కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోర్నోగ్రఫీ ఎందుకు అంతగా వ్యాప్తిచెందింది?

పోర్నోగ్రఫీ ఎందుకు అంతగా వ్యాప్తిచెందింది?

పోర్నోగ్రఫీ ఎందుకు అంతగా వ్యాప్తిచెందింది?

లైంగిక భావాలను రేకెత్తించే కామతప్త అంశాల రూపకల్పన వేల సంవత్సరాల క్రితమే ఉంది. కాని దాని చరిత్రలో చాలామట్టుకు, పోర్నోగ్రఫీకి సంబంధించినవి తయారుచేయడం కష్టంగా ఉండేది కాబట్టి అవి ముఖ్యంగా ధనవంతులకు, అధికార వర్గాలకు మాత్రమే లభ్యమయ్యేవి. కానీ విస్తృత ముద్రణ వల్ల, ఫోటోగ్రఫీ, కదిలే చిత్రాలు కనిపెట్టడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనవంతులుకానివారు కూడా పొందగలిగేలా పోర్నోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది.

వీడియో క్యాసెట్‌ రికార్డర్‌ పెరుగుదల ఈ ధోరణిని విస్తృతం చేసింది. సినిమా రీళ్ళు, పాత ఫోటోల్లా కాక, వీడియో క్యాసెట్లను భద్రపరచడం, కాపీ చేయడం, పంపిణీ చేయడం సులభం. వాటిని చాటుగా ఇళ్ళల్లో కూడా చూసే వీలుంది. ఇటీవల విస్తరించిన కేబుల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌లు మరింత సులభంగా పోర్నోగ్రఫీ లభ్యమయ్యేలా చేశాయి. వీడియో స్టోరులో పెద్దలకు మాత్రమే విభాగంలో ఎక్కడ పొరుగువాడి కంటబడతానో అని భయపడ్డ వినియోగదారుడు, ఇప్పుడు “కేబుల్‌ సిస్టమ్‌లో కేవలం బటన్‌నొక్కి ఇంటినుండే దానికొరకు ఆర్డర్‌ చేయడం లేదా నేరుగా తన టీవీలోనే చూడడం” సాధ్యమవుతుంది అని మీడియా విశ్లేషకుడైన డెన్నిస్‌ మాక్‌ఎల్పైన్‌ అంటున్నాడు. మాక్‌ఎల్పైన్‌ అభిప్రాయం ప్రకారం ఇలాంటి ప్రోగ్రాం చూడడం సులభం కావడం పోర్నోగ్రఫీని “మరనేకమంది అంగీకరించేలా చేసింది.”

జీవన స్రవంతిలో పోర్నోగ్రఫీ సర్వసాధారణమైంది

జీవన స్రవంతిలో పోర్నోగ్రఫీ సర్వసాధారణం కావడంతో చాలామందిలో మిశ్రిత భావాలు చోటుచేసుకున్నాయి. “అది ఇప్పటికే సంగీత రూపకం, బాలే నృత్యం, రంగస్థలం, సంగీతం, చిత్రకళలన్నింటి కన్నా అత్యంత పెద్ద సంస్కృతిలా తయారైంది” అని జర్మేని గ్రీర్‌ అనే రచయిత్రి అంటోంది. అనేకమంది ప్రముఖులు ధరించే ‘ప్రాస్టిట్యూట్‌ చిక్‌’ అనే ఫ్యాషన్‌ దుస్తుల్లో, అంతకంతకు అధికంగా లైంగిక ఊహల్లో డోలలాడించే మ్యూజిక్‌ వీడియోల్లో, “పోర్నోగ్రఫీని రమ్యంగా వర్ణించడాన్ని” ఎంచుకున్న అడ్వర్టయిజింగ్‌ మీడియాల్లో పోర్నోగ్రఫీ పట్లగల ఆధునిక దృక్పథాలు ప్రతిబింబిస్తున్నాయి. మాక్‌ఎల్పైన్‌ చివరికిలా అంటున్నాడు: “చెంచాతో మీడియా తినిపించేదే సమాజం స్వీకరిస్తోంది. . . . ఇదంతా మంచిదేననే తలంపు పుట్టేందుకు అది దోహదపడుతోంది.” ఆ కారణంగా “ప్రజలు ఆందోళనపడుతున్నట్లు కనిపించడంలేదు. వారికేమీ పట్టినట్టు లేదు” అని అండ్రియ డ్వోర్కిన్‌ అనే గ్రంథకర్త విచారం వ్యక్తం చేశాడు.

పోర్నోగ్రఫీకి మూలకారణాలు

గ్రంథకర్త డ్వోర్కిన్‌ వ్యాఖ్యానాన్నే ప్రతిధ్వనిస్తూ చాలామంది ప్రజలు “ఈ అశ్లీలత కలిగించే పర్యవసానాలను, అది తీసుకురాగల సమస్యలను చూడడంలేదు” అని ఎఫ్‌బిఐ నుండి పదవీ విరమణచేసిన రోజర్‌ యంగ్‌ సూచిస్తున్నాడు. పోర్నోగ్రఫీని సమర్థించేవారి మాటలకు ప్రభావితులైన కొంతమంది, పోర్నోగ్రఫీ చిత్రాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు రుజువేమీ లేదని వాదిస్తున్నారు. “పోర్నోగ్రఫీ కేవలం మనఃకల్పితం మాత్రమే, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం దాని వ్యతిరేకులకు కష్టంగా ఉన్నట్లుంది” అని ఎఫ్‌. ఎమ్‌. క్రిస్టన్సన్‌ అనే గ్రంథకర్త వ్రాస్తున్నాడు. కానీ ఆ మనఃకల్పిత భావనకు ఎలాంటి బలమూ లేకపోతే, ఈ అడ్వర్టయిజింగ్‌ పరిశ్రమ దేనిమీద ఆధారపడినట్లు? వాణిజ్య కార్యక్రమాలు, వీడియోలు, ముద్రిత యాడ్‌లు ప్రజలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనట్లయితే, వాటి తయారీకి వాణిజ్య సంస్థలు కోట్ల డాలర్లు ఎందుకు ఖర్చుపెడుతున్నట్లు?

