కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పుప్పొడి అపాయకరమా లేక అద్భుతమా?

పుప్పొడి అపాయకరమా లేక అద్భుతమా?

పుప్పొడి అపాయకరమా లేక అద్భుతమా?

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! రచయిత

హాచ్‌! తుమ్ములు, కళ్ళలోనుండి నీరుకారడం, కళ్ళు దురదపెట్టడం, ముక్కు చీదర, ముక్కు కారడం వంటివి కోట్లాదిమందికి వసంత రుతువు ఆరంభాన్ని సూచిస్తాయి. వారికి ఆ ఎలర్జీ సాధారణంగా పుప్పొడి నిండిన వాతావరణం కారణంగా కలుగుతుంది. పారిశ్రామిక ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు ఆయా రుతువుల్లో కలిగే పుప్పొడి ఎలర్జీలతో​—⁠ఈ ఎలర్జీలు హే ఫీవర్‌ అని కూడా పిలువబడతాయి​—⁠బాధపడుతున్నారని బిఎమ్‌జి (పూర్వం బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌) అంచనా వేసింది. మొక్కలు గాలిలోకి వదిలే పుప్పొడి పరిమాణంతో పోలిస్తే ఆ సంఖ్య ఆశ్చర్యకరమేమీ కాదు.

స్వీడన్‌ దక్షిణప్రాంతపు మూడవ భాగంలోవున్న స్ప్రూస్‌ వృక్షజాతి అడవులే ప్రతిసంవత్సరం దాదాపు 75,000 టన్నుల పుప్పొడిని విడుదల చేస్తాయని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఉత్తర అమెరికాలో హే ఫీవర్‌ బాధితుల వ్యథకు కారణమైన రాగ్‌వీడ్‌ మొక్క ఒకటి రోజుకు పదిలక్షల పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేయగలదు. రాగ్‌వీడ్‌ పుప్పొడి గాలిలో కలిసిపోయి భూమికి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు, సముద్రంపై 600 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది.

అయితే ఈ పుప్పొడి కొందరిలో ఎలర్జీ ఎందుకు కలిగిస్తుంది? మనం ఈ ప్రశ్నను పరిశీలించే ముందు, పుప్పొడిని సునిశితంగా పరిశీలించి ఆ సూక్ష్మ రేణువుల్లో కనబడే అద్భుత రూపకల్పనను చూద్దాం.

సూక్ష్మ జీవ రేణువులు

పుప్పొడి “విత్తనాధార మొక్కల్లోని పరాగకోశం లేదా పురుష బీజావయవంలో తయారై వివిధ మాధ్యమాల ద్వారా (గాలి, నీరు, కీటకాలు వగైరాల ద్వారా) గర్భకేసరానికి లేదా స్త్రీ బీజాశయానికి చేరుకొని అక్కడ ఫలదీకరణం చెందుతుంది” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది.

పుష్పసహిత మొక్కల్లోని పుప్పొడి రేణువులు మూడు విభిన్న భాగాలతో అంటే శుక్లకణాల కేంద్రకము, రేణువులపై గోడగా లేదా గుల్లగా రూపొందే రెండు పొరలతో తయారౌతాయి. బయటిపొర దుర్భేద్యంగా ఉండి గాఢమైన ఆమ్లాలను, క్షారపదార్థాలను, చివరకు వేడిని సహితం తట్టుకునే సామర్థ్యంతో ఉంటుంది. అయినప్పటికీ, దాదాపు అన్నిరకాల పుప్పొడి కేవలం కొన్ని రోజులు లేదా వారాలపాటు మాత్రమే జీవనక్షమంగా ఉంటుంది. అయితే గట్టిగావుండే గుల్ల మాత్రం కుళ్లిపోకుండా వేలాది సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. అందుకే నేలలో పుప్పొడి రేణువులు కుప్పలుతెప్పలుగా కనబడతాయి. వాస్తవానికి, నేలలోని వివిధ లోతుల నుండి సేకరించబడిన మట్టిలోని పుప్పొడిని అధ్యయనంచేసి శాస్త్రజ్ఞులు భూసంబంధ వృక్షశాస్త్రం గురించి ఎంతో నేర్చుకున్నారు.

పుప్పొడి రేణువుల బాహ్య గుల్లపై ఉండే విశిష్ఠ రూపకల్పనల కారణంగా ఆ వృక్షశాస్త్ర చరిత్ర కూడా చాలా నిర్దుష్టంగా ఉంటుంది. పుప్పొడి రకాన్ని బట్టి ఆ గుల్ల నున్నగా, ముడతలుగా, గీతలుగీతలుగా, మళ్లుముళ్లుగా, ముడులుగా ఉండవచ్చు. “అలా, గుర్తు పట్టడానికి వీలుగా, ప్రతి జాతికి చెందిన పుప్పొడి మానవుల వేలి గుర్తులంత నమ్మదగినదిగా ఉంటుంది” అని మానవశాస్త్ర పండితుడైన వోన్‌ ఎమ్‌. బ్రాయింట్‌, జూనియర్‌ చెబుతున్నాడు.

మొక్కల పరాగసంపర్కం

పుప్పొడి రేణువు స్త్రీజాతి మొక్కల గర్భకేసరంలో భాగమైన కీలాగ్రానికి చేరినప్పుడు జరిగే రసాయనిక చర్య, పుప్పొడి రేణువు వ్యాకోచించి సన్నని నాళికగా స్త్రీబీజకణం వరకు పెరిగేలా చేస్తుంది. అప్పుడు పుప్పొడి రేణువులోని శుక్లకణాలు ఆ నాళికగుండా స్త్రీబీజకణాన్ని చేరుకొని ఫలదీకరణం చెందిన బీజంగా తయారౌతాయి. ఆ బీజం పరిపక్వమైనప్పుడు, మొలకెత్తడానికి దానికి సరైన పర్యావరణం ఉంటే చాలు.

కొన్ని విత్తనాధార మొక్కలు పురుషజాతి మొక్కలుగా లేదా స్త్రీజాతి మొక్కలుగా పెరిగినప్పటికీ, వాటిలో అధికశాతం ఇటు పుప్పొడిని అటు స్త్రీబీజకణాలను ఉత్పన్నం చేస్తాయి. కొన్ని మొక్కల్లో ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది; మరికొన్నింటిలో అదేజాతికి చెందిన మొక్కలకు లేదా దగ్గరి సంబంధంగల మొక్కలకు పుప్పొడిని చేరవేయడంతో పరపరాగ సంపర్కం జరుగుతుంది. పరపరాగ సంపర్కం జరిగించే మొక్కలు “తరచూ తమ కీలాగ్రాలు పుప్పొడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సమయానికి ముందు లేదా ఆ తర్వాత పుప్పొడి రాల్చి ఆత్మపరాగ సంపర్కం జరగకుండా చేస్తాయి” అని బ్రిటానికా చెబుతోంది. మరితర మొక్కల్లో తమ సొంత పుప్పొడికి, అదే జాతికి చెందిన ఇతర మొక్కల పుప్పొడికి మధ్య తేడా కనిపెట్టే రసాయనాలు ఉంటాయి. సొంత పుప్పొడిని కనిపెట్టినప్పుడు, అవి తరచు పుప్పొడి నాళిక పెరగకుండా అడ్డగించి వాటిని నిర్వీర్యం చేస్తాయి.

రకరకాల మొక్కలున్న ప్రాంతపు గాలిలో వివిధ రకాల పుప్పొడి మిశ్రమం ఉంటుంది. మొక్కలు తమకు కావలసిన పుప్పొడిని ఎలా కనిపెట్టి ఎంచుకుంటాయి? కొన్ని సంక్లిష్టమైన చలద్వాయువుల యాంత్రికచర్య సూత్రాలను ఉపయోగించుకుంటాయి. ఉదాహరణకు, పైన్‌ వృక్షాలను పరిశీలించండి.

గాలినుండి కార్యఫలం సాధించడం

పురుషజాతి పైన్‌ శంకువులు గుత్తులు గుత్తులుగా పెరిగి, పరిపక్వమైనప్పుడు పెద్ద మొత్తాల్లో పుప్పొడిని గాల్లోకి వదులుతాయి. స్త్రీజాతి పైన్‌ శంకువులు, తమ చుట్టూవున్న సూదిలాంటి ఆకుల సహాయంతో గాలిలోని పుప్పొడి సుడులు తిరుగుతూ శంకువుల పునరుత్పాదక ఉపరితల భాగాలపై పడేలా గాలిని మళ్లిస్తాయి. స్వీకృత స్త్రీజాతి శంకువుల శల్కాలు ఒకదాని నుండి ఒకటి వేరవుతూ కొద్దిగా విచ్చుకున్నప్పుడు ఈ ఉపరితల భాగాలు కనిపిస్తాయి.

పరిశోధకుడైన కార్ల్‌ జె. నిక్లాస్‌ పైన్‌ శంకువుల వాయుసంబంధ చాతుర్యవంతమైన రూపకల్పనపై విస్తృత పరీక్షలు నిర్వహించాడు. సైంటిఫిక్‌ అమెరికన్‌ పత్రికలో ఆయన ఇలా వ్రాశాడు: “ప్రతిజాతి మొక్క ఉత్పత్తిచేసే శంకువుకుండే ఉత్కృష్ట ఆకారం తనదైన [విశిష్ట] రీతిలో గాలి ప్రసరణను సవరిస్తుంది . . . అదేవిధంగా ప్రతి పుప్పొడి రకానికి విశిష్ట పరిమాణం, రూపం, సాంద్రత ఉంటాయి, కాబట్టి పుప్పొడి గాలిలోని మార్పులకు తగ్గట్టు అసాధారణమైన రీతిలో వ్యవహరిస్తుందని మా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.” ఈ సాంకేతిక నైపుణ్యాలు ఎంత ప్రభావవంతమైనవి? నిక్లాస్‌ ఇలా చెబుతున్నాడు: “మేము అధ్యయనం చేసిన శంకువులు అధికంగా గాలినుండి ఇతర జాతుల పుప్పొడిని కాదుగాని తమ ‘సొంత’ జాతులకు చెందిన పుప్పొడినే వడబోసుకున్నాయి.”

అయితే మొక్కలన్నీ పరాగ సంపర్కం చేయడానికి గాలిని ఉపయోగించవు​—⁠ఎలర్జీ బాధితులకు ఇదెంత ఉపశమనమో గదా! చాలా మొక్కలు జంతువులను ఉపయోగించుకుంటాయి.

మకరందంతో ఆకర్షించబడడం

పక్షులు, చిన్న క్షీరదజాతి జంతువులు, కీటకాల ద్వారా సంపర్కం చెందే మొక్కలు సాధారణంగా ఆ జంతువుల శరీరాలకు పుప్పొడి అంటించడానికి కొంకులను, మొనదేలిన భాగాలను లేదా జిగురు దారాలను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, నూగు ఎక్కువగావుండే బంబుల్‌ తుమ్మెద తడవకు దాదాపు 15,000 పుప్పొడి రేణువులను మోసుకెళుతుంది!

వాస్తవానికి తేనెటీగలు పుష్పసహిత మొక్కలకు ప్రధాన పరాగ సంపర్క సహకర్తలు. ప్రతిఫలంగా ఆ మొక్కలు తేనెటీగలకు తియ్యని మకరందాన్ని, పుప్పొడిని ఇస్తాయి, ఈ పుప్పొడిలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. అసాధారణ రీతిలో సహకరిస్తూ తేనెటీగలు ఒక తడవకు 100 కంటే ఎక్కువ పువ్వులను సందర్శిస్తాయి, అయితే అవి తమకు సరిపడా సమకూర్చుకునేంత వరకు లేదా పువ్వుల్లోని సరఫరా అయిపోయేంత వరకు కేవలం ఒక జాతి పువ్వులనుండే పుప్పొడిని, మకరందాన్ని లేదా రెంటిని సేకరిస్తాయి. గమనార్హమైన ఈ సహజజ్ఞాన ప్రవర్తన సమర్థవంతమైన పరాగ సంపర్కం జరగడానికి సహాయం చేస్తుంది.

మోసకారి పుష్పాలు

తియ్యని మకరందాలు ఇవ్వడానికి బదులు, కొన్ని మొక్కలు పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించేలా వాటిని మోసగించడంపై ఆధారపడతాయి. ఉదాహరణకు, పశ్చిమ ఆస్ట్రేలియాలో పెరిగే హ్యామర్‌ ఆర్కిడ్‌నే తీసుకోండి. ఈ హ్యామర్‌ ఆర్కిడ్‌ పువ్వు మధ్యభాగం నుండి వ్రేలాడే దళం మనుషుల కన్నులకు సహితం అచ్చం బొద్దుగా, రెక్కలుండని ఒక రకమైన ఆడ కందిరీగ మాదిరిగానే కనబడుతుంది. నిజమైన ఆడ కందిరీగ విడుదల చేసినట్లే ఆ పువ్వు లైంగిక రసాయన పదార్థాన్ని లేదా లైంగికాకర్షక ద్రావకాన్ని విడుదల చేస్తుంది! ఆకర్షణీయమైన ఈ పుష్పదళానికి కొంచెంపైనవుండే కాడకు చివరన పుప్పొడి నిండిన జిగురు సంచులుంటాయి.

అనుకరణ లైంగికాకర్షక ద్రావకం ద్వారా ఆకర్షించబడిన మగ కందిరీగ, ఆడ కందిరీగలా కనిపించే ఆ దళాన్ని చిక్కించుకొని ఆత్రంగా “దానితోపాటు” ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అలా ఎగిరిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ కందిరీగ వేగగతి కారణంగా అది దాని కాళ్ళమధ్యవున్న దళంతోపాటు తలక్రిందులుగా సరిగ్గా పుప్పొడి సంచులపై పడుతుంది. జరిగిన పొరపాటు గ్రహించిన ఆ కందిరీగ ఆ దళంను విడిచి ఎగిరిపోతుంది​—⁠ఒక కీలుకు బిగించినట్లుండే ఆ దళం తిరిగి తన పూర్వ స్థానం చేరుకుంటుంది​—⁠కాని ఆ కందిరీగ మరో హ్యామర్‌ ఆర్కిడ్‌ మొక్క చేసే మోసానికే మరలా గురౌతుంది. అయితే ఈ సారి అది ముందు జరిగిన సంఘటనలో అంటించుకున్న పుప్పొడితో ఈ ఆర్కిడ్‌కు పరాగ సంపర్కం జరిగిస్తుంది.

అయితే ఆడ కందిరీగలు చురుకుగా ఉన్నప్పుడు, మగ కందిరీగలు మోసకరమైన ఆర్కిడ్‌ పువ్వులను కాకుండా ఖచ్చితంగా ఆడ కందిరీగల్లో ఒకదానినే ఎంచుకుంటాయి. కాబట్టి ఆ పరిస్థితికి తగినట్టుగానే ఆర్కిడ్‌లు, ఆడ కందిరీగలు తమ నేలగూటినుండి బయటకు రావడానికి అనేకవారాలముందే వికసించి పుష్పాలకు తాత్కాలిక ప్రయోజనం చేకూరుస్తాయి.

ఎలర్జీలు ఎందుకు?

కొంతమంది పుప్పొడివలన ఎందుకు ఎలర్జీకి గురౌతారు? సూక్ష్మమైన పుప్పొడి రేణువులు ముక్కులోకి వెళ్ళినప్పుడు అక్కడవుండే జిగురుపొరకు అంటుకుంటాయి. అక్కడినుండి అవి గొంతులోకిచేరి లోపలికి వెళ్ళిపోతాయి లేదా ఎలాంటి హానికర ప్రభావాలు లేకుండా సాధారణంగా దగ్గుతో బయటపడతాయి. అయితే కొన్నిసార్లు పుప్పొడి రోగనిరోధక వ్యవస్థను ప్రకోపింపజేస్తుంది.

