కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

మొక్కల కుండీల విలువ

“స్కూళ్ళలోని తరగతి గదుల్లో మొక్కల కుండీలను ఉంచితే వేలాదిమంది విద్యార్థులు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారు” అని పరిశోధకులు చెబుతున్నట్లు లండన్‌ వార్తాపత్రిక ద టైమ్స్‌ నివేదిస్తోంది. విద్యార్థులతో నిండివుండి గాలి ప్రసరణ అంతగాలేని తరగతి గదుల్లో సాధారణంగా ఉండవలసిన దానికంటే 500 శాతం ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ ఉండడం వల్ల పిల్లల అవధానం దెబ్బతిని వారి అభివృద్ధి కుంటుపడుతుందని రీడింగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ డెరిక్‌ క్లిమెన్స్‌-క్రూమ్‌ కనుగొన్నారు. ఆయన ఈ పరిస్థితికి సిక్‌ క్లాస్‌రూమ్‌ సిండ్రోమ్‌ అని పేరుపెట్టారు. ఆఫీసుల్లోని ఉద్యోగులను వారి పనిని “సిక్‌ బిల్డింగ్‌ సిండ్రోమ్‌” ప్రభావితం చేస్తుండగా, ఒక తరగతి గదిలోని పిల్లల సగటు సంఖ్య ఆఫీసు భవనాల్లోని ఉద్యోగుల సంఖ్య కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉందని ఆయన చెబుతున్నారు. గదిలోని గాలి నాణ్యతను పెంచడానికి ఎలాంటి మొక్కలను ఉపయోగించవచ్చు? స్పైడర్‌ ప్లాంట్‌లు అత్యంత సమర్థవంతమైనవని అమెరికాలో నిర్వహించబడిన ఒక అధ్యయనంలో తేలింది. గాలిని కలుషితంచేసే వాటిని నిర్మూలించడంలో డ్రాగన్‌ మొక్కలు, నిత్యహరితగుల్మం, రబ్బర్‌ మొక్కలు, పీస్‌ లిల్లీలు, యుక్కా మొక్కలు కూడా ఎంతో సమర్థవంతమైనవి. ఇంట్లోని మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడం ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిని తగ్గిస్తాయి. (g03 6/08)

“మాట్లాడే” మొక్కలు

జర్మనీలోని బాన్‌ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌కు చెందిన పరిశోధకులు మొక్కలు చెప్పేవాటిని “వినగల” లేసర్‌ మైక్రోఫోన్‌లను తయారుచేశారు. ఈ మైక్రోఫోన్‌లు, మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు విడిచే ఎథిలిన్‌ వాయువు ఉత్పత్తి చేసే శబ్ద తరంగాల సిగ్నల్‌ను పట్టుకోగలవు. బాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుడు డా. ఫ్రాంక్‌ క్యున్‌మాన్‌ ఇలా అన్నారు: “మొక్క ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే, మా మైక్రోఫోన్‌లో వచ్చే సిగ్నల్‌ అంత బిగ్గరగా ఉంటుంది.” ఒక సందర్భంలో చాలా ఆరోగ్యంగా కనబడుతున్న దోసకాయ మొక్క, మైక్రోఫోన్‌లోని రీడింగుల ప్రకారం “అక్షరార్థంగా అరిచింది.” “ఆ మొక్కను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దానికి బూజు పట్టిందని, కానీ ఇంకా దాని సూచనలు బైటకు కనపడలేదని వెల్లడయ్యింది.” నిజానికి బూజు పట్టిన ప్రాంతాలు బైటకు కనపడడానికి ఎనిమిది నుండి తొమ్మిది రోజులు పడుతుంది, అవి కనిపించిన తర్వాతే రైతులు సమస్యను గుర్తించగలరు. “మొక్కలు చెబుతున్నవాటిని వినడం ద్వారా తెగుళ్ళ గురించి, వ్యాధుల గురించి ముందుగానే హెచ్చరించే వ్యవస్థను తయారుచేయడం సాధ్యమవ్వాలి. పళ్ళు, కూరగాయల ఒత్తిడి స్థాయిని తెలుసుకోవడమనేది వాటిని నిలువచేసి, రవాణా చేయడంలో సమర్థవంతమైన సాధనంగా ఉంటుంది” అని లండన్‌కు చెందిన టైమ్స్‌ చెబుతోంది. (g03 5/08)

పోపు స్మృతిచిహ్నాల అమ్మకం తగ్గిపోతోంది

ఎన్నో సంవత్సరాలుగా “[పోలండ్‌లో] మతసంబంధమైన వస్తువుల అమ్మకం ఎంతో లాభదాయకంగా” ఉండింది అని న్యూస్‌వీక్‌ పత్రిక యొక్క పోలిష్‌ సంచిక నివేదిస్తోంది. అయితే ఇటీవలే, పరిశుద్ధ ప్రతిమల అమ్మకంలో “కలతపరిచే పరిస్థితి” గమనించబడింది. 2002వ సంవత్సరంలో పోప్‌ పోలండ్‌ను సందర్శిస్తున్నాడని ఎంతో ప్రచారం చేయబడినప్పటికీ, గొలుసులు, చిత్రాలు వంటి సాంప్రదాయక మతసంబంధ వస్తువుల కోసం గిరాకీ చాలా తక్కువయ్యింది. “మార్కెట్‌ నిండా లక్షలాది ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ మరియు లోహంతో చేయబడిన ప్రతిమలు” పోప్‌ చిత్రం ఉన్న “బిళ్ళలు, చాపలు, చిత్రాలు, చిన్న విగ్రహాలు” ఉన్నప్పటికీ “కొనుగోలుదారులు ఆచితూచి కొంటున్నారు” అని ఆ పత్రిక నివేదిస్తోంది. అయితే ఒక ఐడియా జనాకర్షితమైంది. అది ఒక ప్లాస్టిక్‌ కార్డ్‌, ఆ కార్డ్‌కు ఒకవైపున “పరిశుద్ధ చిత్రాలు” మరోవైపున “ప్లాస్టిక్‌లోకి పొదగబడిన బంగారు పూసలు” ఉంటాయి. ఈ “రోజరీ కార్డ్‌లు” “పోప్‌ [జ్ఞాపికల్లో] అధునాతనమైనవి, అధిక జనాదరణగలవి” అని పోలిష్‌ వారపత్రిక ప్రోస్ట్‌ నివేదించింది. (g03 5/22)

వేవిళ్ళను తగ్గించడం

“గర్భవతుల్లో 70 నుండి 80 శాతంమంది వేవిళ్ళ వలన బాధపడుతున్నారని అంచనా వేయబడింది” అని ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక సన్‌-హెరాల్డ్‌ నివేదిస్తోంది. కొత్తగా గర్భం దాల్చిన ఈ స్త్రీలు ఉదయం నిద్ర లేచినప్పుడు వికారం, వాంతులతో బాధపడతారు. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల స్థాయి పెరగడం వల్ల కడుపులో ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి చేయబడడంతో ఆ పరిస్థితి ఏర్పడుతుందని అనుమానించబడుతోంది. అంతేకాక, గర్భవతులకు వాసన గ్రహించగల శక్తి మరింత ఎక్కువగా ఉండడంతో వారికి వికారం, ఒత్తిడి, అలసట కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.” వేవిళ్ళను అన్ని పరిస్థితుల్లోనూ నయం చేసే చికిత్స ఏమీ లేదు అయితే వేడిగా ఉండే ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండడం మంచిది ఎందుకంటే వేడి వికారాన్ని కలుగజేస్తుంది, తగినంత సమయం నిద్రపోవడం, కోసిన నిమ్మకాయ వాసన చూడడం వంటివి చేయమని ఆ వార్తాపత్రిక సూచిస్తోంది. “మంచంమీది నుండి లేవకముందు పల్చని బిస్కెట్‌లను లేదా వట్టి సీరియల్‌ను తినడానికి ప్రయత్నించండి, అన్ని సందర్భాల్లో మంచంపైనుండి మెల్లగా లేవండి, మాంసకృత్తులు సమృద్ధిగావున్న అల్పాహారాలు తింటూ ఉండండి” అని కూడా ఆ వార్తాపత్రిక సలహా ఇస్తోంది. “వేవిళ్ళు కొంత ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తాయి. వేవిళ్ళువుండే స్త్రీలకు గర్భస్రావం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. (g03 4/22)

ఇండియాలో సమాచార మాధ్యమాల పెరుగుదల

నేషనల్‌ రీడర్‌షిప్‌ స్టడీస్‌ కౌన్సిల్‌ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, మూడు సంవత్సరాల్లో అంటే 1999 నుండి 2002 వరకూ గడచిన మూడు సంవత్సరాల్లో ఇండియాలో వార్తాపత్రికలు చదివేవారి సంఖ్య 13.1 కోట్లమంది నుండి 15.1 కోట్లమందికి చేరుకుంది. వార్తాపత్రికలు, పత్రికలు, నియత కాలంలో వచ్చే ఇతర పత్రికలు చదివేవారిని ఒక గుంపుగా పరిగణిస్తే, దేశంలో ముద్రిత ప్రచురణలను చదివేవారు 18 కోట్లమంది ఉన్నారు. వంద కోట్ల కంటే ఎక్కువ జనాభాగల ఇండియాలో 65 శాతం కంటే ఎక్కువమంది అక్షరాస్యులు కావడం వల్ల ముద్రిత ప్రచురణలు చదివేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టీవీ ప్రేక్షకుల సంఖ్య 38.36 కోట్లు కాగా రేడియో శ్రోతల సంఖ్య 68.06 కోట్లు. 1999లో ఇంటర్నెట్‌ను ఉపయోగించిన 14 లక్షలమందితో పోలిస్తే ఇప్పుడు 60 లక్షల కంటే ఎక్కువమంది దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇండియాలో టీవీలు ఉన్న ఇళ్ళలో ఇప్పుడు దాదాపు సగం ఇళ్ళకు కేబుల్‌ టీవీ, ఉపగ్రహ కనెక్షన్‌లు ఉన్నాయి, గత మూడు సంవత్సరాల్లో ఇది 31 శాతం పెరిగింది. (g03 5/08)

రోజరీ పునరుద్ధరణ

“యేసు జీవితానికి, ఆయన తల్లి జీవితానికి సంబంధించిన 15 కీలకమైన సంఘటనలు లేదా ‘మర్మాల’ గురించి ధ్యానించడాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించబడిన రోజరీని అంటే ప్రభువు ప్రార్థనను, మరియ స్తుతిని పునరుచ్ఛరిస్తూ వల్లించే మంత్రంలాంటి ప్రార్థనను రోమన్‌ క్యాథలిక్‌ భక్తులు 500 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు” అని న్యూస్‌వీక్‌ నివేదిస్తోంది. “గత [అక్టోబరులో] పోప్‌ జాన్‌ పాల్‌ II, రోజరీకి నాలుగవ పరంపరను చేరుస్తూ పీఠాధిపతి తాలూకు ఉత్తరాన్ని జారీచేశాడు,” ఆ నాలుగవ పరంపర యేసు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ప్రభువు రాత్రి భోజనం వరకూ ఆయన చేసిన పరిచర్యపై ఆధారపడివుంది. “తనకు ‘ఇష్టమైన’ ప్రార్థనా విధానంలో ఆసక్తిని పునరుద్ధరించడానికి పోప్‌ అలా చేశాడు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ జరిగినప్పటినుండి ఆ ప్రార్థనా విధానంలో ఆసక్తి తగ్గిపోయింది” అని ఆ పత్రిక చెబుతోంది. “కేవలం క్యాథలిక్కుల ద్వారానే ఆచరించబడే ఈ ఆరాధనా పద్ధతి ద్వారా మరియ అంటే ఎక్కువగా రోజరీతోనే గుర్తించబడే స్త్రీ కుమారుడిగా యేసుకు మరింత ప్రాముఖ్యతను జోడించాలన్నదే పోప్‌ చర్య యొక్క ముఖ్యోద్దేశం.” “క్రైస్తవత్వం ప్రాచ్యమతాల ధ్యాన సాంప్రదాయాల ద్వారా ప్రభావితమవుతున్న” ఈ సమయంలో ఈ చర్య క్యాథలిక్కుల మధ్య ధ్యానించే అలవాటును ప్రోత్సహిస్తుందని ఆశించబడుతుందని పోప్‌ వ్యాఖ్యానించాడు. (g03 6/08)