వాస్తవమేమిటంటే విజయవంతమైన అన్ని వ్యాపార ప్రకటనల్లాగే, పోర్నోగ్రఫీ ముఖ్య ఉద్దేశం అంతకు ముందు లేని కోరికలను పుట్టించడమే. “పోర్నోగ్రఫీ కేవలం లాభార్జనకే తప్ప మరిదేనికీ కాదన్నది సుస్పష్టం. ఈ బజారులో లాభం కోసం అమ్మగలిగేది ఏదైనాసరే, ప్రత్యేకించి స్త్రీల శరీరాలు, మానవ లైంగిక సంబంధాలు లాభం కోసం అమ్ముకోవడం పెచ్చుపెరిగింది” అని స్టీవెన్‌ హిల్‌, నైన సిల్వర్‌ అనే పరిశోధకులు వ్రాశారు. గ్రీర్‌, పోషక విలువలు లేకపోయినా అలవాటుపడేలాచేసే పదార్థాలు, రసాయనాలు కలిపి అలవాటు మానుకోలేనంత రుచిగా తయారుచేయబడే ఫాస్ట్‌ ఫుడ్‌తో పోర్నోగ్రఫీని పోల్చారు. “వాణిజ్య సంబంధిత ఫాస్ట్‌ సెక్స్‌, అసలైన సెక్స్‌ కాదు . . . ఫుడ్‌ అడ్వర్టయిజింగ్‌ ఫాంటసీ ఫుడ్‌ అమ్ముతుంది, సెక్స్‌ అడ్వర్టయిజింగ్‌ ఫాంటసీ సెక్స్‌ను అమ్ముతుంది.”

మాదకద్రవ్యాల వ్యసనం కన్నా మరెంతో క్లిష్టమైన వ్యసనాన్ని పోర్నోగ్రఫీ కలిగించే అవకాశముందని కొందరు డాక్టర్లు అంటున్నారు. మాదకద్రవ్యాల వ్యసనపరులకు చేసే చికిత్స, సాధారణంగా వారి శరీరం నుండి ఆ పదార్థాన్ని తొలగించే డిటాక్సిఫికేషన్‌తో ప్రారంభమౌతుంది. కానీ పోర్నోగ్రఫీకి అలవాటు పడడం, “వ్యసనపరునిలో శాశ్వతమైన మానసిక చిత్రాలను ముద్రిస్తుంది, అవి మెదడు రసాయన ప్రక్రియలో ఓ అంతర్భాగమౌతాయి” అని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన డాక్టర్‌ మేరీ ఆన్‌ లేడెన్‌ వివరిస్తున్నారు. ఆ కారణంవల్లే ఆయా వ్యక్తులు అనేక సంవత్సరాలు గడిచిపోయినా పోర్నోగ్రఫీ సంబంధ చిత్రాలను స్పష్టంగా గుర్తుచేసుకోగలుగుతారు. ఆమె ముగింపుగా ఇలా అంటోంది: “ఇది డిటాక్సిఫికేషన్‌కు ఎలాంటి అవకాశంలేని మొట్ట మొదటి వ్యసనం.” అంటే పోర్నోగ్రఫీ ప్రభావం నుండి విముక్తి పొందడం అసాధ్యమని దీనర్థమా? పోర్నోగ్రఫీ నిర్దిష్టంగా ఎలాంటి హాని కలుగజేస్తుంది? (g03 7/22)

[5వ పేజీలోని బాక్సు]

ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ వాస్తవాలు

◼ ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ దాదాపు 75 శాతం అమెరికాలో తయారవుతుంది. సుమారు 15 శాతం యూరప్‌లో తయారవుతుంది.

◼ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లను వారానికి సుమారు ఏడు కోట్లమంది సందర్శిస్తున్నట్లు అంచనా. వారిలో దాదాపు రెండు కోట్లమంది వినియోగదార్లు కెనడా, అమెరికాల్లో ఉన్నారు.

◼ ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీకి యూరప్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ల తర్వాత జర్మనీలో అత్యధిక ప్రేక్షకులున్నట్లు ఇటీవలి ఒక నెల కాలంలో జరిపిన అధ్యయనం వెల్లడిచేసింది.

◼ జర్మనీలో ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ వినియోగదార్లు పోర్నోగ్రఫీ సైట్లను చూడడానికి సగటున నెలకు 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు.

◼ ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ చూసే యురోపియన్లలో, 50 ఏళ్లు దాటినవారే అత్యధిక సమయాన్ని పెద్దలకు మాత్రమే సంబంధించిన వెబ్‌ సైట్లలో గడుపుతున్నారు.

◼ ఒక పత్రిక ప్రకారం, ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ ట్రాఫిక్‌ 70 శాతం పగలే ఉంటోంది.

◼ దాదాపు 1,00,000 ఇంటర్నెట్‌ సైట్లలో చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించినవే చేర్చబడ్డాయని కొందరు అంచనావేశారు.

◼ సుమారు 80 శాతం ఇంటర్నెట్‌ వాణిజ్య చైల్డ్‌ పోర్నోగ్రఫీ జపాన్‌లో తయారవుతుంది.

[4వ పేజీలోని చిత్రాలు]

పోర్నోగ్రఫీ మరింత సులభంగా లభ్యమౌతోంది