కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మామూలుదే అయినా ఎంతో ప్రజాదరణగల వేరుసెనగ

మామూలుదే అయినా ఎంతో ప్రజాదరణగల వేరుసెనగ

మామూలుదే అయినా ఎంతో ప్రజాదరణగల వేరుసెనగ

మీకు వేరుసెనగలు ఇష్టమా? అలాగైతే, మీరొక్కరే లేరు. మానవ కుటుంబంలో ఎంతోమంది వేరుసెనగలు తినడానికి ఇష్టపడతారు. భూమ్మీద అత్యధిక జనాభాగల దేశాలైన చైనా, ఇండియా కలిసి ప్రపంచవ్యాప్త వేరుసెనగ పంటలో 50 కంటే ఎక్కువ శాతాన్ని పండిస్తున్నాయి.

అమెరికా వార్షికంగా కోట్లాది కిలోల వేరుసెనగను అంటే ప్రపంచంలోని మొత్తం పంటలో దాదాపు 10 శాతాన్ని పండిస్తుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌, మలావీ, నైజీరియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా, సూడాన్‌ దేశాలు వేరుసెనగను భారీ ఎత్తున పండిస్తాయి. వేరుసెనగ ఇంత ప్రజాదరణ ఎలా సంపాదించుకుంది? వేరుసెనగలను తినకుండా ఉండవలసిన పరిస్థితులేమైనా ఉంటాయా?

సుదీర్ఘ చరిత్ర

వేరుసెనగ మొక్కకు మూలం దక్షిణ అమెరికా అని భావించబడుతోంది. వేరుసెనగలపై మానవునికున్న మక్కువను తెలియజేసే కళాకృతుల్లో ఇప్పటివరకూ లభించినవాటిలో పెరూలో కనుగొనబడిన పూలజాడీ అతిపురాతనమైనది. ఆ జాడీ వేరుసెనగ ఆకారంలో ఉండడమే కాక దానిపై వేరుసెనగ ఆకారపు చిత్రాలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో మొదటిసారిగా వేరుసెనగను కనుగొన్న స్పానిష్‌ అన్వేషకులు అవి తమ ప్రయాణాల్లో భుజించడానికి మంచి పోషకాహారమని గ్రహించారు. ఆ తర్వాత కొన్నింటిని వారు యూరప్‌కు తీసుకువెళ్ళారు. యురోపియన్‌లు వేరుసెనగ గింజలను ఇతర విధాలుగా ఉపయోగించడం ప్రారంభించి వాటిని కాఫీ గింజలకు ప్రత్యామ్నాయంగా కూడా వాడారు.

ఆ తర్వాత పోర్చుగీసువారు వేరుసెనగను ఆఫ్రికాకు పరిచయం చేశారు. అక్కడ ఇతర పంటలు పండించడానికి అనువుకాని బంజరు భూమిలో కూడా పెరిగే వేరుసెనగలు విలువైన ఆహార మూలమని వారు వెంటనే గుర్తించారు. నిజానికి వేరుసెనగ మొక్కలు ఫలవంతంకాని భూమికి ఎంతో అవసరమైన నైట్రోజన్‌ను అందించి దాన్ని ఫలవంతమైన నేలగా మారుస్తాయి. చివరకు, బానిసల వ్యాపార కాలంలో వేరుసెనగ ఆఫ్రికా నుండి ఉత్తర అమెరికాకు చేరుకుంది.

1530లలో వేరుసెనగ పోర్చుగీస్‌ ప్రజలతోపాటు ఇండియాకు, మాకాకు ప్రయాణించింది, స్పానిష్‌ ప్రజలు దాన్ని ఫిలిప్పీన్స్‌కు చేరవేశారు. ఆ తర్వాత వ్యాపారులు వేరుసెనగను ఈ దేశాల నుండి చైనాకు పరిచయం చేశారు. కరువు భారం మోయడంలో వేరుసెనగ పంట తమ దేశానికి సహాయపడగలదని చైనా దేశస్థులు గుర్తించారు.

1700లకు చెందిన వృక్షశాస్త్రవేత్తలు నేల సెనగలని వారు పిలిచిన వేరుసెనగలను అధ్యయనం చేసి అవి పందులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయనే ముగింపుకు వచ్చారు. 1800ల తొలికాలంకల్లా అమెరికాలోని సౌత్‌ కెరోలినాలో వేరుసెనగలు వాణిజ్య పంటగా పండించబడడం ప్రారంభమయ్యింది. 1861లో ప్రారంభమైన అమెరికన్‌ సివిల్‌ యుద్ధ సమయంలో వేరుసెనగలు ఇరుపక్షాల సైనికులకు ఆహారంగా ఉపయోగపడ్డాయి.

