కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చికిత్సకు సంబంధించిన సవాలు

చికిత్సకు సంబంధించిన సవాలు

చికిత్సకు సంబంధించిన సవాలు

“అపాయకరంకాని డయబెటిస్‌ అంటూ ఏదీ లేదు. అన్ని రకాల డయబెటిస్‌ అపాయకరమైనదే.”​—ఆన్ని డాలి, అమెరికన్‌ డయబెటిస్‌ అసోసియేషన్‌.

“మీ రక్త పరీక్షలో గుర్తించదగిన మార్పులు కనిపిస్తున్నాయి. మీకు వెంటనే వైద్య సహాయం అవసరం.” డాక్టరు చెప్పిన ఆ మాటలు డెబోరాకు సమ్మెట పోటులా తగిలాయి. “పరీక్షలు చేయడంలో ఏదో పొరపాటు జరిగివుంటుంది, నా ఆరోగ్యానికి లోటులేదు బహుశా అది నిజం కాదేమో అని రాత్రంతా ఆలోచిస్తూ గడిపాను” అని ఆమె చెబుతోంది.

చాలామందిలాగే డెబోరా కూడా తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని అనుకుంది, అందుకే ఆమె తనలో రోగ లక్షణాలు కనబడుతున్నా పట్టించుకోలేదు. విపరీతమైన దాహం వేస్తే, ఎలర్జీ కోసం తాను వేసుకుంటున్న మందులవల్లే అలా అవుతోందని తలంచింది. అధిక మూత్రవిసర్జన చేయవలసి వస్తే, తానెక్కువగా నీళ్ళు తాగుతున్నందువల్లే అలా జరుగుతోందని అనుకుంది. విపరీతమైన అలసటగా అనిపిస్తే, ఉద్యోగంచేసే తల్లులందరూ అలా అలసిపోతారని సర్ది చెప్పుకుంది.

కానీ రక్త పరీక్షలో, ఆమె సమస్యలకు కారణం డయబెటిస్‌ అని తేలింది. ఆ విషయాన్ని అంగీకరించడం డెబోరాకు కష్టమనిపించింది. “నా అనారోగ్యం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు.రాత్రిపూటకుటుంబసభ్యులందరూనిద్రపోయినప్పుడునేను

అలా చీకటిలోకి చూస్తూ ఏడ్చేదాన్ని” అని ఆమె చెబుతోంది. కొంతమంది తమకు డయబెటిస్‌ ఉందని తెలుసుకొన్నప్పుడు డెబోరాలాగే మానసిక కృంగుదల, చికాకు పడడం వంటి తీవ్ర భావోద్వేగాలకు గురవుతారు. “నేను నిజాన్ని అంగీకరించలేక ఏడ్చేదాన్ని” అని కరేన్‌ చెబుతోంది.

అనుకోని దెబ్బగా అనిపించే ఈ పరిస్థితికి అలా ప్రతిస్పందించడం సహజమే. అయితే ఇతరుల మద్దతుతో, డయబెటిస్‌ ఉన్నవారు తమ పరిస్థితిని తాళుకోవచ్చు. “నా పరిస్థితిని అంగీకరించడానికి నా నర్సు నాకు సహాయం చేసింది. నేను ఏడిస్తే అది సహజమేనని ఆమె నాకు హామీ ఇచ్చింది. ఇలా నా భావోద్వేగాలను వెల్లడి చేయడం వల్ల నేను పరిస్థితికి తగ్గట్టు మార్పులు చేసుకోవడం సులభమయ్యింది” అని కరేన్‌ చెబుతోంది.

ఎందుకు ప్రమాదకరమైనది?

డయబెటిస్‌ను మంచికారణంతోనే, “జీవనాధార శక్తినిచ్చే ఇంజన్‌కు సోకిన వ్యాధి” అని పిలువవచ్చు. గ్లూకోజ్‌కు సంబంధించి శరీరం జీవక్రియ జరపనప్పుడు, శరీరంలో అనేక ఆవశ్యక ప్రక్రియలు ఆగిపోతాయి, వాటివల్ల కొన్నిసార్లు ప్రాణం ప్రమాదంలో పడుతుంది. “ప్రజలు నేరుగా డయబెటిస్‌వల్ల మరణించరు, ఆ వ్యాధి కలిగించే సమస్యల కారణంగానే మరణిస్తారు. అలాంటి సమస్యల నివారణలో మంచి నైపుణ్యం మనకున్నా, ఆ సమస్యలు ఒకసారి ఏర్పడితే మాత్రం చికిత్స చేయడం మహాకష్టం” అని డా. హార్వే కాట్సెఫ్‌ చెబుతున్నారు. *

డయబెటిస్‌తో బాధపడుతున్నవారికి ఏదైనా ఆశ ఉందా? ఉంది​—అయితే వాళ్ళు ఆ వ్యాధి ప్రమాదాన్ని గుర్తించి, చికిత్సా విధానానికి లోబడాలి. *

