కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను పచ్చబొట్టు పొడిపించుకోవాలా?

నేను పచ్చబొట్టు పొడిపించుకోవాలా?

యువత ఇలా అడుగుతోంది . . .

నేను పచ్చబొట్టు పొడిపించుకోవాలా?

“కొన్ని పచ్చబొట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అవి చాలా కళాత్మకంగా ఉంటాయి.”​—జాలీన్‌. *

“నా మొదటి పచ్చబొట్టు కోసం నేను రెండు సంవత్సరాలుగా కలలుగన్నాను.”​—మిషాల్‌.

ఎక్కడ చూసినా పచ్చబొట్లే కనబడతాయి​—లేదా అలా అనిపిస్తుంది. రాక్‌ మ్యూజిక్‌ తారలు, ప్రముఖ క్రీడాకారులు, ఫ్యాషన్‌ మోడల్స్‌, సినీ తారలు తమ పచ్చబొట్లను ప్రదర్శిస్తారు. చాలామంది టీనేజర్లు వారిని అనుకరిస్తూ తమ భుజాలు, చేతులు, నడుములు, చీలమండలమీద పచ్చబొట్లను గర్వంగా ప్రదర్శిస్తున్నారు. “పచ్చబొట్లు నేటి ఫ్యాషన్‌కు గుర్తు. వాటిని పొడిపించుకోవాలా వద్దా అన్నది వ్యక్తిగత ఎంపిక” అని ఆండ్రూ వాదిస్తున్నాడు.

వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “శరీరం మీద శాశ్వతంగా ఉండిపోయేలా డిజైన్లు పొడిపించుకునే అలవాటే పచ్చబొట్లు పొడిపించుకోవడం. వర్ణద్రావకాల్లో ముంచిన మొనదేలిన కర్రముక్క, ఎముక లేక సూదితో చర్మాన్ని పొడుస్తూ ఈ డిజైన్లు వేస్తారు.”

ఖచ్చితమైన గణాంకాలను సేకరించడం కష్టమే అయినా, అమెరికాలోని 15 నుండి 25 ఏండ్ల మధ్య వయస్సుగలవారిలో 25 శాతం మంది పచ్చబొట్లు పొడిపించుకున్నారని ఒక నివేదిక అంచనా. “అలా పొడిపించుకోవడం ప్రాచుర్యమైంది” అని సాండీ అంటోంది. కొంతమంది యౌవనులకు పచ్చబొట్లు ఎందుకంత ఆకర్షణీయంగా ఉన్నాయి?

ఎందుకంత ప్రాచుర్యమైంది?

కొంతమంది ప్రగాఢ ప్రేమకు చిహ్నంగా పచ్చబొట్టు పొడిపించుకొంటారు. మిషాల్‌ ఇలా చెబుతోంది: “మా అన్నయ్య చీలమండమీద తనతో కలిసి తిరిగిన అమ్మాయి పేరు ఉంది.” అయితే సమస్య ఏమిటి? “తనిప్పుడు ఆమెతో డేటింగ్‌ మానేశాడు.” టీన్‌ అనే పత్రిక ప్రకారం, “తమ దగ్గరకు వచ్చి పచ్చబొట్లను తొలగించుకున్న వారిలో 30 శాతం కంటే ఎక్కువ మంది వారి మాజీ బోయ్‌ఫ్రెండ్‌ పేర్లను తొలగించుకున్న టీనేజి అమ్మాయిలే ఉన్నారని డాక్టర్ల అంచనా.”

