డయబెటిస్ “మౌన హంతకి”
డయబెటిస్ “మౌన హంతకి”
ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో కెన్‌కు విచిత్రంగా విపరీతమైన దాహం వేయడం మొదలయ్యింది. ఆయన తరచూ మూత్రవిసర్జనకు వెళ్ళవలసి వచ్చేది—చివరకు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత కెన్‌కు కాళ్ళు చేతులు బరువుగా అనిపించడం ప్రారంభమైంది. ఆయన తీవ్రంగా అలసిపోయేవాడు, చూపు మందగించింది.
కెన్‌కు వైరస్ సోకినప్పుడు అసలు విషయం బైటపడింది. డాక్టర్ పరీక్ష చేసినప్పుడు కెన్‌కు కేవలం ఫ్లూ మాత్రమే కాక టైప్ 1 డయబెటిస్ మెల్లిటస్, క్లుప్తంగా చెప్పాలంటే డయబెటిస్ ఉందని తేలింది. పోషకపదార్థాలను, ప్రాథమికంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ అనే చక్కెరను ఉపయోగించుకునే సామర్థ్యం శరీరానికి ఉంటుంది, అయితే ఈ జీవరసాయన వ్యాధి ఆ సామర్థ్యానికి అడ్డుపడుతుంది. కెన్ రక్తంలోని చక్కెర పరిమాణం స్థిరపడేంతవరకూ అంటే ఆరు వారాలపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండవలసి వచ్చింది.
అది 50 కంటే ఎక్కువ సంవత్సరాలనాటి మాట, అయితే గడిచిన 50 సంవత్సరాల్లో చికిత్సా విధానాలు చాలావరకు అభివృద్ధి చెందాయి. అయితే కెన్ ఇంకా డయబెటిస్‌తో బాధపడుతున్నాడు, ఆయన మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్లకంటే ఎక్కువమందికి ఈ వ్యాధి ఉందని అంచనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2025వ సంవత్సరానికల్లా ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. డయబెటిస్ ఇలా ప్రబలడం చూసి నిపుణులు కలవరపడుతున్నారంటే అది అర్థం చేసుకోదగినదే. “డయబెటిస్‌తో బాధపడేవారి సంఖ్యను చూస్తే, ఓ మహమ్మారి ఆరంభాన్ని చూస్తున్నట్లుగా ఉంది” అని అమెరికాలోని ఒక చికిత్సా కేంద్రానికి సహసంచాలకురాలైన డా. రాబిన్ ఎస్. గోలెండ్ చెబుతోంది.
ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఈ క్లుప్త నివేదికలను పరిశీలించండి.
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని అంతర్జాతీయ డయబెటిస్ సంస్థ ప్రకారం, “21వ శతాబ్దంలోని ఆరోగ్య సమస్యల్లో డయబెటిస్ అత్యంత సవాలుదాయకమైనది.”
ఇండియా: కనీసం మూడు కోట్లమందికి డయబెటిస్ ఉంది. “15 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల్లోపు వాళ్ళకు ఈ వ్యాధి రావడం చాలా అరుదుగా జరిగేది. కానీ నేడు ఆ వయస్సు వాళ్లలో ప్రతి ఇద్దరిలో ఒకరికి డయబెటిస్ ఉంది” అని ఒక డాక్టర్ చెబుతున్నాడు.
సింగపూర్: 30 సంవత్సరాల నుండి 69 సంవత్సరాల వయస్సుగలవారిలో దాదాపు మూడవవంతు మందికి డయబెటిస్ ఉంది. చాలామంది పిల్లలకు, పది సంవత్సరాల పిల్లలకు కూడా, ఈ వ్యాధి ఉందని నిర్ధారించబడింది.
అమెరికా: దాదాపు 1.6 కోట్లమందికి ఈ వ్యాధి ఉంది, ప్రతి సంవత్సరం కొత్తగా మరో 8,00,000 మందికి ఆ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించబడుతోంది. లక్షలాదిమందికి ఆ వ్యాధి ఉంది కానీ ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలియదు.
ఒక వ్యక్తికి డయబెటిస్ ఉందని నిర్ధారించబడడానికి ఎంతో కాలం ముందు నుండే ఆయనకు ఆ వ్యాధి ఉండవచ్చు, అందువల్ల డయబెటిస్‌కు చికిత్స చేయడం మరింత కష్టతరమవుతోంది. “తొలి సూచనలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి డయబెటిస్ ఉందని గుర్తించబడకుండా పోతుంది” అని ఏషియావీక్ పత్రిక చెబుతోంది. కాబట్టి డయబెటిస్ మౌన హంతకి అనే మారుపేరుతో పిలువబడుతోంది.
ఈ వ్యాధి ప్రబలత, తీవ్రత దృష్ట్యా, తర్వాతి ఆర్టికల్‌లు ఈ క్రింది ప్రశ్నలను పరిశీలిస్తాయి:
● డయబెటిస్‌ను కలుగజేసేదేమిటి?
● ఆ వ్యాధి ఉన్నవారు దానిని ఎలా తాళుకోవచ్చు? (g03 5/08)
[4వ పేజీలోని బాక్సు/చిత్రం]
డయబెటిస్ అని పేరు పెట్టడానికిగల కారణం
“డయబెటిస్ మెలిటస్” అనే పదబంధం “సైఫన్ చేయడం” (సైఫన్ అనే సాధనం ద్వారా ఎక్కువ మట్టంలోవున్న ద్రవాన్ని తక్కువ మట్టంలోకి దించడం) అనే భావంగల గ్రీకు పదం నుండి, “తేనెలాగ తియ్యనిది” అనే భావంగల లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ పదాలు ఈ వ్యాధిని సరిగ్గా వర్ణిస్తున్నాయి, ఎందుకంటే డయబెటిస్ వ్యాధిగ్రస్తుడు త్రాగిన నీరు సైఫన్ ద్వారా జలనిస్సారణ జరిగినట్లు నోటినుండి నేరుగా మూత్రపిండానికి చేరి అక్కడి నుండి శరీరం బయటకు విసర్జించబడుతుంది. అంతేకాకుండా, మూత్రంలోని చక్కెర కారణంగా అది తీపిగా ఉంటుంది. నిజానికి మరింత సమర్థవంతమైన పద్ధతులు కనుగొనబడకముందు ఒక వ్యక్తికి డయబెటిస్ ఉందో లేదో నిర్ధారించడానికి చేసే పరీక్షల్లో ఒకటి, ఆ వ్యక్తి మూత్రాన్ని చీమలపుట్ట దగ్గర పోయడం. దాని దగ్గర చీమలు చేరితే, ఆ మూత్రంలో చక్కెర ఉందని అది సూచించేది.