కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రసిద్ధ, అప్రసిద్ధ చిత్రలేఖనం

ప్రసిద్ధ, అప్రసిద్ధ చిత్రలేఖనం

ప్రసిద్ధ, అప్రసిద్ధ చిత్రలేఖనం

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

మీరెప్పుడైనా ఒక మనిషి ముఖాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించారా? అదంత సులభం కాదు. కానీ మీరు ఒకే ఒక్కసారి చూసిన వ్యక్తి, అదికూడా కేవలం కొన్ని నిమిషాలపాటే చూసిన ఒక వ్యక్తి బొమ్మను వేయాల్సి వస్తే ఎలా? మరింత కష్టమైనదేమిటంటే, మీరు చూసిన వ్యక్తిని మీకు జ్ఞాపకమున్న వాటి ఆధారంగా చిత్రీకరించాలి. చివరకు మీరు మీ జ్ఞాపకాల్లో నుండి చిత్రించిన ఆ వర్ణచిత్రం, వేచివున్న టెలివిజన్‌ సిబ్బంది కోసం అరగంటలోపల సిద్ధం చెయ్యాలి!

అంత త్వరగా అలాంటి బొమ్మ వేయాలంటే మనలో చాలా మందికి సాధ్యం కాదు. అయితే బ్రిటన్‌లో ఇలాంటి పనిలో ప్రత్యేక నైపుణ్యత గల కొందరు స్త్రీపురుషులు ఉన్నారు. ఎవరు వారు? కోర్టు కళాకారులు.

చట్టపరమైన ఆంక్షలు

కోర్టు కేసులు ప్రజల ఆసక్తిని త్వరగా చూరగొంటాయి, ఇలాంటి కేసుల్లో సాధారణంగా టెలివిజన్‌ కవరేజ్‌, ఫోటోగ్రాఫిక్‌ కవరేజ్‌ చాలా దేశాల్లో ఉంటాయి. అయితే బ్రిటన్‌లో పరిస్థితి వేరు. ప్రజలు “కోర్టు గదిని గానీ కోర్టులోని ఏ వ్యక్తిని గానీ ఫోటో” తీయకూడదు, అంటే జడ్జీలను, జూరీ సభ్యులను, చివరకు ప్రతివాది లేక ఖైదీల సాక్షులను కూడా తీయకూడదు. * ఇలాంటి సందర్భంలోనే కోర్టు కళాకారుని హస్తముంటుంది, కోర్టులో జరిగినదాన్ని మీడియా కోసం మనసులో రికార్డుచేసుకుంటాడు.

అద్భుతమైన ఈ కళ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి నేను లండన్‌లో జరిగిన ఒక ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్ళాను. జనాకర్షణ పొందిన ఒక స్టాండు వద్ద బేత్‌ అనే ఒకావిడను కలిశాను, ఆమె ఈ ప్రత్యేక నైపుణ్యతగల కళాకారుల్లో ఒకరు. “ప్రతివాదిని చూసేందుకు మీకు ఎంత సమయం ఉంటుంది?” అని నేను మొదటి ప్రశ్న వేశాను.

సమయము, సంకల్పము

“తొలి విచారణ కోసం బోనులో ఒక ఖైదీ నిలబడినప్పుడు, అతను రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడు, అయినా నాకా సమయం చాలు,” అంటూ బేత్‌ నమ్మకంగా చెప్పింది. “అతని తలను, దువ్వుకున్న విధానాన్ని, అతని ముక్కు తీరును, కండ్లను, పెదవులను, నోటిని గమనించేందుకు అవకాశం లభిస్తుంది. ముఖం వెడల్పును, నుదుటి పొడవును, చెవుల సైజులతోపాటు గెడ్డం, కళ్ళజోడు వంటి వాటిని మనసులోనే గుర్తుంచుకోవాలి. అప్పుడే నా దగ్గర సరైన చిత్రాన్ని వేయడానికి కావలసిన ప్రాథమిక సమాచారం ఉన్నట్లు.

“కొన్నిసార్లు అలా చిత్రీకరించడం చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు ఇటీవలి ఒక కేసులో, బోనులో 12 మంది నిలబడ్డారు! వాళ్ళు దాంట్లో 15 నిమిషాల పాటు ఉన్నారనుకోండి, కానీ 12 మంది ముఖాలు గుర్తుంచుకోవాలంటే చాలా ఏకాగ్రత కావాలి. నేను చూసిన దాన్ని బాగా గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి నాలో ఉంది, అయితే నేను ఆ శక్తిని సంవత్సరాలపాటు కష్టపడి పెంపొందించుకున్నాను. నేను కోర్టు గది నుండి వచ్చేటప్పుడు, నేను కళ్ళు మూసుకున్నానంటే చాలు, నేను చూసిన ముఖాలను స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటాను.”

“మీకు కోర్టులో ఎదురైన వారి గురించి పరిశోధించడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు?” అని మరో ప్రశ్న అడిగాను. బేత్‌ జవాబు నన్ను అబ్బురపరచింది.