కొంతమంది యౌవనులు పచ్చబొట్లను కళాకృతులుగా దృష్టిస్తారు. మరికొందరు వాటిని స్వేచ్ఛకు చిహ్నాలుగా చూస్తారు. “నా జీవితాన్ని నేనే నియంత్రించుకుంటాను” అలాగే, పచ్చబొట్లు పొడిపించుకోవడం “నా జీవితంలో నేను తీసుకున్న ఒకే ఒక జీవన నిర్ణయం” అని జోసీ అన్నది. పచ్చబొట్లు పొడిపించుకోవడం, యౌవనుల్లో కొందరు ప్రయోగం చేసేలా అంటే తమ రూపంపై తమకు నియంత్రణవుందని భావించేలా చేస్తుంది. పచ్చబొట్లు పొడిపించుకోవడం తిరుగుబాటును లేక ప్రత్యామ్నాయ జీవన శైలిని కూడా సూచించవచ్చు. ఆ విధంగా, కొన్నిరకాల పచ్చబొట్లు అశ్లీల పదాలతో, చిత్రాలతో లేక రెచ్చగొట్టే నినాదాలతో ఉంటాయి.

అయితే, అధికశాతం యౌవనులు కేవలం వేలంవెర్రిగా పొడిపించుకున్నవారే కావచ్చు. కానీ, అందరూ పచ్చబొట్లు పొడిపించుకుంటున్నట్టు అనిపించినంత మాత్రాన, మీరు కూడా పొడిపించుకోవాలని దానర్థమా?

పచ్చబొట్లు పొడిచే ప్రాచీన కళ

పచ్చబొట్లు పొడిపించుకోవడం ఆధునిక అలవాటేమీ కాదు. పచ్చబొట్లున్న ఈజిప్టుల, లిబ్యన్ల మమ్మీలు లభ్యమయ్యాయి, అవి క్రీస్తు కంటే వందల సంవత్సరాల ముందు కాలానికి చెందినవి. పచ్చబొట్లున్న మమ్మీలు దక్షిణ అమెరికాలో కూడా లభించాయి. పచ్చబొట్లతో కనిపించే అనేక చిత్రాలకు అన్యమత ఆరాధనతో సూటిగా సంబంధముంది. స్టీవ్‌ గిల్బర్ట్‌ అనే పరిశోధకుని ప్రకారం, “పచ్చబొట్టుగా మొట్టమొదట గుర్తించబడిన బొమ్మ ఏదో అర్థంపర్థంలేని వస్తువు కాదుగాని అది బెస్‌ దేవతా చిత్రాన్ని సూచిస్తోంది. ఐగుప్తీయుల పురాణంలో బెస్‌ కామాతురతగల అల్లరి దేవత.”

మోషే ధర్మశాస్త్రం దేవుని ప్రజలు పచ్చబొట్లు పొడిపించుకోకూడదని నిషేధించడం గమనార్హం. లేవీయకాండము 19:28 లో ఇలా చెప్పబడింది: “చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.” ఐగుప్తీయుల వంటి అన్యమత ఆరాధకులు తమ దేవతల పేర్లను లేక గుర్తులను తమ ఛాతీపైన, చేతులపైన పొడిపించుకునేవారు. పచ్చబొట్లు పొడిపించుకోవడంపై యెహోవా పెట్టిన నిషేధానికి విధేయులు కావడం ద్వారా, ఇశ్రాయేలీయులు ఇతర జనాంగాలకు భిన్నంగా ఉండేవారు.​—ద్వితీయోపదేశకాండము 14:1, 2.

నేడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కింద లేకున్నా, పచ్చబొట్ల మీదున్న నిషేధం గంభీరమైనదే. (ఎఫెసీయులు 2:15; కొలొస్సయులు 2:13-15) మీరు క్రైస్తవులైతే, మీరు మీ శరీరం మీద అన్యమతాన్ని లేక అబద్ధ ఆరాధనను సూచించే గుర్తులను, తాత్కాలికంగానైనా పొడిపించుకోవాలని కోరుకోరు.​—2 కొరింథీయులు 6:15-18.