ఆహారం, వ్యాయామం

టైప్‌ 1 డయబెటిస్‌ను నివారించడానికి అవకాశం లేకపోయినప్పటికీ, శాస్త్రజ్ఞులు జన్యుపరంగా ప్రమాదకరమైన అంశాలను అధ్యయనం చేస్తూ, రోగనిరోధక సామర్థ్యతా దాడిని అణిచే మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. (8వ పేజీలో, “గ్లూకోజ్‌ పాత్ర” అనే బాక్సును చూడండి) “టైప్‌ 2 డయబెటిస్‌కు సంబంధించి పరిస్థితి మెరుగ్గా ఉంది. జన్యుపరంగా ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారిలో చాలామంది సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమంగా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండడంతోపాటు, సాధారణ పరిమితిలో తమ బరువును అదుపులో ఉంచుకున్నప్పుడు వారిలో డయబెటిస్‌ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించవు” అని డయబెటిస్‌​—కేరింగ్‌ ఫర్‌ యువర్‌ ఎమోషన్స్‌ యాస్‌ వెల్‌ యాస్‌ యువర్‌ హెల్త్‌ అనే పుస్తకం చెబుతోంది. *

వ్యాయామ ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ స్త్రీలపై చేయబడిన ఓ విస్తృతమైన అధ్యయనం గురించి నివేదిస్తోంది. “కేవలం కొద్దిసేపు చేసే వ్యాయామం, ఆ తర్వాతి 24 గంటల కంటే ఎక్కువ సమయంలో [శరీరంలోని జీవకణాలు] ఇన్సులిన్‌ నియంత్రిత గ్లూకోజ్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి” అని ఆ అధ్యయనం కనుగొంది. కాబట్టి “నడవడం, చురుకుగా పనిచేయడం ఈ రెండూ కూడా స్త్రీలకు టైప్‌ 2 డయబెటిస్‌వచ్చే ప్రమాదాన్ని చెప్పుకోదగినంతగా తగ్గించివేస్తాయి” అని ఆ నివేదిక నిర్ధారించింది. రోజూ కాకపోయినా, వారంలో కనీసం ఎక్కువరోజులు 30 నిమిషాలపాటు తగుమాత్రం వ్యాయామం చేస్తే మంచిదని పరిశోధకులు సిఫారసు చేస్తున్నారు. ఇలా వ్యాయామం చేయడానికి కేవలం వడిగా నడిస్తే చాలు, నడవడం “అన్నిరకాల వ్యాయామాల్లోకి శ్రేష్ఠమైనది, హానిరహితమైనది, ఖర్చులేనిది” అని అమెరికన్‌ డయబెటిస్‌ అసోసియేషన్‌ కంప్లీట్‌ గైడ్‌ టు డయబెటిస్‌ చెబుతోంది.

అయితే డయబెటిస్‌ ఉన్నవారు చేసే వ్యాయామం వైద్యుల లేదా నిపుణుల నిర్దేశం మేరకే చేయాలి. ఒక కారణమేమిటంటే డయబెటిస్‌, రక్తనాళాలను, నాడీ వ్యవస్థను దెబ్బతీసి తద్వారా రక్త ప్రసరణ, స్పర్శజ్ఞానంపై ప్రభావం చూపగలదు. కాబట్టి గుర్తుతెలియని రీతిలో కాలిపై చిన్నగా గీరుకుపోతే, ఇన్ఫెక్షన్‌కు గురై అది పుండుగా మారవచ్చు​—ఆ పుండుకు వెంటనే చికిత్స చేయకపోతే పరిస్థితి విషమించి చివరకు ఆ కాలు మొత్తమే తీసివేయవలసి రావచ్చు. *

అయితే క్రమంగా వ్యాయామం చేయడం అలవరచుకుంటే అది డయబెటిస్‌ను అదుపులో ఉంచడానికి సహాయం చేస్తుంది. “క్రమంగా వ్యాయామం చేయడంపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్న కొలది దాని ప్రయోజనాల గురించి మరిన్ని రుజువులు లభిస్తున్నాయి” అని ఏడిఏ కంప్లీట్‌ గైడ్‌ చెబుతోంది.

ఇన్సులిన్‌ థెరపీ

డయబెటిస్‌ ఉన్నవారిలో చాలామంది సమత్యులమైన ఆహారం తీసుకోవడం, క్రమంగా వ్యాయామం చేయడంతోపాటు ప్రతిరోజు గ్లూకోజ్‌ పరిమాణాలను పరీక్షించుకొని, ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు తీసుకోవాలి. టైప్‌ 2 డయబెటిస్‌ ఉన్నవారు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమంగా వ్యాయామం చేయడంవల్ల మెరుగుపడిన ఆరోగ్యం కారణంగా కనీసం కొంతకాలంపాటు ఇన్సులిన్‌ థెరపీ తీసుకోకుండా ఉండగలిగారు. * టైప్‌ 1 డయబెటిస్‌ ఉన్న కరేన్‌, వ్యాయామం చేయడంవల్ల, తాను తీసుకొనే ఇన్సులిన్‌ సమర్థత అధికమవుతోందని తెలుసుకుంది. తత్ఫలితంగా ఆమె ఇన్సులిన్‌ ప్రతీరోజు తీసుకోవడాన్ని 20 శాతం వరకూ తగ్గించగలిగింది.

