కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మైలీన్‌కు ఒక కొత్త ముఖం

మైలీన్‌కు ఒక కొత్త ముఖం

మైలీన్‌కు ఒక కొత్త ముఖం

మైలీన్‌ తల్లి చెప్పినది

నా అందమైన 11 సంవత్సరాల కూతురు మైలీన్‌కు ఒక కొత్త ముఖం ఎందుకు అవసరమయ్యింది? నన్ను వివరించనివ్వండి.

మైలీన్‌ నా ఇద్దరు కూతుర్లలో రెండవది. క్యూబాలోని ఆల్జెన్‌లో 1992, ఆగస్టు 5వ తేదీన పుట్టింది. తను పుట్టినప్పుడు నేను, నా భర్త, మా పెద్ద కూతురు ఎంతో సంతోషించాము. కానీ మా సంతోషానికి ఆ వెంటనే అవరోధం కలిగింది. మైలీన్‌ పుట్టిన తర్వాత కొద్ది రోజులకు నాకు చికెన్‌పాక్స్‌ వచ్చింది, ఒక నెల తర్వాత మైలీన్‌కూ ఆ వ్యాధి సోకింది.

మొదట్లో తన పరిస్థితి అంత గంభీరంగా ఉన్నట్లు అనిపించలేదు; కానీ ఆ తర్వాత పరిస్థితి విశమించడంతో మేము తనను ఆస్పత్రిలో చేర్పించాము. మైలీన్‌కు వైద్యపరంగా చక్కని చికిత్స లభించింది, కానీ తన వ్యాధి నిరోధక శక్తి చాలా బలహీనమై పోవడంవల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చింది. మైలీన్‌ చిన్ని ముక్కు పక్కన వింతగా ఎర్రబడడాన్ని నేను గమనించాను. దానికి కారణం ఒక అరుదైన, చాలా శక్తివంతమైన సూక్ష్మక్రిమి అని డాక్టర్లు గుర్తించారు.

మైలీన్‌కు వెంటనే యాంటిబయోటిక్‌లు ఇవ్వడం ప్రారంభించినప్పటికీ కేవలం కొద్ది రోజుల్లోనే ఆ సూక్ష్మక్రిమి తన ముఖాన్ని నాశనం చేయడం ప్రారంభించింది. డాక్టర్లు ఆ ఇన్ఫెక్షన్‌ను అదుపు చేసేలోగా మైలీన్‌ ముక్కు, పెదవులు, చిగుళ్ళు మరియు చుబుకంలోని కొంత భాగాన్ని కోల్పోయింది. ఒక కంటిపక్కన కూడా రంధ్రాలు ఏర్పడ్డాయి.

మైలీన్‌ను చూసినప్పుడు నేను, నా భర్త కన్నీళ్ళ పర్యంతమయ్యాము. మా చిట్టి తల్లికి ఇలా ఎందుకు జరిగింది? మైలీన్‌ చాలా రోజులవరకూ ఇన్‌టెన్సివ్‌ కేర్‌లోనే ఉంది, తను బ్రతకకపోవచ్చు అని డాక్టర్లు అనుకున్నారు. “పాప చావు చూడడానికి సిద్ధంగా ఉండు” అని నా భర్త నాకు పదేపదే చెప్పేవాడు. అయితే నేను మైలీన్‌ చిన్ని చేతిని పట్టుకోవడానికి ఇన్‌క్యూబెటర్‌లోకి చెయ్యి పెట్టినప్పుడు తను నా చేతిని ఎంత బలంగా పట్టుకునేదంటే మైలీన్‌ తప్పకుండా బ్రతుకుతుందని నాకు అనిపించేది. నేను నా భర్తతో ఇలా అన్నాను: “మన పాప చనిపోదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మైలీన్‌ జీవితం ఎలా ఉంటుంది?” మేము ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడు, జరిగినదంతా బహుశా ఒక పీడకలేమో అని అనుకునేవాళ్ళం.

మేము ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆరేళ్ళ మా పెద్ద కూతురు మైడిలీస్‌ను నా తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టాం. తన చిట్టి చెల్లెలు ఎప్పుడు ఇంటికి వస్తుందా అని మైడిలీస్‌ ఆత్రంగా ఎదురు చూస్తుండేది. మైలీన్‌ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద నీలిరంగు కళ్ళతో అందమైన “బొమ్మ”లా ఉండడాన్ని తను చూసింది. కానీ ఆ తర్వాత మైడిలీస్‌ మళ్ళీ తన చెల్లిని చూసినప్పుడు చూసినప్పుడు మైలీన్‌ భయంకరంగా కనిపించింది.

