కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధునిక ప్రాముఖ్యతగల ఒక ప్రాచీన ప్రమాణం

ఆధునిక ప్రాముఖ్యతగల ఒక ప్రాచీన ప్రమాణం

ఆధునిక ప్రాముఖ్యతగల ఒక ప్రాచీన ప్రమాణం

సాధారణంగా వైద్య శాస్త్రానికి పితామహుడు అని పిలువబడే గ్రీకు వైద్యుడైన హిపాక్రటీస్‌, సుమారు సా.శ.పూ. 400లో హిపాక్రటీస్‌ ప్రమాణాన్ని రచించాడు. ఎంతో గమనార్హమైన ఆ మార్గనిర్దేశక సూత్రాలు ఇప్పటికీ వైద్య వృత్తిని నడిపిస్తున్నాయి. మీకు కూడా అదే నేర్పించబడిందా? అయితే అలా నేర్చుకున్నది మీరు ఒక్కరే కాదు. కానీ అది పూర్తిగా నిజమైనదేనా?

హిపాక్రటీస్‌ వ్రాశాడని చలామణి అవుతున్న ప్రమాణాన్ని నిజానికి ఆయన వ్రాసివుండకపోవచ్చు అని వాస్తవాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా నేటి వైద్య వృత్తి ఆ ప్రమాణం మొదట్లో వ్రాయబడినట్లే దానిని అనుసరించడం లేదు.

ఆ ప్రాచీన ప్రమాణాన్ని నిజానికి ఎవరు వ్రాశారో మనకు తెలుసా? ఆ విషయం మనకు తెలిసినప్పటికీ, నేడు మనకు అది ప్రాముఖ్యమైనదా?

హిపాక్రటీస్‌ ఆ ప్రమాణాన్ని వ్రాశాడా?

ఆ ప్రమాణాన్ని హిపాక్రటీసే వ్రాశాడా అని సందేహించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణమేమిటంటే ఆ ప్రమాణం చాలామంది దేవతలను వేడుకోవడంతో ప్రారంభమవుతుంది. అయితే వైద్యాన్ని మతాన్ని వేరుచేసి, వ్యాధులకు మూలకారణం మానవాతీత శక్తులు కాదనీ శారీరక కారకాలేననీ కనిపెట్టిన మొదటి వ్యక్తి హిపాక్రటీస్‌ అని దృష్టించబడుతుంది.

అంతేకాకుండా ఆ ప్రమాణంలో నిషేధించబడిన అనేక విషయాలు, ఆయన కాలంలో వైద్య వృత్తిని నిర్వహించే విధానానికి వ్యతిరేకమైనవేమీ కాదు. (23వ పేజీలోని బాక్సు చూడండి.) ఉదాహరణకు హిపాక్రటీస్‌ కాలంలో గర్భస్రావం గానీ ఆత్మహత్య గానీ చట్టవిరుద్ధమైనవి కాదు, చాలామట్టుకు మతపరమైన ప్రమాణాలకు కూడా వ్యతిరేకమైనవి కాదు. ఆ ప్రమాణం చేసే వ్యక్తి శస్త్ర చికిత్సను ఆ చికిత్స చేసే వైద్యులకే వదిలేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే హిపాక్రటీస్‌ సంచయంలో అంటే హిపాక్రటీస్‌కు, ఇతర ప్రాచీన రచయితలకు ఆపాదించబడే వైద్య సాహిత్య సంచయంలో శస్త్ర చికిత్స చేసే విధానాలు కూడా ఇవ్వబడ్డాయి.

కాబట్టి ఆ విషయం గురించి విద్వాంసులు ఇప్పటికీ వాదించుకుంటున్నా హిపాక్రటీస్‌ ప్రమాణాన్ని నిజానికి హిపాక్రటీస్‌ వ్రాయలేదనడానికి రుజువులు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రమాణంలో వ్యక్తం చేయబడిన తత్త్వం సా.శ.పూ. నాల్గవ శతాబ్దానికి చెందిన పైథాగురియన్స్‌ విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది, వాళ్ళు ప్రాణం పవిత్రమైనదనే ఆదర్శాలను అంగీకరించి శస్త్ర చికిత్సా ప్రక్రియలను వ్యతిరేకించేవారు.