ఆరోగ్య ప్రమాదాలు

ఆరోగ్యపరమైన విషయాల గురించి కూడా మీరు ఆలోచించాలి. డెర్మటాలజీ అసొసియేట్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ రాబర్ట్‌ టామ్‌సిక్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “మీరేమి చేస్తున్నారంటే చర్మాన్ని చీల్చి దానిలో వర్ణద్రావకాలు చేరుస్తున్నారు. సూది కేవలం కొద్దిగా గుచ్చుకున్నా, ఎప్పుడైనా మీ చర్మాన్ని చీరినా మీరు బ్యాక్టీరియా లేక వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. [పచ్చబొట్లు పొడిపించుకోవడం] సాధారణంగా ప్రమాదకరమైనదేనని నేను భావిస్తున్నాను.” డాక్టర్‌ టామ్‌సిక్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “ఒకసారి ఆ వర్ణద్రవ్యం చర్మం లోపలికి చేరుకుందంటే, ఇన్‌ఫెక్షన్‌ కాకపోయినా కూడా, ఎలర్జీలు, చర్మ వాపు, ఎలర్జీ ప్రతిక్రియల వంటివి సంక్రమించవచ్చు, వాటివల్ల చర్మం ఎర్రగా మారడం, వాచిపోవడం, పెళుసుగా మారడం, దురద పెట్టడం వంటివి సంభవిస్తాయి.”

పచ్చబొట్లు శాశ్వతంగా ఉండాలని ఉద్దేశించినప్పటికీ, వాటిని తొలగించుకునే ప్రయత్నాల్లో విభిన్న పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి: లేజర్‌ ద్వారా తీసివేయడం (పచ్చబొట్లను కాల్చివేయడం), శస్త్ర చికిత్స ద్వారా (పచ్చబొట్టును కోసి తీసివేయడం), డెర్మబ్రేషన్‌ (వైర్‌ బ్రష్‌తో రుద్దుతూ బాహ్య చర్మమును లోపలి చర్మమును తీసివేయడం), సలబ్రేషన్‌ (పచ్చబొట్టు పొడిచిన చర్మాన్ని నానబెట్టడానికి ఉప్పు ద్రావణం ఉపయోగించడం), స్కారిఫికేషన్‌ (ఆమ్లంతో పచ్చబొట్టు తీసివేసి దాని స్థానంలో ఒక మచ్చపడేటట్లు చేయడం). ఈ పద్ధతులు ఖరీదైనవి, బాధకరమైనవి. “పచ్చబొట్టు పొడిపించుకోవడం కంటే దాన్ని లేజర్‌ ద్వారా తీసేయించుకోవడం చాలా బాధాకరంగా ఉంటుంది” అని టీన్‌ పత్రిక చెబుతోంది.

ఇతరులు ఏమనుకుంటారు?

మీ ఒంటిమీద పచ్చబొట్లు చూసి ఇతరులు ఏమనుకుంటారోనని కూడా గంభీరంగా ఆలోచించాలి, ఎందుకంటే చాలామంది ప్రతికూలంగా స్పందిస్తారు. (1 కొరింథీయులు 10:29-33) తైవాన్‌లోని లీ అనే ఒక స్త్రీ తన 16వ ఏట మోజుతో పచ్చబొట్టు పొడిపించుకుంది. ఆమెకిప్పుడు 21 ఏండ్లు, ఆఫీసులో పనిచేస్తోంది. “నా సహోద్యోగులు ఆ పచ్చబొట్టు వంక చూసేతీరు నాకు ఇబ్బందిగా ఉంటోంది” అని లీ అంగీకరిస్తోంది. చాలామందికి పచ్చబొట్లు, “తరచూ దౌర్జన్యం చేసే, క్రూరత్వంగల, సంఘ విద్రోహక, నేర స్వభావంగల గుంపుకు చెందిన వ్యక్తికి గుర్తింపు చిహ్నంగా” ఉన్నాయని బ్రిటిష్‌ మానసిక ఆరోగ్య సేవకుడైన థియోడోర్‌ డాల్‌రింపల్‌ అన్నాడు.

