్ని చేస్తాయి?

కీటకాలు రెండు ముఖ్యమైన పద్ధతుల్లో రోగవాహకాలుగా అంటే వ్యాధులను సంక్రమింపచేసే మాధ్యమాలుగా పనిచేస్తాయి. మొదటిది యాంత్రికంగా సంక్రమింపజేయడం. జనం మురికి బూట్లతో ఇంట్లోకి మట్టి తీసుకొచ్చినట్లే “ఈగలు తమ కాళ్ళపై లెక్కలేనన్ని సూక్ష్మక్రిములను మోసుకురాగలవు, ఆ సూక్ష్మక్రిములు తగినంత మోతాదులో మన శరీరంలోకి ప్రవేశిస్తే అవి మనల్ని వ్యాధిగ్రస్తులను చేయవచ్చు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఉదాహరణకు ఈగలు, మలం నుండి కలుషిత పదార్థాలను తెచ్చి ఆహారం మీద, పానీయాల మీద వాలి వాటిని చేరవేయవచ్చు. ఈ విధంగా మనుష్యులకు టైఫాయిడ్‌, అతిసార వ్యాధి, కలరా వంటి మంచానపడేసే, మరణకర వ్యాధులు సంక్రమిస్తాయి. ఈగలు ట్రకోమా అనే కంటివ్యాధిని వ్యాప్తిచేయడానికి కూడా దోహదపడతాయి, ప్రపంచంలో అంధత్వానికి ఈ వ్యాధే ముఖ్య కారణం. ట్రకోమా, కళ్ళలోని కార్నియాకు అంటే ఐరిస్‌కు ఎదురుగా ఉండే స్పష్టమైన కంటి భాగానికి శుక్లాలతో గ్రుడ్డితనాన్ని కలుగజేయగలదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,00,00,000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

అపరిశుభ్ర ప్రాంతాల్లో పెచ్చరిల్లే బొద్దింకలు కూడా యాంత్రికంగా వ్యాధులను సంక్రమింపజేస్తున్నాయని అనుమానించబడుతోంది. అంతేకాక, ప్రత్యేకించి పిల్లల్లో ఇటీవల అధికమౌతున్న ఉబ్బసానికి బొద్దింకల అలర్జీలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, ఉబ్బసం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఎన్నో రాత్రులు బాధపడిన 15 సంవత్సరాల ఆష్లేను ఊహించుకోండి. డాక్టర్‌ ఆమె ఊపిరితిత్తులను పరీక్షించబోతుంటే ఆ అమ్మాయి షర్టులోనుండి ఒక బొద్దింక బైటపడి ఆ డాక్టర్‌ పరీక్షా టేబుల్‌ మీదనుండి పరిగెత్తింది.

కీటకాల శరీరాల్లో ఉండే వ్యాధులు

కీటకాలు తమ శరీరాల్లో వైరస్‌లకు, సూక్ష్మక్రిములకు, పరాన్నజీవులకు ఆశ్రయమిచ్చినప్పుడు అవి రెండవ పద్ధతిలో వ్యాధులను వ్యాప్తిచేస్తాయి అంటే మనుష్యులను కుట్టడం ద్వారా లేదా మరితర విధాలుగా ఆ రోగక్రిములను చేరవేసి వ్యాధులను వ్యాప్తిచేస్తాయి. అయితే కీటకాల్లో చాలా తక్కువశాతం మాత్రమే ఈ విధంగా మనుష్యులకు వ్యాధులను సంక్రమింపజేస్తాయి. ఉదాహరణకు దోమల్లో వేలాది జాతులు ఉన్నప్పటికీ అనాఫిలిస్‌ జాతి దోమలు మాత్రమే మలేరియాను వ్యాప్తిచేస్తాయి, ప్రపంచంలో క్షయ తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి మలేరియానే.

అయితే వేరే దోమలు కూడా ఎన్నో రకాల వ్యాధులను సంక్రమింపజేస్తాయి. డబ్ల్యు.హెచ్‌.ఓ. ఇలా నివేదిస్తోంది: “వ్యాధులను సంక్రమింపజేసే కీటకాలన్నింటికంటే దోమ అత్యంత ప్రమాదకరమైనది, అది మలేరియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌ వంటి వ్యాధులను సంక్రమింపజేస్తుంది, ఇవి ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది మరణించడానికి, కోట్లాదిమంది అంటువ్యాధులతో బాధపడడానికి కారణమౌతున్నాయి.” భూజనాభాలో కనీసం 40 శాతంమందికి మలేరియా, దాదాపు 40 శాతంమందికి డెంగ్యూ సంక్రమించే ప్రమాదం ఉంది. చాలా ప్రాంతాల్లో ఒక వ్యక్తికి ఈ రెండు వ్యాధులూ సంక్రమించే అవకాశం కూడా ఉంది.

అయితే వ్యాధులకు తమ శరీరాల్లో ఆశ్రయమిచ్చే కీటకాలు కేవలం దోమలు మాత్రమే కావు. సీసీ ఈగలు అతినిద్రా వ్యాధిని కలుగజేసే ప్రోటోజోవాను సంక్రమింపజేస్తాయి, ఈ వ్యాధి లక్షలాదిమందిని బాధపెడుతూ వారు తమ సారవంతమైన పొలాలను విడిచి వెళ్ళిపోయేలా చేస్తుంది. బ్లాక్‌ ఫ్లైస్‌ అనే కీటకాలు రివర్‌ బ్లైండ్‌నెస్‌ కలుగజేసే పరాన్నజీవిని సంక్రమింపజేయడం ద్వారా 4,00,000 మంది ఆఫ్రికన్లకు అంధత్వాన్ని కలుగజేశాయి. సాండ్‌ ఫ్లైస్‌ లీస్‌మేనియాసిస్‌కు చెందిన వివిధ వ్యాధులను కలుగజేసే పరాన్నజీవులను మోసుకెళ్ళగలవు, ప్రజలను అశక్తులను, విరూపులను చేసే ప్రాణాంతకమైన ఈ వ్యాధులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసులకు చెందిన లక్షలాదిమందిని పీడిస్తున్నాయి. దాదాపు ప్రతీచోటా కనిపించే త్రుళ్లు పురుగులు ఏలికపాములకు, మెదడు వాపు వ్యాధికి, ట్యూలరీమియా అనే అంటుజ్వరానికి, మామూలుగా బ్లాక్‌ డెత్‌ అని పిలువబడే ప్లేగువ్యాధికి కారణమయ్యే క్రిములను మోసుకెళ్ళగలవు. ఈ బ్లాక్‌ డెత్‌ మధ్యయుగాల్లో కేవలం ఆరు సంవత్సరాల్లోనే ఐరోపాలో మూడువంతులకంటే ఎక్కువ మందిని తుడిచిపెట్టింది.

పేలు, తపుటిపురుగులు, టిక్‌ పురుగులు టైఫస్‌ రకానికి చెందిన వివిధ వ్యాధులనే కాక ఇతర వ్యాధులను కూడా వ్యాప్తిచేయగలవు. ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ దేశాల్లోని టిక్‌ పురుగులు ప్రాణాంతకంగా పరిణమించగల లైమ్‌ వ్యాధిని సంక్రమింపజేయగలవు, అమెరికా, ఐరోపాలలో రోగవాహకాల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ఈ వ్యాధి సర్వసాధారణమైనది. వలసవెళ్ళే పక్షులు టిక్‌ పురుగులను వేలాది కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్ళి, వీటి ద్వారా వ్యాపించే వ్యాధులను క్రొత్త ప్రాంతాలకు పరిచయం చేయగలవని ఒక స్వీడిష్‌ అధ్యయనం వెల్లడిచేసింది. “టిక్‌ పురుగులు మనుష్యులకు సంక్రమింపజేసే వ్యాధుల సంఖ్య మిగతా ఆర్థ్రోపొడా జీవులు సంక్రమింపజేసే వ్యాధుల సంఖ్య కంటే (దోమలు మినహా) ఎక్కువ” అని బ్రిటానికా చెబుతోంది. నిజానికి ఒక్క టిక్‌ పురుగు మూడు వేర్వేరు వ్యాధులను కలుగజేసే జీవులకు ఆశ్రయమివ్వగలదు, మనిషిని ఒక్కసారి కుట్టి ఆ మూడు వ్యాధులను ఒకేసారి సంక్రమింపజేయగలదు!

వ్యాధులకిక “సెలవు”

1877వ సంవత్సరంలోనే కీటకాలు వ్యాధులను సంక్రమింపజేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. అప్పటినుండి వ్యాధులను వ్యాప్తిచేసే కీటకాలను అదుపు చేయడానికి లేదా నిర్మూలించడానికి భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. వ్యాధులను వ్యాప్తిచేసే కీటకాల నిర్మూలనకు వాడే మందులకు 1939లో డి.డి.టి. క్రిమిసంహారి కూడా చేర్చబడింది. 1960లకల్లా కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు ఆఫ్రికా వెలుపలి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం కావని పరిగణించబడింది. రోగవాహకాలను అదుపుచేయడంపై కాక అత్యవసర పరిస్థితుల్లో వ్యాధులను మందులతో నయంచేయడానికి ఎక్కువ అవధానమివ్వబడింది, కీటకాల గురించీ వాటి నివాస స్థలాల గురించీ అధ్యయనం చేయడంపై ఆసక్తి క్షీణించిపోయింది. కొత్త మందులు కూడా కనుగొనబడుతుండడం వల్ల విజ్ఞానశాస్త్రం ఎలాంటి వ్యాధినైనా నయంచేసేందుకు “అద్భుతమైన మందు” కనుగొనగలదని అనిపించింది. ప్రపంచం అంటువ్యాధులకు “సెలవు” పెట్టి ఆనందించసాగింది. కానీ ఆ సెలవు త్వరలోనే ముగిసింది. ఎందుకలా జరిగిందో తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది. (g03 5/22)

[3వ పేజీలోని బ్లర్బ్‌]

నేడు ప్రతి ఆరుగురిలో ఒక వ్యక్తి కీటక సంక్రమిత వ్యాధితో బాధపడుతున్నాడు

[3వ పేజీలోని చిత్రం]

కిస్సింగ్‌ బగ్‌

[4వ పేజీలోని చిత్రం]

ఈగలు వ్యాధులను కలుగజేసే క్రిముల్ని తమ కాళ్ళమీద మోసుకెళతాయి

[5వ పేజీలోని చిత్రాలు]

చాలా కీటకాలు తమ శరీరాల్లో వ్యాధులకు ఆశ్రయమిస్తాయి

బ్లాక్‌ ఫ్లైస్‌ రివర్‌ బ్లైండ్‌నెస్‌ను కలుగజేస్తాయి

దోమలు మలేరియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్‌ను సంక్రమింపజేస్తాయి

పేలు టైఫస్‌ను సంక్రమింపజేయగలవు

త్రుళ్లు పురుగులు మెదడు వాపు వ్యాధి, ఇతర వ్యాధుల క్రిములను తమ శరీరంలో మోసుకెళ్తాయి

సీసీ ఈగలు అతినిద్రా వ్యాధిని సంక్రమింపజేస్తాయి

[చిత్రసౌజన్యం]

WHO/TDR/LSTM

CDC/James D. Gathany

CDC/Dr. Dennis D. Juranek

CDC/Janice Carr

WHO/TDR/Fisher

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Clemson University - USDA Cooperative Extension Slide Series, www.insectimages.org