ఒకవేళ ఇన్సులిన్‌ తీసుకోవడం అవసరమైతే, ఆ వ్యక్తి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. “ఇన్సులిన్‌ తీసుకోవలసి రావడం, మీరు విఫలులయ్యారని సూచించదు. మీకు ఏ రకం డయబెటిస్‌ ఉన్నా మీరు మీ రక్తంలోని చక్కెరను జాగ్రత్తగా అదుపు చేస్తే మీకు తర్వాత రాబోయే ఆరోగ్య సమస్యలను చాలావరకూ తగ్గించుకోవచ్చు” అని ఎంతోమంది డయబెటిస్‌ పేషెంట్లకు సేవలందిస్తున్న రిజిస్టర్డ్‌ నర్సు మేరీ ఆన్‌ చెబుతోంది. నిజానికి టైప్‌ 1 డయబెటిస్‌ ఉన్నవారు తమ రక్తంలోని చక్కెర పరిమాణాలను అదుపులో పెట్టినప్పుడు “వారికి డయబెటిస్‌ కారణంగా రాగల కంటి వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, నరాల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గాయని” ఇటీవల జరిగిన ఒక అధ్యయనం వెల్లడి చేసింది. ఉదాహరణకు, కంటి వ్యాధి (రెటీనోపథి) వచ్చే ప్రమాదం 76 శాతం వరకూ తగ్గింది! టైప్‌ 2 డయబెటిస్‌ ఉన్నవారు తమ రక్తంలోని చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకుంటే వారు కూడా అలాంటి ప్రయోజనాలను అనుభవిస్తారు.

ఇన్సులిన్‌ థెరపీని మరింత సుళువుగా, దాదాపు నొప్పిలేకుండా చేసేందుకు సర్వసాధారణంగా ఉపయోగించబడే సిరంజీలకు, ఇన్సులిన్‌ పెన్‌లకు చాలా సన్నగావున్న సూదులు అమర్చబడతాయి, అవి దాదాపుగా నొప్పి కలిగించవు. “మొదటిసారి ఇంజెక్షన్‌ తీసుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కానీ ఆ తర్వాత అసలు నొప్పే తెలియదని చాలా మంది పేషెంట్లు చెబుతారు” అని మేరీ ఆన్‌ అంటోంది. ఇంజెక్షన్‌ చేసే ఇతర పద్ధతుల్లో, నొప్పి తెలియకుండా చర్మంలోకి చటుక్కున సూదిని గుచ్చే ఆటోమెటిక్‌ ఇంజెక్టర్‌లు, ఇన్సులిన్‌ ద్రవమే సూదిలా చర్మంగుండా దూసుకుపోయేలా చేసే జెట్‌ ఇంజెక్టర్లు, చర్మంలో అమర్చిన కేథటర్‌ రెండు మూడు రోజులపాటు అక్కడే ఉండేటట్లు చేసే ఇన్‌ఫ్యూసర్లు ఉన్నాయి. పాకెట్‌ పేజర్‌ పరిమాణంలోవుండే ఇన్సులిన్‌ పంపు ఇటీవలి సంవత్సరాల్లో ప్రజాదరణను పొందింది. రోజంతటిలో శరీర అవసరాన్నిబట్టి కేథటర్‌ ద్వారా క్రమంగా ఇన్సులిన్‌ను శరీరంలో ప్రవేశపెట్టేలా ప్రోగ్రాం చేయబడ్డ ఈ ఉపకరణాలు మరింత ప్రామాణికంగా, సౌకర్యవంతంగా శరీరానికి ఇన్సులిన్‌ లభించేలా చేస్తున్నాయి.

నేర్చుకుంటూనే ఉండండి

ఇన్ని విషయాలు చెప్పుకున్నా, డయబెటిస్‌ ఉన్నవారందరికి స్థూలంగా ఒకే చికిత్స లేదు. చికిత్సను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. “మీరు వైద్య సిబ్బంది సంరక్షణ క్రింద ఉన్నా చికిత్సను ఎంపిక చేసుకోవలసింది మీరే” అని మేరీ ఆన్‌ చెబుతోంది. నిజానికి డయబెటిస్‌ కేర్‌ అనే పత్రిక ఇలా చెబుతోంది: “క్రమబద్ధమైన స్వీయ నిర్వహణా విద్యలేకుండా ఇవ్వబడే డయబెటిస్‌ వైద్య చికిత్సను అప్రమాణికమైన, నైతికవిరుద్ధ చికిత్సగా పరిగణించవచ్చు.”

