కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ఏనుగులను అడ్డుకునే తేనెటీగలు

కెన్యాలో ఏనుగుల సంఖ్య పెరుగుతోంది, అయితే దానివల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఏనుగుల దండు చెట్లను, పంట పొలాలను నాశనం చేస్తోంది, ప్రతి రెండు వారాలకు సగటున ఒక వ్యక్తిని అవి తొక్కి చంపేస్తున్నాయి. అయితే ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త ఫ్రిట్జ్‌ వాల్రాత్‌ వాటిని అడ్డుకునే ఉపాయమొకటి కనుగొన్నాడు. ఏనుగులు ఒక తేనెతట్టును కదిలించినప్పుడు “అవి చూస్తూ ఊరుకోవు. వెంటనే పరుగెత్తడం ప్రారంభిస్తాయి, తేనెటీగలు వాటిని వెన్నంటి [చాలా కిలోమీటర్ల] వరకు తరుముతాయి” అని ఆయన చెబుతున్నాడు. తేనెటీగలు ఏనుగులకు నొప్పికలిగే శరీరభాగాల్లో అంటే కళ్ళ చుట్టూ, చెవుల వెనుక, తొండం క్రింద, కడుపు మీద కుడతాయి. ఏనుగులు తరచుగా సంచరించే అడవిలోని కొన్ని చెట్లకు, వాల్రాత్‌ ఆఫ్రికన్‌ తేనెటీగల తెట్టెలు కొన్ని నిండువి కొన్ని ఖాళీవి అక్కడక్కడా తగిలించాడు. ఏనుగులు తేనెటీగలున్న తెట్టెలు తగిలించిన అన్ని చెట్ల దగ్గరకు, ఖాళీ తెట్టెలున్న చెట్లలో మూడవ వంతు దగ్గరకు వెళ్ళకుండా జాగ్రత్తపడ్డాయని న్యూ సైంటిస్ట్‌ నివేదిస్తోంది. అయితే తేనెతెట్టెలు తగిలించని చెట్లలో పదింట తొమ్మిది చెట్లను అవి నాశనం చేశాయి. కోపంతోవున్న తేనెటీగల శబ్దాన్ని లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపించినప్పుడు సహితం ఏనుగులు ఆ దరిదాపులకు రావని కూడా వాల్రాత్‌ కనుగొన్నాడు. (g03 7/08)

ఇండియాలో పెరుగుతున్న మధుమేహవ్యాధి

ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లకంటే ఎక్కువమందికి మధుమేహవ్యాధి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఆ వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఇండియాలోనే ఎక్కువగా ఉంది, ప్రస్తుతం ఇండియాలో 3.2 కోట్లమందికి ఆ వ్యాధి ఉండగా 2005 కల్లా ఆ సంఖ్య 5.7 కోట్లను దాటుతుందని డెక్కన్‌ హెరాల్డ్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. ఆసియాలో మధుమేహవ్యాధి గురించి చర్చించేందుకు శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, మధుమేహవ్యాధిగలవారి సంఖ్య ఇలా హఠాత్తుగా పెరిగిపోవడానికి మానసిక ఒత్తిడి, జన్యుకారకాలు, బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, శిశువులకు అతిగా ఆహారం పెట్టడం వంటి కారణాలతోపాటు ఆహార విధానంలోను జీవిత విధానంలోను వచ్చిన మార్పులు ప్రాథమిక కారణాలని నిపుణులు పేర్కొన్నారు. ఇండియాలో మధుమేహవ్యాధి చికిత్సకయ్యే ఖర్చు ప్రపంచంలోనే అతి స్వల్పం. అయినప్పటికీ మధుమేహవ్యాధికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, మరణించే వారి సంఖ్య ఎంతో అధికంగా ఉన్నాయి, దానికి కొంతవరకు ఆ వ్యాధి గురించి తెలియకపోవడం, ఆలస్యంగా రోగ నిర్ధారణ జరగడమే కారణం. ఇండియాలోని మహానగరాల్లో నిర్వహించబడిన అధ్యయనం, వయోజనుల జనాభాలో 12 శాతం మంది మధుమేహవ్యాధితో బాధపడుతున్నారు, 14 శాతం మందికి తరచు మధుమేహవ్యాధి వృద్ధికాకముందు కనిపించే గ్లూకోస్‌ విచ్ఛిన్న సామర్థ్యలోపం ఉన్నట్లు కనుగొనబడింది. (g03 7/22)

రెండు సెట్ల నరాలా?

మానవులకు ప్రేమను, వాత్సల్యమును గ్రహించగల ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ అనుగ్రహించబడిందని జర్మన్‌ సాంకేతిక పత్రిక బిల్డ్‌ డార్‌ విస్సన్‌షాఫ్ట్‌ నివేదిస్తోంది. తన ముఖ్య స్పర్శ గ్రాహకములను కోల్పోయిన స్త్రీని ఒక మెత్తని పెయింట్‌ బ్రష్‌తో తట్టినప్పుడు ఆమెకు ఆ సున్నితమైన స్పర్శ తెలిసింది. ఆ స్పర్శా భావం చర్మంలోవుండే ద్వితీయ నాడీ వ్యవస్థ అంటే టాక్టయిల్‌ C తంతువులు అని పిలువబడే నిదాన వాహక తంతువులుండే నాడీ వ్యవస్థ కలిగించినదని వారు కనుగొన్నారు. ఆ వ్యవస్థ కేవలం మృదువైన స్పర్శకు మాత్రమే స్పందించి భావావేశాలతో వ్యవహరించే మెదడు భాగాలను చైతన్యవంతం చేస్తుంది. మానవులకు రెండు విభిన్నమైన నరాల సెట్లు ఎందుకున్నాయనే దానిపై వ్యాఖ్యానిస్తూ, ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ ఇలా చెబుతోంది: “జీవిత తొలి ఘడియలనుండే బహుశా గర్భంలో ఉన్నప్పటినుండే నిదాన వాహక తంతువులు పనిచేస్తాయి, అయితే వేగ వాహక తంతువులు పుట్టుక తర్వాత నెమ్మదిగా వృద్ధిచెందుతాయి. నవశిశువులు తమ స్వీయ స్పర్శను గ్రహించడానికి ముందే తల్లిదండ్రుల ప్రేమపూర్వక స్పర్శను గ్రహించే అవకాశముంది.” (g03 7/22)

దోమలనుండి రక్షణ

“2,500పైగా జాతులుగల దోమలు గ్రహమంతా వ్యాపించి ఉన్నాయి” అని మెక్సికో డెస్‌కొనోసిడో పత్రిక పేర్కొంది. మగ దోమలు ఆడ దోమలు మకరందం తింటాయి కాని ఆడ దోమలు మాత్రమే కుడతాయి. తద్వారా అవి మానవులకు మలేరియా, డెంగ్యూ, వెస్ట్‌ నైల్‌ వైరస్‌లను సంక్రమింపజేస్తాయి. దోమల బారినుండి మిమ్మల్ని మీరెలా కాపాడుకోవచ్చు? ఆ నివేదిక ఈ క్రింది సలహాలను సూచిస్తోంది: (1) దోమలు అత్యంత చురుకుగా వుండే సంధ్యవేళల్లో, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకండి. (2) దోమ తెరలను, దోమలను పారద్రోలే మందుతో తడిపిన దోమ తెరలను ఉపయోగించండి. (3) వదులుగావుండే పొడుగు చేతుల చొక్కాలు ప్యాంట్లు ధరించండి, అవసరమైతే తలంతా కప్పివుంచే నెట్‌వున్న టోపీ పెట్టుకోండి. (4) బయటకు కనబడే శరీర భాగాలకు దోమలను ప్రారదోలే మందు రాసుకోండి. (5) ప్రతిరోజు 300 మిల్లి గ్రాముల B1 విటమిన్‌ తినండి. ఇది కొందరిలో దోమలకు పడని చెమట పుట్టిస్తుంది. (6) చిత్తడి ప్రదేశాల్లో అత్యవసర కవచంగా ఒంటికి బురద పూసుకోండి. దోమ కుడితే గోకకండి, ఎందుకంటే రక్తం కారడం ఇనఫెక్షన్‌కు దారితీస్తుంది. బదులుగా కాలమైన్‌ లోషన్‌ రాయండి. (g03 8/08)