‘నా పాప ఇంత బాధను ఎందుకు అనుభవించాలి?’

ఒకటిన్నర నెలల తర్వాత మైలీన్‌ ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేయబడింది. మేము నగరంలోవున్న మా ఇంటికి తిరిగివెళ్ళలేదు ఎందుకంటే ఇతరులెవ్వరూ మైలీన్‌ను చూడకూడదని మేము అనుకున్నాము. మా తల్లిదండ్రుల ఫార్మ్‌ పక్కన చిన్న ఇంట్లో ఇతరుల నుండి వేరుగా ఉండడం ప్రారంభించాము.

మొదట్లో నేను మైలీన్‌కు, తన ముఖంలో ఒకప్పుడు నోరు ఉండిన స్థానంలో మిగిలిన చిన్న రంధ్రంలోనుండి కొద్దికొద్దిగా పాలు పట్టించేదాన్ని. మైలీన్‌ తనంతట తాను పాలు తాగలేకపోయేది. అయితే తన గాయాలు మానడం ప్రారంభమైనప్పుడు ఆ రంధ్రం దాదాపు మూసుకుపోయింది. నేను తనకు ఒక బాటిల్‌ ద్వారా ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇవ్వగలిగే దాన్ని. మైలీన్‌కు ఒక సంవత్సరం నిండాక మేము తనను తీసుకొని మళ్ళీ ఆల్జెన్‌కు వెళ్ళాము, అక్కడ డాక్టర్లు తన నోటి స్థానంలోవున్న రంధ్రాన్ని పెద్దది చేయడానికి నాలుగు ఆపరేషన్లు చేశారు.

‘నా పాప ఇంత బాధను ఎందుకు అనుభవించాలి?’ అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను అభిచార సంబంధ కేంద్రాల్లో వెదికి, నా మతపరమైన విగ్రహాలకు ప్రార్థించేదాన్ని. కానీ ఏదీ నాకు ఓదార్పునివ్వలేదు. కొందరు బంధువులు, స్నేహితులు చేసిన బాధాకరమైన వ్యాఖ్యానాలు నన్ను మరింత తికమకపెట్టాయి. “దేవుడు ఇలాంటివి ఎందుకు అనుమతిస్తాడో ఆయనకు తెలుసు” అని కొందరు అనేవారు. “అది తప్పకుండా దేవుడు విధించిన శిక్షే” అని మరికొందరు నాకు చెప్పేవారు. మైలీన్‌ పెరిగి పెద్దయ్యాక తనకు ఏమి చెప్పాలి అని కూడా నేను చాలా చింతించేదాన్ని. ఒకసారి, మైలీన్‌ ఇంకా చిన్నగా ఉన్నప్పుడే, “నాకు అందరిలాగా ముక్కు ఎందుకు లేదు?” అని వాళ్ళ నాన్నను అడిగింది. ఆయన సమాధానం చెప్పలేక ఏడవడానికి బయటకు వెళ్ళిపోయాడు. నేను జరిగిన విషయాన్ని తనకు చెప్పడానికి ప్రయత్నించాను. ఒక చిన్న పురుగు తన ముక్కును, నోటిని తినేసిందని నేను చెప్పినట్లు మైలీన్‌కు ఇంకా గుర్తుంది.

నిరీక్షణకు ఆధారం

నేను ఇలా ప్రతికూల భావాలతో సతమతమవుతున్న సమయంలో, మా పక్కింటావిడ ఒక యెహోవాసాక్షి అని నాకు గుర్తొచ్చింది. నా చిట్టి తల్లి ఇంత బాధ అనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడో బైబిలు నుండి చూపించమని నేను ఆమెను అడిగాను. “ఇది నేను చేసిన తప్పుకు దేవుడు విధించిన శిక్ష అయితే, నేను చేసినదానికి మైలీన్‌ ఎందుకు శిక్షించబడాలి?” అని కూడా నేను అడిగాను.