డయబెటిస్‌ ఉన్నవారు తమ వ్యాధి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలను పెంచుకోవడానికి అంత ఎక్కువగా సిద్ధపడి ఉంటారు. అయితే సమర్థవంతమైన విద్యకు సహనం అవసరం. డయబెటిస్‌​—కేరింగ్‌ ఫర్‌ యువర్‌ ఎమోషన్స్‌ యాస్‌ వెల్‌ యాస్‌ యువర్‌ హెల్త్‌ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “మీరు అన్ని విషయాలు ఒకేసారి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు తికమకపడి ఆ సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించలేకపోవచ్చు. అంతేకాకుండా, మీరు నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సమాచారం చాలామట్టుకు పుస్తకాల్లో లేదా కరపత్రాల్లో ఉండదు. మీ దినచర్యలో వచ్చే మార్పులవల్ల మీ రక్తంలోని చక్కెర పరిమాణాలు ఎలా మారుతున్నాయి . . . అనేది మీకు తెలిసివుండాలి. ఈ విషయాలను కాలంగడిచే కొద్దీ అనుభవం ద్వారానే నేర్చుకోవచ్చు.”

ఉదాహరణకు, జాగ్రత్తగా గమనిస్తూ ఉండడం ద్వారా, మీ రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచే మానసిక ఒత్తిడికి మీ శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో మీరు నేర్చుకుంటారు. “నేను 50 సంవత్సరాలుగా డయబెటిక్‌ శరీరంతో జీవిస్తున్నాను, అదెలా ప్రతిస్పందిస్తుందో నాకు తెలుసు!” అని కెన్‌ చెబుతున్నాడు. కెన్‌ తన శరీర ప్రతిస్పందనలను “పరిగణలోకి తీసుకోవడం” ప్రయోజనకరంగా ఉంది, ఎందుకంటే 70 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న కెన్‌ ఇప్పటికీ పూర్తికాలం పనిచేయగలుగుతున్నాడు!

కుటుంబ మద్దతు ప్రాముఖ్యం

డయబెటిస్‌ చికిత్సలో, కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎంతో ప్రాముఖ్యం. నిజానికి పిల్లల్లో, వయోజనుల్లో డయబెటిస్‌ను అదుపులో ఉంచడానికి “కుటుంబ జీవితపు నాణ్యత బహుశా చాలా ప్రాముఖ్యమైన విషయం” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది.

కుటుంబ సభ్యులు డయబెటిస్‌ గురించి తెలుసుకోవడం ప్రయోజనకరమైనది, అలా చేయడానికి వాళ్ళు ఆ వ్యాధిగల కుటుంబ సభ్యునితోపాటు హాస్పిటల్‌కు వంతులవారిగా వెళ్ళవచ్చు. ఆ వ్యాధికి సంబంధించి విషయాలు తెలుసుకొనివుంటే, వాళ్ళు ఆ వ్యాధిగల వ్యక్తికి మద్దతునివ్వడానికి, ప్రాముఖ్యమైన సూచనలను గుర్తించడానికి, అలాంటప్పుడు ఎలా ప్రతిస్పందించాలో తెలిసివుండడానికి సహాయపడుతుంది. టెడ్‌ భార్యకు నాలుగు సంవత్సరాల వయసునుంచి టైప్‌ 1 డయబెటిస్‌ ఉంది, ఆయన ఇలా చెబుతున్నాడు: “బార్బరా రక్తంలో చక్కెర పరిమాణం మరీ తక్కువైపోయినప్పుడు నేను వెంటనే గుర్తుపట్టగలను. మాటల మధ్యలో ఆమె చాలా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఆమెకు విపరీతంగా చెమటలు పడతాయి, అకారణంగా కోపం తెచ్చుకుంటుంది. మనమేమన్నా అడిగితే ఆమె ప్రతిస్పందించడానికి చాలా సమయం పడుతుంది.”

అదేవిధంగా కెన్‌ భార్య అయిన కాథరీన్‌, కెన్‌ మొహం పాలిపోయినట్లు అతని శరీరం చల్లబడి, అతని ప్రవర్తన మారినట్లు కనిపిస్తే ఆమె అతణ్ణి ఒక సులువైన లెక్క చేయమంటుంది. కెన్‌ చెప్పిన సమాధానం అతను తికమకపడుతున్నాడు అని సూచిస్తే, ఆ సమయంలో తాను నిర్ణయాలు తీసుకొని, ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి వెంటనే చర్య తీసుకోవాలని ఆమెకు అర్థమవుతుంది. కెన్‌, బార్బరా ఇద్దరూ, తాము ఎంతగానో ప్రేమించే, తాము పూర్తిగా నమ్మే వివాహ భాగస్వాములకు తమ వ్యాధి గురించి తెలిసివుండడం విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగివున్నారు. *

ప్రేమగల కుటుంబ సభ్యులు ప్రోత్సాహకరమైనవారిగా, దయగలవారిగా, సహనంగలవారిగా ఉండాలి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి, వారి వ్యాధి తగ్గుముఖం పట్టడానికి వారి కుటుంబ సభ్యులు చూపించే ఆ లక్షణాలు సహాయపడతాయి. కరేన్‌ భర్త, తాను ఆమెను ఇంకా ప్రేమిస్తున్నానని ఆమెకు హామీ ఇచ్చాడు, అది చాలా అనుకూలమైన ప్రభావం చూపించింది. కరేన్‌ ఇలా వివరిస్తోంది: “‘ప్రజలు జీవించివుండడానికి ఆహారం నీళ్ళు తీసుకోవాలి, అదేవిధంగా నువ్వు ఆహారం నీళ్ళు మరియు కొంచెం ఇన్సులిన్‌ తీసుకోవాలి’ అని నైజిల్‌ నాతో అన్నాడు. ఈ ప్రేమపూర్వకమైన, ఆచరణాత్మకమైన మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి.”

