కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టైర్లు మీ జీవితం వాటిపై ఆధారపడగలదు!

టైర్లు మీ జీవితం వాటిపై ఆధారపడగలదు!

టైర్లు మీ జీవితం వాటిపై ఆధారపడగలదు!

వెల్డింగు చేసిన స్టీలు మరియు గాజు బోనువంటి ఒక యంత్ర నిర్మాణంలో మీరు బంధించబడినట్లు, మీ పక్కనే యాసిడ్‌, భగ్గునమండే ద్రావకాలున్న డబ్బాలు ఉన్నట్లు ఊహించుకోండి. ప్రాణాంతకంకాగల ఆ నిర్మాణాన్ని ఇప్పుడు నేల నుండి కొన్ని సెంటిమీటర్ల ఎత్తున వేలాడదీసి, సెకనుకు దాదాపు 30 మీటర్ల వేగంతో ముందుకు కదిలేలా చేయండి. కొస మెరుపుగా, మీ యంత్ర నిర్మాణాన్ని అలాంటి కొన్ని నిర్మాణాల మధ్యన ఉంచి వాటిని ఒకదాని వెంట ఒకటి వేగంగా కదిలేలా చేయండి, మరికొన్ని యంత్రాలు మీ యంత్రానికి వ్యతిరేక దిశ నుండి వేగంగా దూసుకువస్తుంటాయి!

మీరు కారులో కూర్చొని డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డు మీదకు వెళ్ళిన ప్రతిసారి మీరు ముఖ్యంగా చేసేది అదే. మీరు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు వాహనాన్ని అదుపులో ఉంచుకోవడానికి, సురక్షితంగా ఉన్నట్లు భావించడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది? చాలా మట్టుకు మీ టైర్లే.

టైర్లు పనిచేసే విధానం

టైర్లు ముఖ్యమైన వివిధ పనులు చేస్తాయి. అవి మీ వాహనపు భారాన్ని మోయడం మాత్రమే కాక, రోడ్డు మీది ఎత్తుపల్లాల్లో, గతుకుల్లో, ఇతర అవరోధాల్లో ఎక్కువ కుదుపుల్లేకుండా చేస్తాయి. మరింత ప్రాముఖ్యంగా మీరు వేగంగా వెళ్లడానికి, నిర్దిష్ట దిశకు తిప్పడానికి, ఆపడానికి, విభిన్న రోడ్లపై నిర్దిష్ట గమనదిశలోనే స్థిరంగా ముందుకు కదలడానికి ఎంతో అవసరమైన ట్రాక్షన్‌ను (పట్టును) ఇస్తాయి. అయితే ఏ సమయంలోనైనా టైరులోని కేవలం ఒక చిన్న భాగం అంటే దాదాపు ఒక పోస్టుకార్డంత భాగం మాత్రమే నేలకు తాకుతుంటుంది.

టైర్లకున్న ప్రాముఖ్యత దృష్ట్యా, అవి సురక్షితంగా సమర్థవంతంగా పనిచేయడానికి మీరు ఏమి చేయవచ్చు? టైర్లు అవసరమైనప్పుడు మీ వాహనానికి సరైన టైర్లను ఎలా ఎంపిక చేస్తారు? ఈ ప్రశ్నలకు జవాబివ్వడానికి ముందు, టైర్ల చరిత్రను కాస్త పరిశీలిద్దాం.

