ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
ప్రాచీన ఈజిప్ట్ టూత్‌పేస్ట్ ఫార్ములా
“టూత్‌పేస్ట్ 1873లో కోల్గెట్ అనే వాణిజ్య పేరుతో మార్కెట్టులోకి రావడానికి 1,500 సంవత్సరాల పూర్వమే ఉపయోగించబడిన ప్రపంచంలోని అతి పురాతన టూత్‌పేస్ట్ ఫార్ములా, వెన్నీస్ మ్యూజియం బేస్‌మెంటులో దుమ్ముపట్టిన పాపిరస్‌పై ఉన్నట్లు కనుగొనబడింది” అని ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ నివేదించింది. “మసి, అరబిక్ జిగురు, నీరుకలిపి చేసిన సిరాతో వెలిసిన నలుపు రంగులో ప్రాచీన ఈజిప్ట్ లేఖికుడు ‘తెల్లని, మెరుగైన దంతాల కోసం పళ్లపొడి’ అని తాను పిలిచే ఫార్ములాకు సంబంధించిన వివరాలు జాగ్రత్తగా వ్రాశాడు. నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు అది ‘శుద్ధమైన టూత్‌పేస్ట్‌గా’ మారుతుంది” అని ఎలక్ట్రానిక్ టెలీగ్రాఫ్ నివేదిస్తోంది. సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన ఈ డాక్యుమెంటు రాతి ఉప్పు, పుదీనా, ఎండిన ఐరిస్ పువ్వులు, మిరియాలు—ఇవన్నీ కలిపి నూరి పొడిచేయడాన్ని వివరిస్తోంది. ఈ విషయం వియన్నాలో జరిగిన డెంటల్ కాంగ్రేసులో సంచలనం సృష్టించింది. “ప్రాచీనకాలంలో అలాంటి ఉన్నతస్థాయి టూత్‌పేస్ట్ ఫార్ములా ఉంటుందని డెంటల్ ప్రొఫెషన్‌లో ఎవ్వరూ తలంచలేదు” అని డాక్టర్. హెయిన్జ్ న్యూమన్ చెప్పాడు. ఆయన దానిని వాడినప్పుడు “నోరు తాజాగా, పరిశుభ్రంగా ఉన్నట్లు” కనుగొన్నాడు. ఆ ఆర్టికల్ ఇలా చెబుతోంది: “ఐరిస్ పువ్వుల ప్రయోజనకర గుణాలను డెంటిస్టులు ఇటీవల కనుగొన్నారు, అవి చిగురు వ్యాధులపై అమోఘంగా పనిచేస్తున్నట్లు వెల్లడి కాగా అదిప్పుడు వాణిజ్యపరంగా వాడుకలోకి వచ్చింది.” (g03 11/22)
కుటుంబం సంభాషించవలసిన అవసరత
“కుటుంబ సంభాషణలు ‘దైనందిన గొణుగుడుగా’ దిగజారిపోవడంవల్ల పిల్లలు సరిగా మాట్లాడలేకపోతున్నారు” అని లండన్‌కు చెందిన ద టైమ్స్ నివేదిస్తోంది. బ్రిటన్‌లో విద్యా ప్రమాణాలు కాపాడే బాధ్యతగల ప్రభుత్వ ప్రాథమిక నైపుణ్యతల సంస్థ సంచాలకుడైన ఆలెన్ వెల్స్, కుటుంబంలో సంభాషణలు అలా దిగజారడానికిగల కారణాన్ని పిల్లలు “టీవీ, కంప్యూటర్ ముందు కూర్చోవడానికి, కుటుంబాలు కలిసి భోజనం చేయడానికి సమయం లేకపోవడానికి” ఆపాదిస్తున్నాడు. తాతయ్యలు మామ్మలు లేని ఒకే తల్లి/తండ్రి ఉన్న కుటుంబాలు పెరిగిపోవడాన్ని అలాగే తమ పిల్లలకు చదివి వినిపించే తల్లిదండ్రులు కొద్దిగానే ఉండడాన్ని కూడా వెల్స్ నిందిస్తున్నాడు. నాలుగు, ఐదు సంవత్సరాల వయస్సులో పాఠశాలలో చేర్పించబడే పిల్లలు గతకాలపు పిల్లలవలే “స్పష్టంగా మాట్లాడలేకపోవడానికి, తమను తాము వ్యక్తం చేసుకోలేకపోవడానికి”గల కారణాన్ని వివరించడానికి ఈ వాస్తవాలు సహాయం చేస్తున్నాయని ఆయన అభిప్రాయం. తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఎలా సంభాషించాలో నేర్పించే కార్యక్రమాలను ఆయన సిఫారసు చేస్తున్నాడు. (g03 9/22)
