కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

మత ప్రసంగాల అమ్మకం

“ఎన్నో పనుల్లో మునిగిపోయి ఉండడంవల్ల తమ ప్రసంగాలను సిద్ధం చేసుకోవడానికి సమయం దొరకక అవస్థపడుతున్న మతాధికారుల ప్రార్థనలకు సమాధానం లభించింది: చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లో మతబోధ చేయడానికి అనుమతి పొందిన ఒక వ్యక్తి అన్ని సందర్భాలకు తగిన ప్రసంగాలను అందించే కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు” అని లండన్‌కు చెందిన ద డెయిలీ టెలిగ్రాఫ్‌ నివేదిస్తోంది. వృత్తిపరంగా రచయిత అయిన ఆ వెబ్‌సైట్‌ యజమాని బాబ్‌ ఆస్టిన్‌ ఇలా చెబుతున్నాడు: “ఈ మధ్య ప్రచారకులు అంతకంతకు ఎక్కువ పనుల్లో మునిగిపోవడంవల్ల ప్రసంగాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.” తన వెబ్‌సైట్‌లో “ఆధారపడదగిన, రెడీమేడ్‌ ప్రసంగాలను” తాను అందిస్తున్నానని, అవి “ఆలోచన రేకెత్తించేవిగా, ప్రేరేపించేవిగా, జ్ఞానోదయం కలిగించేవిగా” ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నాడు. “వివిధ బైబిలు లేఖనాల మరియు అంశాల ఆధారంగా తయారుచేయబడి ‘ఇంతకుముందే చర్చి వేదిక మీది నుండి ఇవ్వబడి పరీక్షించబడిన’ 50 కంటే ఎక్కువ ప్రసంగాలు” ప్రస్తుతం ఆ సైట్‌లో ఉన్నాయి, అయితే విపరీతమైన లేదా సిద్ధాంతపరంగా వివాదాస్పదమైన ప్రసంగాలు ఆ వెబ్‌సైట్‌లో ఉండవు అని ఆ వార్తాపత్రిక వివరిస్తోంది. “సంఘం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా రూపొందించబడిన 10-20 నిమిషాల ప్రసంగాలు” అని వర్ణించబడిన ఆ ప్రసంగాలు 13 డాలర్లకు ఒకటి చొప్పున లభిస్తున్నాయి. (g04 6/8)

చిన్నతంలోనే నికొటిన్‌ వ్యసనం

“ఒక యౌవనస్థుడు నికొటిన్‌కు బానిసవడానికి సిగరెట్టును ఒక్కసారి పీలిస్తే చాలు” అని కెనడాకు చెందిన నేషనల్‌ పోస్ట్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. “నికొటిన్‌కు అలవాటుపడడం క్రమంగా జరిగే ప్రక్రియని, ఎన్నో సంవత్సరాలపాటు అధికంగా పొగత్రాగితేనే దానికి అలవాటుపడతారని ప్రస్తుతమున్న అభిప్రాయం తప్పని అధ్యయన రిపోర్టులు నిరూపిస్తున్నాయి” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. దాదాపు ఆరు సంవత్సరాలపాటు 1,200 మంది యౌవనస్థులను అధ్యయనం చేసిన తర్వాత, “అప్పుడప్పుడు పొగత్రాగేవారు కూడా తోటివాళ్ళ ఒత్తిడిని బట్టి కాక వాళ్ళకున్న శారీరక వ్యసనాన్ని బట్టే పొగత్రాగుతారు” అని పరిశోధకులు తెలుసుకున్నారని ఆ వార్తాపత్రిక చెప్పింది. ఆ అధ్యయనం ప్రకారం, “పొగత్రాగే యౌవనస్థుల్లో చాలామంది మొదటిసారి సిగరెట్‌ త్రాగినప్పటి నుండి ప్రతిరోజు సిగరెట్‌ త్రాగడం ప్రారంభించేవరకూ నికొటిన్‌కు బానిసలయ్యే సూచనలు కనిపిస్తాయి.” పొగత్రాగడానికి వ్యతిరేకంగా నిర్వహించబడే కార్యక్రమాలు, యౌవనస్థులకు పొగత్రాగాలని కలిగే ఒత్తిడిని ఎదిరించడానికి సహాయం చేయడమే కాకుండా అప్పటికే పొగత్రాగడం ప్రారంభించినవారికి నికొటిన్‌పై ఆధారపడకుండా ఉండేందుకు కూడా సహాయం చేయాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. (g04 5/22)