అయితే ఆ సమయంలో వేరుసెనగలు పేదవారి ఆహారమని చాలామంది భావించేవారు. ఆ కాలంలోని అమెరికా రైతులు మనుష్యులకు ఆహారంగా ఉపయోగపడేందుకు వేరుసెనగలను పండించకపోవడానికి కారణాన్ని అది కొంతవరకూ వివరిస్తోంది. అంతేకాక దాదాపు 1900లో యాంత్రిక సాధనాలు తయారుచేయబడకముందు వేరుసెనగలను పండించడానికి ఎంతోమంది పనివారు అవరసమయ్యేది, ఎంతో డబ్బు ఖర్చయ్యేది.

కానీ 1930 కల్లా అమెరికాకు చెందిన అగ్రగామి వ్యవసాయ శాస్త్రవేత్త జార్జ్‌ వాషింగ్టన్‌ కార్వర్‌ వేరుసెనగ మొక్కకు సంబంధించిన కొత్త ఉపయోగాల విషయంలో పరిశోధన ప్రారంభించాడు. చివరకు ఆయన వేరుసెనగ మొక్క నుండి పానీయాలు, సౌందర్య సాధనాలు, అద్దకపు రంగులు, మందులు, బట్టలుతికే సబ్బు, క్రిమిసంహారకాలు, ముద్రించడానికి ఉపయోగించే సిరాతో సహా 300 కంటే ఎక్కువ ఉత్పత్తుల్ని రూపొందించాడు. భూమి సారాన్ని తగ్గించివేసే పత్తి పంటను మాత్రమే పండించే అలవాటు మానుకొని పత్తితోపాటు పర్యాయపంటగా వేరుసెనగ పండించమని కూడా కార్వర్‌ స్థానిక రైతులను ప్రోత్సహించాడు. ఆ సమయంలో బాల్‌ వీవిల్‌ చీడపురుగు పత్తి పంటను నాశనం చేస్తుండడం వల్ల చాలామంది రైతులు కార్వర్‌ సలహా పాటించడానికి ప్రేరేపించబడ్డారు. దాని ఫలితం?

వేరుసెనగ పంట ఎంత లాభదాయకంగా తయారయ్యిందంటే అది అమెరికాలోని దక్షిణ భాగంలో ప్రాముఖ్యమైన వాణిజ్య పంటగా మారింది. నేడు అలబామాలోని డోథాన్‌లో కార్వర్‌ జ్ఞాపకార్థం నిర్మించబడిన స్మారక శిల్పం ఉంది. అలబామాలోని ఎంటర్ప్రైస్‌ నగరంలో బాల్‌ వీవిల్‌ చీడపురుగు జ్ఞాపకార్థం కూడా ఒక స్మారక చిహ్నం నిర్మించబడింది ఎందుకంటే ఆ చీడపురుగు పత్తి పంటను నాశనం చేయడంవల్లనే రైతులు వేరుసెనగ పంటను పండించడానికి ప్రేరేపించబడ్డారు.

వేరుసెనగను పండించడం

వేరుసెనగలు నిజానికి సెనగలు కావు, అవి వేరుసెనగ మొక్క విత్తనాలు. ఆ మొక్క పెరుగుతుండగా దానికి పసుపుపచ్చ పువ్వులు పూస్తాయి, ఆ పువ్వులు స్వయంగా పరాగ సంపర్కం చేసుకుంటాయి.

పెగ్‌ అని పిలువబడే కాండపు చివరి భాగంలో ఉండే బీజకోశంలో భ్రూణం ఉంటుంది, ఆ కాండం భూమిలోకి చొచ్చుకొనిపోవడం ప్రారంభిస్తుంది. నేలలో ఆ భ్రూణం ఉపరితలానికి సమాంతరంగా వ్యాపించి భూమిలోపలే పరిపక్వమవడం ప్రారంభించి మనందరికీ బాగా తెలిసిన వేరుసెనగ ఆకారం సంతరించుకుంటుంది. ఒక్క మొక్కకు 40 వరకూ వేరుసెనగ కాయలు కాయవచ్చు.