మతంపట్ల ఆసక్తి లేకపోవడం
“ప్రస్తుత నిరాశాపూరిత పరిస్థితులను తట్టుకోవడానికి సంఘర్షిస్తున్న [జపాను] దేశస్థులు పరిష్కారం కోసం మతంవైపు మళ్లుతున్నట్లుగా కనిపించడం లేదు” అని ఐ.హెచ్.టి అసాహీ షింబున్ వార్తాపత్రిక నివేదిస్తోంది. “మీరు మతాన్ని లేదా ఏదో విధమైన విశ్వాసాన్ని నమ్ముతారా లేదా దానిలో కాస్తయినా ఆసక్తివుందా?” అనే ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ కేవలం 13 శాతం స్త్రీపురుషులు మాత్రమే అవును అని జవాబిచ్చారు. అదనంగా 9 శాతం పురుషులు, 10 శాతం స్త్రీలు తమకు “కాస్త” ఆసక్తి ఉందని చెప్పారు. “ప్రత్యేకంగా 20 సంవత్సరాల స్త్రీలల్లో ఆసక్తి చాలా తక్కువగా ఉండడం గమనార్హం, వారు కేవలం 6 శాతమే ఉన్నారు” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. జపానులో 77 శాతం పురుషులు, 76 శాతం స్త్రీలు తమకు మతంపై లేదా ఏ విధమైన విశ్వాసంపై ఆసక్తి లేదని చెప్పినట్లు వార్షిక సర్వే వెల్లడిచేస్తోంది. ఇలాంటి సర్వేనే 1978లో కూడా జరిగింది, అయితే అప్పటికీ ఇప్పటికీ జపాను దేశస్థుల్లో మతం మీద ఆసక్తి దాదాపు సగానికి తగ్గిపోయింది. సాధారణంగా, 60 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులే తమకు మతంపట్ల కాస్త ఆసక్తి ఉందని జవాబిచ్చారు. (g03 10/08)
నేర్చుకోవడానికి వృద్ధాప్యం అడ్డుకాదు
నిరక్షరాస్యత విస్తారంగా ఉన్న నేపాల్‌లో, 12కంటే ఎక్కువ మంది మనుమలు మనవరాళ్లు ఉన్న ఓ పెద్దమనిషి విద్య నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలను బట్టి గణుతికెక్కాడు. రైటర్ బాజేగా అందరికీ తెలిసిన బాల్ బహదూర్ కార్కీ 1917లో జన్మించాడు, ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. 84 సంవత్సరాల వయసులో నాలుగుసార్లు ప్రయత్నించిన తర్వాత ఆయన స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ సంపాదించాడు. ఇప్పుడు తన 86వ యేట ఆయన కాలేజి విద్య నేర్చుకుంటున్నాడు. ఆయన ఇంగ్లీషు భాషను నేర్చుకోవడంపై అవధానం నిలిపి, ఆ భాషలో వేరేవాళ్లకు ట్యూషన్లు కూడా చెబుతున్నాడు. ఆయన తన డెస్కు ముందు కూర్చొని ఉండగా తనచుట్టు కూర్చునే యౌవనులను చూసి తన వయసు మరచిపోయి, తను కుర్రవాడని భావిస్తున్నానని ఆయన చెబుతున్నాడు. ఆయన క్రితంసారి రాజధాని ఖాట్మండుకు వెళ్లినప్పుడు, తాను సాధించిన విజయాలకు బహుమతులు, పెద్దపెట్టున కరతాళ ధ్వనులు అందుకున్నాడు. తాము వృద్ధులమనే కారణంచేత ఆశవదులుకోవద్దని ఆయన ఇతరులను ప్రోత్సహించాడు. అయితే రైటర్ బాజే ఒక ఫిర్యాదు చేశాడు. ఎయిర్‌లైన్స్‌లో తనకు డిస్కౌంట్ లభించలేదని, తాను పూర్తి విమాన ఖర్చులు భరించలేడు కాబట్టి బస్సు పట్టుకోవడానికి మూడురోజులు నడవాల్సివచ్చిందని ఆయన చెప్పాడు. “నేను కూడా విద్యార్థిని కాబట్టి నాకు ఎయిర్‌లైన్స్ వాళ్లు విద్యార్థులకు ఇచ్చే డిస్కౌంట్ ఇవ్వాలి” అని ఆయన ఖాట్మండు పోస్ట్‌కు చెప్పాడు. (g03 12/22)