రబ్బరు పథగాములు

వేల సంవత్సరాల నుండి చక్రాలు వాడకంలో ఉన్నప్పటికీ, వాహనపు చక్రాల చట్రానికి రబ్బరు అతికించడమనే తలంపు ఇటీవల కాలాల్లోనే ఆవిర్భవించింది. 1800 తొలిభాగంలో సహజమైన రబ్బరు మొదట కఱ్ఱ చక్రాలకు లేక లోహపు చక్రాలకు అతికించబడేది. కానీ అది త్వరగా అరిగిపోయేది, ఆ కారణంగా రబ్బరు అతికించిన చక్రాలకు ఎక్కువ భవిష్యత్తు లేదనే భావం కలిగించింది. ఈ పరిస్థితి అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన దృఢ సంకల్పంగల పరిశోధకుడైన చార్లెస్‌ గుడ్‌ ఇయర్‌ కాలం వరకు కొనసాగింది. 1839లో గుడ్‌ ఇయర్‌ వల్కనైజేషన్‌ అనే ప్రక్రియను కనుగొన్నాడు, ఇది రబ్బరుతో గంధకము కలిపి తేమలేని పరిస్థితులలో వేడిచేసే పద్ధతి. ఈ ప్రక్రియ రబ్బరును మలచడాన్ని చాలా సులభం చేయడమే కాక, అరుగుదలను తగ్గించేందుకూ ఎంతో దోహదపడింది. మిశ్రితంకాని రబ్బరు టైర్లు చాలా ప్రాచుర్యం పొందాయి, కానీ వాటిమీద ప్రయాణం కుదుపులతో ఉండేది.

న్యూమటిక్‌ లేదా గాలి నింపిన టైరు తయారుచేయడానికి పేటెంటు హక్కు మొట్టమొదట 1845లో స్కాటిష్‌ ఇంజనీర్‌ రాబర్ట్‌ డబ్ల్యు. థామ్‌సన్‌కు లభించింది. అయితే జాన్‌ బాయ్డ్‌ డన్‌లప్‌ అనే మరొక స్కాటిష్‌ వ్యక్తి, వాళ్ళ అబ్బాయి సైకిలు ప్రయాణాన్ని మెరుగుపరిచేందుకు చేసిన ప్రయత్నం వల్ల, గాలి నింపిన టైరు వాణిజ్యపరంగా సఫలమయ్యింది. డన్‌లప్‌ 1888లో తను కనిపెట్టిన కొత్తరకపు టైరు తయారుచేయడానికి పేటెంటు హక్కును సంపాదించి, సొంత కంపెనీ ఒకటి ప్రారంభించాడు. ఏదేమైనా గాలి నింపిన టైరు భవిష్యత్తులో ఇంకా అనేక అవరోధాలను అధిగమించాల్సివుంది.

1891లో ఒకరోజు, ఫ్రాన్సుకు చెందిన ఒక వ్యక్తి తన సైకిలు టైరులోని గాలిపోవడంతో, దాన్ని రిపేరు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ టైరు సైకిలు చక్రానికి శాశ్వతంగా అతికించబడి ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. ఆయన తన తోటి ఫ్రెంచి వ్యక్తి ఎడ్‌వార్‌ మీష్లన్‌ సహాయం కోరాడు, మీష్లన్‌కు రబ్బరును వల్కనైజ్‌ చేయడంలో మంచి పేరుంది. ఆయనకు ఆ టైరు రిపేరు చేయడానికి తొమ్మిది గంటలు పట్టింది. ఆ అనుభవంతో ఆయన, సులభంగా రిపేరు చేయడానికి చక్రం నుండి విడదీయగలిగే న్యూమటిక్‌ టైరును తయారుచేసేందుకు ప్రేరణపొందాడు.

మీష్లన్‌ టైర్లు ఎంత విజయవంతమయ్యాయంటే ఆ తర్వాతి సంవత్సరంలో 10,000 మంది సైకిలు తొక్కేవాళ్ళు వాటిని ఉపయోగించి సంతృప్తిచెందారు. అనతికాలంలోనే న్యూమటిక్‌ టైర్లు పారిస్‌లోని గుఱ్ఱపు బగ్గీలకు ఎక్కించబడ్డాయి, ఫ్రెంచి ప్రయాణీకులు అలాంటి గుఱ్ఱపు బగ్గీల్లో హాయిగా ప్రయాణించగలిగారు. న్యూమటిక్‌ టైర్లను మోటారు వాహనాలకు కూడా ఉపయోగించవచ్చని చూపించేందుకు, 1895లో ఎడ్‌వార్‌, అతని సహోదరుడు ఆండ్రే వాటిని ఒక రేసు కారుకు బిగించారు, కానీ ఆ కారు పందెంలో మూడవ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, ప్రజలు ఈ అసాధారణమైన టైర్లను చూసి ఎంత ఆశ్చర్యపోయారంటే మీష్లన్‌ సహోదరులు టైర్ల లోపల ఏమి దాచారో తెలుసుకోవాలని వాటిని కోసి చూడడానికి ప్రయత్నించారు!