వేరుసెనగ మొక్కలకు వెచ్చని సూర్యకాంతిగల, తగుమాత్రం వర్షం కురిసే రుతువులు ఇష్టం. మొక్కలు నాటడం నుండి పంట కోయడం వరకూ 120 నుండి 160 రోజులు పట్టవచ్చు, అది పండించే వేరుసెనగ రకంపై మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడివుంటుంది. వేరుసెనగ పంటను కోయడానికి రైతులు నేలను త్రవ్వి వేర్లతో సహా మొక్కను బైటకు తీసి, వేరుసెనగలు పాడైపోకుండా భద్రపరచడానికి వీలుగా మొక్కలను తల క్రిందులుగా పెట్టి ఎండబెట్టాలి. నేడు చాలామంది రైతులు నేలను త్రవ్వి మొక్కలను బైటకు తీసి, వాటికున్న మట్టిని దులిపివేసి, తలక్రిందులుగా ఎండబెట్టడం వంటి పనులన్నీ ఒకే ప్రక్రియలో చేసే ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

వేరుసెనగ యొక్క అనేక ఉపయోగాలు

వేరుసెనగ పోషక విలువ అద్భుతమైనది. వేరుసెనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఆధునిక ఆహారంలో లోపించే 13 విటమిన్లు మరియు 26 ఖనిజాలు వేరుసెనగల్లో ఉన్నాయి. “ఎద్దు కాలేయాన్ని వేరుసెనగలను సమపాళ్ళలో తీసుకుంటే వేరుసెనగల్లోనే ఎక్కువ మాంసకృత్తులు, ఖనిజాలు ఉంటాయి” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. కానీ శరీర బరువు గురించి చింతించేవారు జాగ్రత్తగా ఉండాలి! వేరుసెనగల్లో “చిక్కని మీగడ కంటే ఎక్కువ క్రొవ్వు పదార్థం ఉంటుంది” అలాగే “చెక్కర కంటే ఎక్కువ (కాలరీలు) ఉంటాయి.”

అనేక విభిన్నమైన దేశాలకు చెందిన వంటకాల్లో వేరుసెనగలు ఉపయోగించబడతాయి. వాటి ప్రత్యేకమైన రుచిని ఇట్టే గుర్తుపట్టవచ్చు. “వేరుసెనగ రుచి ఎంత మధురంగా, ఎంత విలక్షణంగా ఉంటుందంటే, నూరిన వేరుసెనగలు కలిసిన వంటకాలన్నింటికీ ఒకేలాంటి రుచి ఉంటుంది” అని వంటకాల రచయిత్రి అన్యా వాన్‌ బ్రెమ్జెన్‌ చెబుతోంది. “కాబట్టి ఇండోనేషియన్‌ వేరుసెనగ సాస్‌, దక్షిణ ఆఫ్రికా సూప్‌, చైనీస్‌ నూడుల్స్‌, పెరూవియన్‌ స్ట్యూ, వేరుసెనగ వెన్న (పీనట్‌ బట్టర్‌)తో చేసిన సాండ్‌విచ్‌ల రుచిలో సారూప్యత కనిపిస్తుంది.”

వేరుసెనగలు ప్రపంచవ్యాప్త ప్రజలకు ఇష్టమైన అల్పాహారం కూడా. ఉదాహరణకు ఇండియాలో వేరుసెనగలను ఇతర కాయధాన్యాలతో కలిపి అల్పాహారంగా వీధుల్లో అమ్ముతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ద గ్రేట్‌ అమెరికన్‌ పీనట్‌ అనే పుస్తకం ప్రకారం, కొన్ని దేశాల్లో సాధారణంగా సాండ్‌విచ్‌ మధ్య ఉపయోగించే వేరుసెనగ వెన్న “దాదాపు 1890లో సెయింట్‌ లూయిస్‌కు [అమెరికా] చెందిన వైద్యుని ద్వారా వృద్ధుల కోసం ఎంతో ఆరోగ్యవంతమైన ఆహారంగా రూపొందించబడింది” అని తలంచబడుతోంది.

అయితే వేరుసెనగలు ఆహారంగా ఉపయోగపడడమే కాక అనేక ఇతర విధాలుగా కూడా ఉపయోగపడతాయి. ఆసియా అంతటిలోను వంట నూనె తయారీలో వేరుసెనగలు ప్రధానంగా ఉపయోగించబడతాయి. వేరుసెనగ నూనె బాగా మరిగిన తర్వాత కూడా దానితో వంట చేయవచ్చు, దానిలో వండిన పదార్థాల రుచిని అది పీల్చుకోదు.

బ్రెజిల్‌లో వేరుసెనగ నూనె తయారుచేయబడిన తర్వాత మిగిలిన వేరుసెనగ పిప్పి పశువులకు ఆహారంగా ఉపయోగించబడుతుంది. అంతేకాక ప్రతీరోజు మనం ఉపయోగించే సరుకుల్లో కూడా వేరుసెనగ ఉత్పత్తులు ఉంటాయి.​—పైన చూడండి.

