కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహాన్ని పవిత్రంగా ఎందుకు దృష్టించాలి?

వివాహాన్ని పవిత్రంగా ఎందుకు దృష్టించాలి?

బైబిలు ఉద్దేశం

వివాహాన్ని పవిత్రంగా ఎందుకు దృష్టించాలి?

నేడు చాలామంది వివాహాన్ని పవిత్రమైనదిగానే ఎంచుతున్నామని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఇన్ని వివాహాలు విడాకులతో ఎందుకు ముగుస్తున్నాయి? కొంతమందికి వివాహం కేవలం ఒక ప్రణయ సంబంధ వాగ్దానం, ఒక చట్టబద్ధమైన ఒప్పందం మాత్రమే. అలాంటి వాగ్దానాలకు కట్టుబడి ఉండకపోయినా ఫరవాలేదని వాళ్ళు భావిస్తారు. వివాహాన్ని ఇలా దృష్టించే వాళ్ళకి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు విడాకులు తీసుకోవడం చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది.

వివాహ ఏర్పాటును దేవుడు ఎలా దృష్టిస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన వాక్యమైన బైబిలులో హెబ్రీయులు 13:4 లో ఉంది: ‘వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను.’ “ఘనమైనదిగా” అని అనువదించబడిన గ్రీకు పదం విలువైనది, ఎంతో గౌరవించదగినది అనే తలంపునిస్తుంది. మనం దేన్నైనా విలువైనదిగా ఎంచినప్పుడు దానిని భద్రంగా ఉంచుకోవడానికి, పొరపాటున కూడా దానిని పోగొట్టుకోకుండా ఉండడానికి జాగ్రత్తపడతాము. వివాహ ఏర్పాటు విషయంలో కూడా మనం అలాగే భావించాలి. క్రైస్తవులు దానిని ఘనమైనదిగా, అంటే తాము జాగ్రత్తగా ఉంచుకోవాలనుకునేంత విలువైనదిగా దృష్టించాలి.

యెహోవా దేవుడు వివాహాన్ని భార్యాభర్తల మధ్య ఉండే పవిత్రమైన ఏర్పాటుగానే రూపొందించాడు. మనం కూడా వివాహాన్ని ఆయన దృష్టించినట్లే దృష్టిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

ప్రేమ, గౌరవం

వివాహ ఏర్పాటును గౌరవించాలంటే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. (రోమీయులు 12:​10) అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”​—ఎఫెసీయులు 5:33.

కొన్నిసార్లు భార్య లేక భర్త ప్రేమగా, గౌరవంగా ప్రవర్తించకపోవచ్చు. అయినప్పటికీ క్రైస్తవులు అలాంటి ప్రేమను, గౌరవాన్ని చూపించాలి. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”​—కొలొస్సయులు 3:13.

సమయము, శ్రద్ధ

తమ వివాహాన్ని పవిత్రమైనదిగా దృష్టించే దంపతులు తమ భాగస్వాముల శారీరక మరియు భావోద్వేగ అవసరాలను తీర్చడానికి సమయం వెచ్చిస్తారు. లైంగిక విషయాల్లో కూడా అంతే. బైబిలిలా చెబుతోంది: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.”​—1 కొరింథీయులు 7:3.

అయితే కొంతమంది దంపతులు, డబ్బు సంపాదించడానికి భర్త కొంతకాలంపాటు వేరే ప్రాంతంలో ఉండాలని భావించారు. కొన్నిసార్లు అలా దూరంగా ఉండడం అనుకోకుండా ఎక్కువకాలంపాటు కొనసాగుతుంది. ఇలా దూరంగా ఉండడమనేది తరచూ వివాహంపై ఒత్తిడి తీసుకువస్తుంది, అది కొన్నిసార్లు వ్యభిచారానికి, విడాకులకు నడిపిస్తుంది. (1 కొరింథీయులు 7:2, 5) ఆ కారణంగానే చాలామంది క్రైస్తవ దంపతులు తాము పవిత్రమైనదిగా ఎంచే తమ వివాహాన్ని ప్రమాదంలో పడవేసే బదులు భౌతికపరమైన ప్రయోజనాలను త్యజించాలని నిర్ణయించుకున్నారు.

సమస్యలు తలెత్తినప్పుడు

తమ వివాహాన్ని గౌరవించే క్రైస్తవులు సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వేరైపోరు లేదా విడాకులు తీసుకోరు. (మలాకీ 2:16; 1 కొరింథీయులు 7:10, 11) యేసు ఇలా చెప్పాడు: “నేను మీతో చెప్పునదేమనగా—వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.” (మత్తయి 5:32) ఎలాంటి లేఖనాధారిత కారణాలు లేకుండానే వేరైపోవడానికి లేక విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకునే దంపతులు వివాహాన్ని అగౌరవపరుస్తున్నారు.

