కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అమాటే మెక్సికో దేశపు కాగితం

అమాటే మెక్సికో దేశపు కాగితం

అమాటే మెక్సికో దేశపు కాగితం

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

మెక్సికో ప్రజలకు సుసంపన్నమైన, ఆసక్తికరమైన చరిత్ర ఉంది. గతకాలం నుండి కాపాడబడుతూ వస్తున్న విలువైన సాంస్కృతిక సంపదలో “టెస్టిమోనీస్‌” అంటే చిత్రకథా చేవ్రాత ప్రతులు లేదా రాతప్రతులు ఉన్నాయి. ఈ రాతప్రతుల ఆధారంగా చరిత్ర, విజ్ఞానశాస్త్రం, మతం, కాలవృత్తాంతంలాంటి అనేక రంగాల గురించి, అలాగే ఎజ్‌టెక్‌లు, మాయాలతోపాటు మెసోమెరికాలోని అభివృద్ధిచెందిన నాగరికతల దైనందిన జీవన విధానం గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అసాధారణ ప్రజ్ఞగల ట్లాక్‌విలోస్‌ లేదా శాస్త్రులు వివిధ పదార్థాలపై తమ చరిత్రను వర్ణించారు.

కొన్ని రాతప్రతులు గుడ్డ ముక్కలతో, జింక చర్మంతో, లేదా మాగువే కాగితంతో చేయబడినప్పటికీ, ప్రధానంగా అమాటే కాగితమే ఉపయోగించబడింది. అమాటే అనే పేరు నాహుటల్‌ పదమైన అమాటెల్‌ నుండి తీసుకోబడింది, దానికి కాగితం అని అర్థం. ఈ అమాటే మొరేసియే కుటుంబానికి చెందిన ఫికస్‌ లేదా అంజూరపు చెట్టు బెరడునుండి సేకరించబడుతుంది. ఎన్‌సైక్లోపీడియా డి మెక్సికో ప్రకారం, “కాండాన్ని, ఆకుల్ని, పువ్వుల్ని, కాయల్ని ప్రత్యేకంగా పరీక్షించకుండా ఫికస్‌ రకాల్లోని అనేక జాతుల్ని విడివిడిగా చెప్పడం చాలాకష్టం.” ఫికస్‌ తెలుపురంగు అమాటే కావచ్చు, తెలుపురంగు అడవి అమాటే కావచ్చు లేదా ముదురు గోధుమరంగు అమాటే కావచ్చు.

తయారీ విధానం

16వ శతాబ్దంలో స్పెయిన్‌ దేశపు ఆక్రమణతో, అమాటే తయారీ ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు? ఎందుకంటే ఆ విజేతల దృష్టిలో, ఆ ప్రక్రియకు క్యాథలిక్‌ చర్చి ఖండించిన స్పెయిన్‌పూర్వ మతాచారాలకు దగ్గరి సంబంధముంది. స్థానికులు “తమ పూర్వికుల విస్తృత చారిత్రక వివరాలు కూర్చారు. వెర్రి ఆసక్తితో వాటిని నాశనం చేయకుండా ఉండివుంటే ఇవి మనకు మరింత సమాచారం అందించివుండేవి. అవి ప్రతిమలని తలంచిన అజ్ఞానులు కొందరు వాటిని కాల్చివేశారు, వాస్తవానికి అవి విలువైన చారిత్రక దస్తావేజులు” అని హిస్టోరియా డి లాస్‌ ఇండియాస్‌ డి నూవా ఎస్‌పానా ఇ ఇలాస్‌ డి లా టియర్రా ఫిర్మా (నవ స్పెయిన్‌ ఇండీస్‌, టెర్రా ఫిర్మా ద్వీపాల చరిత్ర) అనే స్వీయ రచనలో స్పెయిన్‌ దేశస్థుడైన డ్యేగొ డూరాన్‌ అనే డొమినికన్‌ సన్యాసి తెలియజేస్తున్నాడు.

అయితే అమాటే కాగితపు తయారీ సాంప్రదాయాన్ని నిర్మూలించాలనే ప్రయత్నాలు ఫలించలేదు, అందువల్ల అది మనకాలం వరకూ కొనసాగుతూ వచ్చింది. ప్యూబ్లా రాష్ట్రంలోని ఉత్తర సియరా పర్వతాల్లో సానా పాబ్లిటో, పవట్లాన్‌ మున్సిపాలిటీవంటి ప్రాంతాల్లో ఆ కాగితం ఇంకా తయారవుతూనే ఉంది. రాజైన ఫిలిప్‌ II దగ్గర రాజ వైద్యునిగా పనిచేసిన ఫ్రాన్సిస్కో హెర్నాండేజ్‌ నమోదుచేసిన సమాచారం నుండి ఉదహరిస్తూ ఆర్క్విలోజియా మెక్సికానా (మెక్సికో పురావస్తుశాస్త్రం) అనే పత్రిక ఇలా చెబుతోంది: “ఆ కాగితం తయారుచేసేవారు చెట్ల లేత రెమ్మలు వదిలేసి గట్టి కొమ్మలు నరికి, అవి మెత్తబడడానికి రాత్రిపూట దగ్గర్లోవున్న నదుల్లో లేదా సెలయేళ్లలో నానబెడతారు. ఆ మరుసటి రోజు, ఆ కొమ్మల తొక్క తీసి ఆ తొక్క లోపలిపొరను బయటిపొరను వేరుచేసి లోపలి పొరను మాత్రమే భద్రపరుస్తారు.” ఆ తొక్కను శుభ్రంచేసి, దాని పీచు పదార్థాన్ని చదునుగావున్న స్థలంమీద పరిచి, దానిని రాతి సుత్తితో దంచుతారు.

