కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోర్నోగ్రఫీ కలిగిస్తున్న హాని

పోర్నోగ్రఫీ కలిగిస్తున్న హాని

పోర్నోగ్రఫీ కలిగిస్తున్న హాని

అన్ని రకాల లైంగిక సమాచారం టెలివిజన్‌లో, సినిమాల్లో, మ్యూజిక్‌ వీడియోల్లో, ఇంటర్నెట్‌లో సులభంగా లభిస్తోంది. నిర్దాక్షిణ్యంగా చొరబడుతున్న ఈ పోర్నోగ్రఫీ సంబంధిత లైంగికత్వ మానసిక చిత్రాలు, హానిరహితమని మనల్ని నమ్మించాలని చాలామంది కోరుకుంటున్నట్లు, నిజంగా హానిరహితమైనవా? *

పెద్దల మీద పోర్నోగ్రఫీ కలిగించిన పరిణామాలు

దాన్ని సమర్థించేవారు ఏమి చెప్పినా ప్రజలకు సెక్స్‌ పట్ల, లైంగిక ప్రవర్తన పట్ల ఉన్న అభిప్రాయాలపై పోర్నోగ్రఫీ తీవ్ర పరిణామాలు కలిగించింది. జాతీయ కుటుంబ పరిశోధన, విద్యా సంస్థకు చెందిన పరిశోధకులు, “పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారిలో అసహజ లైంగిక ప్రవర్తన వృద్ధిచెందే తీవ్ర ప్రమాదముంది” అని తేల్చిచెప్పారు. వారి నివేదిక ప్రకారం, “అత్యాచారం కట్టుకథ (స్త్రీలే అత్యాచార పరిస్థితులు కలిగించి, అందులో ఆనందం అనుభవిస్తారు, రేపిస్టులు సామాన్యులు) అనే నమ్మకం పోర్నోగ్రఫీకి అలవాటుపడిన మగవాళ్ళలోనే విస్తరించింది.”

పోర్నోగ్రఫీకి అలవాటుపడడం సాధారణ దాంపత్య జీవితంలో ఆనందంతో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. లైంగిక వ్యసనపరుల చికిత్సా నిపుణుడైన డాక్టర్‌ విక్టర్‌ క్లైన్‌, పోర్నోగ్రఫీ అలవాటులో పదేపదే మామూలు నుండి తీవ్ర పరిస్థితికి వెళ్లడాన్ని గమనించాడు. యాదృచ్ఛికంగా చూడడంతో ప్రారంభమైన పోర్నోగ్రఫీని కట్టడిచేయకపోతే, చివరికది విశృంఖల, విపరీత లైంగిక దృశ్యాల స్థాయికి చేరుకుంటుంది. ఇది అసహజ లైంగిక కృత్యాలకు దారితీయవచ్చని ఆయన నొక్కిచెబుతున్నాడు. ప్రవర్తనా పరిశోధనా శాస్త్రవేత్తలు దీనితో ఏకీభవిస్తున్నారు. “ఏ విధమైన అసహజ లైంగిక ప్రవర్తనైనా ఈ విధంగానే అలవాటుకావచ్చు . . . అప్పుడు అపరాధ భావాలు ఎంత విస్తారంగావున్నా దాన్ని రూపుమాపడం సాధ్యం కాదు” అని డాక్టర్‌ క్లైన్‌ నివేదిస్తున్నాడు. చివరకు ఆ వ్యక్తి పోర్నోగ్రఫీలో చూసిన అనైతిక మనఃకల్పిత పద్ధతుల ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నించవచ్చు, దాని ఫలితాలు తరచూ వినాశకరంగా ఉంటాయి.

ఈ సమస్య చాప క్రింద నీరులా మెల్లగా, కనిపెట్టని విధంగా రావచ్చని క్లైన్‌ తేల్చిచెప్పాడు. ఆయన ఇలా అంటున్నాడు: “క్యాన్సర్‌లాగే ఇది అధికమవుతూ వ్యాప్తిచెందుతుంది. అదలా వ్యాపిస్తూనే ఉంటుంది, దీనికి చికిత్స, స్వస్థత కూడా చాలా కష్టం. ఈ దురలవాటున్న పురుషుడు తనకా అలవాటు లేదనడం, తనకు సమస్యలేదని నిరాకరించడం మామూలే, ఇది ఎక్కువగా వివాహంలో లేదా దంపతుల మధ్య సమస్యలకు, కొన్నిసందర్భాల్లో విడాకులకు, ఇతర సన్నిహిత సంబంధాలు తెగిపోవడానికి దారితీస్తుంది.”

యౌవనులకు జరిగే హాని

పోర్నోగ్రఫీ చూసేవారిలో ప్రాథమికంగా 12 నుండి 17 ఏండ్ల మధ్యనున్న అబ్బాయిలే ఉన్నారని గణాంకాలు చూపిస్తున్నాయి. నిజానికి చాలామందికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు పోర్నోగ్రఫీయే ప్రాథమిక మూలాధారంగా ఉంది. దీనివల్ల ఆందోళనకరమైన పరిణామాలు కలుగుతున్నాయి. “పోర్నోగ్రఫీలో బాల్య గర్భధారణ, ఎయిడ్స్‌ వంటి సుఖవ్యాధుల గురించి ఎన్నడూ చిత్రీకరించబడదు, ఆ విధంగా పోర్నోగ్రఫీలో ప్రదర్శించబడే ప్రవర్తనలో ఎలాంటి దుష్పరిణామాలు లేవనే అబద్ధ నమ్మకాన్ని అది కలిగిస్తోంది” అని ఒక నివేదిక చెబుతోంది.

పోర్నోగ్రఫీ పిల్లల మెదడు సహజ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మీడియా ఎడ్యుకేషన్‌ అధ్యక్షురాలైన డాక్టర్‌ జూడిత్‌ రేయిస్‌మాన్‌ ఇలా చెబుతోంది: “పోర్నోగ్రాఫిక్‌ సైట్ల సౌండ్లకు సహజంగానే మెదడులో కలిగే ప్రతిస్పందనల గురించిన ఆరోగ్యసంబంధ నాడీవ్యవస్థ పరిశోధన, పోర్నోగ్రఫీ చూడడాన్ని జీవశాస్త్రీయ విశేష ఘటనగా సూచించింది. అది విషయాన్ని అర్థంచేసుకొని అవగాహనకువచ్చే సహజ ప్రక్రియను కాలరాస్తుంది. ఈ సహజ ప్రక్రియను పోగొట్టుకోవడం పిల్లల అవగాహనా శక్తిని ప్రమాదంలో పడవేస్తుంది, కాబట్టి అది పిల్లల [తీర్చిదిద్దగల] ‘మృదువైన’ మెదడుకు హానికరం. పర్యవసానంగా వారి మానసిక శారీరక ఆరోగ్యం, వారి సంక్షేమం వారి సంతోషాన్వేషణ ప్రమాదంలో పడతాయి.”

సంబంధాలపై కలిగే పరిణామాలు

పోర్నోగ్రఫీ మనోవైఖరులను మార్చివేస్తుంది, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. దాని సందేశాలు మనఃకల్పితాలుగావుండి వాస్తవ పరిస్థితికంటే మరింత ఉత్తేజకరంగా అందజేయబడతాయి కాబట్టి అవి వలలో వేసుకునేవిగా ఉంటాయి. (“మీరు ఏ సందేశాన్ని స్వీకరిస్తారు?” అనే బాక్సులోని సమాచారం చూడండి.) “పోర్నోగ్రఫీకి అలవాటుపడినవారు సంబంధాలు తెగిపోవడానికి దారితీసే అవాస్తవిక ఆశలను తమలో పెంచుకుంటారు” అని ఒక నివేదిక పేర్కొంటోంది.

వివాహంలో అత్యావశ్యక లక్షణాలైన నమ్మకాన్ని, నిజాయితీని పోర్నోగ్రఫీ నశింపజేయగలదు. పోర్నోగ్రఫీ ప్రాముఖ్యంగా రహస్యంగా చూసేది కాబట్టి అది తరచూ మోసానికి అబద్ధానికి దారితీస్తుంది. భాగస్వాములు మోసగించబడినట్లు భావిస్తారు. తమ వివాహిత భాగస్వామికి తమ పట్ల ఆకర్షణ ఎందుకు కొరవడిందో వారికి అంతు చిక్కదు.