1930, 1940లలో సులభంగా నశించిపోయే నూలు, సహజ రబ్బరు స్థానంలోకి రెయోన్‌, నైలాన్‌, పాలిష్టర్‌ వంటి మన్నికైన కొత్త పదార్థాలు వాడుకలోకి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, టైరును అభివృద్ధిపరచాలని చేసిన కృషి ఫలితంగా గాలి పోకుండా చక్రాన్ని గట్టిగా అంటిపెట్టుకొని ఉండే టైరు తయారయింది. దానితో లోపల గాలితో నింపే ట్యూబుల అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత వాటి తయారీలో మరింత ప్రగతి సాధించబడింది.

నేడు టైరు తయారీలో 200 కంటే ఎక్కువ ముడి పదార్థాలు ఉపయోగించబడుతున్నాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం సహాయంతో కొన్ని టైర్లు 1,30,000 కిలోమీటర్లు లేదా అంతకంటె ఎక్కువే మన్నగలిగితే, రేసు కార్లకు తొడిగించబడే మరికొన్ని టైర్లు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో పోయినా మన్నగలుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో టైర్లు సాధారణ వినియోగదారునికి కూడా అందుబాటులోకి వచ్చాయి.

టైర్లను ఎంపిక చేసుకోవడం

మీకు ఒక మోటారు వాహనం ఉన్నట్లయితే, కొత్త టైర్లను ఎంపిక చేయడమనే క్లిష్టమైన సవాలు మీకు ఎదురుకావచ్చు. మీరు మీ టైర్లు ఎప్పుడు మార్చాలనే విషయాన్ని ఎలా నిర్ణయిస్తారు? అరిగిపోయినట్లు లేదా పాడయినట్లు స్పష్టమైన సంకేతాలున్నాయా అని మీరు మీ టైర్లను క్రమంగా పరీక్షించడం ద్వారానే. * టైర్ల కంపెనీలు మీరు మీ టైర్లను ఎప్పుడు మార్చాలో సూచించేందుకు, వాటిమీదే అంతర్లీనంగా అరుగుదలను తెలిపే గుర్తులు ఇస్తారు, వాటిని వేర్‌ బార్స్‌ అంటారు. రబ్బరు పట్టీల్లాగ ఉండే ఈ వేర్‌ బార్లు నేలను ఆనే చక్రపు ఉపరితల భాగం చుట్టూ కనబడతాయి. ట్రెడ్‌ (నేలను ఆనే టైరు ఉపరితల భాగం) ఊడిరావడం, బీడ్స్‌ (చక్రాన్ని గట్టిగా పట్టుకొనివుండే టైరు లోపలి అంచుల్లో) నుండి వైర్లు లేదా దారాలు బయటకురావడం, టైరు పక్క భాగాల్లో ఉబ్బిన సూచనలు, తదితర అవకతవకలు ఏమైనా ఉన్నాయేమో చూడడం కూడా మంచిది. వీటిలో ఏ ఒక్కటైనా మీకు కనబడినట్లయితే, ఆ టైరు రిపేరు చేసేంతవరకు లేదా మార్చేంతవరకు వాహనం నడిపించకూడదు. మీ టైర్లు కొత్తగా కొన్నవి, ఇంకా వారంటీకాలంలో ఉన్నవి అయితే, వాటిని టైర్ల విక్రయదారుడు తక్కువ ధరకే మారుస్తుండవచ్చు.

టైర్లు మార్చేటప్పుడు, ఇరుసుకు ఇరువైపులా ఒకే రకం టైర్లను ఎక్కించడం మంచిది. మీరు కొత్త టైరు ఒకటే మారుస్తున్నట్లయితే, బ్రేకు వేసినప్పుడు పట్టు సమానంగా ఉండేందుకు దాన్ని ఎక్కువ ట్రెడ్‌ లేదా బటన్‌వున్న టైరుకు జోడీగా వేయండి.