ఈ రోజుల్లో, ఆ పీచును మెత్తగా చేయడానికి అలాగే ఆ పీచులోని కొన్ని పదార్థాలను తొలగించడానికి బూడిద, సున్నపురాయి కలిపి దానిని పెద్ద గంగాళాల్లో ఉడకబెడుతున్నారు. అలా ఉడకబెట్టే ప్రక్రియ ఆరుగంటలపాటు సాగుతుంది. ఆ తర్వాత, ఆ పీచును జాడించి అలా నీళ్లలోనే వదిలేస్తారు. కళాకారులు ఆ పీచులోని పోగుల్ని చదునుగా ఉన్న బల్లపై ఒకదాని ప్రక్కన ఒకటి పెడుతూ గళ్లుగళ్లుగా పరిచి, ఈ పీచు పోగులన్నీ అల్లుకుపోయి కాగితం షీటులా తయారయ్యేవరకు రాతి సుత్తితో దంచుతారు. చివరగా ఆ కాగితపు అంచులను బలంగా ఉంచడానికి దాని అంచులు లోనికి మడిచి ఎండలో ఆరబెడతారు.

అమాటే వివిధ రంగుల్లో ఉంటుంది. సాధారణంగా అది గోధుమరంగులో లభిస్తుంది, అయితే అది తెలుపు లేదా ఏనుగు దంతపు రంగు, గోధుమ మరియు తెలుపు చుక్కలతో, అలాగే పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగుల్లోనూ లభ్యమవుతుంది.

దాని ఆధునిక ఉపయోగం

అమాటేతో చూడముచ్చటైన మెక్సికన్‌ హస్తకళాకృతులు చేయబడుతున్నాయి. ఈ కాగితంమీది వర్ణచిత్రాలకు కొన్నింటికి మతసంబంధ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇతర చిత్రాలు వివిధ జంతువులకు, పండుగలకు, మెక్సికో ప్రజల సంతోషకరమైన జీవితాన్ని ప్రతిబింబించే దృశ్యాలకు ప్రతీకగావుంటాయి. అమాటే ఉపయోగించి అందమైన వివిధ వర్ణాల చిత్రాలకుతోడు, గ్రీటింగ్‌ కార్డులు, బుక్‌మార్క్‌లు, ఇతర హస్తకళాకృతులు కూడా చేయబడుతున్నాయి. అలాంటి కళాకృతులు అలంకరణకై వాటిని కొనే స్థానికులకూ, విదేశీయులకూ పారవశ్యం కలిగిస్తుంటాయి. ఈ కళ మెక్సికో సరిహద్దులు దాటి విస్తరించింది, ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఎగుమతి చేయబడింది. ప్రాచీనకాల రాతప్రతుల నకళ్లు తయారుచేయబడ్డాయి. ఆ కళను మొదటిసారి చూడడం స్పెయిన్‌వాసులకు ఎంత ఆసక్తికరంగా ఉండి ఉంటుందో కదా! వాస్తవానికి, స్థానికులు “ప్రతీ విషయాన్ని, అవి జరిగిన సంవత్సరాల, నెలల, రోజుల లెక్కలతో సహా పుస్తకాల్లో, పెద్ద కాగితపు షీట్లలో వ్రాసిపెట్టారు, చిత్రీకరించారు. వారి శాసనాలు, ఆదేశాలు, జనాభాలెక్కలు మొదలైన వివరాలన్నీ చక్కని క్రమంలో, అనుగుణ్యతతో ఈ వర్ణచిత్రాల్లో పొందుపరచబడి ఉన్నాయి” అని ముందు ప్రస్తావించబడిన డొమినికన్‌ సన్యాసి, డ్యేగొ డూరాన్‌ వ్యాఖ్యానించాడు.

అమాటే తయారీ సాంప్రదాయం, దానితోపాటు మెక్సికన్‌ వారసత్వ సంపద చక్కదనం మనకాలంవరకు నిలిచి ఉండడం ఎంతో అద్భుతమైన విషయం. పూర్వకాల ట్లాక్‌విలోస్‌ లేదా శాస్త్రుల మాదిరిగానే సామాన్య ఆధునికదిన కళాకారులు అమాటే అద్భుతాన్ని ఆనందిస్తున్నారు, దానిని నిజంగానే మెక్సికో దేశపు కాగితం అని పిలువవచ్చు. (g04 3/8)

[24వ పేజీలోని చిత్రం]

ఆ పీచును దంచడం