జాగ్రత్త​—వేరుసెనగ అలర్జీ!

వేరుసెనగలను శీతలీకరించకుండానే ఎంతో కాలంపాటు నిల్వచేయవచ్చు. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. బూజు పట్టిన వేరుసెనగల్లో అఫ్లాటాక్సిన్‌ ఉంటుంది అది క్యాన్సర్‌ కలుగజేసే బలమైన కారకం. అంతేకాక కొందరికి వేరుసెనగ అలర్జీ ఉంటుంది. అలాంటి అలర్జీలు “ముక్కు కారడం, చర్మంపై దద్దుర్లు రావడమే కాక ప్రాణాంతకమైన అనాఫిలాక్టిక్‌ షాక్‌కు సంబంధించిన రోగలక్షణాలను కూడా కలుగజేయగలదు” అని ప్రివెన్షన్‌ అనే పత్రిక నివేదిస్తోంది. చిన్నపిల్లలకు వేరుసెనగ అలర్జీ రావడం సర్వసాధారణమైపోతుందని అనేక అధ్యయనాలు సూచించాయి.

ఒక పిల్లవాని తల్లిదండ్రులిద్దరికీ ఉబ్బసం, అలర్జిక్‌ రినైటిస్‌ లేదా ఎగ్జిమా ఉంటే ఆ పిల్లవానికి వేరుసెనగ అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రివెన్షన్‌ నివేదిస్తోంది.

అలర్జీలతో బాధపడే తల్లులకు పుట్టిన శిశువులకు, పుట్టిన మొదటి సంవత్సరంలోనే పాల అలర్జీ పెంపొందించుకునే శిశువులకు కూడా వేరుసెనగ అలర్జీ వచ్చే అవకాశముంది. “ఇలాంటి కుటుంబాలు తమ శిశువులకు మూడు సంవత్సరాలు వచ్చే వరకూ వేరుసెనగ వెన్న పెట్టకుండా ఉంటే మంచిది” అని అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంలో పెడ్యాట్రిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన డా. హగ్‌ సాంప్సన్‌ చెబుతున్నారు.

మీరు వేరుసెనగ ప్రియులైనా కాకపోయినా, వేరుసెనగ యొక్క అనేక ఉపయోగాల గురించి ఇలా తెలుసుకోవడం ద్వారా మామూలుదే అయినా ఎంతో ప్రజాదరణగల ఈ విత్తనం పట్ల మీ గౌరవం బహుశా పెరిగివుంటుంది. (g03 4/22)

[28వ పేజీలోని బాక్సు/చిత్రం]

వేరుసెనగ ఉత్పత్తులు ప్రతిదిన జీవితంలో ఉపయోగించే అనేక సరుకుల్లో కనిపించవచ్చు

• వాల్‌బోర్డు

• కుంపటిలో కాల్చడానికి ఉపయోగించే కొయ్యదుంగలు

• పెంపుడు పిల్లులు పడుకోవడానికి ఉపయోగించే పరుపు

• కాగితాలు

• డిటర్జెంట్‌

• తైలం

• మెటల్‌ పాలిష్‌

• బ్లీచ్‌

• సిరా

• ఆక్సెల్‌ గ్రీస్‌

• షేవింగ్‌ క్రీము

• ఫేస్‌ క్రీము

• సబ్బు

• లినోల్యమ్‌

• రబ్బర్‌

• సౌందర్య సాధనాలు

• పెయింట్‌

• పేలుడు పదార్థాలు

• షాంపూ

• మందులు

[చిత్రసౌజన్యం]

మూలం: ద గ్రేట్‌ అమెరికన్‌ పీనట్‌

[26వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆకులు

పెగ్‌

భూస్థాయి

వేళ్ళు వేరుసెనగ

[చిత్రసౌజన్యం]

The Peanut Farmer magazine

[26వ పేజీలోని చిత్రం]

జార్జ్‌ వాషింగ్‌టన్‌ కార్వర్‌ స్మారక శిల్పం

[27వ పేజీలోని చిత్రం]

అమెరికా

[27వ పేజీలోని చిత్రం]

ఆఫ్రికా

[27వ పేజీలోని చిత్రం]

ఆసియా

[చిత్రసౌజన్యం]

FAO photo/R. Faidutti

[27వ పేజీలోని చిత్రం]

వేరుసెనగ అల్పాహారాల్లో కొన్ని రకాలు

[28వ పేజీలోని చిత్రం]

కొన్ని దేశాల్లో వేరుసెనగ వెన్న ఎంతో ప్రజాదరణగల ఆహారపదార్థం