కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి ఆరోగ్యం కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటం

మంచి ఆరోగ్యం కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటం

మంచి ఆరోగ్యం కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటం

న్యూయార్క్‌లో నివసిస్తున్న జోయాన్‌కు టీబీ (క్షయ) సోకింది. అయితే ఆమెకు సోకింది మామూలు టీబీ కాదు. ఆమెకు ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియావల్ల ఆ వ్యాధి వచ్చింది, దాదాపు అన్ని మందులను నిరోధించగల శక్తిని పెంపొందించుకున్న ఆ బ్యాక్టీరియా సోకినవారిలో సగంమంది చనిపోతారు. అయినప్పటికీ, జోయాన్‌ క్రమంగా చికిత్స చేయించుకోలేదు, తత్ఫలితంగా ఆమె అప్పటికే ఆ వ్యాధి ఇతరులకు సోకడానికి కారణమయ్యింది. అందువల్ల, ‘ఇక లాభంలేదు ఆమెను ఒంటరిగా ఒక గదిలో పెట్టి తాళం వెయ్యాల్సిందే’ అని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ అంది.

టీబీ ఎంతోకాలంగా ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. అక్షరార్థంగా కోట్లాది మంది టీబీతో బాధపడి మరణించారు. ఈ వ్యాధి ఎంతోకాలంగా ఉందని ప్రాచీన ఐగుప్తు మరియు పెరూలోని మమ్మీలనుబట్టి రుజువవుతోంది. నేడు, మళ్లీ తలెత్తిన టీబీవల్ల ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షలమంది మరణిస్తున్నారు.

ఆఫ్రికాలో ఒక గుడిసెలో చిన్న మంచంపై పడుకొనివున్న కార్లిటోస్‌ నుదురంతా చెమట పట్టింది. మలేరియావల్ల కనీసం ఏడవడానికి కూడా ఆ పిల్లవాడికి శక్తిలేకుండా పోయింది. కలత చెందిన ఆ పిల్లవాడి తల్లిదండ్రుల దగ్గర మందులు కొనడానికి డబ్బులు లేవు, తమ కొడుక్కి వైద్యం చేయిద్దామంటే దగ్గర్లో ఆస్పత్రి కూడా లేదు. కార్లిటోస్‌కు జ్వరం తగ్గలేదు, 48 గంటల్లోపే ఆ అబ్బాయి మరణించాడు.

మలేరియావల్ల ప్రతి సంవత్సరం కార్లిటోస్‌లాంటి పిల్లలు పది లక్షల మంది చనిపోతున్నారు. తూర్పు ఆఫ్రికా గ్రామాల్లో చాలామంది పిల్లలను మలేరియా వ్యాప్తిచేసే దోమలు ప్రతి నెలా 50 నుండి 80 సార్లు కుడతాయి. ఈ దోమలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి, మలేరియాను నివారించే మందుల ప్రభావం తగ్గిపోయింది. ప్రతి సంవత్సరం, 30 కోట్లమంది తీవ్రమైన మలేరియాతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది.

కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న 30 సంవత్సరాల కెన్నెత్‌ 1980లో మొదటిసారిగా డాక్టర్‌ వద్దకు వెళ్ళాడు. తనకు విరేచనాలు అవుతున్నాయని, బాగా అలసటగా ఉంటోందని డాక్టర్‌కు చెప్పాడు. ఒక సంవత్సరం తర్వాత అతను మరణించాడు. అతనికి నిపుణులు చికిత్స చేసినప్పటికీ అతని శరీరం కృశించి చివరకు అతను నిమోనియాతో చనిపోయాడు.

రెండు సంవత్సరాల తర్వాత శాన్‌ ఫ్రాన్సిస్కోకు 1,600 కిలోమీటర్ల దూరంలోవున్న ఉత్తర టాంజానియాలో ఒక స్త్రీ అలాంటి రోగ లక్షణాలతోనే బాధపడడం ప్రారంభించింది. కొద్ది వారాల తర్వాత ఆమె నడవలేకపోయింది, ఆ తర్వాత ఆమె చనిపోయింది. గ్రామస్థులు ఆ వింత వ్యాధికి జూలియానా వ్యాధి అని పేరు పెట్టారు ఎందుకంటే జూలియానా అనే పేరు ముద్రించబడివున్న బట్టను అమ్మే వ్యక్తి ఆమెకూ, ఇతర స్త్రీలకూ ఆ వ్యాధిని సంక్రమింపజేశాడని వాళ్ళు భావించారు.

కెన్నెత్‌ మరియు టాంజానియాకు చెందిన స్త్రీ ఒకే వ్యాధితో మరణించారు: అదే ఎయిడ్స్‌. 1980ల ప్రారంభంలో వైద్య శాస్త్రం అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవులను అదుపు చేయడంలో విజయం సాధించింది అనుకుంటున్న సమయంలోనే, ఈ కొత్త అంటువ్యాధి మానవాళిని కలవరపెట్టడం ఆరంభించింది. రెండు దశాబ్దాల్లోపే ఎయిడ్స్‌వల్ల మరణించిన వారి సంఖ్య 14వ శతాబ్దంలో యూరేసియాను కబళించిన, యూరప్‌ ఎన్నటికీ మరచిపోలేని బ్లాక్‌ డెత్‌ తెగులువల్ల చనిపోయినవారి సంఖ్యను మించిపోవడం ప్రారంభించింది.

బ్లాక్‌ డెత్‌

బ్లాక్‌ డెత్‌ అనే తెగులు 1347లో క్రిమియా నుండి వచ్చిన ఓడ సిసిలీ ద్వీపానికి చెందిన మెస్సినాలో నిలిచినప్పుడు ప్రబలడం ప్రారంభమయ్యిందని తెలుస్తోంది. ఎప్పుడూ తీసుకువచ్చే సరుకుతోపాటు ఈసారి ఆ ఓడ ఆ అంటువ్యాధిని కూడా తీసుకువచ్చింది. * వెంటనే బ్లాక్‌ డెత్‌ ఇటలీ అంతటా వ్యాపించింది.

ఆ తర్వాతి సంవత్సరం ఇటలీలోని సియన్నాకు చెందిన అగ్నోలో డి ట్యూరా తన పట్టణంలో నెలకొన్న భయంకరమైన పరిస్థితిని ఇలా వర్ణించాడు: ‘సియన్నాలో ప్రజలు చనిపోవడం మే నెలలో ప్రారంభమయింది. అది ఒక క్రూరమైన ఘోరమైన వ్యాధి. అది సోకినవారు దాదాపు వెంటనే చనిపోయేవారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా వందలకొద్ది ప్రజలు చనిపోయారు.’ ఆయన ఇంకా ఇలా చెప్పాడు: ‘నేను నా ఐదుగురు పిల్లలను స్వయంగా పూడ్చిపెట్టాను, ఇంకా చాలామంది కూడా అలాగే చేశారు. ఎవరు చనిపోయినా ఎవ్వరూ ఏడ్చేవారు కాదు ఎందుకంటే చివరకు అందరూ చనిపోవాల్సిందేనని మేము భావించాము. ఎంతమంది చనిపోయారంటే అందరూ ఈ లోకం అంతానికి చేరుకుందని భావించారు.’

నాలుగు సంవత్సరాల్లోపు ఆ వ్యాధి యూరప్‌ అంతటా వ్యాపించింది, అక్కడి జనాభాలో దాదాపు మూడువంతుల మంది అంటే బహుశా రెండు కోట్ల నుండి మూడు కోట్ల మంది వరకూ తమ ప్రాణాలను కోల్పోయారు అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. మారుమూల ద్వీపమైన ఐస్‌ల్యాండ్‌కు వ్యాపించిన ఆ వ్యాధి అక్కడి ప్రజల్లోని అధికశాతం మంది ప్రాణాలను బలిగొంది. ఈశాన్య దిశగా 13వ శతాబ్ద ప్రారంభంలో 12.3 కోట్లు ఉన్న చైనా జనాభా 14వ శతాబ్దంలో 6.5 కోట్లకు పడిపోయిందని, అది తెగులువల్ల దాని తర్వాత వచ్చిన కరువువల్ల అని చెప్పబడుతోంది.

ఇంతకుముందు వ్యాపించిన తెగుళ్లు, జరిగిన యుద్ధాలు లేదా కరువులు ఇంతటి బాధ కలిగించలేదు. “మానవ చరిత్రలో దానికి పోల్చదగిన విషాదమేదీ లేదు” అని మ్యాన్‌ అండ్‌ మైక్రోబ్స్‌ అనే పుస్తకం వ్యాఖ్యానించింది. “యూరప్‌, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో 25 శాతం నుండి 50 శాతం మంది చనిపోయారు” అని కూడా ఆ పుస్తకం చెబుతోంది.

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నందువల్ల అవి బ్లాక్‌ డెత్‌ విధ్వంసాన్ని తప్పించుకున్నాయి. కానీ సముద్రాలు దాటివెళ్లే ఓడలు ఆ దూరాన్ని తగ్గించివేశాయి. 16వ శతాబ్దంలో బ్లాక్‌ డెత్‌ తెగులు కంటే ఎన్నో రెట్లు ప్రాణాంతకమైన తెగుళ్లు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కుదిపేశాయి.

అమెరికాను గడగడలాడించిన మశూచి

1492లో కొలంబస్‌ వెస్ట్‌ ఇండీస్‌ను చేరుకున్నప్పుడు ఆయన స్థానిక ప్రజలను ‘అందమైన రూపం, మంచి ఎత్తు, చక్కని దేహదారుఢ్యంతో చూడముచ్చటగా ఉన్నారు’ అని వర్ణించాడు. అయితే, ఆరోగ్యవంతంగా కనిపించిన వాళ్ళ శరీరాలు యూరప్‌కు చెందిన వ్యాధులకు లొంగిపోయాయి.

1518లో హిస్పానియోలా ద్వీపంలో మశూచి వ్యాపించడం ప్రారంభమయ్యింది. అమెరికా ఆదివాసులు ముందెన్నడూ ఆ వ్యాధికి గురికాలేదు, అందువల్ల అది వారిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ విషాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక స్పానిష్‌ వ్యక్తి ఆ ద్వీపమంతటిలో కేవలం వెయ్యి మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారని అంచనా వేశాడు. ఆ మహమ్మారి త్వరలోనే మెక్సికోకి, పెరూకి కూడా వ్యాపించి అదే స్థాయిలో ప్రాణనష్టం కలిగించింది.

ఆ తర్వాతి శతాబ్దంలో వలస సమాజాలవారు ఉత్తర అమెరికాలోని మస్సాచుసెట్స్‌కు చేరుకున్నప్పుడు అక్కడి ప్రజలందరూ మశూచి కారణంగానే చనిపోయారని పరిశోధనల్లో వెల్లడయింది. “దాదాపు స్థానికులందరూ మశూచికి బలైపోయారు” అని వలస సమాజపు నాయకుడు జాన్‌ వింథ్రాప్‌ వ్రాశాడు.

మశూచి తర్వాత ఇతర మహమ్మారులూ ప్రబలాయి. ఒక పుస్తకం ప్రకారం, కొలంబస్‌ సందర్శించిన తర్వాత 100 సంవత్సరాల్లోపే విదేశీయుల రాకవల్ల ప్రబలిన వ్యాధుల కారణంగా అమెరికా ఖండాల్లోని జనాభాలో 90 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో జనాభా 30 కోట్ల నుండి 30 లక్షలకు చేరుకోగా, పెరూ జనాభా 80 లక్షల నుండి 10 లక్షలకు పడిపోయింది. కాబట్టి మశూచికి కేవలం అమెరికా ఆదివాసులు మాత్రమే బలి కాలేదు. “మానవ చరిత్రంతటిలోను మశూచి కోట్లాది మంది ప్రాణాలను బలిగొంది, బ్లాక్‌ డెత్‌ తెగులు కారణంగా చనిపోయిన వారి సంఖ్య . . . ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నింటిలో మరణించినవారి కంటే ఎక్కువే” అని స్కర్జ్‌​—⁠ద వన్స్‌ అండ్‌ ఫ్యూచర్‌ థ్రెట్‌ ఆఫ్‌ స్మాల్‌పాక్స్‌ అనే పుస్తకం చెబుతోంది.

ఆ యుద్ధంలో ఇంకా విజయం సాధించబడలేదు

ఈ కాలంలో, బ్లాక్‌ డెత్‌ తెగులు మరియు మశూచి వంటి మహమ్మారులు ఎప్పుడో జరిగిన విషాదాలని, అవి ఇప్పుడు చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమయ్యాయని అనిపించవచ్చు. 20వ శతాబ్దంలో మానవాళి అంటువ్యాధులతో పోరాడే యుద్ధంలో ప్రత్యేకించి పారిశ్రామిక దేశాల్లో అనేక విజయాలు సాధించింది. డాక్టర్లు ఎన్నో వ్యాధులకు కారణాలను కనుగొన్నారు, వాటిని నయం చేసే మార్గాలు కూడా కనిపెట్టారు. (క్రింది బాక్సు చూడండి.) కొత్తరకపు టీకాలు, యాంటిబయోటిక్‌లు నయం చేయడానికి కష్టమైన వ్యాధులను కూడా సమూలంగా పెకిలించివేయగల అద్భుతమైన మందుల్లా కనిపించాయి.

అయితే “మరణం, పన్నులు ఎంత తప్పనిసరో అంటువ్యాధుల మహమ్మారులు కూడా అంతే తప్పనిసరి” అని యు.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌కు మాజీ అధ్యక్షుడైన డా. రిచర్డ్‌ క్రౌస్‌ వ్యాఖ్యానించాడు. టీబీ, మలేరియాలు అంతరించలేదు. అంటువ్యాధుల మహమ్మారులు ఇప్పటికీ ప్రపంచాన్ని పీడిస్తున్నాయని ఇటీవలి ఎయిడ్స్‌ మహమ్మారి బాధాకరంగా గుర్తు చేసింది. “అంటువ్యాధులవల్లే ప్రపంచంలోని అత్యధికులు మరణిస్తున్నారు; ఇక ముందు కూడా అవి అలాగే ఉంటాయి” అని మ్యాన్‌ అండ్‌ మైక్రోబ్స్‌ అనే పుస్తకం నివేదించింది.

వ్యాధులతో పోరాడడంలో గమనార్హమైన అభివృద్ధి సాధించబడినప్పటికీ, గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన ఆ విజయాలు తాత్కాలికమైనవిగానే ఉండవచ్చు అని కొంతమంది డాక్టర్లు భయపడుతున్నారు. “అంటువ్యాధుల ప్రమాదం అంతరించిపోలేదు​—⁠అది అంతకంతకూ ఎక్కువవుతోంది” అని ఎపిడెమ్యాలజిస్టు రాబర్ట్‌ షోప్‌ హెచ్చరిస్తున్నాడు. దానికిగల కారణాన్ని తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది. (g04 5/22)

[అధస్సూచి]

^ ఆ అంటువ్యాధి వివిధ రూపాల్లో అంటే బుబోనిక్‌ తెగులు మరియు నిమోనిక్‌ తెగులుతో సహా వివిధ రూపాల్లో వ్యాపించింది. ముఖ్యంగా ఎలుకలపై ఉండే త్రుళ్లు పురుగులు బుబోనిక్‌ తెగులును వ్యాపింపజేశాయి, ఆ వ్యాధి సోకిన ప్రజలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెదజల్లబడే తుంపర నిమోనిక్‌ తెగులును వ్యాపింపజేసింది.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

రెండు దశాబ్దాల్లోపే ఎయిడ్స్‌వల్ల మరణించిన వారి సంఖ్య 14వ శతాబ్దంలో యూరేసియాను కబళించిన బ్లాక్‌ డెత్‌ తెగులువల్ల చనిపోయినవారి సంఖ్యను మించిపోవడం ప్రారంభించింది

[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

పరిజ్ఞానానికి పోటీగా మూఢనమ్మకాలు

14వ శతాబ్దంలో బ్లాక్‌ డెత్‌ తెగులు కారణంగా అవికాన్‌లోని పోప్‌ కుటుంబానికి ముప్పు వాటిల్లినప్పుడు, ఆయన వ్యక్తిగత డాక్టరు ఆ తెగులు వ్యాపించడానికి ముఖ్య కారణం శని, గురు, అంగారక గ్రహాలు కుంభరాశిలో కలవడమేనని చెప్పాడు.

దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌కు గొంతులో ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ప్రసిద్ధులైన ముగ్గురు డాక్టర్లు ఆయన రక్తనాళాల నుండి రెండు లీటర్ల రక్తాన్ని బయటకు తీసి ఆ ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేశారు. దానితో కొన్ని గంటల్లోపే ఆయన చనిపోయారు. రక్తనాళం నుండి రక్తం తీయడం 2,500 సంవత్సరాల కాలంపాటు అంటే హిపాక్రటీస్‌ కాలం నుండి 19వ శతాబ్దపు మధ్యకాలం వరకూ వైద్య శాస్త్రపు పద్ధతిగా కొనసాగింది.

మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు వైద్య శాస్త్ర అభివృద్ధికి అంతరాయం కలిగించినప్పటికీ తమ వృత్తికే అంకితమైన డాక్టర్లు అంటువ్యాధుల కారణాలను, వాటికి చికిత్సలను కనుక్కోవడానికి ఎంతో శ్రమించారు. వాళ్ళు సాధించిన విజయాల్లో గమనార్హమైనవి కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

మశూచి. 1798లో ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచికి టీకాలు కనుగొనడంలో విజయం సాధించాడు. 20వ శతాబ్దంలో పోలియో, పచ్చకామెర్లు, పొంగు, రుబెల్లా వంటి ఇతర వ్యాధులను నివారించడంలో కూడా టీకాలు సమర్థవంతంగా పనిచేశాయి.

టీబీ (క్షయ). 1882లో రాబర్ట్‌ కోచ్‌ టీబీ బ్యాక్టీరియాను గుర్తించి ఆ వ్యాధిని పరీక్షించే విధానాన్ని పెంపొందించాడు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత టీబీని నయం చేయడానికి స్ట్రెప్టొమైసిన్‌ అనే సమర్థవంతమైన యాంటిబయోటిక్‌ కనుగొనబడింది. ఈ మందులు బుబోనిక్‌ తెగులును నయం చేయడానికి కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లు నిరూపించబడ్డాయి.

మలేరియా. 17వ శతాబ్దం మొదలుకొని, చింకోనా చెట్టు బెరడునుండి తీయబడే క్వీనైన్‌ కోట్లాదిమంది మలేరియా బాధితుల ప్రాణాలను కాపాడింది. 1897లో రొనాల్డ్‌ రాస్‌ ఈ వ్యాధిని అనాఫిలిస్‌ దోమలు వ్యాప్తి చేస్తాయని గుర్తించాడు, ఉష్ణమండల దేశాల్లో ఈ వ్యాధితో చనిపోయేవారి సంఖ్యను తగ్గించడానికి ఆ తర్వాత దోమల నియంత్రణను ప్రారంభించారు.

[చిత్రాలు]

రాశి చక్రం (పైన), రక్తాన్ని తీయడం

[చిత్రసౌజన్యం]

రెండు చిత్రాలు: Biblioteca Histórica “Marqués de Valdecilla”

[3వ పేజీలోని చిత్రాలు]

నేడు మళ్లీ తలెత్తిన టీబీవల్ల ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు

[చిత్రసౌజన్యం]

ఎక్స్‌రే: New Jersey Medical School–National Tuberculosis Center; పురుషుడు: ఫోటో: WHO/Thierry Falise

[4వ పేజీలోని చిత్రం]

దాదాపు 1500లో చెక్కబడిన జర్మన్‌ చిత్రం బ్లాక్‌ డెత్‌ బారిన పడకుండా ఉండడానికి ఒక వైద్యుడు ముసుగు వేసుకోవడాన్ని చూపిస్తోంది. ఆ ముక్కులో పరిమళ ద్రవ్యం ఉండేది.

[చిత్రసౌజన్యం]

Godo-Foto

[4వ పేజీలోని చిత్రం]

బుబోనిక్‌ తెగులు కలుగజేసిన బ్యాక్టీరియా

[చిత్రసౌజన్యం]

© Gary Gaugler/Visuals Unlimited