అమెరికన్‌ డెమొగ్రాఫిక్స్‌ అనే పత్రికలోని ఒక ఆర్టికల్‌ అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చింది: “బయటకు కనబడే శరీర కళ ప్రమాదకరమైనదని చాలామంది అమెరికన్లు భావిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఎనభై శాతం [యువత] ఈ వ్యాఖ్యతో ఏకీభవిస్తోంది, ‘బయటకు కనబడే పచ్చబొట్లున్న ప్రజలు . . . ఇలాంటి స్వీయ ప్రదర్శన పద్ధతి తమ కెరీర్‌కు లేక ఇతరులతో సంబంధాలకు బహుశా అవాంతరాలను సృష్టిస్తుందని గ్రహించాలి.’”

పచ్చబొట్టు పొడిపించుకోవడాన్ని ఎంపిక చేసుకోవడం, మీరు క్రైస్తవులని చెప్పుకునేదాన్ని బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా అని కూడా ఆలోచించండి. అది ఇతరులకు ‘అభ్యంతరం కలుగజేసే’ అవకాశముందా? (2 కొరింథీయులు 6:3) నిజమే కొందరు యువతీయువకులు బయటకు కనబడని శరీర భాగాల్లో పచ్చబొట్లు పొడిపించుకున్నారు. ఈ రహస్య పచ్చబొట్ల గురించి చివరకు వారి తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. కానీ జాగ్రత్త సుమా! అత్యవసర పరిస్థితిలో డాక్టరు దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినా లేక స్కూల్లో స్నానం చేసేటప్పుడైనా మీ రహస్యం బయటపడే అవకాశముంది! అవివేకంగా మోసాలు చేయకుండా ‘అన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తించడం’ మంచిది.​—హెబ్రీయులు 13:18.

అన్ని వ్యామోహాల్లాగే పచ్చబొట్లు కూడా కొంతకాలానికి వాటి ఆకర్షణను కోల్పోవచ్చు. నిజానికి మీరు మీ జీవిత కాలమంతా ధరించాలనుకునేంతగా ఇష్టపడే ఒక జత జీన్స్‌, షర్ట్‌, డ్రెస్సు వంటి బట్టలుగానీ లేక బూట్లు గానీ ఉన్నాయా? లేవనడంలో సందేహం లేదు! అలంకరణ పద్ధతులు, దుస్తుల తీరు, రంగులు మారతాయి. అయితే ఒక గుడ్డ ముక్కను తీసివేసినట్లు పచ్చబొట్టును తీసివేయడం కష్టం. అంతేకాదు మీ 16 ఏండ్ల వయసులో మీకు “ఫ్యాషన్‌”గా కనిపించింది మీకు 30 ఏండ్లు వచ్చేసరికి అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.

తమ రూపానికి శాశ్వత మార్పులు చేసుకున్నందుకు చాలామంది పశ్చాత్తాపపడ్డారు. “నేను యెహోవాను తెలుసుకోకముందు పచ్చబొట్లు పొడిపించుకున్నాను, నేను దాన్ని కప్పివుంచడానికి ప్రయత్నిస్తాను. అది సంఘంలో ఎవరి కంటైనా పడితే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది” అని ఎమీ అంటోంది. మరి సందేశమేమిటి? పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ముందు పదిసార్లు ఆలోచించండి. పశ్చాత్తాపపడే నిర్ణయాన్ని తీసుకోకండి. (g03 9/22)

[అధస్సూచి]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[22వ పేజీలోని చిత్రం]

 చ్చబొట్లు తరచూ తిరుగుబాటు జీవన విధానాలతో ముడిపడి ఉంటాయి

[22వ పేజీలోని చిత్రం]

కొంతకాలమయ్యేసరికి, పచ్చబొట్టు పొడిపించుకున్నందుకు చాలామంది పశ్చాత్తాపపడతారు

[23వ పేజీలోని చిత్రం]

పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ముందు పదిసార్లు ఆలోచించండి