కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జాతి విద్వేషం సమర్థనీయమా?

జాతి విద్వేషం సమర్థనీయమా?

బైబిలు ఉద్దేశము

జాతి విద్వేషం సమర్థనీయమా?

మీరు ఒక నిర్దిష్టమైన జాతివర్గ ప్రజలు కావడం వల్ల మిమ్మల్ని మోసకారులు, దౌర్జన్యం చేసేవారు, మూర్ఖులు, నైతికతలేనివారు అని ఇతరులు అనుకుంటుంటే మీరెలా భావిస్తారు? * మీరు తప్పకుండా కోపగించుకుంటారు. విచారకరంగా లక్షలాదిమందికి అలాంటి అనుభవమే ఎదురౌతోంది. అంతేకాదు, మానవ చరిత్రంతటిలో లెక్కలేనంత మంది అమాయకులు కేవలం వారి జాతి లేదా జాతీయత కారణంగా దురాచారానికి, చివరకు హత్యకు కూడా గురయ్యారు. నిజానికి నేడు జరుగుతున్న అనేక రక్తపాత పోరాటాలకు మూలకారణం జాతి విద్వేషమే. అయినా అలాంటి దౌర్జన్యానికి మద్దతిచ్చే వారిలో చాలామంది నిజానికి దేవుని మీద బైబిలు మీద నమ్మకముందని చెప్పుకునేవారే. జాతివాదమనేది మానవ నైజంలోనే ఉందని వాదించేవారూ ఉన్నారు.

అలాంటి జాతి విద్వేషాన్ని బైబిలు మన్నిస్తోందా? సాంస్కృతికపరంగా లేక జాతిపరంగా భిన్నమైనవారిని ద్వేషించడాన్ని సమర్థించే పరిస్థితులేవైనా ఉన్నాయా? జాతి విద్వేషంలేని భవిష్యత్తు నిరీక్షణ ఏదైనా ఉందా? బైబిలు ఉద్దేశమేమిటి?

వారి క్రియలనుబట్టి వారు తీర్పుతీర్చబడ్డారు

దేవుడు మానవాళితో వ్యవహరించిన తొలి విధానాలను పైపైన చూడడం, నిజానికి దేవుడు జాతి విద్వేషానికి మద్దతిచ్చాడనే తప్పుడు అభిప్రాయానికి దారితీయవచ్చు. కొన్ని బైబిలు వృత్తాంతాలు దేవుణ్ణి ఆయాతెగలను, జనాంగాలను పూర్తిగా సంహరించిన దేవునిగా చిత్రీకరించడం లేదా? నిజమే, కానీ వాటిని సునిశితంగా పరిశీలిస్తే, ఆ ప్రజలు నైతికత విషయంలో దైవ నియమాలను నిర్లక్ష్యం చేసినందుకు దేవుడు వారికి తీర్పుతీర్చాడే గాని, వారి జాతి నేపథ్యాన్ని బట్టి కాదని బోధపడుతుంది.

ఉదాహరణకు, కనానీయుల హేయమైన లైంగిక, పైశాచిక ఆచారాల కారణంగా యెహోవా దేవుడు వారిని ఖండించాడు. వారు అబద్ధ దేవుళ్ళకు పిల్లలను దహనబలిగా కూడా అర్పించారు. (ద్వితీయోపదేశకాండము 7:5; 18:9-12) అయితే కొన్ని సందర్భాల్లో కొందరు కనానీయులు దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించి మారుమనస్సు పొందారు. ఆ కారణంగా యెహోవా వారి ప్రాణాలు కాపాడి వారిని ఆశీర్వదించాడు. (యెహోషువ 9:3, 25-27; హెబ్రీయులు 11:31) కనానీయురాలైన రాహాబు, వాగ్దానం చేయబడిన మెస్సీయా అయిన యేసుక్రీస్తుకే పూర్వీకురాలైంది.​—మత్తయి 1:5.

దేవుడు పక్షపాతి కాదని ఆయన ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రం చూపిస్తోంది. దానికి భిన్నంగా ఆయన ప్రజలందరి సంక్షేమం పట్ల నిజమైన చింత కనబరుస్తున్నాడు. లేవీయకాండము 19:33, 34 లో దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన సానుభూతికరమైన ఈ ఆజ్ఞ మనకు కనబడుతుంది: “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.” ఇలాంటి ఆజ్ఞలే నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండములలో కనబడతాయి. అందువల్ల, యెహోవా జాతి విద్వేషాన్ని సమర్థించడన్నది సుస్పష్టం. ఆయన జాతి సామరస్యాన్ని నొక్కిచెప్పాడు.

