నేను ఇద్దరు యజమానులకు సేవచేయడానికి ప్రయత్నించాను
నేను ఇద్దరు యజమానులకు సేవచేయడానికి ప్రయత్నించాను
కెన్ పేన్ చెప్పినది
నేను 1938లో జన్మించాను, అమెరికాలోని న్యూ మెక్సికోలో మా తాతగారి వ్యవసాయ క్షేత్రంలో నేను పెరిగాను. వాగులు, పచ్చిక బయళ్ళతో 24,000 ఎకరాలుండే ఆ వ్యవసాయ క్షేత్రం కొండల దగ్గర ఉండేది. గొర్రెలు, పశువులు, గుర్రాలు, కౌబాయ్‌ల బూట్ల చప్పుళ్ళు నాకు ఇంకా గుర్తున్నాయి. కొన్నిసార్లు గడ్డిమీదుగా వీచే గాలి శబ్దాన్ని, దానికి భిన్నంగా కిల్‌డీర్ పక్షులు నీళ్ల తొట్టిచుట్టూ చేరి చేసే అలజడిని నేను వినేవాడిని.
ఒక వ్యక్తి జీవితపు తొలి ప్రభావాలు ఆ వ్యక్తిపై ప్రగాఢమైన, శాశ్వతమైన ముద్రవేస్తాయి. నేను మా తాతగారితో ఎక్కువ సమయం గడిపేవాడిని, ఆయన అమెరికా పశ్చిమ ప్రాంతం గురించి భలే కథలల్లి చెప్పేవారు. బిల్లి ద కిడ్ అనే చట్ట బహిష్కృతుడు వరుస హత్యలకు పేరుగాంచి, ఆ తర్వాత 1881లో 21 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు, అతనితోపాటు తిరిగిన ప్రజలు కూడా మా తాతగారికి తెలుసు.
నా తల్లిదండ్రులు యెహోవాసాక్షులు, క్రైస్తవ పరిచర్య కోసం దూరంగావున్న వ్యవసాయ క్షేత్రాలకు, హొండో లోయలో పచ్చి ఇటికలతో కట్టిన మామూలు ఇళ్ళకు వెళ్లేటప్పుడు వారు తమతోపాటు నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. వారు తరచు జె. ఎఫ్. రూధర్‌ఫోర్డ్ మాట్లాడిన బైబిలు రికార్డింగ్‌వున్న ఫోనోగ్రాఫ్ ఉపయోగించేవారు, ఆ రికార్డింగ్‌లు నా మదిలో ముద్రించుకుపోయాయి. * ఆయన ప్రసంగాలను మేము అన్ని రకాల ప్రజలకు అంటే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారికి, మెక్సికన్ రైతులకు, అపాచి మరియు ప్యుబ్లోస్ వంటి అమెరికన్ ఇండియన్లకు వినిపించేవాళ్ళం. పత్రికలతో చేసే వీధి సాక్ష్యపు పనిని నేను ఎంతో ఇష్టపడేవాడిని ఎందుకంటే యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో సహితం ఒక చిన్న పిల్లవాడి నుండి పత్రిక తీసుకోవడాన్ని చాలా కొద్దిమంది మాత్రమే నిరాకరించేవారు.
అవును, నాకు మంచి పునాది ఉంది. అయితే నేను యేసు ఇచ్చిన ఈ హెచ్చరికను లక్ష్యపెట్టడంలో విఫలమయ్యాను: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” (మత్తయి 6:24) పూర్తికాల సేవ చేస్తూ నేను అద్భుతమైన జీవితం గడిపాను అని చెప్పగలిగితే ఎంతో బాగుండేది. కాని ఆ తొలి రోజుల్లో అంటే నాకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు నన్ను ప్రభావితం చేసిన మరో “యజమాని” నన్ను ఆ త్రోవ నుండి పక్కకు తప్పించాడు. ఏమి జరిగింది?
