కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పోర్నోగ్రఫీ భిన్న దృక్పథాలు

పోర్నోగ్రఫీ భిన్న దృక్పథాలు

పోర్నోగ్రఫీ భిన్న దృక్పథాలు

“అది కలుగకూడని విపరీత కోరికలను పుట్టిస్తుంది, తనివితీరని వాంఛలను ప్రేరేపిస్తుంది.”​—టోనీ పార్సన్స్‌, పత్రికా విలేఖరి.

‘ఇంటర్నెట్‌ సెక్స్‌కు’ అలవాటుపడాలని జాన్‌ ఎన్నడూ అనుకోలేదు. * పోర్నోగ్రఫీ, సెక్స్‌ ఛాట్‌ రూములు అనేకమందికి యాదృచ్ఛికంగా తారసపడినట్లే, ఆయన ఒకరోజు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా అలాంటి ఛాట్‌ రూముల సైట్‌ తెరమీదికి రావడం చూసి తడబడ్డాడు. కొద్దికాలంలోనే ఆయన సైబర్‌ సెక్స్‌లో పూర్తిగా మునిగిపోయాడు. “నా భార్య పనికి వెళ్ళేంతవరకు వేచి ఉండేవాడిని” అని గుర్తుచేసుకుంటూ, “ఆ వెంటనే మంచం మీది నుండి ఒక్క గెంతుతో బయటపడి కంప్యూటర్‌ ముందర గంటలకొలది సమయం గడిపేవాడిని” అని ఆయన అంటున్నాడు. ఆయనలా గంటలుగంటలు అతుక్కుపోయి ఆహారపానీయాలు కూడా మరచిపోయేవాడు. “నాకు ఆకలికూడా తెలిసేది కాదు” అని అంటున్నాడు. ఆయన తన రహస్య కార్యకలాపాల గురించి తన భార్యతో అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. అది ఆయన పని మీది ఏకాగ్రతను భంగపరచడం ప్రారంభించింది, ఆయన క్రమ క్రమంగా ఏదో పరధ్యానంలోవున్న వ్యక్తిగా తయారయ్యాడు. ఆయన వివాహ జీవితానికి తీవ్ర హానికలగడం మొదలయ్యింది, అలా చివరకు ఆయన తన సైబర్‌ సెక్స్‌ భాగస్వామిని కలుసుకునే ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ విషయం ఆయన భార్యకు తెలిసిపోయింది. నేడు జాన్‌ తన వ్యసనానికి చికిత్స పొందుతున్నాడు.

పోర్నోగ్రఫీ నిరోధక కార్యకర్తలు, పోర్నోగ్రఫీ వల్ల కలిగే దుష్పరిణామాలకు నిదర్శనంగా ఇలాంటి అనుభవాలను చెబుతారు. అది అనుబంధాలను నాశనం చేస్తుంది, స్త్రీని కించపరుస్తుంది, పిల్లలను పాడుచేస్తుంది, సెక్స్‌ పట్ల అదుపుతప్పిన హానికరమైన దృక్పథాన్ని కలిగిస్తుందని వారంటున్నారు. మరోవైపున, దాని మద్దతుదారులు పోర్నోగ్రఫీని సమర్థిస్తూ, అది స్వేచ్ఛకు వ్యక్తీకరణ అంటూ దాన్ని నిరోధించేవారిని అతి బిడియస్థులుగా దృష్టిస్తారు. “ప్రజలు తమ విభిన్న లైంగిక ఆసక్తుల లేక కోరికల విషయంలో సిగ్గుపడకూడదు. సెక్సు గురించి నిష్పాక్షికమైన చర్చలను ప్రారంభించి, ప్రోత్సహించేందుకు పోర్నోగ్రఫీ ఉపయోగించవచ్చు” అని దానిని ప్రతిపాదించే ఒక వ్యక్తి వ్రాశాడు. కొందరైతే పోర్నోగ్రఫీ వ్యాప్తిని నూతన భావాలుగల, ఆరోగ్యకరమైన సమాజానికి గుర్తింపు చిహ్నమని కూడా సూచించారు. “పెద్దల మధ్య జరిగే ఇష్టారాజ్య లైంగిక చర్యలను సహించేంతగా పరిణతిచెందిన సమాజమే బహుశా బహువిధ లైంగికత్వానికి, స్త్రీల సమానత్వానికి అనువైన సమాజంగా ఉంటుంది” అని బ్రయన్‌ మెక్‌నార్‌ అనే రచయిత అంటున్నాడు.

సమాజపు మిశ్రిత అభిప్రాయాలు పోర్నోగ్రఫీని ఆమోదకరం చేస్తాయా? ఇది ఇంతగా ఎందుకు వ్యాప్తిచెందింది? పోర్నోగ్రఫీ నిజంగా ప్రమాదకరమా? దీని తర్వాతి ఆర్టికల్స్‌ ఈ ప్రశ్నలను పరిశీలిస్తాయి. (g03 7/22)

[అధస్సూచి]

^ పర్లు మార్చబడ్డాయి.