కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ బంధువులు మీ విశ్వాసాన్ని పంచుకోనప్పుడు

మీ బంధువులు మీ విశ్వాసాన్ని పంచుకోనప్పుడు

బైబిలు ఉద్దేశం

మీ బంధువులు మీ విశ్వాసాన్ని పంచుకోనప్పుడు

ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో 10,000 కంటే ఎక్కువ రకాల మతాలు, తెగలు ఉన్నాయి. ఒక దేశ జనాభాలో దాదాపు 16 శాతం వయోజనులు ఏదోక సమయంలో ఒక మతం నుండి వేరొక మతానికి మారారు. కాబట్టి, మత నమ్మకాలకు సంబంధించి బంధువుల, స్నేహితుల మధ్య అసమ్మతి ఉందంటే దానిలో ఆశ్చర్యం లేదు. దీనివల్ల కొన్నిసార్లు బంధువర్గాల్లో అపార్థాలు కలుగుతాయి. కాబట్టి ప్రశ్నేమంటే, తమ విశ్వాసాన్ని పంచుకోని తమ బంధువులపట్ల క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి?

ఓ ప్రత్యేక సంబంధం

ఉదాహరణకు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యవుండే ప్రత్యేక సంబంధం గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి. “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అని చెబుతున్న నిర్గమకాండము 20:12 లోని ఆజ్ఞకు కాల పరిమితి లేదు. వాస్తవానికి, మత్తయి 15:4-6 లో నమోదు చేయబడినట్లు యేసు ఈ ఆజ్ఞను చర్చించినప్పుడు, ఆయన ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రులపట్ల చూపాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాడనేది స్పష్టమవుతోంది.

తల్లిదండ్రులపట్ల అగౌరవం చూపించడానికి విరుద్ధంగా బైబిలు పుస్తకమైన సామెతలు హెచ్చరిస్తోంది. “నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము” అని సామెతలు 23:22 హితవు చెబుతోంది. “తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు” అని సామెతలు 19:26 నొక్కి చెబుతోంది.

మనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని లేఖనాలు చెబుతున్నాయన్నది స్పష్టం. తల్లిదండ్రులు మన మతాన్ని అంగీకరించనప్పుడు, అది వారితో మన సంబంధాన్ని తెంచివేయదు. ఈ లేఖన సూత్రాలు ఇతర రక్తసంబంధీకులకూ, వివాహ జతకూ అన్వయిస్తాయి. కాబట్టి, తమ బంధువులను ప్రేమించాలనే నైతిక, లేఖన బాధ్యతను క్రైస్తవులు విస్మరించలేరు.

సముచితత్వం ఆవశ్యం

అయితే, చెడు సాంగత్యానికి విరుద్ధంగా బైబిలు హెచ్చరిస్తోంది మరియు ఈ ప్రభావం ఒక వ్యక్తి రక్తసంబంధీకుల నుండే రావచ్చు. (1 కొరింథీయులు 15:33) గతంలో దేవుని నమ్మకమైన సేవకులు చాలామంది తమ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా సత్యం కోసం నిలబడ్డారు. ఇది కోరహు కుమారుల విషయంలో వాస్తవం. (సంఖ్యాకాండము 16:32, 33; 26:10, 11) ఇతరులను, చివరకు తమ బంధువులను సంతోషపెట్టడానికి కూడా నిజ క్రైస్తవులు తమ విశ్వాసం విషయంలో రాజీపడకూడదు.​—అపొస్తలుల కార్యములు 5:29.

కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా ఇతర బంధువులు క్రైస్తవుని నమ్మకాలకు విరుద్ధంగా తీవ్రంగా పోరాడతారు. కొందరు నిజ క్రైస్తవత్వానికి శత్రువులుగా కూడా తయారుకావచ్చు. అలాంటి సందర్భాల్లో క్రైస్తవులు తమ ఆధ్యాత్మికతను కాపాడుకోవడానికి సముచితమైన చర్యలు తీసుకొంటారు. యేసు యుక్తంగానే ఇలా చెప్పాడు: “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.”​—మత్తయి 10:36, 37.

అయితే అనేక సందర్భాల్లో, క్రైస్తవులు తమ బంధువుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోరు. వారి బంధువులు కేవలం వారి బైబిలు బోధల అవగాహనను మాత్రమే ఆమోదించరు. అవిశ్వాసులను ‘సాత్వికముతోను, మిక్కిలి గౌరవముతోను’ చూడవలెనని పరిశుద్ధ లేఖనాలు క్రీస్తు అనుచరులను ప్రోత్సహిస్తున్నాయి. (2 తిమోతి 2:24; 1 పేతురు 3:15, NW) బైబిలు యుక్తంగా ఇలా ఉపదేశిస్తోంది: ‘ప్రభువుయొక్క దాసుడు జగడమాడక అందరి యెడల సాధువుగా ఉండవలెను.’ (2 తిమోతి 2:26) “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెను” అని కూడా అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు.​—తీతు 3:1.

వారిని ఎడబాయక, ప్రేమను వ్యక్తం చేయండి

1 పేతురు 2:12 లో క్రైస్తవులకు ఈ ప్రోత్సాహమివ్వబడింది: “వారు [బంధువులు] మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి . . . దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెను.” మన నమ్మకాలను పంచుకోని బంధువులు తరచూ మనం బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మన జీవితంలో వచ్చిన మార్పులను గమనిస్తారు. అనాసక్తిగావున్న లేదా బైబిలు సత్యాన్ని వ్యతిరేకించిన చాలామంది తమ మనస్సు మార్చుకున్నారని మరచిపోకండి. కొంతమంది తమ వివాహ జత లేదా పిల్లవాని మంచి ప్రవర్తనను ఎన్నో సంవత్సరాలు జాగ్రత్తగా గమనించిన తర్వాత దాని వెనుకగల కారణం పరిశోధించడానికి ఆసక్తి చూపివుండవచ్చు. ప్రజలు తన క్రైస్తవ బంధువులచే నిర్లక్ష్యం చేయబడినందుకే బైబిలు సత్యాన్ని అంగీకరించకుండాపోయే పరిస్థితి రానివ్వకండి.

నిజమే, పరిస్థితులు వివిధ రకాలుగా ఉండవచ్చు మరియు క్రైస్తవ సాక్షులు తమ తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తుండవచ్చు. కోరుకున్నంత తరచుగా వారిని సందర్శించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఉత్తరాలు వ్రాయడం, టెలిఫోను చేయడం లేదా ఇతరత్రా వారితో క్రమంగా సంబంధం కలిగి ఉండడం మన బంధువులపట్ల మనకు ప్రేమవుందని వ్యక్తంచేస్తుంది. నిజ క్రైస్తవులు కాని అనేకులు తమ మత నమ్మకాలను పంచుకోని తల్లిదండ్రులను, ఇతర బంధువులను ప్రేమిస్తూ క్రమంగా వారితో సంబంధం కాపాడుకుంటారు. క్రైస్తవ సాక్షులు అంతకంటే తక్కువ చేయాలా? (g03 11/08)

[20వ పేజీలోని చిత్రం]

మీ బంధువులతో సంబంధం కాపాడుకోవడం వారిపట్ల మీ ప్రేమను వెల్లడిచేస్తుంది