సమస్య పుప్పొడి మాంసకృత్తులకు సంబంధించినది. ఎలర్జీతో బాధపడే వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ ఏదో కారణంచేత కొన్నిరకాల పుప్పొడి మాంసకృత్తులను హానికరంగా దృష్టిస్తుంది. ఆ వ్యక్తి శరీరం, శరీర కణజాలాల్లో ఉండే మాస్ట్‌ కణాలు ఎక్కువ పరిమాణాల్లో హిస్టమైన్‌ను విడుదల చేసేందుకు కారణమయ్యే గొలుసుకట్టు ప్రతిచర్యలను ప్రారంభించడం ద్వారా స్పందిస్తుంది. హిస్టమైన్‌ రక్తనాళాలు వ్యాకోచించి, వాటిలో ద్రవం మరెక్కువగా ప్రవహించేలా చేస్తుంది, అందువల్ల అవి రోగనిరోధక కణాలు ధారాళంగావుండే ద్రవాన్ని ప్రవహింపజేస్తాయి. సాధారణ పరిస్థితుల్లో, ఈ రోగనిరోధక కణాలు శరీరానికి గాయమైన చోటికి లేదా ఇన్ఫెక్షన్‌వున్న ప్రాంతాలకు చేరుకొని శరీరం హానికర ముట్టడిదార్లను వదిలించుకోవడానికి సహాయం చేస్తాయి. అయితే ఎలర్జీతో బాధపడేవారిలో పుప్పొడి బూటకపు హెచ్చరిక కలిగిస్తుంది, అందువల్ల ముక్కు దురదపెట్టడం, ముక్కు కారడం, కణజాలాలు ఉబ్బడం, కళ్ళలోనుండి నీరుకారడం జరుగుతాయి.

ఎలర్జీ కలగడమనేది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు, అయితే తల్లిదండ్రులకు ఎలర్జీ కలిగించినదే పిల్లలకు ఎలర్జీ కలిగించకపోవచ్చు. కాలుష్యం, పుప్పొడి ఎలర్జీకి సులభంగా లోనయ్యేటట్లు చేయగలదు. “డీజిల్‌ ధూమ రేణువులు గాలిలో ఎక్కువ మోతాదుల్లో వ్యాపించిన ప్రాంతాలకు సమీపాన ఉన్నప్పుడు పుప్పొడి ఎలర్జీలు ఎక్కువవుతున్నాయని జపానులో కనుగొన్నారు. ఈ రేణువులు ఎలర్జీకి సులభంగా లోనయ్యే అవకాశాలను ఎక్కువచేస్తాయని జంతువులమీద చేసిన పరిశోధనలు సూచిస్తున్నాయి” అని బిఎమ్‌జె పేర్కొంది.

సంతోషకరమైన విషయమేమంటే, ఆంటీహిస్టమైన్‌లు అనేకమంది బాధితుల రోగలక్షణాలను తగ్గించగలవు. * ఆ మందుల పేరు సూచిస్తున్నట్లుగా అవి హిస్టమైన్‌ చర్యను నిరోధిస్తాయి. అయితే పుప్పొడి చికాకుపరిచే ప్రభావాలను కలిగించినప్పటికీ, ఈ సూక్ష్మమైన జీవ రేణువుల రూపకల్పనలో, అవి వ్యాపించే విధానంలో కనిపించే సంక్లిష్టతనుబట్టి ఎవ్వరూ ముగ్ధులు కాకుండా ఉండలేరు. అవే గనుక లేకపోతే, భూ గ్రహం వాస్తవానికి బంజరు భూమిగా ఉండేది. (g03 7/22)

[అధస్సూచి]

^ గతంలో ఆంటీహిస్టమైన్స్‌ మగత కలిగించి, నోరు ఎండిపోయేలా చేసేవి. క్రొత్తగా రూపొందించిన మందులు ఈ దుష్ప్రభావాలను తగ్గించాయి.

[24, 25వ పేజీలోని డయాగ్రామ్‌]

కేసరం

పరాగకోశం

పుప్పొడి రేణువు

పుష్పదళం

గర్భకేసరం

కీలాగ్రం

పుప్పొడి నాళిక

స్త్రీబీజకోశం

స్త్రీబీజకణం

[చిత్రసౌజన్యం]

NED SEIDLER/NGS Image Collection

[25వ పేజీలోని చిత్రాలు]

వివిధరకాల పుప్పొడి సూక్ష్మదర్శిని దృశ్యం

[చిత్రసౌజన్యం]

పుప్పొడి రేణువులు: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.

[26వ పేజీలోని చిత్రాలు]

ఆడ కందిరీగ పోలికగల హ్యామర్‌ ఆర్కిడ్‌ పుష్పభాగం

[చిత్రసౌజన్యం]

Hammer orchid images: © BERT & BABS WELLS/OSF ▸

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

పుప్పొడి రేణువులు: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

పుప్పొడి రేణువులు: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.