ఎక్కువమంది యౌవనస్థులు వీధుల్లో నివసిస్తున్నారు

“మాడ్రిడ్‌లో వీధుల్లో నివసిస్తున్న యౌవనస్థుల సంఖ్య పెరుగుతోంది” అని ఎల్‌ పాయిస్‌ అనే స్పానిష్‌ వార్తాపత్రికకు చెందిన ఆంగ్ల సంచిక చెబుతోంది. ఒక విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం “మాడ్రిడ్‌లోని 5,000 మంది నిరాశ్రయుల్లో దాదాపు 1,250 మంది 20 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే నిరాశ్రయులయ్యారు.” “నిరాశ్రయులైన యౌవనస్థుల్లో చాలామట్టుకు విభాగిత కుటుంబాల నుండి వచ్చినవారే, వాళ్ళ జీవితాలు మానసిక గాయాలతో నిండివున్నాయని స్పష్టమవుతోంది” అని ఆ పరిశోధన వెల్లడి చేసింది. నిజానికి “ప్రతి ముగ్గురు యౌవనస్థుల్లో ఇద్దరు త్రాగుబోతుల పిల్లలు లేదా మాదకద్రవ్యాలను దుర్వినియోగపరిచేవారి పిల్లలు, ఇంట్లో దౌర్జన్యానికి గురైన యౌవనస్థుల సంఖ్య కూడా దాదాపు అంతే.” “మధ్యప్రాచ్యంలో విలక్షణంగా కనిపించే సంప్రదాయక కుటుంబ బంధాలు కూలిపోవడం ప్రారంభించాయి” అని ఆ నివేదిక రచయితల్లో ఒకరైన మాన్వెల్‌ మూన్యోజ్‌ చెప్పారు. (g04 5/8)

“బొద్దుగా ఉండేవారి” కోసం బీచ్‌

నాజూగ్గా ఉన్నవారితో నిండివుండే బీచ్‌కు వెళ్ళడానికి సిగ్గుపడేవారి కోసం మెక్సికోలోని ఒక హోటల్‌ కొంత ప్రాంతాన్ని ప్రత్యేకంగా కేటాయించింది అని ఎల్‌ ఎకానమిస్టా వార్తాపత్రిక నివేదిస్తోంది. కాంకన్‌ సముద్ర తీరాన ఉన్న ఆ హోటల్‌ “లావుగా ఉండండి, సంతోషంగా ఉండండి” అనే నినాదాన్ని ప్రారంభించింది. “అధిక బరువువల్ల తమ స్నానపు దుస్తుల్లో బీచ్‌కు వెళ్ళడానికి భయపడే ప్రజలను ఆకర్షించడమే” ఆ హోటల్‌ లక్ష్యం. ఆ హోటల్‌ సిబ్బంది కూడా అన్ని రకాల బరువులకు చెందినవారు. స్థూలకాయులు “తమ దైనందిన జీవితంలో ఇప్పటికే ఎంతో వివక్షకు గురవుతున్నారు” కాబట్టి వాళ్ళు ఆ హోటల్‌కు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలాంటి తేడా లేకుండా వ్యవహరించడానికి ఆ హోటల్‌ సిబ్బంది శిక్షణ పొందారు అని ఆ నివేదిక చెబుతోంది. (g04 5/8)

పిల్లల ఆత్మహత్యా హెచ్చరిక

“ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే లేదా ఆత్మహత్య చేసుకునే పిల్లల్లో ఎనభై శాతం మంది తాము అలా చేయబోతున్నామని కొన్ని రోజుల లేదా కొన్ని నెలల ముందే మాటల్లో లేదా వ్రాతపూర్వకంగా తెలియజేస్తారు” అని మెక్సికో నగరానికి చెందిన మీలెన్యో వార్తాపత్రిక నివేదిస్తోంది. పిల్లల్లో జీవించాలనే కోరిక నశించడానికి (శారీరక, భావోద్వేగ, లేదా మౌఖిక) దుష్ప్రవర్తనకు గురికావడం, లైంగికంగా హింసించబడడం, కుటుంబం విడిపోవడం, స్కూలు సంబంధిత సమస్యలు ముఖ్య కారణాలు. మెక్సికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషియల్‌ సెక్యూరిటీ అనే సంస్థలో మానసిక నిపుణుడైన హోసే లూయీస్‌ బాస్కెస్‌ ప్రకారం, టీవీలో, సినిమాల్లో, వీడియో గేమ్స్‌లో, పుస్తకాల్లో మరణం అనేది ఎంతో తరచుగా సంభవించడం వల్ల పిల్లలు జీవితపు విలువ గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఎనిమిది నుండి పది సంవత్సరాల వయసుగల ప్రతి 100 మంది పిల్లల్లో 15 మంది ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచిస్తారు, వాళ్ళలో 5 శాతం మంది తమ ప్రాణాలను తీసుకోవడంలో సఫలమవుతారు అని ఆయన చెబుతున్నారు. పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పినప్పుడు దానిని కేవలం ఒక బెదిరింపుగానో అవధానం పొందడానికి చేసే ప్రయత్నంగానో దృష్టించి కొట్టి పారేయకుండా జాగ్రత్తపడాలని ఆ వార్తాపత్రిక సలహా ఇస్తోంది. అంతేకాక “తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడిపి, వాళ్ళతో ఆడుకొని, వాళ్ళతో సంభాషించి, ఎప్పుడూ వాళ్ళకు ప్రేమను చూపించాలి” అని అది చెబుతోంది. (g04 5/22)

ఆవులు మనుష్యులకంటే విలువైనవా?

