కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బ్రోలి తీసుకెళ్ళడం మరచిపోకండి!”

“బ్రోలి తీసుకెళ్ళడం మరచిపోకండి!”

“బ్రోలి తీసుకెళ్ళడం మరచిపోకండి!”

బ్రిటన్‌లోని తేజరిల్లు! రచయిత

బ్రిటన్‌లో చాలామంది సాధారణంగా ప్రతిరోజు గొడుగు తీసుకొనివెళతారు. ఈ రోజు వర్షం కురవదు అని ఖచ్చితంగా చెప్పలేము. ఇంటినుండి బయలుదేరేటప్పుడు “బ్రోలి తీసుకెళ్ళడం మరచిపోకండి!” అని ఒకరితో ఒకరం చెప్పుకుంటుంటాము, ఆ తర్వాత బస్సులోనో, ట్రెయిన్‌లోనో లేదా షాపులోనో దానిని మరచిపోతుంటాము. * అవును మనతోపాటు ఎక్కడికి కావలసివస్తే అక్కడికి తీసుకువెళ్ళగల ఈ ఆశ్రయాన్ని మనం తేలికగా తీసుకుంటాము ఎందుకంటే ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చు. కాని అన్ని సందర్భాల్లోను గొడుగు తేలికగా తీసిపారేసేదిగా దృష్టింపబడలేదు.

దాని సుప్రసిద్ధ చరిత్ర

మొట్ట మొదటి గొడుగులకు వర్షాలకు సంబంధమే ఉండేది కాదు. అవి విశిష్టవర్గానికి గౌరవానికి ప్రతీకగా ఉండి, ప్రముఖులకు మాత్రమే పరిమితమయ్యేవి. అస్సీరియా, ఈజిప్టు, పర్షియా, ఇండియాకు చెందిన వేలాది సంవత్సరాల పురాతన శిల్పాల్లోను, చిత్రాల్లోను పరిపాలకులకు ఎండ తగలకుండా వారి సేవకులు వారికి ఆతపత్రాలు పట్టుకొనివుండడం కనిపిస్తుంది. అస్సీరియాలో కేవలం రాజుకు మాత్రమే గొడుగు ఉపయోగించే అధికారం ఉండేది.

చరిత్రంతటా ప్రత్యేకించి ఆసియాలో గొడుగు అధికారానికి ప్రతీకగా నిలిచింది. ఒక పరిపాలకుని స్థాయి ఆయనకున్న గొడుగులను బట్టి అధికమయ్యేది, బర్మా రాజు ఇరవై నాలుగు గొడుగుల ప్రభువు అని పిలువబడడాన్నిబట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు వాటికుండే దొంతరల సంఖ్య ప్రాముఖ్యమైనదిగా ఎంచబడేది. చైనా చక్రవర్తి గొడుగుకు నాలుగు దొంతరలు ఉండేవి, సియాము రాజు గొడుగుకు ఏడు లేదా తొమ్మిది దొంతరలు ఉండేవి. నేడు కూడా కొన్ని ప్రాచ్య మరియు ఆఫ్రికా దేశాల్లో గొడుగు అధికారానికి ప్రతీకగా ఉంది.

మతసంబంధ గొడుగులు

చరిత్రారంభంలో గొడుగుకు మతానికి సంబంధముండేది. నట్‌ దేవత భూమంతటినీ ఒక గొడుగులా తన శరీరంతో కప్పివుంచేదని ప్రాచీన ఐగుప్తీయులు తలంచేవారు. కాబట్టి ప్రజలు ఆమె రక్షణ పొందేలా తమ వెంట తీసుకెళ్ళగలిగే “ఛత్రముల” క్రింద నడిచేవారు. ఇండియాలోను చైనాలోను ప్రజలు తెరచివున్న గొడుగు, ఈ చివరనుండి ఆ చివర వరకు ధనురాకారంలో పరచుకొనివున్న ఆకాశానికి సూచన అని నమ్మేవారు. తొలికాలపు బౌద్ధమతస్థులు దానిని బుద్ధునికి సంకేతంగా ఉపయోగించారు, వారి బౌద్ధక్షేత్రాల ప్రాసాదాల పైకప్పుపై తరచూ గొడుగులు ఉంచేవారు. హిందూమతంలో కూడా గొడుగులకు ఓ స్థానముంది.