వివాహ జీవితంలో గంభీరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారికి మనం ఇచ్చే సలహాలు కూడా మనం వివాహాన్ని ఎలా దృష్టిస్తున్నామో చూపిస్తాయి. మనం వెంటనే వేరైపొమ్మని లేదా విడాకులు తీసుకొమ్మని సలహా ఇస్తున్నామా? నిజమే కొన్నిసార్లు దంపతులు వేరవ్వడానికి తగిన కారణాలే ఉండవచ్చు, అంటే తీవ్రమైన శారీరక దౌర్జన్యం లేక ఉద్దేశపూర్వకంగా మద్దతివ్వకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. * అంతేకాకుండా పైన చెప్పబడినట్లుగా భాగస్వామి వ్యభిచారం చేసినప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవడాన్ని బైబిలు అనుమతిస్తోంది. అయినప్పటికీ, క్రైస్తవులు ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఇతరులు తీసుకునే నిర్ణయాలపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాకూడదు. ఎందుకంటే సలహా ఇచ్చిన వ్యక్తి కాదుగానీ ఆ సమస్య ఎదుర్కొంటున్న వ్యక్తే తాను తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుంది.​—గలతీయులు 6:5, 7.

తేలికగా దృష్టించకండి

కొన్నిప్రాంతాల్లో ప్రజలు మరొక దేశంలో నివసించడానికి చట్టబద్ధమైన అనుమతిని సంపాదించుకోవడానికి వివాహాన్ని ఉపయోగించుకోవడం సాధారణమైపోయింది. అలాంటి ప్రజలు సాధారణంగా మరొక దేశ నివాసికి డబ్బు ఇచ్చి తమను పెళ్ళిచేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాంటి దంపతులు వివాహం చేసుకున్నా వేరుగానే జీవిస్తారు, బహుశా ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకు కావలసిన చట్టబద్ధమైన అనుమతి లభించిన వెంటనే వాళ్ళు విడాకులు తీసుకుంటారు. వాళ్ళు తమ వివాహాన్ని కేవలం ఒక వ్యాపార సంబంధమైన ఒప్పందంగానే దృష్టిస్తారు.

వివాహాన్ని ఇలా తేలికగా దృష్టించడాన్ని బైబిలు ప్రోత్సహించదు. ఇలా వివాహం చేసుకునేవారి ఉద్దేశాలు ఏమైనప్పటికీ వాళ్ళు దేవుడు జీవితాంతపు బంధంగా భావించే పవిత్రమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నవారు భార్యాభర్తలుగా ఐక్యమైనవారిగానే దృష్టించబడతారు, వాళ్ళు మరొకరిని పెళ్ళి చేసుకునే ఉద్దేశంతో విడాకులు తీసుకోవాలనుకుంటే బైబిలులో సూచించబడినట్లు అందుకు సరైన కారణం ఉండాలి.​—మత్తయి 19:5, 6, 9.

ఇతర యోగ్యమైన పనులు చేయడానికి కృషి, పట్టుదల అవసరమైనట్లే వివాహానికి కూడా కృషి, పట్టుదల అవసరం. దాని పవిత్రతను విలువైనదిగా ఎంచని వారు సులభంగా దానిని అంతం చేయడానికి సిద్ధపడతారు. లేదా వాళ్ళు సంతోషంలేని వివాహబంధంతో జీవించడానికి రాజీపడిపోతారు. మరోవైపున వివాహపు పవిత్రతను అంగీకరించేవారు, తాము కలిసివుండాలని దేవుడు కోరుకుంటున్నాడని గ్రహిస్తారు. (ఆదికాండము 2:​24) తమ వివాహం సాఫీగా కొనసాగేందుకు కృషి చేయడం ద్వారా వాళ్ళు వివాహ ఏర్పాటును స్థాపించిన వ్యక్తిగా దేవుణ్ణి గౌరవిస్తున్నామని కూడా వాళ్ళు గ్రహిస్తారు. (1 కొరింథీయులు 10:​31) వివాహాన్ని ఇలా దృష్టించడం ద్వారా వాళ్ళు దానిని కాపాడుకోవడానికి తమ వివాహాన్ని విజయవంతం చేసుకోవడానికి కృషి చేసేందుకు పురికొల్పబడతారు. (g04 5/8)

[అధస్సూచి]

^ యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకంలోని 13వ అధ్యాయంలో, 14-20 పేరాలు చూడండి.