విమానయానం నా వ్యామోహమైంది
1941వ సంవత్సరంలో పైపర్ కబ్ విమానం పెరటి మైదానంలో దిగింది. మా గొర్రెలను చంపుకుతింటున్న తోడేళ్ళను
వేటాడేందుకు అది ఉపయోగించబడేది. అప్పుడే, మూడేళ్ళ వయస్సులోనే, నేను పైలట్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. నాకు 17 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు నేను న్యూ మెక్సికోలోని హాబ్బ్స్ విమానాశ్రయంలో పనిచేయడానికి ఇల్లు వదిలి వెళ్ళాను. విమానయాన పాఠాలు నేర్చుకోవడానికి నేనక్కడ విమాన శాల ఊడ్వడం, విమానాల్లో పనిచేయడం వంటివి చేశాను. నా జీవితంలో క్రైస్తవ పరిచర్య వెనకబడిపోయింది.నేను 18 సంవత్సరాల వయస్సులో పెళ్ళి చేసుకున్నాను, చివరకు నాకు నా భార్యకు ముగ్గురు పిల్లలు పుట్టారు. నాకు జీవనాధారమేమిటి? పంటలపై మందుచల్లే విమానాలు, చార్టర్ విమానాలు, పరభక్ష జంతువులను వేటాడే విమానాలు నడుపుతూ, అలాగే విమానయాన పాఠాలు చెబుతూ డబ్బు సంపాదించేవాడిని. ఆరు సంవత్సరాలు అలా చేసిన తర్వాత నేను టెక్సాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేయడం ప్రారంభించి డల్లాస్ నుండి టెక్సాస్ వరకు విమానాలు నడిపేవాడిని. జీవితంలో ఇది నాకు మరింత స్థిరత్వాన్నిచ్చింది, నేను డెంటన్ సంఘంలో సంఘపెద్దగా కూడా సేవచేశాను. నేను చాలా బైబిలు అధ్యయనాలు కూడా నిర్వహించాను, ఒక విమాన కెప్టన్, అతని భార్య, వారి కుటుంబ సభ్యులతో కూడా అధ్యయనం చేశాను, వారి కుటుంబ సభ్యులందరూ సత్యం అంగీకరించారు.
1973కల్లా నేనప్పటికే మూడు సంవత్సరాలపాటు ప్రాప్‌జెట్స్ నడిపాను, అయితే DC-3 విమాన సేవలు నిలిపివేయడంతో నాకు ఆసక్తి సన్నగిల్లడం మొదలయ్యింది. నిజానికి నా మనస్సు ఇంకా న్యూ మెక్సికోనే కోరుకుంటోంది. కాని నేను విమానయానం మానుకుంటే, మరి జీవించేదెలా?
కళ నా వ్యామోహమైంది
1961నుండి నేను ఒక హాబీగా పశ్చిమ అమెరికా దృశ్యాలను పెయింట్ చేసేవాడిని, అవి బాగానే అమ్ముడుపోయేవి. అందువల్ల నేను ఎయిర్‌లైన్ ఉద్యోగానికి రాజీనామాచేసి ఆనంద దేశమని పిలువబడిన న్యూ మెక్సికోకు తిరిగి వెళ్లిపోయాను. అయితే నేను సమతూకంతో జీవించలేదు. నా కళాభిమానం నన్ను ముంచెత్తడానికి అనుమతించాను. అప్పుడప్పుడు విమానం నడపడంతోపాటు చిత్రకళ ఆ తర్వాత శిల్పకళ నాకు సమయం లేకుండా చేశాయి. నేను రోజుకు 12 నుండి 18 గంటలపాటు పనిచేసేవాడిని. అది నేను నా కుటుంబాన్ని, నా దేవుణ్ణి బాగా నిర్లక్ష్యం చేసేందుకు కారణమయ్యింది. తర్వాత ఏంజరిగింది?
నా వైవాహిక జీవితం విచ్ఛిన్నమై చివరకు విడాకులకు దారితీసింది. నేను ఉత్తరదిశగా మోన్‌టానాకు వెళ్లిపోయి అక్కడ త్రాగుడుకు అలవాటుపడ్డాను. క్రైస్తవులకు తగని జీవన విధానం నన్ను, యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారుని మాదిరిగా అజ్ఞానమార్గానికి మళ్లించింది. (లూకా 15:11-32) అప్పుడు ఒకరోజు నాకు ఒక్క నిజమైన స్నేహితుడు కూడా లేడని నేను గ్రహించాను. కష్టాల్లోవున్న ప్రజలను కలిసినప్పుడు నేను వారికి “యెహోవాసాక్షులను కలవండి. వారు మీకు నిజంగా సహాయం చేయగలరు” అని చెప్పేవాడిని. దానికి, “అలాగయితే మీరెందుకు సాక్షిగా లేరు?” అని తిరుగు ప్రశ్న వేసేవారు. నా మాదిరిగా జీవిస్తూ అదే సమయంలో సాక్షిగా కొనసాగడం కుదరదని నేను అంగీకరించాల్సి వచ్చేది.