డయబెటిస్‌ ఉన్న వ్యక్తి రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గుతూ పెరుగుతూ ఉంటే ఆ వ్యక్తి మానసిక స్థితిపై అది ప్రభావం చూపుతుంది అని కుటుంబ సభ్యులు, స్నేహితులు అర్థం చేసుకోవాలి. “డయబెటిస్‌కు సంబంధించి నేను కృంగుదలను అనుభవించినప్పుడు, నేను చాలా నిశ్శబ్దంగా ఉండిపోతాను, ఊరికే చిరాకుపడతాను, కోప్పడతాను” అని ఒక స్త్రీ చెబుతోంది. “నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయినందుకు ఆ తర్వాత నాకు చాలా బాధగా ఉంటుంది. అయితే నేను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించే ఈ భావోద్వేగాలకు కారణమేమిటో ఇతరులు అర్థం చేసుకోగలరు అని నేను తెలుసుకోవడం నాకు సహాయకరంగా ఉంటుంది” అని ఆమె చెబుతోంది.

డయబెటిస్‌ ఉన్నవారికి స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తే ఆ వ్యాధిని విజయవంతంగా తాళుకోవచ్చు. బైబిలు సూత్రాలు కూడా దానికి సహాయం చేస్తాయి. ఎలా? (g03 5/08)

[అధస్సూచీలు]

^ గుండె జబ్బు, స్ట్రోక్‌, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, పరిధీయ ధమని వ్యాధి, నాడీ వ్యవస్థ పాడైపోవడం వంటివి డయబెటిస్‌ వల్ల వచ్చే సమస్యలు. కాళ్ళకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంవల్ల పుండ్లు రావచ్చు, పరిస్థితి తీవ్రంగా మారిన కేసుల్లో అలా పుండ్లు అయిన కాళ్ళను ఆపరేషన్‌ చేసి తీసివేయవలసి ఉంటుంది. వయోజనుల్లో డయబెటిస్‌ తరచూ అంధత్వానికి కూడా కారణమవుతోంది.

^ తేజరిల్లు! ప్రత్యేకమైన ఎలాంటి చికిత్సనూ ధృవీకరించదు. తమకు డయబెటిస్‌ ఉందని అనుమానించేవారు, ఆ వ్యాధి నివారణలో, దానికి చికిత్స చేయడంలో అనుభవమున్న డాక్టర్‌ను సంప్రదించాలి.

^ తుంటి దగ్గరవుండే కొవ్వు (జీడిమామిడిలా ఉండే బేరిపండు ఆకారపు శరీరం) కంటే, ఉదరం చుట్టూవుండే అదనపు కొవ్వు (ఆపిల్‌ ఆకారపు ఉదరభాగం) ఎక్కువ ప్రమాదం కలిగిస్తున్నట్లుగా ఉంది.

^ పొగత్రాగేవారు తమను తామే మరింత ప్రమాదంలో పడవేసుకుంటారు, ఎందుకంటే వారికున్న ఆ అలవాటు గుండెకు, రక్తప్రసరణ వ్యవస్థకు హాని కలుగజేసే, రక్త నాళాలు ఇరుకయ్యేలా చేస్తుంది. డయబెటిస్‌ కారణంగా శరీర భాగాలు తీసివేయవలసి వచ్చినవారిలో 95 శాతంమంది పొగత్రాగేవారేనని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది.

^ వీరిలో కొంతమందికి ఇంజెక్షన్‌ల ద్వారా కాకుండా మందుల ద్వారా సహాయం అందించబడింది. క్లోమం ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయపడే మందులు, రక్తంలోని చక్కెర అధికమయ్యే వేగాన్ని తగ్గించే మందులు, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించే మందులు ఉపయోగించబడతాయి. (టైప్‌ 1 డయబెటిస్‌ ఉన్నవారికి సాధారణంగా నోటిద్వారా మందులు తీసుకునే చికిత్సా విధానం సిఫారసు చేయబడదు.) ప్రస్తుతం, ఇన్సులిన్‌ను నోటిద్వారా తీసుకోవడం వీలుపడదు, ఎందుకంటే ఈ మాంసకృత్తు రక్తంలో కలవడానికి ముందే శరీర జీర్ణ వ్యవస్థ దానిని విచ్ఛిన్నం చేస్తుంది. అయితే ఇన్సులిన్‌ థెరపీ గానీ, నోటి ద్వారా మందులు తీసుకోవడం గానీ వ్యాయామ అవసరతను, సమతుల్యమైన ఆహారం తీసుకోవలసిన అవసరతను తగ్గించవు.