ఆమె నాతో మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి అధ్యయనం చేయడం ప్రారంభించింది. * మైలీన్‌కు జరిగిన దానికి దేవుడు బాధ్యుడు కాదనీ, ఆయనకు మనపట్ల నిజమైన ఆసక్తి ఉందనీ నేను క్రమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. (యాకోబు 1:13; 1 పేతురు 5:7) యేసుక్రీస్తు ఆధీనంలోని ఆయన పరలోక రాజ్యంలో బాధలు నిర్మూలించబడతాయనే అద్భుతమైన నిరీక్షణను విలువైనదిగా ఎంచడం ప్రారంభించాను. (మత్తయి 6:9, 10; ప్రకటన 21:3, 4) ఈ జ్ఞానం నన్ను బలపరచింది, నేను యెహోవాసాక్షుల క్రైస్తవ కూటాలకు హాజరయ్యేలా అది నన్ను పురికొల్పింది. మొదట్లో నా భర్తకు నేను ఇలా కొత్తగా ఆధ్యాత్మిక ఆసక్తి చూపించడం నచ్చలేదు. అయితే బైబిలును అధ్యయనం చేయడం, మాకు జరిగినదానిని తట్టుకోవడానికి నాకు సహాయం చేస్తుంది కాబట్టి ఆయన నన్ను అధ్యయనం చేయడం ఆపమని చెప్పలేదు.

విదేశాల నుండి సహాయం

మైలీన్‌కు రెండు సంవత్సరాల వయసున్నప్పుడు, మెక్సికోలోని ఒక ప్రఖ్యాత ప్లాస్టిక్‌ సర్జన్‌కు తన గురించి తెలిసింది, ఆయన మైలీన్‌కు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చాడు. మొదటి ఆపరేషన్లు 1994లో చేయబడ్డాయి. నేను, మైలీన్‌ దాదాపు ఒక సంవత్సరంపాటు మెక్సికోలో ఉన్నాము. మొదట్లో మేము యెహోవాసాక్షులను కలుసుకోలేకపోయాము కాబట్టి క్రైస్తవ కూటాలకు హాజరవలేకపోయాము. అది నన్ను ఆధ్యాత్మికంగా బలహీనపరచింది. ఆ తర్వాత ఒక స్థానిక సాక్షి మమ్మల్ని కలిసింది, మేము మళ్ళీ తోటి విశ్వాసులతో వీలైనంత తరచుగా సహవసించడం ప్రారంభించాము. మేము క్యూబాకు తిరిగి వచ్చిన తర్వాత నేను నా బైబిలు అధ్యయనాన్ని తిరిగి ప్రారంభించి ఆధ్యాత్మికంగా కోలుకున్నాను.

ఆ సమయంలో నా భర్తకు ఇంకా బైబిలుపై ఆసక్తి కలుగలేదు. ఆయనలో ఆసక్తి రేకెత్తించడానికి ప్రయత్నిస్తూ నాకు బైబిలు ఆధారిత ప్రచురణలు మరింత బాగా అర్థమయ్యేందుకు వీలుగా వాటిలోని కొన్ని భాగాలను చదివి వినిపించమని ఆయనను కోరుతుండేదాన్ని. చివరకు ఆయన బైబిలు అధ్యయనానికి అంగీకరించేందుకు పురికొల్పబడ్డాడు, ఎందుకంటే మేము పదేపదే మెక్సికోకు వెళ్ళి అక్కడ ఎన్నో రోజులపాటు ఉండడంవల్ల మా కుటుంబ బంధం పాడవుతుందని ఆయన చింతించేవాడు. ఆధ్యాత్మికంగా ఐక్యంగా ఉంటే, మేము ఒకరికొకరం దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండే సమయాలను తట్టుకోవడానికి అది సహాయం చేస్తుందని ఆయన భావించాడు. అది మాకు నిజంగానే సహాయం చేసింది. నా భర్త, నా పెద్ద కూతురు, నేను 1997లో యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకున్నాము.

మేము మైలీన్‌ తొలి ఆపరేషన్ల కోసం మెక్సిలో ఉన్నప్పుడు, ఆ చిన్న పురుగు తన ముఖాన్ని తినుండకపోతే నాన్న నుండి అక్క నుండి ఇలా దూరంగా ఉండవలసి వచ్చేది కాదు అని అంటుండేది. దీర్ఘకాలంపాటు మా కుటుంబం అలా వేరుగా ఉండవలసి వచ్చినందుకు నా హృదయం తరుక్కుపోయేది. అయితే మెక్సికోలోని బెతెల్‌ అని పిలువబడే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించడం నాకు గుర్తుంది. మేము ఒకసారి మెక్సికోలో ఉన్నప్పుడు మైలీన్‌ ఇంక నేను ఆపరేషన్‌ చేయించుకోను అని మారాం చేసింది, ఎందుకంటే ఆ సందర్శనంలో అది ఐదవ ఆపరేషన్‌, పైగా నయమయ్యేటప్పుడు ఎంతో నొప్పిగా ఉంటుంది కాబట్టి తనకు ఆపరేషన్‌ వద్దని మారాం చేసింది. కానీ బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్న కొంతమంది సాక్షులు, మైలీన్‌ ధైర్యంగా ఉండి ఆపరేషన్‌ చేయడానికి డాక్టర్లను అనుమతిస్తే తను ఆస్పత్రినుండి డిశ్చార్జి కాగానే తనకు పార్టీ ఇస్తామని చెప్పారు. ఆపరేషన్‌ చేయించుకోవడానికి మైలీన్‌ ఒప్పుకుంది.