చివరకు 1978లో నేను న్యూ మెక్సికోలో నన్నెరిగిన సాక్షులున్న సంఘానికి తిరిగి వెళ్ళాను. చాలా సంవత్సరాల తర్వాత నేను రాజ్యమందిరానికి వెళ్ళడం అదే మొదటిసారి, కన్నీరుమున్నీరుగా ఏడ్వడం తప్ప నేను మరేమి చేయలేకపోయాను.
నాపట్ల యెహోవా ఎంతో కనికరం చూపాడు. సంఘంలోని స్నేహితులు నాపట్ల ప్రేమపూర్వకంగా ప్రవర్తించి, నేను మళ్ళీ యెహోవా మార్గంలోకి తిరిగి వచ్చేలా నాకు సహాయం చేశారు.ఓ క్రొత్త భాగస్వామి, క్రొత్త ఆరంభం
1980లో నేను చక్కని సాక్షియైన కరేన్‌ను వివాహం చేసుకున్నాను, ఆమె నాకు అనేక సంవత్సరాలుగా తెలుసు. ఆమెకు తన గత వివాహం ద్వారా జేసన్, జోనథాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. యెహోవాపట్ల ఆమెకున్న ప్రగాఢమైన ప్రేమనుబట్టి ఆమె నా జీవితానికి స్థిరత్వాన్నిచ్చింది, మాకు బెన్, ఫిలిప్ అనే చక్కని కుమారులు కలిగారు. కానీ జీవితం పూలపానుపు కాదు. భవిష్యత్తులో మా కొరకు విషాదం కాచుకొనివుంది.
నేను మానవుల జంతువుల శరీరశాస్త్రం, ప్రత్యేకంగా గుర్రాల శరీరశాస్త్రం అలాగే కంటికి కనిపించేరీతిగా వివిధ భాగాల అమరిక, తులనాత్మక సంబంధం, సమతల చిత్రకళ గురించి నేర్చుకోవడానికి అనేక గంటలు గడుపుతూ కళాధ్యయనం చేశాను. నేను బంకమన్నుతో బొమ్మలు తయారుచేయడం ప్రారంభించాను, ముఖ్యంగా పాతకాలపు పాశ్చాత్త్య గుర్రాలను, గుర్రాలపై స్వారీచేసే ఇండియన్లను, కౌబాయ్‌లను, గుర్రపు బగ్గీలో ప్రయాణించే పాతకాలపు వైద్యుడి బొమ్మలను చేసేవాడిని. అది విజయవంతం కావడం ఆరంభించింది. కాబట్టి మేము ఒక గ్యాలరీ ఆరంభించాలని నిర్ణయించుకున్నాము. దానికి కరేన్ మౌంటెన్ ట్రెయిల్స్ గ్యాలరీ అని పేరుపెట్టింది.
1987లో మేము ఆరిజోనాలోని సెడొనాలో ఒక గ్యాలరీని కొని దానికి ఆ పేరు పెట్టాము. కరేన్ గ్యాలరీ పనులను నిర్వహిస్తుండగా, నేను ఇంటివద్ద స్టూడియోలో పనిచేస్తూ పిల్లలను చూసుకునేవాడిని. అయితే పిల్లలు జబ్బుపడ్డారు, గ్యాలరీలో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. దానితో కరేన్ ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడానికి వీలుగా మేము పనులు మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాము. నేను నా బంకమన్ను స్టోర్‌కు తీసుకెళ్లి అక్కడే ఖాతాదారుల ఎదుట బొమ్మలు తయారుచేయడం ఆరంభించాను. అదెంతో మార్పుతెచ్చింది.
నేను చేసే కంచు బొమ్మల గురించి ప్రజలు అడగడం మొదలుపెట్టారు. వారికి నా పని గురించి చెప్పేటప్పుడు, రూపకల్పనకు ఆధారంగా నేను ఉపయోగించే కళావిధానం వివరిస్తూ నేను చేసిన విస్తృత పఠనంనుండి నేర్చుకున్న పాతకాలపు పశ్చిమప్రాంత పేర్ల, స్థలాల, సంఘటనల చరిత్ర పాఠాలు చెప్పేవాడిని. నేను చేస్తున్న మోడల్స్‌పై ప్రజలు నిజమైన శ్రద్ధ చూపించారు, కొందరు బొమ్మ పూర్తయిన తర్వాత కంచు పోత పోసినప్పుడు మిగతా బ్యాలన్సు చెల్లించే ఉద్దేశంతో తయారౌతున్న బొమ్మకు డిపాజిట్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డారు. అలా “ప్రికాస్ట్ సేల్” అంటే బొమ్మను పోత పోయడానికి ముందే అమ్మడం అనేమాట వాడుకలోకి వచ్చింది. అది త్వరితగతిన విజయవంతమైంది. నా వ్యాపారం మూడు గ్యాలరీలు, 32మంది ఉద్యోగులతో ఒక పెద్ద ఫౌండ్రీగా విస్తరించింది. అయితే అది నా శక్తినంతా హరించేది. ఎంతకూ తెగని ఆ అలవాటునుండి ఎలా బయటపడాలా అని నేను కరేన్ ఆలోచనలోపడ్డాం. దాని గురించి మేము ప్రార్థించాం. నేనప్పుడు సంఘంలో పెద్దగావున్నాను, యెహోవాకు నేను ఇంకా ఎక్కువ చేయవలసివుందని నాకు తెలుసు.
తిరిగి ఒకే యజమానికి సేవచేయడం
1996లో మా సంఘానికి ప్రాంతీయ పైవిచారణకర్త వచ్చినప్పుడు ఆయనతోపాటు మధ్యాహ్న భోజనానికి రమ్మని ఆయన మమ్మల్ని అడిగాడు. భోజనానికి ఉపక్రమించే ముందు ఆయనొక ఊహించని ప్రశ్న వేశారు. అదేమంటే నావజో ఇండియన్ రక్షిత ప్రాంతంలోని చిన్లీలో ఓ క్రొత్త సంఘం ఆరంభించేందుకు సహాయపడడానికి మేము అక్కడికి వెళ్లడం గురించి ఆలోచించగలమా అని ఆయన అడిగారు. అదెంత సవాలో గదా! మేము చాలాసార్లు ఆ రక్షిత ప్రాంతానికివెళ్లి, ఆ మారుమూల ప్రాంతంలో ప్రకటించేందుకు సహాయం చేశాము, ఈ ప్రతిపాదన మాకొక క్రొత్త లక్ష్యాన్ని పెట్టింది. ఐశ్వర్యాసక్తిగల అవిశ్రాంత దినచర్యనుండి తప్పుకొని యెహోవాకు ఆయన ప్రజలకు మరింత సమయం వెచ్చించడానికి ఇది మాకొచ్చిన మంచి అవకాశం. మేము మళ్ళీ ఒకే యజమానిని సేవించనారంభించాం!
మాకు మంచి స్నేహితులు, కారెసెటెస్‌ల కుటుంబీకులైన మరో పెద్ద అతని కుటుంబం మాతోపాటు ఆ పనిచేసేందుకు ఆహ్వానించబడ్డారు. మేమిద్దరం మా సౌకర్యవంతమైన ఇళ్లు అమ్మేసి ఆ రక్షిత ప్రాంతంలో వాడడానికి మాకు అనుకూలంగావుండే మొబైల్ ఇళ్లకు ఆర్డరు చేశాం. నేను గ్యాలరీలను చివరకు ఫౌండ్రీని అమ్మేశాను. మా జీవితాలు సరళంచేసుకుని, మా క్రైస్తవ పరిచర్యను విస్తరింపజేసుకోవడానికి స్వతంత్రులమయ్యాం.
1996 అక్టోబరులో, మా క్రొత్త చిన్లీ సంఘపు మొదటి కూటం జరిగింది. అప్పటినుండి, నవజో ప్రజలమధ్య ప్రకటనా పని విస్తరించింది, నవజో భాష మాట్లాడే విశిష్టమైన నవజో పయినీర్లు మా సంఘంలో ఉన్నారు. మేము నవజోలము కాకపోయినా మమ్మల్ని ఆ ప్రజలు అంగీకరించేందుకు, మేము నెమ్మదిగా ఆ కష్టభరితమైన భాష నేర్చుకోవడం ఆరంభించాం. ఇండియన్ అధికారుల అనుమతితో మేము స్థలం సంపాదించి చిన్లీలో ఒక రాజ్యమందిరం నిర్మించాము, ఇదే సంవత్సరం జూన్ నెలలో రాజ్యమందిర ప్రతిష్ఠాపన జరిగింది.
విషాదం విరుచుకుపడింది!