యేసు జాతి సహనాన్ని ప్రోత్సహించాడు

యేసు భూమ్మీద ఉన్నప్పుడు, యూదులు సమరయులు ఒకరినొకరు తృణీకరించుకోవడానికి మొగ్గుచూపేవారు. ఒకసారి సమరయుల గ్రామములోని ప్రజలు యేసు యెరూషలేముకు వెళ్తున్న యూదుడనే కారణంతో ఆయనను గ్రామంలోనికి రానివ్వలేదు. అలాంటి తిరస్కారానికి మీరెలా స్పందించేవారు? యేసు శిష్యులు “ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా” అని అడిగినప్పుడు, ఆ కాలంలో ఉన్న వివక్షలను వారు ప్రతిబింబించివుండవచ్చు. (లూకా 9:51-56) యేసు తన శిష్యుల క్రోధ స్వభావం తనను ప్రభావితం చేసేందుకు అనుమతించాడా? దానికి భిన్నంగా ఆయన వారిని గద్దించి, శాంతియుతంగా మరొక గ్రామంలో బస కోసం ప్రయత్నించాడు. దాని తర్వాత కొద్దిరోజులకే యేసు, మంచి పొరుగువాడైన సమరయుని ఉపమానం చెప్పాడు. కేవలం ఒక వ్యక్తి జాతి నేపథ్యం ఆయననొక శత్రువుగా చేయదని, ఆ వ్యక్తి ఒక మంచి పొరుగువాడు కూడా కావచ్చునని ఆ ఉపమానం విస్పష్టం చేసింది!

క్రైస్తవ సంఘంలో జాతివర్గాలు

యేసు తన భూ పరిచర్యలో, ముఖ్యంగా తన జాతీయులనే శిష్యులను చేయడంపై దృష్టి కేంద్రీకరించాడు. కానీ ఇతరులు కూడా చివరకు తన శిష్యులుగా మారతారని ఆయన సూచించాడు. (మత్తయి 28:19) అన్ని జాతివర్గాల్లోని వ్యక్తులు అంగీకరించబడతారా? అవును! అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) అటు తర్వాత అపొస్తలుడైన పౌలు, క్రైస్తవ సంఘంలో ఒక వ్యక్తి జాతి నేపథ్యం ప్రాముఖ్యం కాదని స్పష్టంగా పేర్కొంటూ ఈ భావనను మరింత బలపరిచాడు.​—కొలొస్సయులు 3:11.

దేవుడు అన్ని జాతివర్గాల ప్రజలను అంగీకరిస్తాడనే సూచన బైబిలు పుస్తకమైన ప్రకటనలో కూడా కనబడుతుంది. అపొస్తలుడైన యోహాను దైవ ప్రేరేపిత దర్శనంలో, దేవుని రక్షణ పొందిన “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన . . . యొక గొప్పసమూహము[ను]” చూశాడు. (ప్రకటన 7:9, 10) ఈ “గొప్పసమూహము” నూతన మానవ సమాజానికి పునాది వంటిది, అందులో అన్ని నేపథ్యాల ప్రజలు తమకు దేవుని పట్లగల ప్రేమ ద్వారా కలిసిమెలిసి శాంతియుతంగా ఐక్యంగా జీవిస్తారు.

ఈ మధ్యకాలంలో, క్రైస్తవులు జాతి నేపథ్య కారణంగా ఇతరులను విమర్శించే స్వభావాన్ని నిరోధించాలి. దేవుడు దృష్టించినట్లే, ప్రజలను కేవలం జాతివర్గాల సభ్యులుగా కాక ఆయా వ్యక్తులుగా దృష్టించడం న్యాయమైనది, ప్రేమపూర్వకమైనది. మిమ్మల్ని అలాగే చూడాలని మీరు కోరుకోరా? యేసు తగినరీతిలోనే మనల్నిలా ఆదేశిస్తున్నాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) జాతి విద్వేషం లేకుండా జీవించడం ఆహ్లాదకరంగా ఉంటుంది. అది గొప్ప మనశ్శాంతిని, ఇతరులతో సమాధానాన్ని చేకూరుస్తుంది. మరింత ముఖ్యంగా అది పక్షపాతంలేని మన సృష్టికర్తయైన యెహోవా దేవునితో మనకు సామరస్యాన్ని కలుగజేస్తుంది. జాతి విద్వేషాన్ని నిరోధించేందుకు అదెంత బలమైన కారణమో కదా! (g03 8/8)

[అధస్సూచి]

^ ఈ ఆర్టికల్‌లో ఉపయోగించబడిన “జాతివర్గం” అనే మాట సమరూపమైన జాతి, జాతీయత, తెగ, సంస్కృతులుగల ప్రజలను సూచిస్తుంది.