కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొజాయిక్‌లు రాతి చిత్రాలు

మొజాయిక్‌లు రాతి చిత్రాలు

మొజాయిక్‌లు రాతి చిత్రాలు

ఇటలీలోని తేజరిల్లు! రచయిత

మొజాయిక్‌ చిత్రణ “ఓ అపూర్వ కళ,” “అద్భుతమైన” అలంకరణా నైపుణ్యం, “పురాతన కాలంనుండి చెక్కుచెదరకుండా నిలిచిన అలంకార కృతుల్లో” ఒకటి అని పిలువబడింది. 15వ శతాబ్దానికి చెందిన ఇటలీ కళాకారుడైన డోమేనీకో గిర్‌లాండాజో దానిని “నిరంతరం నిలిచే నిజమైన చిత్రణా విధానం” అని పిలిచాడు. మొజాయిక్‌ల గురించి మీ ఆలోచన ఏదైనా, వాటికి నిజంగా ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది.

మొజాయిక్‌ చిత్రణను నేల, గోడ లేదా ధనురాకారంలో ఉండే పైకప్పు లోపలి భాగం వంటి ఉపరితలంపై చిన్నచిన్న రాతి, గాజు లేదా పెంకు ముక్కలను దగ్గరదగ్గరగా అతికించి పరికల్పనచేసే అలంకరణ కళగా నిర్వచించవచ్చు. పురాతన కాలం నుండి నేలల, గోడల అలంకరణలో మొజాయిక్‌లు వాడబడ్డాయి. తేమ కారణంగా సున్నిత కళారీతులు పాడయ్యే స్థలాలు అంటే స్నానాల గదులు, కొలనులు, ఫౌంటెయిన్‌లు కూడా మొజాయిక్‌లతో అలంకరించబడేవి.

మామూలుగా ఒకటే రంగులో ఉండే నేలల నుండి నలుపు తెలుపు డిజైన్ల వరకు, రంగురంగుల సంక్లిష్టమైన పువ్వుల నమూనాల నుండి కష్టసాధ్యమైన చిత్ర కూర్పుల వరకు మొజాయిక్‌లు ఎన్నో రూపాల్లో ఉంటాయి.

ఆవిష్కరణ, అభివృద్ధి

మొజాయిక్‌లను ఎవరు కనిపెట్టారో స్పష్టంగా తెలియదు. ప్రాచీన ఐగుప్తీయులు, సుమేరియన్లు తమ భవంతులను ఉపరితల రంగుల నమూనాలతో అలంకరించేవారు. అయితే, ఆ కళ అభివృద్ధి చెందకుండానే అంతరించిపోయినట్లు కనిపిస్తోంది. ఆసియా మైనర్‌, కార్తేజ్‌, క్రేతు, గ్రీస్‌, సిసిలి, స్పెయిన్‌, సిరియా ఇవన్నీ మొజాయిక్‌ చిత్రణకు పుట్టిన ప్రాంతాలుగా చెప్పబడడంతో, ఈ సాంకేతిక పనితనం “మధ్యధరా జలపోషిత వివిధ ప్రాంతాల్లో, వివిధ కాలాల్లో కనిపెట్టబడి, మరచిపోబడి, తిరిగి కనిపెట్టబడింది” అని ఒక రచయిత సిద్ధాంతీకరించడానికి దారితీసింది.