ప్రపంచంలోని గొప్పవారికి పేదవారికి మధ్యవున్న అంతరం పెరుగుతూనే ఉంటుంది. గత 20 సంవత్సరాల్లో, ప్రపంచ వాణిజ్యమంతటిలో, అస్సలు అభివృద్ధి చెందని దేశాల (70 కోట్ల నివాసుల) వాటా 1 శాతం నుండి 0.6 శాతానికి పడిపోయింది. “నల్ల ఆఫ్రికన్లలో అధికశాతం మంది ఒక తరం ముందుకంటే ఇప్పుడు మరింత పేదవారిగా ఉన్నారు” అని ఫ్రెంచి ఆర్థిక శాస్త్రవేత్త అయిన ఫిలిప్‌ యుర్గెన్సెన్‌ ఛాలెంజెస్‌ అనే పత్రికలో వ్రాశాడు. ఉదాహరణకు ఇథియోపియాలో 6.7 కోట్లమంది, లక్సెంబర్గ్‌లోని 4,00,000 మంది నివాసుల సంపదలో మూడు శాతంతోనే జీవిస్తున్నారు. యూరోపియన్‌ రైతులకు ఒక ఆవుకు 150 రూపాయిల చొప్పున ప్రతిరోజు సబ్సిడీ లభిస్తుంది, కానీ దాదాపు 250 కోట్లమంది ప్రతిరోజు అంతకంటే తక్కువ డబ్బుతోనే జీవించాల్సి వస్తుందని యుర్గెన్సెన్‌ చెప్పాడు. కాబట్టి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో “ఒక పేదవాడికంటే ఆవు ఎక్కువ విలువైనది” అని యుర్గెన్సెన్‌ చెబుతున్నాడు. (g04 6/8)

మత్తులైన పిల్లలు

బ్రిటన్‌లో 50 ఆస్పత్రుల్లోని యాక్సిడెంట్‌ విభాగాలనూ ఎమర్జెన్సీ విభాగాలనూ సర్వే చేసినప్పుడు, “ఆరు సంవత్సరాల వయసు పిల్లలు కూడా ఎక్కువగా త్రాగి ఒళ్లు తెలియని స్థితికి చేరుకోవడంవల్ల ఆస్పత్రిలో చేర్పించబడుతున్నారు” అని వెల్లడయినట్లు లండన్‌కు చెందిన ద డెయిలీ టెలిగ్రాఫ్‌ నివేదిస్తోంది. ఒక ఆస్పత్రిలోని డాక్టర్లు, నర్సులు వేసవి సెలవుల్లో వారానికి దాదాపు 100 మంది మత్తులైన పిల్లలకు చికిత్స చేసినట్లు నివేదించారు. “మద్యపానీయాలను దుర్వినియోగపరచినందుకు ఆస్పత్రిలో చేర్పించబడే పిల్లల వయసు అంతకంతకూ తగ్గిపోతోందని ఆస్పత్రి సిబ్బందిలోని 70 శాతంకంటే ఎక్కువమంది నమ్ముతున్నారు” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది. అంతేకాకుండా బ్రిటన్‌లో మద్యపానీయాలవల్ల మరణించినవారి సంఖ్య 20 సంవత్సరాల్లో మూడింతలు పెరిగిందని ఇటీవల జరిగిన ప్రభుత్వ సర్వే చూపిస్తోంది. (g04 6/8)

భూవ్యాప్త ఆరోగ్య విపత్తు

డయబెటిస్‌ కలతపరిచేంతగా అధికమవడంవల్ల ఈ ప్రపంచం ఇంతకుముందెప్పుడూ చూడనంత “మహాగొప్ప ఆరోగ్య విపత్తు” వైపు వెళ్తోంది అని బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్‌ మరియు ఇంటర్నేషనల్‌ డయబెటిస్‌ ఫెడరేషన్‌ (ఐడిఎఫ్‌)కు అధ్యక్షుడు అయిన సర్‌ జార్జ్‌ ఆల్బర్టీ హెచ్చరిస్తున్నారు. ఐడిఎఫ్‌ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకంటే ఎక్కువమందికి పాలచెక్కర పడదు, అది తరచూ డయబెటిస్‌కు దారితీస్తుంది అని బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తోంది. ఒకప్పుడు ముఖ్యంగా వయసు పైబడినవారికే వచ్చిన టైప్‌ 2 డయబెటిస్‌ ఇప్పుడు బ్రిటన్‌లో, చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ వ్యాయామం చేయకుండా లావెక్కిన యౌవనస్థుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. “దీనంతటిని [డయబెటిస్‌ను దాని ప్రభావాలను] మన జీవనశైలి ద్వారా నివారించే అవకాశం ఉన్నా మనం ఏమీ చేయడం లేదన్నదే అత్యంత నిరుత్సాహకరమైన విషయం” అని ఆల్బర్టీ చెబుతున్నారు. వర్ధమాన దేశాలు “సంపన్న దేశాల అనారోగ్యకరమైన ఆహారాన్నీ, జీవిత విధానాలను” అలవర్చుకుంటే ఆ దేశాల్లో కూడా డయబెటిస్‌ విజృంభించే అవకాశాలున్నాయని ద గార్డియన్‌ వ్యాఖ్యానిస్తోంది. (g04 6/22)