నిష్క్రమణ, పునరాగమనం

ఆ ప్రమాణాన్ని రచించింది ఎవరైనా సరే, అది పాశ్చాత్య దేశాల వైద్య శాస్త్రాన్ని ప్రత్యేకించి నీతి శాస్త్రాన్ని ఎంతో గమనార్హంగా ప్రభావితం చేసిందనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఆ ప్రమాణం “వైద్యంలో ఖచ్చితమైన నైతిక సిద్ధాంతాలు వృద్ధి చెందడానికి సంబంధించిన అత్యున్నత శిఖరం” అని, “అభివృద్ధి చెందిన దేశాల్లో రోగులకు వైద్యులకు మధ్యవుండే సంబంధానికి ఆధారం” అని, “వృత్తిపరమైన నైతికతకు అత్యున్నత చిహ్నం” అని పిలువబడింది. 1913వ సంవత్సరంలో కెనడాకు చెందిన ప్రఖ్యాత వైద్యుడు సర్‌ విలియమ్‌ ఆస్లర్‌ ఇలా చెప్పారు: “ఈ ప్రమాణం హిపాక్రటీస్‌ కాలానికి చెందినదేనా లేదా అన్నది ప్రాముఖ్యం కాదు . . . ఇరవై ఐదు శతాబ్దాలుగా అది వైద్య వృత్తికి ‘మార్గనిర్దేశక సూత్రం’గా ఉంది, చాలా విశ్వ విద్యాలయాల్లో ఇప్పటికీ విద్యార్థులను వైద్యులుగా ప్రకటించడానికి అదే ప్రమాణం ఉపయోగించబడుతోంది.”

అయితే 20వ శతాబ్దపు తొలి భాగంలో ఆ ప్రమాణాన్ని అందరూ ఆమోదించలేదు, బహుశా అప్పట్లో విజ్ఞాన శాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా అలా జరిగివుండవచ్చు. హేతువాదం అంతకంతకూ పెరిగిపోతున్న కారణంగా ఆ ప్రమాణం పురాతనమైనదిగాను అసంబద్ధమైనదిగాను అనిపించివుండవచ్చు. అయితే విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ నైతిక మార్గనిర్దేశాల అవసరం ఉండనే ఉంది. అందుకేనేమో ఇటీవలి దశాబ్దాల్లో ఆ ప్రమాణానికి మళ్ళీ ఆదరణ లభించడం ప్రారంభించింది.

చాలామంది డాక్టర్లు వైద్య కళాశాలలో ప్రవేశం పొందడానికి లేదా దానినుండి ఉత్తీర్ణులవ్వడానికి ఈ ప్రమాణం చేయడం మరోసారి ప్రాముఖ్యమైన విషయంగా తయారయ్యింది. అమెరికాలోని, కెనడాలోని వైద్య కళాశాలలపై 1993లో నిర్వహించబడిన సర్వే, సర్వే చేయబడిన కళాశాలల్లో 98 శాతం ఏదోక విధమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నాయని సూచించింది. 1928లో అయితే కేవలం 24 శాతం కళాశాలలు మాత్రమే అలా చేసేవి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో చేయబడిన అలాంటి సర్వే, ప్రస్తుతం 50 శాతం కళాశాలలు ప్రమాణాన్ని లేదా ప్రకటనను ఉపయోగిస్తున్నాయని చూపించింది. ఆస్ట్రేలియాలో, న్యూజీలాండ్‌లో కూడా 50 శాతం కళాశాలలు అలాంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నాయి.

కాలంతోపాటు మారడం

అయితే హిపాక్రటీస్‌ ప్రమాణం మార్పులకు అతీతమైనదేమీ కాదు; కాల ప్రవాహంలో అది క్రైస్తవమత సామ్రాజ్యంలో ప్రబలంగావున్న నమ్మకాలకు అనుగుణంగా మార్చబడింది. కొన్నిసార్లు ఇతర విషయాలతో వ్యవహరించడానికి అంటే ప్లేగ్‌ బాధితులతో వ్యవహరించడానికి సంబంధించి మార్పులు చేయబడ్డాయి. ఇటీవల ఆ ప్రమాణం ఆధునిక ఆలోచనా విధానానికి అనుగుణంగా మార్చబడింది.

