కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సముద్రంలో విపత్తు భూమ్మీద విషాదం

సముద్రంలో విపత్తు భూమ్మీద విషాదం

సముద్రంలో విపత్తు భూమ్మీద విషాదం

స్పెయిన్‌లోని తేజరిల్లు! రచయిత

సముద్ర జలాల్లో 2002 నవంబరు 13న చమురు ఓడ ప్రెస్టీజ్‌కు చిల్లుపడడంతో పర్యావరణ, ఆర్థిక విపత్తు మొదలైంది. దెబ్బతిన్న ఆ ఓడను రక్షించే ప్రయత్నాలు విఫలం కావడంతో, ఆరు రోజుల తర్వాత​—అప్పటికే దాదాపు 20,000 టన్నుల చమురు కారిపోయింది​—ఆ ఓడ చివరకు స్పెయిన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో రెండు ముక్కలుగా విరిగి మునిగిపోయింది.

ఆ ఓడలో 50,000 టన్నుల చమురు ఉంది, దాని చట్రం నుండి రోజుకు దాదాపు 125 టన్నుల చమురు కారడం ఆగలేదు. ఆ చమురు నిరాటంకంగా తెట్లు తెట్లుగా తీరంవైపు నెమ్మదిగా కొట్టుకురావడం మొదలైంది. ముడి చమురు ముతక, విషపూరిత స్వభావం కారణంగా ప్రత్యేకించి పర్యావరణంపై విషాద ప్రభావం పడింది.

సముద్ర తీరాలను శుభ్రం చేయడానికి ప్రయత్నించిన అనేకమంది స్వచ్ఛంద సేవకులను ఆవిరిసెగలు అశక్తులను చేశాయి. అంతేకాకుండా, ఆ చమురు బరువైన తారు తెట్లుగా తయారై ఛూయింగ్‌ గమ్‌లా బండలకు అతుక్కుపోయింది. “చరిత్రలో ఇది అతి భీకరమైన చమురు తెట్టె” అని సెంటర్‌ ఆఫ్‌ డాక్యుమెంటేషన్‌, రీసెర్చ్‌ అండా ఎక్స్‌పరిమెంటేషన్‌ ఆన్‌ ఆక్సిడెంటల్‌ వాటర్‌ పొల్యూషన్‌ సంచాలకుడైన మైఖేల్‌ గిరిన్‌ విషాదం వెలిబుచ్చాడు.

సాహసోపేత ప్రయత్నాలు

జీవనోపాధికి ప్రమాదం వాటిల్లజేసే చమురు తెట్లు తొలగించేందుకు అనేక వారాలపాటు వందలాది మంది జాలర్లు తీవ్ర కృషిచేశారు. చమురు తమ సముద్రతీరాలను నల్లబరిచి, ప్రపంచంలోనే చేపల అధికోత్పత్తి ప్రాంతాలను నాశనం చేయకముందే ఆ జాలర్లు చమురును తొలగించడానికి సాహసోపేత పోరాటం సల్పారు. కొందరు చేతులతోనే నీళ్లలోనుంచి బంకసాగిన చమురు తెట్లను తొలగించారు. “అది నడ్డివిరిచే పని, అయినా చిన్నపడవల్లోని మాకు వేరే గత్యంతరం లేకపోయింది” అని ఓ స్థానిక జాలరి ఆంటోనియో వివరించాడు.

సముద్రంలో చమురుతో జాలర్లు పోరాడుతుండగా, స్పెయిన్‌ నలుమూలలనుండి వేలాదిమంది స్వచ్ఛంద సేవకులు సముద్ర తీరాలను శుభ్రపరిచే పనిచేశారు. శరీరాన్నంతా కప్పే తెల్లని డిస్పోసబుల్‌ బట్టలు, ముసుగులు ధరించిన వారు, జీవాయుధ యుద్ధంచేస్తున్న యోధుల్లా కనిపించారు. కానీ వారు ఎంతో కష్టపడుతూ, మోసుకెళ్లడానికి వీలుగా బకెట్లలోకి చమురు ఎత్తారు. జాలర్ల మాదిరిగా కొందరు స్వచ్ఛంద సేవకులు సముద్ర తీరాలను పాడుచేసిన చమురు తొలగించడానికి తమ చేతులు సైతం ఉపయోగించారు.

విషాదకర ప్రభావాలు

“ముఖేలో, అలలమీదుగా రేవుకు కొట్టుకొస్తున్న చమురును నేను మొదటిసారి చూసినప్పుడు దుఃఖం భరించలేక నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. మా పట్టణంలో ఆ చమురు తెట్టె అనేకమంది జీవనోపాధిని దెబ్బతీసింది” అని తీరం విధ్వంసమైన ఉత్తర గలీషియ ప్రాంతపు కోర్కుబయోన్‌ పట్టణ మేయరు, రఫాయేల్‌ మూసో చెప్పాడు.

విషాదకరంగా, స్పెయిన్‌లోని సౌందర్యవంతమైన కొత్త జాతీయ ఉద్యానవనమైన లాస్‌ ఇస్లాస్‌ అట్లాంటికాస్‌ (అట్లాంటిక్‌ దీవులు), అలాంటి ఒక చమురు తెట్టె ప్రభావాన్ని చవిచూసింది. గలీషియ తీరానికి దూరంగావున్న ఒకప్పటి నిర్మలమైన ఈ ఐదు దీవుల్లో వేలకొలది సముద్ర పక్షులు నివసించేవి. చుట్టు ప్రక్కలగల లోతైన సముద్ర తీరాల్లో సమృద్ధిగా మత్స్య సంపద ఉంది.

డిసెంబరు ఆరంభానికి ఉద్యానవనపు తీరంలో 95 శాతం తీరం చమురుతో కలుషితమైపోయింది. దాదాపు 1,00,000 పక్షులు ప్రమాదానికి గురవుతాయని పక్షిశాస్త్ర నిపుణులు లెక్కగట్టారు. సముద్ర గర్భంలో అటుఇటు కదలుచున్న గడ్డకట్టిన పెద్దపెద్ద చమురు ముద్దలు సున్నితమైన సముద్ర పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయని ఈతగాళ్లు చెప్పారు.

పక్షుల సంరక్షణా కేంద్రాన్ని వ్యవస్థీకరించిన జా హాల్‌కెమ్‌ ఇలా నివేదిస్తున్నాడు: “సాధారణంగా, పక్షులు మునిగిపోవడంవల్ల లేదా అల్పోష్ణస్థితితో మరణిస్తాయి. చమురు ఈకలకు అంటుకుపోయి, వాటి రక్షణకవచాన్ని, తేమ తట్టుకునే గుణాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా, తడిసి ముద్దయిన బట్టలు ఈతగాణ్ణి ఈడ్చినట్లే, బరువైన చమురు వాటిని ఈడ్చేలా చేస్తాయి. పక్షులను కొద్ది సంఖ్యలోనైనా రక్షించగలిగితే అది ఎంతో సంతృప్తినిస్తుంది.”

‘జరుగుతుందని ఊహించిన ప్రమాదమే’

శక్తికోసం ప్రపంచం చమురుపై ఆధారపడుతోంది, అయితే దాని ధరను అదుపులో ఉంచడానికి అది తరచూ ప్రమాదకరమైన, మంచి నిర్వహణా స్థితిలోలేని ఓడల్లో రవాణా చేయబడుతోంది. అందువల్ల, ఆ పరిస్థితిని “జరుగుతుందని ముందుగానే ఊహించిన ప్రమాదమని” ద న్యూయార్క్‌ టైమ్స్‌ వర్ణిస్తోంది.

గత 26 సంవత్సరాల్లో గలీషియా తీర ప్రాంతంలో మునిగిపోయిన చమురు ఓడల్లో ప్రెస్టీజ్‌ మూడవది. దాదాపు పది సంవత్సరాల క్రితం, ఉత్తర గలీషియలోని లా కొరున్వా దగ్గర ఏగియన్‌ సీ అనే ఓడ మునిగి 40,000 టన్నుల ముడి చమురు సముద్రం పాలుకాగా ఆ సమీప తీర ప్రాంతాలు కొన్ని ఇంకా కోలుకోలేదు. 1976లో అర్కోయిలె ఓడ అదే నదీముఖ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు కూడా విధ్వంసకరంగా 1,00,000 టన్నులకంటే ఎక్కువ చమురు సముద్రంలో పడిపోయింది.

ఇటీవలి విపత్తు దృష్ట్యా, రెండు పొరల చట్రాలులేని ఇంధన చమురు ఓడలన్నింటినీ నిషేధించడానికి యురోపియన్‌ యూనియన్‌ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ నిర్ణయం దెబ్బతిన్న యూరప్‌ తీర సంరక్షణకు తగినవిధంగా ఉన్నట్లు నిరూపించుకుంటుందో లేదో వేచిచూడాలి.

చమురు తెట్టెలే గానీ, విషపూరిత వ్యర్థపదార్థాలే గానీ లేదా వాతావరణ కలుషితమే గానీ, కాలుష్యం లేని ప్రపంచాన్ని హామీ ఇవ్వడంలో మానవ ప్రభుత్వాలు విఫలమయ్యాయని స్పష్టమవుతోంది. అయితే, క్రైస్తవులు మళ్లీ ఎప్పటికీ కలుషితంకాని పరదైసుగా మన గ్రహాన్ని మార్చే పనిని దేవుని రాజ్యం పర్యవేక్షించే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.​—యెషయా 11:1, 9; ప్రకటన 11:18. (g03 8/22)

[26, 27వ పేజీలోని చిత్రం]

ప్రెస్టీజ్‌ 50,000 టన్నుల చమురుతో మునిగిపోయింది

[చిత్రసౌజన్యం]

AFP PHOTO/DOUANE FRANCAISE