వివిధ రకాలు, పరిమాణాలు, మోడళ్ళలోవున్న టైర్లను పరిశీలించి ఎన్నుకోవడం తికమకగా ఉండవచ్చు. అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలకు జవాబులు వెదకడం ద్వారా మీరు మీ పనిని ఎంతో సులభం చేసుకోవచ్చు. మొదటిగా, వాహనం తయారీదారు సిఫారసు చేసేదాన్ని సమీక్షించండి. మీ వాహనానికి అవసరమైన నిర్దిష్టమైనవాటిని అంటే టైరు, చట్రం సైజు, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను (వాహనం అడుగు భాగానికి నేలకు మధ్య ఉండవలసిన ఖాళీని), లోడ్‌ కెపాసిటీని (మోయగలిగే గరిష్ట బరువును) పరిగణలోకి తీసుకోవాలి. మీ వాహనపు నమూనా కూడా ప్రాధాన్యమే. యాంటిలాక్‌ బ్రేకులు, ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఆల్‌వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్స్‌తో రూపొందించబడిన ఆధునిక వాహనాలకు ప్రత్యేక గుణాలున్న టైర్లు ఉపయోగించాలి. టైర్లకు ఉండవలసిన ప్రత్యేక గుణాల గురించిన వివరాలు సాధారణంగా మీ వాహనంలోని ఓనర్స్‌ మాన్యువల్‌లో ఉంటాయి.

ముఖ్యమైన మరొక విషయం రోడ్ల పరిస్థితులు. మీ వాహనం ఎక్కువగా మట్టి రోడ్లపై లేదా కంకర రోడ్లపై, వర్షంలో లేదా పొడిగావుండే వాతావరణంలో నడిపించబడుతోందా? అలాగైతే మీరు విభిన్న పరిస్థితుల్లో నడిపిస్తున్నారన్నమాట. అటువంటప్పుడు మీకు ఆల్‌ టెర్రేన్‌ (అన్ని రకాల నేలపై ఉపయోగపడే) లేదా ఆల్‌ సీజన్‌ (అన్ని రుతువుల్లో ఉపయోగపడే) టైర్లు అవసరం.

మీరు టైరు మన్నే కాలాన్ని, ట్రాక్షన్‌ రేటింగ్‌ను (ఎంతకాలం రోడ్డును అదిమిపట్టుకొని దొసగకుండా ఉంటుందో తెలిపే స్థాయిని) కూడా పరిశీలించాలి. సాధారణంగా ట్రెడ్‌ కంపౌండ్‌ (రోడ్డును ఆనే ఉపరితల భాగంలోని మిశ్ర పదార్థం) మెత్తగా ఉంటే, టైరుకు రోడ్డుమీద ఎక్కువ పట్టు ఉంటుంది, కానీ ఇది కొద్దికాలంలోనే అరిగిపోతుంది. దానికి భిన్నంగా, ట్రెడ్‌ కంపౌండ్‌ కాస్త గట్టిగా ఉంటే, టైరుకు రోడ్డుమీద తక్కువ పట్టు ఉంటుంది, కానీ ఎక్కువకాలం మన్నుతుంది. సాధారణంగా టైర్లు అమ్మే స్థలాల్లో ఉండే సాహిత్యాల్లో ఈ రేటింగులు ఉంటాయి. టైరు రేటింగులు ఆయా తయారీదారులను బట్టి భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోండి.

మీ అన్వేషణ ఒక కొలిక్కి వచ్చాక, చివరిగా ఎంపిక చేసుకున్నదాని ధర నిర్ణయించుకోవచ్చు. ప్రాచుర్యం పొందిన తయారీదారులు సాధారణంగా టైరు నాణ్యత విషయంలోను వారంటీ వర్తించే కాలపరిమితి విషయంలోనూ మంచి హామీ ఇస్తారు.

మీ టైర్లను కాపాడుకోవడం

టైర్లను చక్కగా కాపాడుకోవడంలో మూడు విషయాలు ఉన్నాయి: సరైన ఎయిర్‌ ప్రెషర్‌ ఉంచడం, టైర్లను క్రమంగా మార్చడం, వాటిని సమన్వయంగా, అలైన్‌మెంట్‌లో (సరైన సమరేఖలో) ఉంచడం. టైర్లలో ఎయిర్‌ ప్రెషర్‌ను ఎప్పుడూ ఖచ్చితంగా ఉంచడం చాలా ముఖ్యం. టైరులో గాలి ఎక్కువైతే, టైరు ఉపరితలపు మధ్యభాగం త్వరగా అరిగిపోతుంది. మరోవైపున టైరులోని ప్రెషర్‌ చాలా తక్కువగా ఉండి టైరు అణగిపోయినట్లు ఉంటే, టైరు అంచులు ఎక్కువగా అరిగిపోయి మైలేజి తగ్గుతుంది.

రబ్బరు గుండా గాలి పోవడం వల్ల, టైర్లు ప్రతి నెల ఒక పౌండు లేదా అంతకంటె ఎక్కువ ప్రెషర్‌ కోల్పోవచ్చు. కాబట్టి మీ టైర్ల ఆకృతిని చూసి వాటిలో గాలి సరిగ్గా ఉందో లేదో చెప్పగలమని అనుకోకండి. రబ్బర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం, “ఒక టైరులో దాదాపు సగం ఎయిర్‌ ప్రెషర్‌ కోల్పోయినా, అది అణగిపోయినట్లు కనబడదు!” కాబట్టి కనీసం నెలకు ఒకసారి ప్రెషర్‌ గేజ్‌ ఉపయోగించి టైరు ప్రెషర్‌ పరీక్షించండి. అనేకమంది వాహనపు యజమానులు, సుళువుగా ఉపయోగించేందుకు డాష్‌బోర్డులోని చిన్న సొరుగులో ఒక గేజ్‌ను ఉంచుకుంటారు. ఇంజన్‌ ఆయిల్‌ మార్చినప్పుడు, టైర్లు చల్లగా ఉన్నప్పుడు అంటే కనీసం మూడు గంటలపాటు కదలకుండావుంటున్నా లేక 1.5 కిలోమీటరుకంటె తక్కువ నడిపించబడినా వాటిని పరీక్షిస్తుండండి. టైరు ప్రెషర్‌ వివరాలు సాధారణంగా ఓనర్స్‌ మాన్యువల్‌లో గానీ డ్రైవరు వైపు డోర్‌ పోస్ట్‌ దగ్గర లేక డాష్‌బోర్డులోని సొరుగులో ఉండే లేబుల్‌పైన గానీ ఉంటాయి. మీ ప్రయాణం సాఫీగా ఉండాలంటే, పక్క భాగాలు ఉబ్బేలా అత్యధికంగా గాలి నింపకండి.

మీరు టైర్లను క్రమంగా మారుస్తుంటే అవి ఎక్కువ కాలం మన్నుతాయి, సమతలంగా అరుగుతాయి. మీ వాహనపు తయారీదారు మరోవిధంగా సిఫారసు చేయకుంటే, ప్రతి 10,000 నుండి 13,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్లు మార్చడం మంచిది. ఈ విషయంలో కూడా మీ ఓనర్స్‌ మాన్యువల్‌లో సూచించబడిన రొటేషన్‌ పాటర్న్‌ను (టైర్లు మార్చే నమూనాను) చూడండి.

చివరిగా, మీరు ప్రతి సంవత్సరం లేదా కారు స్టీరింగులో ఏమైనా అసహజమైన కంపనం లేక అవకతవకలు గమనించినప్పుడు టైరు అలైన్‌మెంట్‌ చేయించండి. వివిధ బరువులకు అనుగుణంగా టైర్లను సమన్వయంగా ఉంచేందుకు మీ వాహనపు సస్పెన్షన్‌ సిస్టమ్‌ రూపొందించబడినప్పటికీ, సాధారణంగా టైర్లు అరుగుతాయి, చిట్లుతాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడు పరీక్షించి మళ్ళీ అలైన్‌మెంట్‌ చేయించడం అవసరమవుతుంది. ఆధికారికంగా ధృవపరచబడిన మెకానిక్‌ మీ వాహనాన్ని సరైన అలైన్‌మెంట్‌లో ఉంచగలుగుతాడు, టైర్లు ఎక్కువకాలం మన్నగలిగేలా, ప్రయాణం సాఫీగా ఉండేలా చేయగలుగుతాడు.

“తెలివైన” టైర్లు

కంప్యూటర్ల సహాయంతో, కొన్ని కార్లు టైరు ప్రెషర్‌ సురక్షిత పరిమితుల కంటే తగ్గిపోయినప్పుడు డ్రైవరును హెచ్చరిస్తాయి. కొన్ని టైర్లు ఎయిర్‌ ప్రెషర్‌ సరిగా లేకున్నా కొంత సమయం వరకు సురక్షితంగా నడవగలుగుతాయి, మరికొన్ని టైర్లు పంక్చర్‌ అయిన తర్వాత వాటికవే మూసుకుపోతాయి. నిజానికి ఇంజనీర్లు దినదినం మరిన్ని వివిధ పరిస్థితుల్లో నడవగలిగే ఎన్నోరకాల టైర్లను రూపొందిస్తున్నారు.

మూల పదార్థాల అభివృద్ధి కొనసాగుతుండగా, ఆధునిక వాహనాలకు అనువుగా ట్రెడ్‌ డిజైన్‌, సస్పెన్షన్‌, స్టీరింగ్‌, బ్రేకింగ్‌ సిస్టమ్స్‌ వంటివి రూపొందించబడుతున్నాయి. కాబట్టి టైర్లు డ్రైవింగును సులభం చేయడమేకాక సురక్షితం చేస్తున్నాయి కూడా. (g04 6/8)

[అధస్సూచి]

^ మీ టైర్లను పరీక్షించడానికి సహాయం కోసం, 29వ పేజీలోని పట్టిక చూడండి.

[29వ పేజీలోని చార్టు/చిత్రాలు]

టైర్లను కాపాడుకోవడానికి తనిఖీ పట్టిక

చూసి పరీక్షించేవి:

❑ పక్క భాగంలో ఎక్కడైనా ఉబ్బినట్లు కనబడుతోందా?

❑ ట్రెడ్‌ ఉపరితలభాగంలో దారాలు, వైర్లు బయటకు కనబడుతున్నాయా?

❑ ట్రెడ్‌ లోతు లేదా టైర్‌ బటన్‌ సురక్షిత పరిమితుల్లో ఉందా లేక వేర్‌ బార్‌లు పైకి కనబడుతున్నాయా?

ఇవి కూడా పరిశీలించండి:

❑ టైరులో గాలి, వాహనపు తయారీదారు సిఫారసు చేసిన ప్రకారమే ఉందా?

❑ టైర్లు మార్చే సమయం దగ్గరపడిందా? (వాహనపు తయారీదారు సూచించిన మైలేజ్‌ ఇంటర్వల్‌, రొటేషన్‌ నమూనా ఉపయోగించండి.)

❑ రుతువుల మార్పును బట్టి టైర్లు మార్చాలా?

[చిత్రం]

వేర్‌ బార్‌

[28వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

టైరులోని భాగాలు

ట్రెడ్‌ రోడ్డును అదిమిపట్టుకొనివుంటుంది, మూల మలుపుల్లో జారిపోకుండా ఉంటుంది

బెల్ట్‌లు ట్రెడ్‌ను స్థిరంగా, బలంగా ఉంచుతాయి

సైడ్‌వాల్‌ రోడ్డు నుండి, గతుకుల నుండి టైరు పక్కభాగం పాడవకుండా కాపాడుతుంది

బాడీ ప్లై టైరుకు బలాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది

ఇన్నర్‌ లైనర్‌ టైరులోపల గాలి ఉండేలా చేస్తుంది

బీడ్‌ గాలి బయటకుపోకుండా చక్రానికి గట్టిగా అదిమిపట్టుకొని ఉంటుంది

[27వ పేజీలోని చిత్రాలు]

అలనాటి సైకిలు, కారు రెండూ గాలి నింపగల టైర్లతో నడిచినవే, ఆనాటి టైర్ల ఫ్యాక్టరీలో పనివాళ్ళు

[చిత్రసౌజన్యం]

The Goodyear Tire & Rubber Company