ప్రమాణం యొక్క వివిధ అనువాదాల్లో ఆధునిక వైద్య శాస్త్రాన్ని ప్రతిబింబించని సిద్ధాంతాలు తీసివేయబడ్డాయి, ప్రస్తుత సమాజానికి ప్రాముఖ్యమైన ఇతర సిద్ధాంతాలు జోడించబడ్డాయి. ఉదాహరణకు రోగులకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలనే సూత్రం నేడు వైద్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉండవచ్చు కానీ ప్రాచీన గ్రీకు వైద్యంలో దానికి స్థానం లేనందున అది హిపాక్రటీస్‌ ప్రమాణంలో కనిపించదు. రోగుల హక్కులు ప్రస్తుతం ఉపయోగించబడుతున్న అనేక ప్రమాణాల్లో ప్రాముఖ్యమైన భాగంగా ఉన్నాయి.

అంతేకాకుండా వైద్యునికి రోగికి మధ్యవుండే సంబంధం ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే రోగులు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే చికిత్సకు ఒప్పుకోవడం వంటి తలంపులు నేడు అంతకంతకూ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. కాబట్టి కేవలం కొన్ని వైద్య కళాశాలలు మాత్రమే హిపాక్రటీస్‌ ప్రమాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉపయోగించడం అర్థం చేసుకోదగినదే.

ఆ ప్రమాణానికి చేయబడిన ఇతర మార్పులు మరింత ఆశ్చర్యకరమైనవి. 1993లో అమెరికాలోను కెనడాలోను ఉపయోగించబడిన ప్రమాణాల్లో కేవలం 43 శాతం మాత్రమే డాక్టర్లు తమ చర్యలకు బాధ్యులనే విషయాన్ని చేర్చాయి, చాలా ఆధునిక ప్రమాణాలు, దానిని ఉల్లంఘించినప్పుడు జరిమానా విధించే పద్ధతేమీ లేకుండా ఉపయోగించబడుతున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపై దయతో వాళ్ళను చంపడం, గర్భస్రావం చేయడం వంటివి చేయము అని ప్రమాణం చేయడం, దేవుళ్ళకు విన్నవించుకోవడం వంటివి కూడా తక్కువైపోయాయి, రోగులతో లైంగిక సంబంధాలు పెట్టుకోము అని ప్రమాణం చేయడం సర్వే చేయబడిన స్కూళ్ళలో కేవలం 3 శాతం కళాశాలల ప్రమాణాల్లో మాత్రమే కనిపించాయి.

ఒక ప్రమాణం విలువ

హిపాక్రటీస్‌ ప్రమాణం ఎన్నో మార్పులకు గురైనప్పటికీ, ఉత్తమమైన మరియు నైతికమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండే వృత్తికి ప్రమాణాలు ఉపయోగించడం ఎంతో ప్రాముఖ్యమని పరిగణించబడుతోంది. పైన ప్రస్తావించబడిన 1993లో చేయబడిన సర్వే, ఉపయోగంలోవున్న చాలా ప్రమాణాలు వైద్యులు తమ రోగులకు బద్ధులై ఉండే విషయాన్ని నొక్కిచెబుతున్నాయని, భావి వైద్యులు తమ రోగులను శ్రద్ధగా చూసుకోవడానికి తాము చేయగలిగినదంతా చేస్తామని ప్రమాణం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నాయని కనుగొంది. ఇలా ప్రమాణం చేయడం, వైద్య వృత్తికి ఆధారమైన విలువైన నైతిక సూత్రాలపై అవధానం కేంద్రీకరిస్తుంది.

ద మెడికల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ప్రచురించబడిన ఒక సంపాదకీయంలో ప్రొఫెసర్‌ ఎడ్‌మండ్‌ పెలెగ్రీనో ఇలా వ్రాశారు: “బహుశా చాలామందికి నేడు వైద్య ప్రమాణం విరిగిపోయిన పురాతన శిల్పంలోని చిన్న ముక్క మాత్రమే. అయితే, ఆ శిల్పాన్ని పూర్తిగా మరచిపోవడమంటే వైద్య వృత్తిని వాణిజ్యపరమైన, పారిశ్రామిక, లేక శ్రామికవర్గపు సంస్థగా మార్చడమేనని మనకు గుర్తు చేయడానికి ఆ శిల్పంలోని తగినంత భాగం వైద్య వృత్తి మనస్సాక్షిలో భద్రంగా ఉంది.”

నేడు ప్రాముఖ్యమైనవిగా ఎంచబడుతున్న హిపాక్రటీస్‌ ప్రమాణమైనా, దాని ఆధారంగా వృద్ధి చేయబడిన ఆధునిక ప్రమాణాలైనా సరే అవి విద్వాంసులకు చర్చాంశంగా కొనసాగుతాయి. అయితే వాటి ఫలితమేమైనప్పటికీ వైద్యులు అనారోగ్యంతో బాధపడుతున్నవారిని శ్రద్ధగా చూసుకోవడమనేది సర్వదా ప్రశంసనీయమైనదే. (g04 4/22)

[23వ పేజీలోని బాక్సు]

హిపాక్రటీస్‌ ప్రమాణం

లూట్విక్‌ ఆడెల్‌స్టీన్‌ అనువాదంపై ఆధారపడినది

అప్పొలొ వైద్యుడు, ఎస్‌క్లీపైయస్‌, ఈయేయి, పానాకీయ మరియు దేవతలందరి సాక్షిగా ఈ ప్రమాణాన్ని, ఈ నిబంధనను నా సామర్థ్యం మరియు వివేచన మేరకు నెరవేరుస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను:

ఈ విద్యను నాకు నేర్పించిన వ్యక్తిని నా తల్లిదండ్రులతో సమానంగా భావించి నా జీవితంలో ఆయనకు సహకరిస్తాను, ఆయనకు డబ్బు అవసరమైతే ఇస్తాను, ఆయన కుమారులను నాకు వారసులైన సహోదరులుగా భావించి వాళ్ళకు ఈ విద్య నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా వాళ్ళకు నేర్పిస్తాను; నా కుమారులకు, నాకు ఉపదేశించిన వ్యక్తి కుమారులకు, ఈ నిబంధనను స్వీకరించి వైద్యశాస్త్ర నియమాల ప్రకారం ప్రమాణం చేసిన విద్యార్థులకు సూత్రాలను నేర్పించి, మౌఖిక ఉపదేశం ఇచ్చి, నేను నేర్చుకున్న విషయాలన్నీ నేర్పిస్తాను, వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికీ నేర్పించను.

నా సామర్థ్యం మరియు వివేచన మేరకు వ్యాధిగ్రస్తుల ప్రయోజనార్థం ఆహార నియమాలను సూచిస్తాను; వాళ్ళకు ఎలాంటి హానీ అన్యాయమూ జరగకుండా చూస్తాను.

ఎవరైనా అడిగితే నేను ప్రాణాంతకమైన మందులు ఇవ్వను, వాళ్ళ మరణానికి కారణమయ్యే సలహా కూడా ఇవ్వను. అదేవిధంగా స్త్రీలకు గర్భస్రావమయ్యేందుకు మందులు సూచించను. నా జీవితం యొక్క, నా విద్య యొక్క స్వచ్ఛతను, పవిత్రతను కాపాడతాను.

వ్యాధిగ్రస్తుల శరీరంలో రాళ్ళు ఉన్నాయని తెలిసినా నేను కత్తిని ఉపయోగించను, ఆ పనిని ఆ విద్య తెలిసినవారే చేయడానికి వదిలేస్తాను.

నేను ఏ ఇంటిని సందర్శించినా వ్యాధిగ్రస్తుల ప్రయోజనార్థమే అలా చేస్తాను కానీ ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేయడం, స్త్రీలు మరియు పురుషులు స్వేచ్ఛాచిత్తులైనా లేక బానిసలైనా వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటివాటికి దూరంగా ఉంటాను.

చికిత్స చేస్తున్న సమయంలో లేదా ఇతర సమయాల్లో కూడా ప్రజల జీవితాల గురించి ఇతరులకు వెల్లడి చేయకూడని విషయాలు నేను చూసినా, విన్నా నేను వాటిని మాట్లాడకూడని సిగ్గుకరమైన విషయాల్లా గోప్యంగా ఉంచి ఎవ్వరికీ వెల్లడి చేయను.

నేను ఈ ప్రమాణం నెరవేర్చి దానిని ఉల్లంఘించని యెడల నేను నా జీవితంలో, నా వైద్య వృత్తిలో సంతోషంగా ఉండి, అన్ని సమయాల్లోను అందరిచేత గౌరవించబడుతూ ఉంటాను; కానీ నేను ఈ ప్రమాణాన్ని నెరవేర్చకుండా ఉల్లంఘిస్తే దానికి విరుద్ధమైనవన్నీ నాకు జరుగును గాక.

[22వ పేజీలోని చిత్రం]

హిపాక్రటీస్‌ సంచయంలోని ఒక పేజీ

[22వ పేజీలోని చిత్రసౌజన్యం]

హిపాక్రటీస్‌, పేజీ: Courtesy of the National Library of Medicine