మైలీన్‌నే తన భావాలను చెప్పనివ్వండి: “బెతెల్‌లో పార్టీ చేసుకోవడమనే తలంపు నన్ను ఎంతో పులకరింపజేసింది. కాబట్టి నేను ధైర్యంగా ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఎంతోమంది ఆధ్యాత్మిక సహోదరసహోదరీలతో పార్టీ ఉత్సాహవంతంగా జరిగింది. వాళ్ళు నాకు ఎన్నో కార్డులు ఇచ్చారు, అవి ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, నేను ఆ తర్వాతి ఆపరేషన్లను సహించడానికి కావలసిన శక్తిని ఇచ్చింది.”

మెరుగుపడిన పరిస్థితి, సహించడానికి సహాయం

ఇప్పుడు పదకొండు సంవత్సరాల వయసున్న మైలీన్‌ తన ముఖాన్ని చక్కదిద్దడానికి ఇప్పటికి 20 ఆపరేషన్లు చేయించుకోవలసి వచ్చింది. ఆ ఆపరేషన్లవల్ల మైలీన్‌కెంతో సహాయం లభించింది, అయినా ఇప్పటికీ తను తన నోటిని పూర్తిగా తెరవలేదు. అయితే తను ఎప్పుడూ ధైర్యంతో కూడిన అనుకూలమైన దృక్పథంతోనే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంది. ఆరు సంవత్సరాల వయస్సునుంచే తను మా స్థానిక సంఘంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పాల్గొంటోంది, 2003, ఏప్రిల్‌ 27న తను బాప్తిస్మం తీసుకుంది. మైలీన్‌ ఒకసారి ఏకంగా మూడు బైబిలు అధ్యయనాలను కూడా నిర్వహించింది. ఒకసారి మెక్సికోలో ఉన్నప్పుడు తను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించాడు. మైలీన్‌ ఆయనను క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు, ఇతర సంఘ కూటాలకు ఆహ్వానించింది, ఆయన ఎంతో ఆసక్తితో వాటికి హాజరయ్యాడు.

మైలీన్‌ ఇంటింటి పరిచర్య చేసినప్పుడు, కొందరు తన ముఖాన్ని చూసి ముఖం కాలిపోయిందా అని అడుగుతారు. రానున్న పరదైసులో యెహోవా తనకు ఒక కొత్త ముఖాన్ని ఇస్తాడు అనే బైబిలు ఆధారిత నిరీక్షణను వాళ్ళతో పంచుకోవడానికి మైలీన్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.​—లూకా 23:43.

ఆపరేషన్లవల్ల, ఇతర పిల్లలు ఎగతాళి చేయడంవల్ల మైలీన్‌ అనుభవించిన బాధ వర్ణనాతీతం. వాటన్నింటిని సహించడానికి తనకు ఏమి సహాయం చేసింది? మైలీన్‌ ఆత్మ విశ్వాసంతో ఇలా చెబుతోంది: “యెహోవా నాకు నిజమైన వ్యక్తి. నేను సహించడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని ఆయన నాకు ఇస్తాడు. నేను ఇంక ఆపరేషన్లు చేయించుకోదలచుకోలేదు ఎందుకంటే డాక్టర్లు ఇప్పుడు నా ముఖానికేమీ చేయలేరు. నేను పుట్టినప్పుడు ఎలా ఉండేదాన్నో అలా చేయడం వాళ్ళకు సాధ్యం కాదు. అయితే నూతనలోకంలో యెహోవా నాకు ఒక కొత్త ముఖాన్ని ఇస్తాడని, నేను మళ్ళీ అందంగా తయారవుతానని నాకు తెలుసు.”(g04 5/22)

[అధస్సూచి]

^ యెహోవాసాక్షులు ప్రచురించినది.

[18వ పేజీలోని బ్లర్బ్‌]

“నూతనలోకంలో యెహోవా నాకు ఒక కొత్త ముఖాన్ని ఇస్తాడు”

[19వ పేజీలోని బ్లర్బ్‌]

దీనంతటికి దేవుడు బాధ్యుడు కాడని నేను క్రమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను