కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?

తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?

యువత ఇలా అడుగుతోంది . . .

తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?

“నేను నేనుగా ఉండాలని కోరుకున్నాను, కానీ నేనెప్పుడూ మా అక్కల పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టు జీవించక తప్పదన్నట్లు భావించాను. మా అక్కలు సాధించినవి సాధించడం ఎన్నటికీ నావల్ల కాదని నేను తలంచాను.”​క్లార.

దేనిలోనైనా విజయం సాధిస్తున్నట్లున్న అక్కయ్య లేదా అన్నయ్య మీకున్నారా? ఆ తోబుట్టువు లాగే మీరూ ఉండాలని మీ తల్లిదండ్రులు అదేపనిగా పోరుపెడుతుంటారా? అలాగైతే, మీరెప్పుడూ అతని లేదా ఆమె మరుగున ఉండిపోవాలేమో, అంటే మీ తోబుట్టువు సాధించినవాటిని మీరెంత విజయవంతంగా సాధిస్తారనే దానిపై మీ విలువ అంచనా వేయబడుతుందేమోనని మీరు భయపడుతుండవచ్చు.

బారీ * అన్నయ్యలు ఎంతో గౌరవప్రదమైన మినిస్టీరియల్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌ * పట్టభద్రులు, క్రైస్తవులుగా వారు మంచి పేరు సంపాదించుకున్నారు. “నేను ప్రకటనా పనిలో వారి ప్రమాణ స్థాయికి తగ్గట్టు లేదా బహిరంగంగా మాట్లాడ్డంలో వాళ్ళంత మంచిగా ఎప్పటికీ ఉండలేననే భావంతో నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. మా అన్నయ్యలు ఆహ్వానించబడినప్పుడు నేను కేవలం వారితో వెళ్లేవాడిని కాబట్టి నాకంటూ స్నేహితుల్ని సంపాదించుకోవడం కష్టంగా ఉండేది. మా అన్నయ్యల కారణంగానే ప్రజలు నాతో స్నేహం చేస్తున్నట్టు నేను భావించాను” అని బారీ ఒప్పుకుంటున్నాడు.

తరచూ ప్రశంసించబడే తోబుట్టువు ఉన్నప్పుడు అలాంటి అసూయ భావాలు కలగడం సహజమే. బైబిలు కాలాల్లో యౌవనుడైన యోసేపు తన అన్నదమ్ములందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు. అది అతని తోబుట్టువులపై ఎలాంటి ప్రభావం చూపింది? ‘వారతని మీద పగపట్టి, అతని క్షేమ సమాచారమైనా అడగలేకపోయారు.’ (ఆదికాండము 37:1-4) అయితే యోసేపు అణకువగలవాడు. కానీ మీ తోబుట్టువు తాను సాధించిన వాటిని ఎల్లప్పుడూ గుర్తుచేస్తూ మీలో పోటీతత్వాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించవచ్చు.

కొందరు యౌవనులు బహుశా పాఠశాలలో తక్కువ గ్రేడ్లు తెచ్చుకోవడం, క్రైస్తవ కార్యకలాపాల్లో సరిగ్గా పాల్గొన లేకపోవడం లేదా దిగ్భ్రాంతికర ప్రవర్తనలో పడిపోవడం ద్వారా తిరుగుబాటు ధోరణి ప్రదర్శించవచ్చు. తమ తోబుట్టువంత చక్కగా చేయలేనప్పుడు దాని కోసం ప్రయత్నించడం కూడా అనవసరమని వారు భావిస్తారు. కానీ రానురాను తిరుగుబాటు ధోరణి మీకే హాని కలిగిస్తుంది. మీ ఆత్మగౌరవం పెరిగే విధంగా, మీ తోబుట్టువు చాటు నుండి మీరెలా బయటపడవచ్చు?

వారిని అత్యున్నత స్థానంలో పెట్టకండి

మీ తోబుట్టువుకు ఇవ్వబడుతున్న అవధానమంతా చూసి మీరు, అతను లేక ఆమె పరిపూర్ణులనీ, వారితో మీరు ఎప్పటికీ సరితూగలేరనీ నమ్మడం ప్రారంభించవచ్చు. అయితే అది నిజమా? బైబిలు ఖరాఖండిగా ఇలా చెబుతోంది: “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”​—రోమీయులు 3:23.

అవును, తోబుట్టువులకు ఎలాంటి నేర్పు లేదా ప్రతిభ ఉన్నా వాళ్ళు కూడా మనలాంటి ‘స్వభావము గల నరులే.’ (అపొస్తలుల కార్యములు 14:15) అందువల్ల, వారిని అత్యున్నత స్థానంలో పెట్టడానికి లేదా వారినే ఆరాధ్య దైవాలుగా చేసుకోవడానికి కారణమేదీ లేదు. మనకు పరిపూర్ణ మాదిరి ఉంచిన ఏకైక మానవుడు యేసుక్రీస్తే.​—1 పేతురు 2:21.

వాళ్ళనుండి నేర్చుకోండి

తర్వాత, మీ పరిస్థితిని నేర్చుకోవడానికి అనువైన అవకాశంగా చూడ్డానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, యేసుక్రీస్తు చెల్లెళ్ల తమ్ముళ్ల విషయమే పరిశీలించండి. (మత్తయి 13:55, 56) తమ పరిపూర్ణ తోబుట్టువు నుండి వారేమి నేర్చుకోగలిగేవారో ఆలోచించండి! అయితే, ‘ఆయన సహోదరులు ఆయనయందు విశ్వాసముంచలేదు.’ (యోహాను 7:5) బహుశా గర్వం, అసూయ వారి విశ్వాసానికి అడ్డుపడి ఉండవచ్చు. యేసు గొప్ప మనస్సుతో “నాయొద్ద నేర్చుకొనుడి” అని ఇచ్చిన ఆహ్వానానికి ఆయన ఆధ్యాత్మిక సహోదరులే అంటే ఆయన శిష్యులే ప్రతిస్పందించారు. (మత్తయి 11:29) యేసు పునరుత్థానమైన తర్వాత గానీ ఆయన తమ్ముళ్లు ఆయన విలువను గ్రహించలేదు. (అపొస్తలుల కార్యములు 1:14) అప్పటివరకు, తమ విశిష్ట సహోదరుని నుండి నేర్చుకునే ఎన్నో సువర్ణావకాశాలను వారు పోగొట్టుకున్నారు.

కయీను అలాంటి పొరపాటే చేశాడు. అతని తోబుట్టువు హేబెలు దేవుని విశిష్ట సేవకుడు. “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 4:4) కానీ ఏ కారణంవల్లనో దేవుడు ‘కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు.’ కయీను కొంత అణకువ ప్రదర్శించి తన తమ్ముడి నుండి నేర్చుకొని ఉండాల్సింది. బదులుగా “కయీను మిక్కిలి కోపము” తెచ్చుకొని హేబెలును హత్యచేశాడు.​—ఆదికాండము 4:5-8.

మీ తోబుట్టువుపై మీకు ఎప్పటికీ అంత కోపం రాదనుకోండి. కానీ గర్వం, అసూయ మీ దారికి అడ్డుపడడానికి అనుమతిస్తే మీరు కూడా అమూల్యమైన అవకాశాలను చేజార్చుకునే అవకాశముంది. మీ తోబుట్టువు లెక్కల్లో ఆరితేరినా, తొందరగా చరిత్ర నేర్చుకునే వాడైనా, మీకిష్టమైన ఆటలో నేర్పు సంపాదించినా, లేఖనాల పరిజ్ఞానం అధికంగా ఉన్నా, బహిరంగంగా చక్కగా మాట్లాడగలిగినా మీరు అసూయను దరిచేరనీయకూడదు. ఎంతైనా “మత్సరము ఎముకలకు కుళ్లు,” అది మీకు హాని చేయగలదు. (సామెతలు 14:30; 27:4) కోపం తెచ్చుకొనే బదులు మీ తోబుట్టువు నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు లేని కొన్ని సామర్థ్యాలు లేదా నైపుణ్యాలు అతనిలో లేక ఆమెలో ఉన్నాయనే వాస్తవాన్ని అంగీకరించండి. మీ తోబుట్టువు పనులు చేసే విధానం గమనించండి, లేదా సహాయం కోసం అడగడం మరీ మంచిది.

ముందు ప్రస్తావించిన బారీ, తన సహోదరుల చక్కని మాదిరి నుండి ప్రయోజనం పొందాడు. అతనిలా అంటున్నాడు: “నా తోబుట్టువులు సంఘంలోనూ ప్రకటనా పనిలోనూ ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపడడంవల్ల ఎంత సంతోషంగా ఉన్నారో నేను గమనించాను. అందువల్ల నేను కూడా నా తోబుట్టువుల మాదిరి అనుసరించాలని నిర్ణయించుకొని రాజ్య మందిరం, బెతెల్‌ నిర్మాణ పనుల్లో పాల్గొన్నాను. నేను పొందిన అనుభవం నాలో నమ్మకం కలిగించి, యెహోవాతో నా సంబంధం మెరుగుపరచుకోవడానికి సహాయం చేసింది.”

మీ సొంత సామర్థ్యాలను తెలుసుకోవడం

మీ తోబుట్టువు మంచి లక్షణాలను అనుకరిస్తే మీరు మీ సొంత వ్యక్తిత్వాన్నే కోల్పోయే అవకాశం ఉందని బహుశా మీరు భయపడుతుండవచ్చు. కానీ అలా జరగనవసరం లేదు. “నన్ను పోలి నడుచుకొనువారై” ఉండుడని అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 కొరింథీయులు 4:15) అంటే వారు తమ సొంత వ్యక్తిత్వాన్నే వదులుకోవాలని పౌలు ఉద్దేశమా? ఎంతమాత్రం కాదు. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవకాశం ఉంది. లెక్కల్లో మీరు మీ తోబుట్టువంత ప్రజ్ఞావంతులుగా లేకపోతే, మీలో ఏదో లోపముందని కాదు. దానర్థం మీరొక విభిన్న వ్యక్తని మాత్రమే.

పౌలు ఈ ఆచరణాత్మక సలహా ఇస్తున్నాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” (గలతీయులు 6:4) మీ సొంత ఉత్కృష్టమైన నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవడానికి ఎందుకు కృషిచేయకూడదు? ఓ విదేశీ భాష మాట్లాడడాన్ని, ఓ సంగీత సాధనం వాయించడాన్ని లేదా కంప్యూటర్‌ ఉపయోగించడాన్ని నేర్చుకోవడం మీలో ఆత్మగౌరవాన్ని పెంచవచ్చు, అలాగే మీలో విలువైన నైపుణ్యాలు పెంపొందింపజేయవచ్చు. అన్నీ పరిపూర్ణంగా చేయడం గురించి దిగులుపడొద్దు. సమగ్రంగా, మనస్సాక్షిపూర్వకంగా, సమర్థంగా పని చేయడాన్ని నేర్చుకోండి. (సామెతలు 22:29) ఫలానిదాని కోసం మీకు సహజ అభిరుచి ఉండకపోవచ్చు, అయితే ‘శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు’ అని సామెతలు 12:24 చెబుతోంది.

ఏదేమైనా, ప్రత్యేకంగా మీరు ప్రగతి సాధించాలని కోరుకునేది ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు. ఇతరుల అవధానం చూరగొనే ఎలాంటి ప్రజ్ఞకన్నా ఆధ్యాత్మిక నైపుణ్యాలకు శాశ్వత విలువ మరి ఎక్కువగా ఉంటుంది. కవల సోదరులైన ఏశావు యాకోబుల విషయమే పరిశీలించండి. “వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా” ఉన్నందున ఏశావు తన తండ్రి మెప్పును చూరగొన్నాడు. మొదట్లో, అతని తోబుట్టువైన యాకోబును అలక్ష్యం చేయడం సులభమే అయ్యుండవచ్చు, ఎందుకంటే అతడు “సాధువై గుడారములలో నివసించుచుండెను.” (ఆదికాండము 25:27) ఏశావు తన ఆధ్యాత్మికతను వృద్ధిచేసుకోవడంలో విఫలమై ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. యాకోబు ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ పెంచుకొని యెహోవాచే మెండుగా ఆశీర్వదించబడ్డాడు. (ఆదికాండము 27:28, 29; హెబ్రీయులు 12:16, 17) మనమేమి పాఠం నేర్చుకోవచ్చు? మీ ఆధ్యాత్మికతను వృద్ధిచేసుకోండి, “మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి,” అప్పుడు మీ “అభివృద్ధి అందరికి తేటగా” కనబడుతుంది.​—మత్తయి 5:16; 1 తిమోతి 4:15.

మొదట్లో ప్రస్తావించబడిన క్లార ఇలా చెబుతోంది: “మా అక్కల చాటున జీవించడంలో నేను తృప్తిపొందాను. అయితే ప్రేమాభిమానాల విషయంలో ‘విశాలపరచుకొనుడి’ అనే లేఖన సలహాను అనుసరించడానికి తీర్మానించుకున్నాను. సంఘంలోని వివిధ వ్యక్తులతో క్షేత్ర పరిచర్యలో పనిచేస్తూ సంఘంలో సహాయం అవసరమున్న వారికి ఆచరణాత్మకంగా సహాయంచేసే మార్గాల కోసం వెదికాను. అంతేగాక విభిన్న వయస్సుల సహోదర సహోదరీలను మా గృహానికి ఆహ్వానించి వారి కోసం వంటచేశాను. నాకిప్పుడు చాలామంది స్నేహితులున్నారు, నా ఆత్మగౌరవం ఎంతో పెరిగింది.”​—2 కొరింథీయులు 6:13.

అప్పుడప్పుడు, మీ తల్లిదండ్రులు మీ అన్నయ్యనో అక్కనో చూసి నేర్చుకొమ్మని మందలించవచ్చు. మీ తల్లిదండ్రులు మీ మేలే కోరుతున్నారని గ్రహించడం మీ బాధను కొంతమేరకు తగ్గించవచ్చు. (సామెతలు 19:11) అయితే, అలా పోల్చడం మీరెలా భావించేలా చేస్తోందో గౌరవపూర్వకంగా మీ తల్లిదండ్రులకు చెప్పడం మంచిది. బహుశా వారు తమ చింతను వేరే విధాలుగా వ్యక్తం చేయడానికి ప్రయత్నించవచ్చు.

మీరు యెహోవా దేవుని సేవ చేస్తే ఆయనే మిమ్మల్ని స్వయంగా గమనిస్తాడని ఎప్పటికీ మరచిపోకండి. (1 కొరింథీయులు 8:3) బారీ చివరికిలా చెబుతున్నాడు: “నేను యెహోవాను ఎంత ఎక్కువగా సేవిస్తే నేనంత ఆనందంగా ఉంటానని గ్రహించాను. ప్రజలిప్పుడు నన్ను ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నారు, మా అన్నయ్యలను మెచ్చుకున్నట్లే ఇప్పుడు నన్నూ మెచ్చుకుంటున్నారు.” (g03 11/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ యెహోవాసాక్షులు తమ కోసం ఏర్పాటు చేసుకున్న పాఠశాల.

[13వ పేజీలోని చిత్రం]

మీ తోబుట్టువు తరచూ అందరి అవధానాన్ని పొందుతోందా?

[14వ పేజీలోని చిత్రం]

మీ సొంత సామర్థ్యాలను, ఆసక్తులను తెలుసుకోండి

[14వ పేజీలోని చిత్రం]

మీ ఆధ్యాత్మిక నైపుణ్యాలను వృద్ధిచేసుకోవడం ద్వారా ‘మీ వెలుగు ప్రకాశింపనియ్యండి’