1996 డిసెంబరులో కొద్దిరోజుల కొరకని కరేన్ పిల్లలను తీసుకొని న్యూ మెక్సికోలోని రూయోడొసోకు వెళ్లింది. నేను చిన్లీలోనే ఉండాల్సివచ్చింది. మా 14 సంవత్సరాల కుమారుడు బెన్ స్కీయింగ్‌చేస్తూ ఓ పెద్ద బండరాయికి గుద్దుకొని చనిపోవడం మాకెంత దిగ్ర్భాంతిని దుఃఖాన్ని కలిగించివుంటుందో ఊహించండి.
మా అందరికీ అదొక భయంకరమైన పరీక్ష. బైబిలులోని పునరుత్థాన నిరీక్షణ మాకు ఆ విషాదంలో ఆసరా ఇచ్చింది. అలాగే మన సహోదరుల మద్దతు మాకు కొండంత అండగా నిలిచింది. మేము అనేక సంవత్సరాలు నివసించిన సెడోనాలోని రాజ్యమందిరంలో అంత్యక్రియల ప్రసంగం ఇవ్వబడిన రోజున మా పొరుగువారు తామెన్నడూ చూడనంతమంది నవజోలను చూశారు. మాకు మద్దతిచ్చేందుకు 300 కిలోమీటర్లకు పైగా దూరంలోవున్న ఆ రక్షిత ప్రాంతం నుండి ఆ సహోదర సహోదరీలు వచ్చారు.బెన్ తమ్ముడు ఫిలిప్ ఆధ్యాత్మిక పురోగతిని చూడడం మాకు సంతోషం కలిగించింది. వాడికి చక్కని ఆధ్యాత్మిక లక్ష్యాలున్నాయి అవి మాకు చెప్పలేని ఆనందానిస్తున్నాయి. వాడు ఒక ఉపాధ్యాయునితో సహా చాలా బైబిలు అధ్యయనాలు చేశాడు. మేమందరం యెహోవా వాగ్దానం చేసిన నూతనలోకంలో బెన్‌ను మరలా చూసేందుకు పరితపిస్తున్నాం.—యోబు 14:14, 15; యోహాను 5:28, 29; ప్రకటన 21:1-4.
మేము ప్రేమగల, మద్దతిచ్చే కుటుంబంతో ఆశీర్వదించబడ్డాం. నా మొదటి వివాహం ద్వారా కలిగిన చిన్న కుమారుడు క్రిస్ ఆయన భార్య లోరీ యెహోవాకు సేవచేస్తున్నారు, నా దత్తపుత్రుడు జోనథాన్ కూడా తన భార్య కెన్నాతోపాటు యెహోవాను సేవిస్తున్నాడు. మా మనవలు వుడ్రో, జోనా దైవ పరిపాలనా పాఠశాలలో విద్యార్థి ప్రసంగాలిస్తున్నారు. మా నాన్న 1987లో చనిపోయారు, అయితే 84 సంవత్సరాల వయస్సులో కూడా మా అమ్మ ఇంకా చురుకుగా యెహోవా సేవ చేస్తోంది, మా తమ్ముడు జాన్ అతని భార్య చెర్రీ కూడా యెహోవా సేవలో ఉన్నారు.
“ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; . . . మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అన్న యేసు మాటలు నిజమని నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా కళ ఎంతో సమయాన్ని, అవధానాన్ని తీసుకునే యజమానిగా ఉండగలదు. అందుకే నా కళ నన్ను మళ్ళీ ముంచెత్తకుండా ఉండేందుకు సమతూకం అప్రమత్తతల ప్రాముఖ్యతను నేను తెలుసుకున్నాను. “నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి” అని అపొస్తలుడైన పౌలు హితవు చెప్పినట్లుగా చేయడం అత్యంత మేలుకరం.—1 కొరింథీయులు 15:58. (g03 7/8)
[అధస్సూచి]
^ జె. ఎఫ్. రూధర్‌ఫోర్డ్ 1942లో చనిపోయేంతవరకు ఆయన యెహోవాసాక్షులకు నాయకత్వం వహించారు.
[15వ పేజీలోని చిత్రం]
1996లో చిన్లీలో నా విమానం
[15వ పేజీలోని చిత్రం]
“నో టైమ్ టు డాలీ” అని పిలువబడే కంచు శిల్పం
[17వ పేజీలోని చిత్రం]
బిలు అధ్యయనం కోసం కలుసుకోవడం, ఆ స్థలంలోనే మా రాజ్యమందిరం నిర్మించబడింది
[17వ పేజీలోని చిత్రం]
నా భార్య కరేన్‌తో
[17వ పేజీలోని చిత్రం]
విలక్షణమైన నవాజో గృహంవద్ద ప్రకటించడం