సా.శ.పూ. తొమ్మిదో శతాబ్దంనాటి తొలికాలపు మొజాయిక్‌లు సాధారణ నమూనాలతో నున్నని స్ఫటికపు రాళ్లతో రూపొందించబడ్డాయి. స్థానికంగా లభించే రాళ్లు వివిధ రంగులు చేకూర్చేవి. సాధారణంగా ఆ రాళ్లు 10 నుంచి 20 మిల్లీ మీటర్ల వ్యాసంలో ఉండేవి, అయితే వివరణాత్మక నమూనాల్లో ఐదు మిల్లీ మీటర్లంత చిన్న స్ఫటికపు రాళ్లు ఉపయోగించబడేవి. సా.శ.పూ. 4వ శతాబ్దానికల్లా కళాకారులు స్ఫటికపు రాళ్లను ఇంకా అతి చిన్న ముక్కలుగా కోయడం ఆరంభించారు, దానితో చిత్రాలను మరింత వివరణాత్మకంగా రూపొందించడం సాధ్యమైంది. క్రమేణా ఆ స్ఫటికపు రాళ్ల స్థానాన్ని నాలుగు పలకల రాళ్లు లేదా టెస్సేరలు ఆక్రమించుకున్నాయి. టెస్సేరలు వివిధ రంగులు లభ్యమయ్యేలా చేయడమే గాక, కావలసిన నమూనాకు తగ్గట్టు సులభంగా అమర్చగల సౌలభ్యాన్ని కలిగించాయి. వాటి వల్ల ఉపరితలాన్ని నున్నగా చేయడం సాధ్యమైంది, అలాంటి ఉపరితలపు రంగుల మెరుపును పెంచడానికి దానికి మెరుగుపెట్టి మైనం రుద్దవచ్చు. సా.శ. రెండవ శతాబ్దానికల్లా రంగురంగుల చిన్న గాజు ముక్కలు కూడా విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి, అవి మొజాయిక్‌ కళాకారులు వివిధ రంగులతో అలంకరించేందుకు ఎంతగానో దోహదపడ్డాయి.

గ్రీసు ప్రభావం ఎక్కువగావున్న కాలంలో (ఇంచుమించు సా.శ.పూ. 300 నుండి ఇంచుమించు సా.శ.పూ. 30) ప్రత్యేకంగా చూడముచ్చటైన బొమ్మల మొజాయిక్‌లు తయారుచేయబడ్డాయి. “సాధ్యమైనంత ఎక్కువ రంగులు వాడడం మూలంగా, టెస్సేరల సైజును మిల్లీ మీటరు ఘనాకారానికి తగ్గించడం మూలంగా . . , గ్రీకు మొజాయిక్‌ కళాకారుల చిత్రాలు, గోడమీద వేసే చిత్రాలకు పోటీగా తయారయ్యాయి” అని గ్లొసారియో టెక్నికో-స్టోరికో డెల్‌ మొజాయికో (మొజాయిక్‌ కళ సాంకేతిక-చారిత్రక పదాల సంకలనం) చెబుతోంది. కాంతి, ఛాయ, దూరం, సాంద్రత, కోణం వంటివాటి సునిశిత ప్రభావాలను చూపించడానికి రంగు ఎంతో నైపుణ్యవంతంగా ఉపయోగించబడేది.

గ్రీసు మొజాయిక్‌ చిత్రాల విశేషత ఏమిటంటే, వాటి మధ్యన ఉండే సవివరమైన ఇన్‌సెట్‌ లేదా ఎంబ్లెమా, ఇది తరచూ ప్రఖ్యాత పెయింటింగ్‌కు ఉత్కృష్టమైన నకలుగా ఉండేది, దీనికి నాలుగు ప్రక్కలా అలంకృత అంచులు ఉండేవి. కొన్ని ఇన్‌సెట్‌లలో ఉండే టెస్సేరలు ఎంత చిన్నవిగా, ఎంత సరిగ్గా సరిపోయేవిగా ఉండేవంటే అవి ఒక్కొక్క రాయి పేర్చి చేసినవిగా కాకుండా కుంచెతో రంగు వేశారా అన్నట్లు కనిపించేవి.

రోమన్‌ మొజాయిక్‌లు

ఇటలీలో, రోమా సామ్రాజ్య పాలిత ప్రాంతాల్లో దొరికిన విస్తారమైన మొజాయిక్‌ల కారణంగా మొజాయిక్‌ చిత్రణ తరచూ రోమన్‌ కళగా పరిగణించబడుతుంది. “ఉత్తర బ్రిటన్‌ నుండి లిబియా వరకు, అలాగే అట్లాంటిక్‌ తీరం నుండి సిరియా ఎడారివరకు రోమన్‌ కాలపు భవంతుల్లో ఈ తరహా పేవ్‌మెంట్లు కోకొల్లలుగా దొరికాయి. ఆ సాంకేతిక పనితనం రోమా సంస్కృతి విస్తరణతో ఎంతగా ముడిపడి ఉందంటే, కొన్నిసార్లు ఆ మొజాయిక్‌ పేవ్‌మెంట్లు రోమన్‌ ఉనికిని గుర్తించే చిహ్నాల్లో ఒక అంశంగా పరిగణించబడ్డాయి” అని ఓ సాహిత్యం చెబుతోంది.

అయితే, వివిధ రంగుల మొజాయిక్‌లు తొలి రోమా సామ్రాజ్య విస్తరణకు తగ్గ అవసరాలను అంతగా తీర్చలేకపోయాయి. సా.శ. మొదటి శతాబ్దంలో పెద్ద ఎత్తున జరిగిన నగర విస్తీర్ణత వేగంగా, చౌకగా లభించే మొజాయిక్‌ చిత్రణకు డిమాండు పెరిగేలా చేసింది. ఇది నలుపు, తెలుపు టెస్సేరలు మాత్రమే ఉపయోగించబడే మొజాయిక్‌ల ఆరంభాన్ని పరిచయం చేసింది. ఉత్పత్తి గణనీయంగా పెరిగింది, ఎన్‌సైక్లోపీడియా డెల్‌ఆర్టీ ఆంటికా (ప్రాచీన కళా సర్వసంగ్రహ నిఘంటువు) ప్రకారం “సామ్రాజ్యంలోని ఏ నగరంలోనైనా మొజాయిక్‌ లేనిధనవంతుల ఇల్లంటూ లేదు.”

కొన్ని నమూనాల ఖచ్చితమైన ప్రతికృతులను ఎక్కడో దూరాన ఉన్న ప్రాంతాల్లో కూడా కనుగొనవచ్చు. మొజాయిక్‌ పనివాళ్ళ జట్లు లేదా బహుశా మొజాయిక్‌ నమూనాలున్న పుస్తకాలు ఒక భవంతినుండి మరో భవంతికి వెళ్తూ ఉండేవని ఇది సూచిస్తోంది. కావాలనుకుంటే, పనిస్థలంలోనే రూపించబడే ఎంబ్లెమాను ముందుగానే ఆర్డరుచేసి, తయారుచేయించుకొని చలువరాయి మీద లేదా కాల్చిన మట్టి పలకమీద నిర్మాణ స్థలానికి చేర్చుకొని స్థాపించుకునేవారు. మిగతా మొజాయిక్‌ పనంతా నిర్మాణ స్థలంలోనే చేయబడేది.

నమూనాలను, అంచులను వాటి కూర్పుకు తగ్గట్టు అమర్చడానికి శ్రద్ధతోకూడిన కార్య ప్రణాళిక అవసరం. పునాది, దాని ఉపరితలం నునుపుగా, మట్టంగా ఉండేలా చూడడానికి వాటికి అవధానం ఇవ్వబడేది. ఆ తర్వాత, ఒక చిన్న భాగంలో అంటే ఆరిపోయి గట్టిపడక ముందే పనిచేయడానికి అనువుగా ఉండేంత స్థలంలో​—బహుశా చదరపు మీటరుకంటే తక్కువ స్థలంలో మెత్తని మోర్టార్‌ పూత (దీనిని సెట్టింగ్‌ బెడ్‌ అంటారు) పూస్తారు. నమూనా నిర్దేశం కోసం దాని ఉపరితలంపై సన్నని గీతలతో స్కెచ్‌ వేసుకొని, టెస్సేరలను అవసరమైన సైజు ముక్కలుగా చేసుకొని మొజాయిక్‌ పనివాళ్లు వాటిని అమర్చడం మొదలుపెడతారు.

టెస్సేరలను ఒక్కొక్కటిగా ఆ మొర్టారులోకి గుచ్చుతారు అప్పుడు ఆ మోర్టారు ఆ ముక్కల మధ్యన అమరుతుంది. ఒక భాగం పూర్తయిన తర్వాత, దాని ప్రక్కనే మరో సెట్టింగ్‌ బెడ్‌ వేస్తారు, ఆ తర్వాత అలాగే మరొకటి అలా వేసుకుంటూ వెళ్తారు. నైపుణ్యంగల పనివాళ్లు మరింత సంశ్లిష్టమైన భాగాల్లో పనిచేస్తూ, ఎక్కువ పనితనం అవసరం లేని కొన్ని మిగిలిన భాగాలు పూర్తిచేయడానికి తమ సహాయకులకు విడిచిపెడతారు.

క్రైస్తవమత సామ్రాజ్యపు మొజాయిక్‌లు

సా.శ. నాలుగవ శతాబ్దంలో, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో మొజాయిక్‌లు ఉపయోగించడం ఆరంభమైంది. తరచూ బైబిలు కథలు చిత్రీకరించబడే అలాంటి మొజాయిక్‌లు ఆరాధకులకు ఉపదేశించడానికి పనికొచ్చేవి. బంగారం మీద, రంగురంగుల గాజు టెస్సేరల మీద ప్రతిఫలించే రెపరెపలాడే కొవ్వొత్తుల వెలుగులు అలౌకిక వాతావరణాన్ని సృష్టించేవి. స్టోరియా డెల్‌ఆర్టె ఇటాలియానా (ఇటాలియన్‌ కళా చరిత్ర) ఇలా చెబుతోంది: “నియోప్లేటోనిజమ్‌చే . . . బహుగా ప్రభావితమైన ఆ కాలపు ఆలోచనా విధానానికి మొజాయిక్‌ చిత్రకళ చాలా చక్కగా సరిపోయింది. మొజాయిక్‌ కళలో ఒక ప్రక్రియ ఏర్పడింది, దాని ద్వారా భౌతికపదార్థం తన జడత్వాన్ని కోల్పోయి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికతగా, స్వచ్ఛమైన వెలుగుగా, స్వచ్ఛమైన ఆకృతిగా రూపొందుతుంది.” * క్రైస్తవత్వ వ్యవస్థాపకుడైన యేసుక్రీస్తు బోధించిన సరళమైన ఆరాధనా విధానానికి దీనికి ఎంత వ్యత్యాసమో గదా!​—యోహాను 4:21-24.

బైజాన్‌టైన్‌ చర్చీల్లో మొజాయిక్‌ పనితనపు ప్రఖ్యాత నమూనాలు కొన్ని కనబడతాయి. కొన్ని ఆరాధనా గృహాల్లో లోపలి గోడల నిండా, ధనురాకారంలో ఉండే పైకప్పు లోపలి భాగం నిండా ఒక్క సెంటీ మీటరు ఖాళీలేకుండా టెస్సేరలు అలంకరించబడి ఉంటాయి. “క్రైస్తవ మొజాయిక్‌ చిత్రణ కళాఖండాలు” అని వర్ణించబడినవి ఇటలీలోని రావెన్నాలో కనబడతాయి, వాటి నేపథ్యంలో బంగారువన్నె ప్రధానంగా కనబడుతూ దైవిక వెలుగును, గ్రహించనశక్యమైన మర్మమును చిత్రీకరిస్తుంది.

మొజాయిక్‌ చిత్రణ పశ్చిమ ఐరోపా చర్చీల్లో మధ్య యుగాలన్నిటిలో ప్రముఖంగా ఉపయోగించబడుతూ, ఇస్లామిక్‌ ప్రపంచంలో బహు ప్రావీణ్యంగా ఉపయోగించబడింది. పునరుజ్జీవ ఇటలీనందు, వెనీస్‌లోని సెయింట్‌ మార్క్స్‌, రోమ్‌లోని సెయింట్‌ పీటర్స్‌ వంటి గొప్ప కెథడ్రల్స్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌లు మొజాయిక్‌ ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దాదాపు 1775 నాటికి, రోమ్‌లోని మొజాయిక్‌ పనివారు రంగురంగుల కరిగిన గాజు దారాల్ని చాలా చిన్న టెస్సేరలుగా ఎలా కోయాలో నేర్చుకున్నారు, దానితో పెయింటిగ్‌ల చిన్న తరహా మొజాయిక్‌ నకలు రూపొందించడం సాధ్యమైంది.

ఆధునిక పద్ధతులు, వాడకం

ఆధునిక మొజాయిక్‌ పనివాళ్లు పరోక్షపద్ధతి అని పిలువబడే విధానం అవలంబిస్తున్నారు. ఈ పద్ధతిలో పనిస్థలంలోనే టెస్సేరలను పూర్తిసైజు కాగితం నమూనా మీద జిగురుతో ముందుభాగం అంటించి వెనుకభాగం అలాగే వదిలేస్తారు. వాటిని స్థాపించవలసిన స్థలానికి ముక్కలు ముక్కలుగా తీసుకెళ్లి టెస్సేరల వెనుకభాగాన్ని సెట్టింగ్‌ బెడ్‌పై పెట్టి గట్టిగా నొక్కుతారు. మోర్టారు ఆరిన తర్వాత ఆ కాగితాన్ని, జిగురును కడిగేసి ముందుభాగం కనపడేలా చేస్తారు. ఈ పద్ధతి సమయాన్ని, శ్రమను తగ్గిస్తుంది. అయితే కాంతివంతంగా ఉండని ఉపరితలానికి మధ్యయుగాల మొజాయిక్‌లలో ఉండే తేజస్సు తగ్గుతుంది.

అయినప్పటికీ, 19వ శతాబ్దానికి చెందిన అనేక నగర శాలలు, నాటక శాలలు, చర్చీలవంటి భవంతులు ఈ పద్ధతిలోనే అలంకరించబడ్డాయి. దీనికితోడు, మెక్సికో నగరం నుండి మాస్కో వరకు, ఇశ్రాయేల్‌ నుండి జపాన్‌ వరకు ఈ పద్ధతి వస్తు ప్రదర్శన శాలల్లో, సబ్‌వే స్టేషన్లలో, షాపింగ్‌ మాల్స్‌లో, పార్కుల్లో, క్రీడా స్థలాల్లో విస్తారంగా ఉపయోగించబడుతోంది. నున్నగా ఉన్నప్పటికీ అనేక ముఖరూపాల్లో ఉండే మొజాయిక్‌ ఉపరితలాలు ఆధునిక భవంతుల విశాలమైన ముందుభాగాలను అలంకరించడానికి బాగుంటాయని కూడా పరిగణించబడుతున్నాయి.

పదహారవ శతాబ్దానికి చెందిన ఇటాలియన్‌ కళాకారుడు, కళా చరిత్రకారుడు అయిన జోర్జో వాసారీ ఇలా వ్రాశాడు: “మొజాయిక్‌ ఉనికిలో ఉండగల అత్యంత మన్నికైన చిత్రం. ఇతర పెయింటింగ్‌లు కాలగమనంలో వెలిసిపోతాయి, అయితే మొజాయిక్‌ చిత్రం కాలం గడిచేకొద్దీ మరింత కాంతివంతమవుతుంది.” అవును, అనేక మొజాయిక్‌ చిత్రాల వెనకున్న పనితనం మన అవధానాన్ని చూరగొంటుంది. మొజాయిక్‌లు నిజంగా ఆకర్షణీయమైన రాతి చిత్రాలు! (g03 10/08)

[అధస్సూచి]

^ లేఖనరహిత నియోప్లేటోనిక్‌ తత్వాలు, ఇతర విషయాలతోపాటు, ఆత్మ అమర్త్యమైనదనే నమ్మకాన్ని కూడా ప్రోత్సహించాయి.

[22వ పేజీలోని చిత్రం]

యెరూషలేము మ్యాప్‌ (సా.శ. ఆరవ శతాబ్దం)

[చిత్రసౌజన్యం]

Garo Nalbandian

[22వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ (సా.శ.పూ. రెండవ శతాబ్దం)

[చిత్రసౌజన్యం]

Erich Lessing/Art Resource, NY

[23వ పేజీలోని చిత్రాలు]

డోమ్‌ ఆఫ్‌ ద రాక్‌, జెరూసలెమ్‌ (సా.శ. 685-691లో నిర్మించబడింది)

[23వ పేజీలోని చిత్రం]

“డయనోసోస్‌,” అంతియొకయ (దాదాపు సా.శ. 325)

[చిత్రసౌజన్యం]

Museum of Art, Rhode Island School of Design, by exchange with the Worcester Art Museum, photography by Del Bogart

[24వ పేజీలోని చిత్రం]

టెస్సేరలు, రంగు గాజు, స్ఫటికపు రాళ్లు ఇప్పటికీ అధునిక మొజాయిక్‌లలో ఉపయోగించబడుతున్నాయి

[24వ పేజీలోని చిత్రం]

మాసాఛూసెట్స్‌లోని లిన్‌ హెరిటేజ్‌ స్టేట్‌ పార్కులో ప్రదర్శించబడిన మొజాయిక్‌ చిత్రం

[చిత్రసౌజన్యం]

Kindra Clineff/Index Stock Photography

[24వ పేజీలోని చిత్రాలు]

బార్సిలోనాలో ఆంటొనీ గాడీ రూపకల్పన చేసిన మొజాయిక్‌లు (1852-1926)

[చిత్రసౌజన్యం]

ఫోటో: Por cortesía de la Fundació Caixa Catalunya