^ డయబెటిస్‌ ఉన్నవారు ఎల్లప్పుడూ ఒక గుర్తింపు కార్డును లేదా తమకు ఆ వ్యాధి ఉందని సూచించే బ్రేస్‌లెట్‌ లేదా చైన్‌ ధరించి ఉండాలని వైద్య అధికారులు సలహా ఇస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో అవి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడగలవు. ఉదాహరణకు, రక్తంలో చక్కెర పరిమాణం తక్కువైనప్పుడు ఆ పరిస్థితిని వేరే అస్వస్థతగా లేదా మద్యపానపు మత్తు వల్ల వచ్చిన సమస్యగా కూడా అపార్థం చేసుకోవచ్చు.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఈ వ్యాధి పిల్లలకు కూడా వస్తుందా?

డయబెటిస్‌ “పిల్లలకు యౌవనులకు కూడా వచ్చే వ్యాధిగా తయారవుతోంది” అని న్యూయార్క్‌లోని మౌంట్‌ సీనాయి స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాఖ డీన్‌, ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్‌ డా. ఆర్థర్‌ రూబెన్‌స్టిన్‌ చెబుతున్నాడు. డయబెటిస్‌ వచ్చే అవకాశంగల వయసు రోజు రోజుకూ తగ్గుతోంది. డా. రాబిన్‌ ఎస్‌. గోలెండ్‌ టైప్‌ 2 డయబెటిస్‌ గురించి చెబుతూ “10 సంవత్సరాల క్రితం, ఈ వ్యాధి 40 సంవత్సరాల్లోపు వారికి రావడం చాలా అరుదు అని మేము వైద్య విద్యార్థులకు బోధించేవాళ్ళము. అయితే ఇప్పుడు ఆ వ్యాధి 10 సంవత్సరాల్లోపు వాళ్ళలో కూడా కనిపిస్తోంది” అని అంది.

పిల్లలకు డయబెటిస్‌ రావడం ఎక్కువైపోవడానికి కారణమేమిటి? కొన్ని సందర్భాల్లో జన్యువిధానం కారణమవ్వవచ్చు. అలాగే శరీర బరువు, వాతావరణం కూడా కీలక పాత్ర వహించవచ్చు. గత రెండు దశాబ్దాల్లో స్థూలకాయులైన పిల్లల సంఖ్య రెట్టింపయ్యింది. దానికి కారణమేమిటి? “గత 20 సంవత్సరాల్లో ఆహార అలవాట్లకు సంబంధించి, శారీరక కార్యకలాపాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయి” అని యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌కు చెందిన డా. విలియమ్‌ డైట్జ్‌ చెబుతున్నాడు. “ప్రజలు మునుపటికంటే ఎక్కువగా హోటళ్ళలోను, రెస్టారెంట్లలోను తినడం; ఉదయపు భోజనం మానేయడం అధికమవ్వడం; ఎక్కువగా కూల్‌ డ్రింక్‌లు త్రాగడం, చిరుతిళ్ళు తినడం; స్కూళ్ళలో [వ్యాయామాలకు సంబంధించిన పాఠాలు] తగ్గిపోవడం; స్కూల్లో ఇంటర్వెల్‌ లేకపోవడం వంటివి ఆ మార్పులకు కారణాలు” అని ఆయన చెప్పాడు.

ఒకసారి డయబెటిస్‌ వస్తే, దానినుండి పూర్తిగా కోలుకోవడం అసాధ్యం. కాబట్టి డయబెటిస్‌ ఉన్న ఒక యువకుడు ఇచ్చిన ఈ సరళమైన సలహాను పాటించడం జ్ఞానయుక్తమైనది: “చిరుతిళ్ళ నుండి దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.”

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రం]

గ్లూకోజ్‌ పాత్ర

శరీరంలోని కోట్లాది జీవకణాల శక్తికి మూలాధారం గ్లూకోజ్‌. అయితే అది జీవకణాల్లోకి ప్రవేశించడానికి దానికి ఒక “తాళం చెవి” అంటే క్లోమం విడుదల చేసే ఇన్సులిన్‌ అనే రసాయనం అవసరం. టైప్‌ 1 డయబెటిస్‌ ఉన్న వ్యక్తి శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. టైప్‌ 2 డయాబెటిస్‌ విషయానికి వస్తే, శరీరం ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుంది కానీ సాధారణంగా అది తగినంతగా ఉత్పత్తి చేయదు. * అంతేకాక ఇన్సులిన్‌ ప్రవేశాన్ని జీవకణాలు అనుమతించవు​—ఈ పరిస్థితిని ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ అని పిలుస్తారు. ఈ రెండు రకాల డయబెటిస్‌లలోను ఫలితం మాత్రం ఒకటే: అవసరమైన గ్లూకోజ్‌ లభించక ఆకలితోవున్న జీవకణాలు, రక్తంలో ప్రమాదకరంగా చక్కెర పరిమాణాలు విపరీతం కావడం.