వివాహ విచ్ఛిన్న సంస్థలు

జపాన్‌లో తమ వివాహజతతో సంతోషంగాలేని కొంతమంది తమ వివాహ బంధాలను తెంచడానికి సంస్థలకు డబ్బు చెల్లిస్తున్నారని టోక్యో వార్తాపత్రిక ఐ.హెచ్‌.టి అసాహి షింబున్‌ నివేదిస్తోంది. ఒక భర్త తన భార్యను వదిలించుకోవాలనుకుంటున్నాడు కానీ అతని దగ్గర విడాకులు తీసుకోవడానికి ఆధారమేమీ లేకపోతే, అతను తన భార్యను “అనుకోకుండా” కలుసుకొని ఆమెతో ప్రేమకలాపాన్ని ప్రారంభించేందుకు అందమైన పురుషుడిని పంపించడానికి ‘వివాహ విచ్ఛిన్న’ సంస్థకు డబ్బు చెల్లిస్తాడు. ఎంతోకాలం గడవకముందే ఆ భార్య విడాకులకు ఒప్పుకుంటుంది. తన పని ముగిసిన తర్వాత ఆ కిరాయి ప్రేమికుడు మాయమైపోతాడు. ఒక భార్య తన భర్తకు విడాకులివ్వాలనుకున్నప్పుడు ఆ సంస్థ, అతనిని వలలో వేసుకోవడానికి ఆకర్షణీయమైన ఒక స్త్రీని పంపిస్తుంది. 24 సంవత్సరాల ఒక స్త్రీ తాను కలుసుకునే పురుషులు తనకు “దాదాపు ఎప్పుడూ కాదని చెప్పరు. నేను 85 నుండి 90 శాతం వరకూ సఫలమయ్యానని చెప్పగలను” అని అంటోంది. అలాంటి ఒక సంస్థ అధిపతి, ఐదుసార్లలో మూడుసార్లు విఫలమైన ఉద్యోగులను పనిలోనుండి తీసివేస్తాడు. “వాళ్ళు విజయం సాధించాల్సిందే. ఇది వ్యాపారం” అని ఆయన అన్నాడని ఆ వార్తాపత్రిక నివేదిస్తోంది. (g03 6/22)

వీధి బాలలు​—⁠ఎందుకున్నారు?

“చిన్న పిల్లలు, కౌమారదశలోని పిల్లలు ఇంటినుండి పారిపోయి వీధుల్లో నివసించడానికి ముఖ్య కారణం ఇంట్లో వారిపై చేయబడుతున్న దౌర్జన్యమే” అని బ్రెజిల్‌ వార్తాపత్రిక ఓ ఎస్టాడో డె ఎస్‌. పౌలో చెబుతోంది. రియో డీ జనైరోలో ఉన్న ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అండ్‌ అడోలసెంట్స్‌లో ఆశ్రయం పొందిన 1,000 మంది వీధి బాలలను ఇటీవలే సర్వే చేసినప్పుడు వారిలో 39 శాతం మంది దుష్ప్రవర్తనకు గురయ్యారు లేదా ఇంట్లో కొట్లాటలను చూశారని వెల్లడయ్యింది. “ఈ పిల్లలు గౌరవం కోసం వెదుకుతున్నారు, అది వీధుల్లో లభిస్తుందన్న భ్రమలో ఉన్నారు” అని సామాజికవేత్త లెని స్మిట్జ్‌ చెబుతున్నారు. ఆ పిల్లల్లో 34 శాతంమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి లేదా అడుక్కోవడానికి, 10 శాతంమంది మాదకద్రవ్యాలకు అలవాటుపడినందుకు, 14 శాతంమంది కేవలం తమకు వీధుల్లో నివసించాలి అనిపించింది కాబట్టి వీధుల్లో నివసించడం ప్రారంభించారని ఆ అధ్యయనం వెల్లడి చేసింది. పైన ప్రస్తావించబడిన మూడు కారణాల్లోని ఆఖరి కారణం తరచూ ఇంట్లో లైంగిక అత్యాచారానికి గురికావడం వంటి ఇతర కారణాలను సూచిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీధి బాలల్లోని 71 శాతంమంది ఇతర వీధి బాలలతో కలిసి “తమ సొంత కుటుంబ వ్యవస్థను” సృష్టించుకుని “ఇతర వీధి బాలలను తమ అన్నలుగా లేదా తమ్ముళ్ళుగా, మామయ్యలుగా, తండ్రులుగా లేదా తల్లులుగా పరిగణిస్తారు” అని స్మిట్జ్‌ చెప్పారు. (g03 6/22)