సా.శ.పూ. 500 నాటికి గొడుగులు గ్రీసుకు విస్తరించాయి, అక్కడ మతసంబంధ పండుగల్లో దేవుళ్ల, దేవతల ప్రతిమలకు గొడుగులు పట్టేవారు. ఏథెన్సులోని స్త్రీలకు గొడుగుపట్టే సేవకులుండేవారు, అయితే కొద్దిమంది పురుషులు మాత్రమే గొడుగు ఉపయోగించేవారు. గ్రీసునుండి ఆ ఆచారం రోమ్‌కు ప్రాకింది.

రోమన్‌ క్యాథలిక్‌ చర్చి దాని ఆచారవ్యవహారాల్లో గొడుగును చేర్చుకుంది. పోప్‌కు ఎరుపు, పసుపుపచ్చ చారలుగల పట్టు గొడుగు, కార్డినల్స్‌కు, బిషప్పులకు ఊదారంగు లేదా ఆకుపచ్చరంగు గొడుగులు వాడడం ఆరంభమయ్యింది. బాసిలికాల్లో నేటికీ పోప్‌ సంబంధిత రంగులుగల ఓంబ్రిలోన్‌ లేదా గొడుగువున్న కుర్చీ పోప్‌ కోసం ఉంటుంది. ఒక పోప్‌ మరణించిన దగ్గర నుండి మరో పోప్‌ ఎన్నుకోబడే వరకు చర్చి అధిపతిగా వ్యవహరించే కార్డినల్‌కు కూడా ఆ సమయంలో అతని వ్యక్తిగత చిహ్నంగా ఒక ఓంబ్రిలోన్‌ ఉంటుంది.

నీడనివ్వడం నుండి వర్షానికి ఒక కవచం వరకు

చైనీయులైన లేదా బహుశా ప్రాచీన రోమ్‌కు చెందిన స్త్రీలు వర్షంలో తడవకుండా ఉండడానికి తమ కాగితపు ఆతపత్రాలకు నూనె, మైనం రాయడం ఆరంభించారు. అయితే 16వ శతాబ్దంలో ఇటలీ ప్రజలు, ఆ తర్వాత ఫ్రెంచివారు మళ్ళీ గొడుగు ఉపయోగించడం ప్రారంభించేంతవరకు ఎండకోసం లేదా వర్షంకోసం ఉపయోగించే గొడుగుల ఆలోచన యూరప్‌లో లేకుండాపోయింది.

18వ శతాబ్దానికల్లా బ్రిటన్‌లో స్త్రీలు గొడుగులు ఉపయోగించడం ప్రారంభించారు, కాని పురుషులు గొడుగు కేవలం స్త్రీల వస్తువని దృష్టిస్తూ దానిని వెంట తీసుకెళ్లడానికి నిరాకరించేవారు. అయితే కాఫీహౌస్‌ యజమానులు మాత్రం వాటిని ఉపయోగించేవారు, తమ కస్టమర్లు కాఫీహౌస్‌ బయటకు వచ్చి గుర్రపు బగ్గీలవరకు వెళ్ళేదాక వారికి ఎండవానలు తగులకుండా ఉండేందుకు వాటిని ఉపయోగించడంలోని ప్రయోజనాన్ని వారు గ్రహించారు. కుండపోతగా వర్షం కురుస్తుండగా చర్చి ఆవరణలో అంత్యక్రియలు జరిగించవలసి వచ్చినప్పుడు గొడుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మతనాయకులు కూడా గ్రహించారు.