టైప్‌ 1 డయబెటిస్‌లో, ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే క్లోమంలోని బీటా జీవకణాలపై ఆ వ్యక్తిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. కాబట్టి టైప్‌ 1 డయబెటిస్‌, ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థే శరీర జీవకణాలకు శత్రువై కణనాశనము కలుగజేసే వ్యాధి, అది కొన్నిసార్లు రోగనిరోధక శక్తి కారణంగా కలిగిన వ్యాధి అని పిలువబడుతుంది. వైరస్‌లు, విషపూరిత రసాయనాలు, కొన్ని రకాల మందులు రోగనిరోధక శక్తి ప్రతిస్పందించేలా చేస్తాయి. కొన్నిసార్లు జన్యు నిర్మాణం కూడా దానికి కారణమవ్వవచ్చు ఎందుకంటే టైప్‌ 1 డయబెటిస్‌ కొన్ని కుటుంబాల్లో సాధారణంగా కనిపిస్తుంది, అది శ్వేతజాతీయుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

టైప్‌ 2 డయబెటిస్‌లో జన్యు నిర్మాణం మరింత బలమైన కారకంగా పనిచేస్తుంది అయితే ఈ వ్యాధి శ్వేతజాతీయులు కాని వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ఆదివాసులకు, అమెరికన్‌ ఇండియన్లకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది, ప్రపంచంలో టైప్‌ 2 డయబెటిస్‌ కలవారిలో అమెరికన్‌ ఇండియన్లే ఎక్కువగా ఉన్నారు. పరిశోధకులు జన్యువ్యవస్థకూ స్థూలకాయానికీ మధ్యవున్న సంబంధంపై, అలాగే జన్యుపరంగా డయబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో అధిక కొవ్వు ఇన్సులిన్‌ నిరోధకతను అధికం చేసే విధానంపై పరిశోధన చేస్తున్నారు. * టైప్‌ 1 డయబెటిస్‌లా కాకుండా టైప్‌ 2 డయబెటిస్‌ ముఖ్యంగా 40 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్నవారికి వస్తుంది.

[అధస్సూచీలు]

^ డయబెటిస్‌ ఉన్నవారిలో 90 శాతంమందికి టైప్‌ 2 డయబెటిస్‌ ఉంది. పూర్వం అది “ఇన్సులిన్‌పై ఆధారపడని” లేదా “అడల్ట్‌ ఆన్‌సెట్‌” డయబెటిస్‌ అని పిలువబడేది. అయితే ఈ పదాలు సరికాదు ఎందుకంటే టైప్‌ 2 డయబెటిస్‌ ఉన్నవారిలో దాదాపు 40 శాతంమందికి ఇన్సులిన్‌ అవసరం. అంతేకాక కలవరపరిచేలా చాలామంది యౌవనస్థులకు, అంతకంటే చిన్నవారికి కూడా టైప్‌ 2 డయబెటిస్‌ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించబడుతోంది.

^ సాధారణంగా ఒక వ్యక్తి శరీర బరువు ఉండవలసిన దానికంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అతను స్థూలకాయుడిగా పరిగణించబడతాడు.

[చిత్రం]

గ్లూకోజ్‌ పరమాణువు

[చిత్రసౌజన్యం]

సౌజన్యం: Pacific Northwest National Laboratory

[9వ పేజీలోని బాక్సు]

క్లోమం పాత్ర

అరటిపండు పరిమాణంలో ఉండే క్లోమం జీర్ణాశయానికి కొంచెం క్రింద ఉంటుంది. ది అనఫిషియల్‌ గైడ్‌ టు లివింగ్‌ విత్‌ డయబెటిస్‌ అనే పుస్తకం ప్రకారం, “ఆరోగ్యవంతమైన క్లోమం నిరంతరం అద్భుతంగా పనిచేస్తూ, గ్లూకోజ్‌ పరిమాణాలు రోజంతా తగ్గుతూ పెరుగుతూ ఉంటే వాటికి అనుగుణంగా సరైన మోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తంలోని చక్కెర పరిమాణాలను స్థిరంగా ఉంచుతుంది.” క్లోమం బీటా కణాలు ఇన్సులిన్‌ హార్మోన్‌కు మూలం.

బీటా కణాలు తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోతే, రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువైపోతుంది, ఆ పరిస్థితిని హైపర్‌గ్లైసీమియా అంటారు. దానికి బదులుగా రక్తంలో చక్కెర తక్కువైనప్పుడు దానిని హైపోగ్లైసీమియా అంటారు. క్లోమంతోపాటు పనిచేస్తూ కాలేయం, అధికంగా ఉన్న గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌ రూపంలో భద్రపరచి రక్తంలో చక్కెర పరిమాణం సరిగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. క్లోమం సూచించినప్పుడు కాలేయం మళ్ళీ శరీరం ఉపయోగించుకోవడానికి వీలుగా గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది.