“రిపోర్టరు చేసినట్లు నేను అసలు పరిశోధనే చేయను. నేను కోర్టుకు ఎటువంటి ఆలోచనలు లేకుండా నిర్మలమైన మనస్సుతో వెళ్తాను, నా పని గురించి ఎలాంటి ఊహాగానాలు చేయకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. ప్రతిదినం విభిన్న ముఖాలుండే ప్రజలతో జరిగే కోర్టు కార్యకలాపాలను రికార్డు చేసుకునేందుకు నేను కృషి చేస్తాను. నేను వేసిన బొమ్మలు టెలివిజన్‌లో గానీ వార్తాపత్రికల్లో గానీ వచ్చినప్పుడు వాటిని జూరీ కూడా చూసే అవకాశముందని నేను గుర్తుంచుకోవాలి, వాళ్ళలా చూసినప్పుడు ఎవరికైనా ‘ప్రతివాది ముఖంలో అపరాధ భావముందేమిటబ్బా!’ అని అనిపించడం నాకిష్టం లేదు. ఈ ప్రాముఖ్యమైన అంశంలో కోర్టు కళ, వర్ణ చిత్రలేఖనం కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది.”

“ఆ క్షణం”

తన విజయానికి రహస్యమేమిటని నేను బేత్‌ను అడిగినప్పుడు, ఆమె ఇలా సమాధానమిచ్చింది: “నేను ఒక క్షణం కోసం చూస్తాను​—⁠‘ఆ క్షణం’​—⁠జరుగుతున్న కార్యకలాపాలను బంధిస్తుంది. ఉదాహరణకు నిందితుడు తన తలను చేతులతో కప్పుకున్నప్పుడు, కేసు అతనికి సానుకూలంగా లేదని అతని భంగిమ తెలియజేస్తుంది. మరో సందర్భంలో ‘మీరొక మంచి తల్లేనా?’ అని ఒక స్త్రీని అడిగిన ప్రశ్నకు, ఆమె ఇచ్చిన జవాబుకంటే చక్కగా ఆమె ముఖ కవళికలే ఆ కేసు తనకు సానుకూలంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అదే విధంగా చేతి రుమాలుతో కన్నీటిని తుడుచుకోవడం ఆ వ్యక్తి భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంది.

“ఒక కోర్టు కళాకారుడు కోర్టు గదిలోని వాతావరణాన్ని కూడా గుర్తుంచుకోవాలి, అంటే జడ్జి, లాయర్లు, కోర్టులో పనిచేసేవారితోపాటు పుస్తకాలు, లైట్లు, ఫర్నిచర్‌ వంటి వాటన్నింటినీ చిత్రీకరించాలి. అలా అన్నింటినీ గమనించే అవకాశం చాలామందికి లభించదు కాబట్టి ఆ చిత్రం వారికి ఆకర్షణీయంగా ఉంటుంది. నేను నా చిత్రాలను ఎక్కడ వేస్తాను? కొన్నిసార్లు కోర్టు విషయాలను పత్రికావిలేఖరులకు తెలియజేసే గదిలో, కానీ ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండే మెట్లమీద ఎక్కడైనా కూర్చొని వేస్తాను. అయితే మరో కొత్త సాక్షిని గానీ ప్రతివాది లాయరును గానీ కోర్టు పిలిస్తే నేను నా చిత్రంలో ఆ కొత్త ముఖాలను చేర్చడానికి వెంటనే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది.” బేత్‌ నవ్వుతూ ఇంకా ఇలా అంది: “నేను వేసిన అనేక చిత్రాలు లాయర్ల కార్యాలయాల్లో గోడలకు వేలాడదీయబడివున్నాయని నాకు తెలుసు.”

అక్కడ ప్రదర్శనకు పెట్టిన ఆమె చిత్రాలను నేను ఆసక్తిగా చూశాను. అవి నేను ఇటీవలి సంవత్సరాల్లో పత్రికల్లో చదివిన వివిధ కోర్టు కేసులను నా మనసులోకి తెచ్చాయి, వాటిలో ప్రసిద్ధమైనవి ఉన్నాయి అప్రసిద్ధమైనవి ఉన్నాయి. దాదాపు పది నిమిషాల తర్వాత నేను అక్కడ నుండి బయల్దేరడానికి సన్నద్ధమవుతుంటే, బేత్‌ స్నేహపూర్వకంగా నా చేతికొక చిత్రాన్ని ఇచ్చింది. అది నాదే. (g03 4/8)

[అధస్సూచి]

^ ఇది స్కాట్‌లాండ్‌కు వర్తించదు.

[24, 25వ పేజీలోని చిత్రాలు]

కోర్టు గది చిత్రం, అది ఒక వార్తాపత్రికలో కనబడిన తీరు (ఎడమ)

[చిత్రసౌజన్యం]

© The Guardian