యాత్రికుడు, ప్రజోపకారియైన జోనెస్‌ హాన్‌వే ఇంగ్లాండులో గొడుగుల చరిత్రనే మార్చివేశాడు. లండన్‌లో బహిరంగంగా గొడుగు వెంట తీసుకెళ్ళిన మొదటి ధైర్యశాలి ఆయనే అని చెప్పబడుతోంది. తన విదేశీ ప్రయాణాల్లో పురుషులు వాటిని ఉపయోగించడం చూసిన తర్వాత, బాడుగకు గుర్రపు బగ్గీలు తోలేవారు ఎగతాళి చేస్తూ కాలువలోని బురదనీరు ఆయనపై చిమ్మేటట్లు కోపంతో బండి తోలినాసరే గొడుకు తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దాదాపు 30 సంవత్సరాలపాటు హాన్‌వే బహిరంగంగా గొడుగు ఉపయోగించాడు, చివరకు 1786లో ఆయన మరణించే నాటికి పురుషులు, స్త్రీలు సంతోషంగా తమవెంట గొడుగులు తీసుకెళ్లడం ఆరంభించారు.

ఆ రోజుల్లో వర్షకాలపు గొడుగు ఉపయోగించడం నిజంగా ఒక సవాలుగా ఉండేది. వర్షానికి ఉపయోగించే గొడుగులు బరువుగా, పెద్దగా వికృతంగా ఉండేవి. నూనె రాసిన సిల్క్‌బట్ట లేదా కాన్వాస్‌, ఊచలు, కేన్‌తో లేదా తిమింగిలం ఎముకతో చేసిన కాడ మూలంగా అవి తడిసినప్పుడు తెరవడం కష్టంగా ఉండేది, అంతేకాక అవి కారుతుండేవి. అయినప్పటికీ, వర్షం కురిసేటప్పుడు గుర్రపు బగ్గీని బాడుగకు తీసుకోవడం కంటే గొడుగు కొనుక్కోవడమే చవక కావడంతో వాటికి ప్రజాదరణ పెరిగింది. గొడుగులు చేసేవారు అధికమయ్యారు, వాటిని అమ్మే దుకాణాలు పెరిగాయి, దానితో క్రొత్త నమూనాలు కనిపెట్టేవారు వాటి రూపకల్పనను మెరుగుపరచడంపైకి ధ్యాస మళ్లించారు. 19వ శతాబ్దపు మధ్యకాలానికల్లా, తేలికగావున్నప్పటికీ దృఢంగా వుండే స్టీలు చట్రంగల చక్కని మోడల్‌కు సామ్యుల్‌ ఫాక్స్‌ హక్కులు సంపాదించాడు. బరువైన నూనె కాన్వాస్‌ స్థానంలో తేలికైన సిల్క్‌, కాటన్‌, మైనం పూసిన బట్ట ఉపయోగించబడడం ప్రారంభమయ్యింది. దానితో ఆధునిక గొడుగు ఆవిర్భవించింది.

ఫ్యాషన్‌ వస్తువు

ఇంగ్లాండులోని ఆధునిక వనితకు గొడుగు అందమైన ఫ్యాషన్‌ వస్తువుగా ఆదరణ పొందింది. మారుతున్న ఫ్యాషన్‌లను ప్రతిబింబిస్తూ వనితల గొడుగులు అంతకంతకు పెద్దవిగా తయారయ్యి కాంతివంతమైన అన్ని రంగుల సిల్కు, సాటిన్‌ బట్టలతో తయారుచేయబడ్డాయి. తరచూ అది ఆమె ధరించే దుస్తులకు సరిపడే రంగులతో, లేసులతో, అంచులతో, రిబ్బన్లతో, బౌలతో చివరకు ఈకలతో అందంగా అలంకరించబడేది. ఇక 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి, తన శరీర వర్చస్సు కాపాడుకోవాలనుకునే ఏ వనితైనా గొడుగు లేకుండా బయటకు వచ్చేది కాదు.

1920వ దశకంలో ఎండలో నల్లబడిన శరీర ఛాయ ఫ్యాషన్‌ కావడంతో గొడుగు దాదాపు కనుమరుగయ్యింది. అప్పుడు, నగరవాసి అయిన పురుషుడు ఖరీదైన దుస్తులతోపాటు బౌలర్‌ టోపి ధరించి, చేతిలో నల్ల గొడుగును నాజూకైన చేతికర్రలా పట్టుకొని నడిచే కాలమొచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, క్రొత్త సాంకేతిక విజ్ఞానంవల్ల టెలిస్కోపులాగ మడిచే మోడల్‌తోపాటు నీరు ఇంకని నైలాన్‌, పాలిస్టర్‌, ప్లాస్టిక్‌ కవర్లతో మరింత మెరుగైన గొడుగుల నమూనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. చేతిపనితో తయారుచేయబడిన, ఖరీదైన గొడుగులు అమ్మే దుకాణాలు కొన్ని ఇంకా ఉన్నాయి. నేడయితే అత్యంత పెద్దవైన గోల్ఫ్‌ గొడుగుల దగ్గరనుండి ఆరుబయట కుర్చీలువేసుకొని కూర్చునేంత పెద్దవాటితోపాటు 15సెంటీమీటర్ల సైజులో చక్కగా మడిచి పర్సులో పెట్టుకునేంత చిన్న గొడుగులను కూడా కర్మాగారాలు విస్తారంగా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నాయి.

ఒకప్పుడు విలాసవస్తువుగా, హోదాచిహ్నంగా దృష్టించబడినా, ఇప్పుడు గొడుగులు ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి, అలాగే అవి పోగొట్టుకున్న వస్తువుల లిస్టులో అన్నింటికంటే పైస్థానం ఆక్రమిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా వివిధ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి అది చాలా ఉపయుక్తమైన సాధనం, అంతేకాక సూర్యరశ్మివల్లకలిగే ప్రమాదాల హెచ్చరికలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి కాబట్టి మునుపు ఎండలో నీడనిచ్చేదిగా ఉపయోగించబడిన గొడుగుల ఉపయోగం ఇప్పుడు కొన్ని దేశాల్లో మళ్ళీ ఫ్యాషన్‌లోకి వచ్చింది. అందువల్ల ఒకవేళ ఈ రోజు మీరు బయటకు వెళుతుంటే, బహుశా మీకు కూడా ఇలా గుర్తు చేయబడుతుంది: “బ్రోలి తీసుకెళ్ళడం మరచిపోకండి!” (g03 7/22)

[అధస్సూచి]

^ గొడుగును బ్రిటీషు వ్యావహారిక భాషలో “బ్రోలి” అంటారు. అమెరికాలో దీనికి సమానార్థంగల “బంబర్షూట్‌” అనే పదాన్ని అరుదుగా ఉపయోగిస్తారు.

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

గొడుగును కొని దాన్ని భద్రంగా కాపాడుకునే విధానం

అనుకూలంగా ఉందా, బలంగా ఉందా అనేవాటినిబట్టి గొడుగును ఎంపిక చేసుకోండి. పెద్ద జేబులో పట్టేలా మడిచిపెట్టగల చవకబారు గొడుగులకు బహుశా కొన్నే ఊచలువుండి అవి బలమైన గాలులకు నిలబడకపోవచ్చు. మరోవైపున, సంప్రదాయ కర్ర గొడుగు ఖరీదు ఎక్కువకావచ్చు, అయితే సాధారణంగా అది వాతావరణానికి తట్టుకొని చాలాకాలం మన్నుతుంది. అవును, మంచి గొడుగు చాలా సంవత్సరాలు మన్నుతుంది. మీరు ఏ రకం గొడుగు ఎంచుకున్నా, మళ్ళీ మడిచిపెట్టడానికి ముందు పూర్తిగా ఆరేటట్లు తెరచివుంచి బూజు లేదా తుప్పు పట్టకుండా దానిని కాపాడుకోండి. కవరులో పెడితే అది దుమ్ముపట్టకుండా, శుభ్రంగా ఉంటుంది.

[19వ పేజీలోని చిత్రాలు]

అస్సీరియా రాజుకు గొడుగు పట్టుకున్న సేవకుడు

గొడుగు పట్టుకున్న ప్రాచీన గ్రీసు మహిళ

[చిత్రసౌజన్యం]

చిత్రాలు: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[20వ పేజీలోని చిత్రం]

రమారమి 1900 కాలంనాటి గొడుగు

[చిత్రసౌజన్యం]

Culver Pictures