ఆధ్యాత్మిక హాని

పోర్నోగ్రఫీ గంభీరమైన ఆధ్యాత్మిక హాని కలిగిస్తుంది. దేవునితో సంబంధం కలిగివుండాలని ప్రయత్నించే వ్యక్తికి ఇది నిజంగా ఒక ఆటంకంగా మారుతుంది. * బైబిలు కామాతురతను దురాశ, విగ్రహారాధనలతో ముడిపెడుతోంది. (కొలొస్సయులు 3:5) ఒక వ్యక్తి దేనికొరకైనా అతిగా ఆశపడడం ఆరంభిస్తే, ఆయన దాన్ని ఎంతగా కోరుకుంటాడంటే ఆయనకది తన జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారుతుంది. వాస్తవానికి, పోర్నోగ్రఫీకి అలవాటుపడినవారు దేవునికంటే తమ లైంగిక కోరికకే ప్రాధాన్యమిస్తారు. ఆ విధంగా వారు దాన్నొక ఆరాధ్యదైవంగా చేసుకుంటారు. అయితే యెహోవా దేవుని ఆజ్ఞ ఇలా చెబుతోంది: “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.”​—నిర్గమకాండము 20:3.

పోర్నోగ్రఫీ ప్రేమగల సంబంధాలను నాశనం చేస్తుంది. స్వయంగా వివాహితుడైన అపొస్తలుడైన పేతురు, క్రైస్తవ భర్తలు తమ భార్యలను సన్మానించాలని ఉద్బోధించాడు. అలా సన్మానించని భర్త దేవునికి చేసే ప్రార్థనలు అడ్డగించబడతాయి. (1 పేతురు 3:7) స్త్రీల అసభ్యకర చిత్రాలను రహస్యంగా చూడడం, తన సొంత భార్యను సన్మానించినట్లవుతుందా? ఆమెకు ఆ విషయం తెలిస్తే ఆమె ఏమనుకుంటుంది? “గూఢమైన ప్రతి యంశమునుగూర్చి . . . విమర్శచే[సే]” దేవుడు, “ఆత్మలను పరిశోధించు” దేవుడు ఏమనుకుంటాడు? (ప్రసంగి 12:14; సామెతలు 16:2) పోర్నోగ్రఫీకి అలవాటుపడిన వ్యక్తి తన ప్రార్థనలను దేవుడు వింటాడని నిరీక్షించేందుకు ఏదైనా కారణముందా?

ఎట్టి పరిస్థితుల్లోనైనా తన భోగాసక్తులను తీర్చుకోవాలన్నది పోర్నోగ్రఫీ యొక్క ముఖ్య విలక్షణం. కాబట్టి పోర్నోగ్రఫీ చూడడం ప్రేమరహితమైనది. అది పవిత్రతను, దేవుని ఎదుట నైతికంగా స్వచ్ఛమైన స్థానాన్ని కాపాడుకోవడానికి చేసే ఒక క్రైస్తవుని పోరాటాన్ని బలహీనపరుస్తుంది. “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, . . . పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.​—1 థెస్సలొనీకయులు 4:3-7.

పోర్నోగ్రఫీ ప్రత్యేకించి స్త్రీలకు పిల్లలకు అన్యాయం చేస్తుంది. అది వారిని కించపరచి వారి గౌరవాన్ని హక్కులను దోచుకుంటుంది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన వ్యక్తి అలాంటి అన్యాయం చేస్తాడు, దానికి మద్దతు ఇస్తాడు. స్టీవెన్‌ హిల్‌ మరియు నైన సిల్వర్‌ అనే పరిశోధకులు ఇలా అంటున్నారు: “ఒక వ్యక్తి తానెంతో బుద్ధిమంతుడని అనుకున్నా, పోర్నోగ్రఫీ పట్ల అతనికుండే అంతర్నిహిత ఆమోదం, తను ప్రేమిస్తున్నానని చెప్పుకునే వారిపట్ల అతను అత్యంత మంచి పరిస్థితుల్లో [శ్రద్ధలేని వ్యక్తిగా], అత్యంత చెడు పరిస్థితుల్లో స్త్రీద్వేషిగా చేస్తుంది.”

పోర్నోగ్రఫీ అలవాటును వదిలించుకోవడం

మీరు ప్రస్తుతం పోర్నోగ్రఫీ అలవాటుతో తంటాలుపడుతున్నట్లయితే ఎలా? దాన్నుండి విముక్తి పొందడానికి ఏమైనా చేయవచ్చా? దానికి బైబిలు నిరీక్షణనిస్తోంది! కొందరు తొలి క్రైస్తవులు, క్రీస్తును తెలుసుకోవడానికి ముందు జారులు, వ్యభిచారులు, దురాశపరులుగా ఉండేవారు. కానీ ‘మీరు కడుగబడ్డారు’ అని పౌలు అన్నాడు. అదెలా సాధ్యమైంది? ఆయనిలా జవాబిచ్చాడు: ‘మన దేవుని ఆత్మయందు మీరు పరిశుద్ధపరచబడ్డారు.’​—1 కొరింథీయులు 6:9-11.

దేవుని పరిశుద్ధాత్మను ఎన్నటికీ తక్కువగా అంచనావేయకండి. “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు” అని బైబిలు చెబుతోంది. నిజానికి, ఆయన తప్పించుకొనే మార్గమును కలుగజేస్తాడు. (1 కొరింథీయులు 10:13) నిరంతరం మీ సమస్యను దేవునికి విన్నవిస్తూ పట్టుదలతో చేసే ప్రార్థన మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఆయన వాక్యమిలా ప్రోత్సహిస్తోంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”​—కీర్తన 55:22.

అయితే, మీరు మీ ప్రార్థనలకు అనుగుణంగా ప్రవర్తించాలి. పోర్నోగ్రఫీని మానుకోవాలని ఉద్దేశపూర్వకంగా, హృదయపూర్వకంగా నిర్ణయించుకోవాలి. మీరు మీ తీర్మానానికి కట్టుబడి ఉండేందుకు కావలసిన సహాయాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో విశ్వసనీయమైన స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడు అమూల్యమైన సహాయంగా ఉండవచ్చు. (“సహాయం పొందడం” అనే బాక్సు చూడండి.) అలాంటి మీ నడవడి దేవుణ్ణి తప్పకుండా సంతోషపరుస్తుందని గుర్తుంచుకోవడం నిర్ణయబద్ధులుగా ఉండేందుకు మీకు సహాయపడుతుంది. (సామెతలు 27:11) అంతేకాకుండా, మీరు పోర్నోగ్రఫీ చూడడం దేవునికి బాధకలిగిస్తుందని తెలుసుకోవడం కూడా, దాన్ని వదిలేసేందుకు అదనపు ప్రేరణగా ఉంటుంది. (ఆదికాండము 6:5, 6) అదంత సులభమైన పోరాటం కాదు, అయినా దాని మీద గెలుపు సాధించవచ్చు. పోర్నోగ్రఫీ అలవాటును వదిలించుకోవచ్చు!

పోర్నోగ్రఫీ వల్ల కలిగే ప్రమాదాలు అనివార్యం. అది హానికరమైనది వినాశకరమైనది. దాన్ని రూపొందించేవారిని దాన్ని వినియోగించేవారిని అది భ్రష్టుపట్టిస్తుంది. అది స్త్రీలకు పురుషులకు అవమానకరమైనది, పిల్లలకు ప్రమాదకరమైనది, అది తిరస్కరించవలసిన అలవాటు. (g03 7/22)

[అధస్సూచీలు]

^ ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ ప్రమాదాల వివరణాత్మక చర్చ కోసం, దయచేసి “ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీ​—అది ఎలాంటి హాని చేయగలదు?” అనే శీర్షికతో వచ్చిన ఆర్టికల్‌ల పరంపరను జూన్‌ 8, 2000 తేజరిల్లు! (ఆంగ్లం)లో 3-10 పేజీల్లో చూడండి.