[9వ పేజీలోని బాక్సు/చిత్రం]

చక్కెర పాత్ర

చక్కెర ఎక్కువగా తినడం వల్ల డయబెటిస్‌ వస్తుంది అనేది సర్వసాధారణమైన అపోహ. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవారు బరువు పెరిగితే, అది చక్కెర ఎక్కువ తినడంవల్ల పెరిగినా లేదా ఇతర కారణాలవల్ల పెరిగినా సరే, వారికి ఆ వ్యాధి వచ్చే ప్రమాదం అధికమవుతుందని వైద్య రుజువులు చూపిస్తున్నాయి. అయితే చక్కెర ఎక్కువ తినడం కూడా ఆరోగ్యకరం కాదు ఎందుకంటే దానివల్ల లభించే పోషకపదార్థాలు చాలా తక్కువ, అది స్థూలకాయానికి దారి తీస్తుంది.

డయబెటిస్‌ ఉన్నవాళ్ళకి తీపిపదార్థాలు తినాలని గాఢమైన వాంఛ ఉంటుందనేది మరో అపోహ. నిజానికి అందరిలాగే వాళ్ళకు కూడా మిఠాయిలు తినాలని ఉంటుంది. డయబెటిస్‌ను అదుపు చేయకపోతే అది విపరీతమైన ఆకలికి దారితీస్తుంది, అయితే ఆ ఆకలి చక్కెర తినాలని మాత్రం కాదు. డయబెటిస్‌ ఉన్నవారు మిఠాయిలు తినవచ్చు కానీ వాళ్ళు తీసుకునే మొత్తం ఆహారంలో చక్కెర శాతం ఎంతవుందో కనిపెట్టుకొని ఉండాలి.

ఫలచక్కెర అంటే పళ్ళు, కూరగాయల నుండి లభించే చక్కెర ఎక్కువగావున్న ఆహారం తీసుకోవడం కూడా ఇన్సులిన్‌ ప్రతినిరోధకతకు తోడ్పడుతుందని, జంతువుల బరువు ఏదైనప్పటికీ వాటికి కూడా డయబెటిస్‌ రావడానికి కారణమవుతోందని ఇటీవలి పరిశోధనలు చూపించాయి.

[8, 9వ పేజీలోని డయాగ్రామ్‌లు/చిత్రాలు]

డయబెటిస్‌ గురించి సరళంగా చెబితే

క్లోమం

ఆరోగ్యవంతుడైన వ్యక్తి

భోజనం తర్వాత, రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణాలు అధికమయినప్పుడు క్లోమం దానికి ప్రతిస్పందించి సరైన మోతాదులో ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది

కండరాల జీవకణాలపై, ఇతర జీవకణాలపై ఉండే గ్రాహకాలు ఇన్సులిన్‌ పరమాణువులతో సంధింపబడతాయి. అప్పుడు గ్లూకోజ్‌ పరమాణువులు ఆ జీవకణాల్లోకి ప్రవేశించడానికి వీలుగా ప్రవేశ ద్వారాలు తెరుచుకోబడతాయి

కండరాల జీవకణాలు గ్లూకోజ్‌ను పీల్చుకొని, దానిని ఉపయోగించుకుంటాయి. అప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌ పరిమాణం సాధారణ స్థాయికి చేరుకుంటుంది

టైప్‌ 1 డయబెటిస్‌ ఉన్న వ్యక్తి

క్లోమంలో ఉండే ఇన్సులిను ఉత్పత్తి చేసే చీటా కణాలపై రోగనిరోధక వ్యవస్ధ దాడి చేస్తుంది. తత్ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయబడదు

ఇన్సులిన్‌ సహాయం లేకుండా గ్లూకోజ్‌ పరమాణువులు జీవకణాల్లోకి ప్రవేశించలేవు

టైప్‌ 2 డయబెటిస్‌ ఉన్న వ్యక్తి

చాలా సందర్భాల్లో క్లోమం పరిమితమైన మోతాదులోనే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది

గ్రాహకాలు ఇన్సులిన్‌కు సరిగా ప్రతిస్పందించకపోతే, రక్తంలోనుండి గ్లూకోజ్‌ను పీల్చుకోవడానికి వీలుగా ప్రవేశ ద్వారాలు తెరుచుకోవు

రక్త ప్రవాహంలో గ్లూకోజ్‌ పరిమాణాలు ఎక్కువైపోతాయి, తద్వారా ఆవశ్యకమైన శరీర ప్రక్రియలు ఆగిపోయి రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి

[డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

జీవకణం

గ్రాహకం

ప్రవేశ ద్వారం

ఇన్సులిన్‌

కేంద్రకం

గ్లూకోజ్‌

[డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రక్తనాళం

ఎర్ర రక్త కణాలు

గ్లూకోజ్‌

[చిత్రసౌజన్యం]

మనిషి: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[7వ పేజీలోని చిత్రం]

డయబెటిస్‌తో బాధపడేవారికి సమతుల్యమైన ఆహారం అవసరం

[10వ పేజీలోని చిత్రాలు]

డయబెటిస్‌తో బాధపడేవారు సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు