గాయపరిచేలా మాట్లాడకండి
బైబిలు ఉద్దేశం
గాయపరిచేలా మాట్లాడకండి
“ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.”—యాకోబు 3:10.
మాట్లాడే సామర్థ్యం ఒక అద్భుతమైన ప్రక్రియ. అది మనకి, జంతువులకి మధ్యవున్న భేదాన్ని చూపిస్తుంది. కానీ కొందరు ఈ ప్రజ్ఞను దుర్వినియోగం చేయడం శోచనీయం. దూషణలు, శాపనార్థాలు, అపవిత్రమైన మాటలు, దైవదూషణ, అసందర్భ ప్రలాపనలు, అశ్లీలమైన మాటలు ఇవి కొన్నిసార్లు శారీరక గాయాలకంటే ఎక్కువ బాధ కలిగిస్తాయి. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు” అని బైబిలు చెబుతోంది.—సామెతలు 12:18.
అనేకమంది ఒట్టుపెట్టుకోవడాలు, శాపనార్థాలు అలవాటుగా చేస్తుంటారు. విద్యార్థుల్లో అశ్లీలమైన భాష ఉపయోగించడం పెరిగిపోయిందని పాఠశాలలు నివేదిస్తున్నాయి. కొందరైతే అలాంటి హానికరమైన భాషను, ఉద్వేగాన్ని వెళ్ళగక్కడానికి ఉపయోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఒక విద్యార్థి ఇలా వ్రాశాడు: “కేవలం మామూలు మాటల్లో మన భావాల్లోని తీవ్రతను వ్యక్తం చేయలేనప్పుడు, అశ్లీలమైన భాషనుపయోగించడం ఒక శక్తివంతమైన చర్యగా ఉంటుంది.” బాధకలిగించే సంభాషణ పట్ల
క్రైస్తవులకు ఇలాంటి నిర్లక్ష్య వైఖరే ఉండాలా? అలాంటి భాషను దేవుడు ఎలా దృష్టిస్తాడు?అసభ్యమైన పరిహాసాలను అసహ్యించుకోండి
అసభ్యమైన భాష ఆధునిక ఆవిర్భావమేమీ కాదు. దాదాపు 2,000 సంవత్సరాలకు పూర్వం అపొస్తలుల కాలంలో కూడా ప్రజలు అసభ్యమైన సంభాషణను ఉపయోగించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారా? ఉదాహరణకు కొలొస్సయి సంఘంలోని కొందరికి కోపం వచ్చినప్పుడు అసభ్యమైన మాటలను ఉపయోగించినట్లు వెల్లడౌతోంది. వారు బహుశా ప్రతీకార భావంతో ఇతరులపై దాడిచేయడానికి లేదా బాధపెట్టడానికి ఆ భాషను బుద్ధిపూర్వకంగా ఉపయోగించివుండవచ్చు. అదేవిధంగా నేడు అనేకమంది కోపం వచ్చినప్పుడు అసభ్యమైన మాటలను ఉపయోగిస్తారు. కాబట్టి పౌలు కొలొస్సయులకు వ్రాసిన ఉత్తరం మన కాలానికి కూడా వర్తిస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు: “ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.” (కొలొస్సయులు 3:8) కోపము వెన్నంటే తరచూ ఉద్రేకము, అసభ్యమైన భాష వస్తాయి కాబట్టి, క్రైస్తవులు వాటికి దూరంగా ఉండాలని ఉద్బోధించబడిందన్నది సుస్పష్టం.
చాలామంది అలాంటి అసభ్యమైన మాటలను ఎదుటివారిపై దాడిచేయాలని గానీ వారిని బాధపెట్టాలని గానీ ఉపయోగించరన్న మాట నిజమే. అందుకే కాబోలు అసభ్యమైన భాష చాలా తరచుగా మామూలు ధోరణిలో ఉపయోగించబడుతోంది. ఆ విధంగా దైనందిన సంభాషణలో దుర్భాష వేళ్ళూనుకుపోయింది. కొందరికైతే ఒక్క బూతు మాట కూడా లేకుండా మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో నవ్వు పుట్టించడానికి కూడా అసభ్యమైన భాష ఉపయోగించబడింది. కానీ అలాంటి అసభ్యమైన పరిహాసాన్ని అప్రధానమైన, అంగీకారయోగ్యమైన తప్పుగా పరిగణించాలా? ఈ క్రింది విషయం పరిశీలించండి.
అసభ్యమైన పరిహాసం అంటే ఇతరుల వినోదం కోసం చాలా బాధకలిగించే భాషను ఉపయోగించడం. నేటి అసభ్యమైన పరిహాసాల్లో ఎక్కువగా లైంగిక విషయాలే ఉంటాయి. అంతేగాక తమకు తాము మాననీయులమని భావిస్తున్న ప్రజల్లో అనేకమంది ఇలాంటి భాషతో వినోదిస్తున్నారు. (రోమీయులు 1:28-32) కాబట్టి వృత్తిరీత్యా కమెడియన్లు అయిన అనేకమందికి సహజమైన, అసహజమైన లైంగిక ప్రవర్తనలే చర్చాంశాలుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అసభ్యమైన పరిహాసం అనేక చలనచిత్రాల్లోనే కాక, టెలివిజన్, రేడియో కార్యక్రమాల్లో కూడా చోటుచేసుకుంది.
బైబిల్లో ఈ అసభ్య పరిహాసాన్ని గురించిన ప్రస్తావన ఉంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలోని క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 5:3, 4) కాబట్టి అసభ్యమైన భాష ఎలాంటి ఉద్దేశంతో ఉపయోగించినా అది దేవుని దృష్టిలో తప్పే. అది మంచిది కాదు. అది గాయపరిచే భాష అన్నది సుస్పష్టం.
దేవునికి అసంతృప్తి కలిగించే కఠినమైన మాటలు
బాధ కలిగించే మాటల్లో అసభ్యమైన భాష కంటే ఎక్కువే మిళితమై ఉందనడంలో సందేహం లేదు. దూషణలు, వ్యంగ్యం, ఎగతాళి, కఠినమైన విమర్శ వంటివి తీవ్రంగా బాధకలిగిస్తాయి. ప్రత్యేకించి మన చుట్టుపక్కల వాతావరణంలో ఇతరులను ఎత్తిపొడవడం, నిందించడం ప్రబలంగా ఉన్నప్పుడు మనమందరము మన నోటితో పాపము చేస్తామని అంగీకరించవలసిందే. (యాకోబు 3:2) అయినప్పటికీ నిజ క్రైస్తవులు బూతు మాటల పట్ల నిర్లక్ష్య వైఖరిని అలవరచుకోకూడదు. యెహోవా దేవుడు గాయపరిచే అన్ని మాటలను అంగీకరించడని బైబిలు స్పష్టంగా తెలియజేస్తోంది.
ఉదాహరణకు బైబిలులోని రెండవ రాజులు పుస్తకంలో, బాలుర గుంపొకటి ఎలీషా ప్రవక్తను మాటలతో వేధించినట్లు మనం చూస్తాం. వాళ్ళు “బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము” చేశారని ఆ వృత్తాంతం తెలుపుతోంది. హృదయాలను చదవగలిగే యెహోవా, ఆ కుర్రవాళ్ళ దురుద్దేశాన్ని చూసి వారి దుర్భాషను చాలా గంభీరంగా తీసుకున్నాడు. దుర్భాష కారణంగా యెహోవా చేతుల్లో 42 మంది బాలురు మరణించారని ఆ వృత్తాంతం తెలుపుతోంది.—2 రాజులు 2:23, 24.
ఇశ్రాయేలు ప్రజలు “దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ 2 దినవృత్తాంతములు 36:16) దేవునికి కోపము రావడానికి ముఖ్య కారణం, తన ప్రజలు విగ్రహారాధన చేస్తూ, అవిధేయంగా ఉండడమే అయినప్పటికీ, బైబిలు నిర్దిష్టంగా దేవుని ప్రవక్తలనుద్దేశించి పలికిన దూషణకరమైన మాటల గురించి ప్రస్తావించడం గమనార్హం. అలాంటి ప్రవర్తనను దేవుడు ఎంతమాత్రం సహించడని ఇది స్పష్టంగా తెలుపుతోంది.
యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.” (దాని ప్రకారమే బైబిలు క్రైస్తవులకు ఇలా ప్రబోధిస్తోంది: “వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.” (1 తిమోతి 5:1) ప్రతి ఒక్కరితో మనం వ్యవహరించేటప్పుడు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలె[ను]” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.—తీతు 3:1, 2.
మన నోటిని అదుపులో ఉంచుకోవడం
ఎవరిపైనైనా మాటలతో దాడి చేయాలనే ప్రోద్బలాన్ని అడ్డుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. తన పట్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, దానికి కారణమైన వ్యక్తిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కఠినమైన, దురుసైన మాటలతో శిక్షించడం న్యాయమేనని ఆ వ్యక్తి భావిస్తాడు. అయితే అలాంటి ప్రోద్బలాన్ని క్రైస్తవులు అడ్డుకుంటారు. సామెతలు 10:19 ఇలా చెబుతోంది: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.”
ఈ విషయంలో దేవదూతలు చక్కని మాదిరిని ఉంచారు. మానవాళి చేసిన మొత్తం తప్పిదం గురించి వారికి తెలుసు. దేవదూతలు మానవుల కంటే బలమైనవారు శక్తిగలవారు అయినప్పటికీ, వారు మానవులను నిందిస్తూ “ప్రభువు ఎదుట” అసభ్యకరమైన ఒక్క మాట కూడా పలుకరు. (2 పేతురు 2:11) తప్పు చేసే ప్రతి ఒక్కరి గురించి దేవునికి బాగా తెలుసని, విషయాలను సరిదిద్దేందుకు ఆయనకు పూర్తి సామర్థ్యముందని ఎరిగిన ఆ దేవదూతలు తమ నోటిని అదుపులో ఉంచుకున్నారు. దూతలందరికీ ప్రధానదూతయైన మిఖాయేలు, సాతానును వ్యతిరేకించినప్పుడు కూడా అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించలేదు.—యూదా 9.
క్రైస్తవులు దేవదూతలను అనుకరించడానికి కృషి చేస్తారు. వారు బైబిలు ఉద్బోధను పాటిస్తారు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.”—రోమీయులు 12:17-19.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన కంఠంలోని స్వరం, తీవ్రత కూడా మనం మాట్లాడే మాటలకు బాధకలిగించేలా పదునుపెట్టే అవకాశముంది. భార్యాభర్తలు ఇరువురూ ఒకరిపై ఒకరు గట్టిగా అరిచి బాధపెట్టుకోవడం మామూలే. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కేకలు వేస్తారు. అయినా మన భావాలను వ్యక్తంచేసేందుకు మనం అరవాల్సిన అవసరం లేదు. బైబిలు ఇలా ఉద్బోధిస్తోంది: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 4:31) ‘ప్రభువుయొక్క దాసుడు జగడమాడక అందరి యెడల సాధువుగా ఉండవలెను’ అని కూడా బైబిలు చెబుతోంది.—2 తిమోతి 2:24-26.
స్వస్థత చేకూర్చే మాటలు
నేడు అసభ్యమైన, అశ్లీలమైన భాష ప్రబలంగా ఉన్నందువల్ల, హానికరమైన దాని ప్రభావాన్నుండి తట్టుకునే చక్కని కార్య ప్రణాళిక క్రైస్తవులకు ఉండాలి. బైబిలు ఒక చక్కని కార్య ప్రణాళికను అందిస్తోంది, అదేమిటంటే మన పొరుగువారిని ప్రేమించడమే. (మత్తయి 7:12; లూకా 10:27) పొరుగువారి పట్ల ఉండే యథార్థమైన శ్రద్ధ, ప్రేమలు మనం ఎల్లప్పుడూ స్వస్థత చేకూర్చే మాటలనే ఉపయోగించేలా మనల్ని పురికొల్పుతాయి. బైబిలు ఇలా చెబుతోంది: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”—ఎఫెసీయులు 4:29.
మన మనస్సుల్లో దేవుని వాక్యాన్ని ఉంచుకోవడం కూడా మనం గాయపరిచే మాటలను ఉపయోగించకుండా ఉండేందుకు సహాయంగా ఉంటుంది. పరిశుద్ధ లేఖనాలను చదువుతూ అధ్యయనం చేయడం, మనం ‘సమస్త కల్మషమును మానివేసేందుకు’ దోహదపడుతుంది. (యాకోబు 1:21) అవును, దేవుని వాక్యం మన మనస్సులను స్వస్థపరుస్తుంది. (g03 6/8)