^ పోర్నోగ్రఫీపైన బైబిలు ఉద్దేశం గురించిన చర్చ కోసం దయచేసి జూలై 8, 2002, తేజరిల్లు! (ఆంగ్లం)లోని 19-21 పేజీలు చూడండి.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

సహాయం పొందడం

పోర్నోగ్రఫీ నుండి విముక్తి పొందడానికి చేసే పోరాటాన్ని తక్కువగా అంచనా వేయకూడదు; అది కష్టమైన యుద్ధమే కావచ్చు. సెక్సు వ్యసనపరులైన వందలమందికి చికిత్స చేసిన డాక్టర్‌ విక్టర్‌ క్లైన్‌ ఇలా అంటున్నాడు: “కేవలం వాగ్దానాలు మాత్రమే సరిపోవు. సదుద్దేశాలున్నంత మాత్రాన ఫలితాలు రావు. వాస్తవానికి [సెక్సు వ్యసనపరుడు] తనకు తాను దీన్ని చేయలేడు.” క్లైన్‌ అభిప్రాయం ప్రకారం, సదరు వ్యక్తి వివాహితుడైతే, అతనికి చేసే చికిత్స విజయవంతం కావడానికి ఆ చికిత్సావిధానంలో ఆ వ్యక్తి భాగస్వామిని కూడా చేర్చాలి. “ఆ చికిత్సలో ఇద్దరిని చేర్చడంవల్ల నివారణ తొందరగా జరుగుతుంది. కారణం, ఇద్దరికీ గాయమైంది. ఇద్దరికీ సహాయం అవసరం” అని ఆయన నొక్కిచెబుతున్నాడు.

ఒకవేళ ఆ వ్యక్తి అవివాహితుడైతే, తరచూ ప్రాణ స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడు బలానికి ఆలంబనగా ఉండవచ్చు. చికిత్స కోసం ఎవరు వచ్చినా, క్లైన్‌ దగ్గర ఒక ఖచ్చితమైన నియమం ఉంది: సమస్య గురించి, ఎప్పుడైనా తిరిగి అవే పొరపాట్లు చేసినా అరమరికలు లేకుండా మాట్లాడాలి. “రహస్యాలు ‘మిమ్మల్ని చంపేస్తాయి,’ అవి సిగ్గును, అపరాధ భావాన్ని కలిగిస్తాయి” అని ఆయన అంటున్నాడు.

[9వ పేజీలోని చార్టు]

మీరు ఏ సందేశాన్ని స్వీకరిస్తారు?

పోర్నోగ్రఫీ సందేశం

◼ సెక్సు ఎవరితోనైనా, ఎప్పుడైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ విధంగానైనా మంచిదే దానిలో ఎలాంటి ప్రతికూల పరిణామాలు లేవు.

బైబిలు దృక్పథం

“వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.”​—హెబ్రీయులు 13:4.

“జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.”​—1 కొరింథీయులు 6:18; రోమీయులు 1:26, 27 కూడా చూడండి.

పోర్నోగ్రఫీ సందేశం

◼ లైంగిక సంతృప్తికి వివాహము ఒక

బైబిలు దృక్పథం

“నీ యౌవనకాలపు భార్యయందు ఆటంకం. సంతోషింపుము. . . . ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.”​—సామెతలు 5:18, 19; అలాగే ఆదికాండము 1:28; 2:24; 1 కొరింథీయులు 7:3 కూడా చూడండి.

పోర్నోగ్రఫీ సందేశం

◼ స్త్రీల ఏకైక సంకల్పం​—పురుషుల లైంగిక అవసరాలను తీర్చడం.

బైబిలు దృక్పథం

“దేవుడైన యెహోవా​—వానికి సాటియైన

పోర్నోగ్రఫీ సందేశం సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.”​—ఆదికాండము 2:18; ఎఫెసీయులు 5:28 కూడా చూడండి.

◼ స్త్రీపురుషులు తమ లైంగిక వాంఛలకు బానిసలు.

బైబిలు దృక్పథం

“కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.”​—కొలొస్సయులు 3:5.

“మీలో ప్రతివాడును, . . . పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుం[డాలి].”​—1 థెస్సలొనీకయులు 4:4.

“తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను” దృష్టించండి.​—1 తిమోతి 5:1, 2; 1 కొరింథీయులు 9:27 కూడా చూడండి.

[7వ పేజీలోని చిత్రం]

పోర్నోగ్రఫీ పిల్లవాడి మెదడు యొక్క సహజ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశముందని కొందరు పరిశోధకులు అంటున్నారు

[8వ పేజీలోని చిత్రం]

పోర్నోగ్రఫీ వివాహంలోని నమ్మకాన్ని, నిజాయితీని నాశనం చేస్తుంది

[10వ పేజీలోని చిత్రం]

పట్టుదలతోచేసే ప్రార్థన సత్ఫలితాలనిస్తుంది