కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యాధులతో చేసే పోరాటంలోని జయాలు, అపజయాలు

వ్యాధులతో చేసే పోరాటంలోని జయాలు, అపజయాలు

వ్యాధులతో చేసే పోరాటంలోని జయాలు, అపజయాలు

పంతొమ్మిది వందల నలభై రెండు, ఆగస్టు 5వ తేదీన డా. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌కు తన దగ్గర రోగిగావున్న, తన స్నేహితుడు ఇక చనిపోతాడని అర్థమైంది. 52 సంవత్సరాల ఆ వ్యక్తి స్పైనల్‌ మెనింజైటిస్‌తో (వెన్నుపూస చుట్టూవుండే పొరలు వాయడంతో) మంచాన పడ్డాడు. ఫ్లెమింగ్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా ఆయన స్నేహితుడు కోమాలోకి జారుకున్నాడు.

పదిహేను సంవత్సరాల క్రితం ఫ్లెమింగ్‌ అనుకోని పరిస్థితుల్లో, నీలం ఆకుపచ్చ రంగులు కలగలసిన శిలీంధ్రం ఉత్పత్తి చేసే అసాధారణమైన పదార్థాన్ని కనుగొన్నాడు. ఆయన దానికి పెన్సిలిన్‌ అని పేరు పెట్టాడు. దానికి బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఉందని ఆయన కనుగొన్నాడు; అయితే ఆయన స్వచ్ఛమైన పెన్సిలిన్‌ను వేరుచేయలేకపోయాడు, ఆయన దానిని కేవలం యాంటిసెప్టిక్‌గానే పరీక్షించి చూశాడు. అయితే 1938లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో హోవర్డ్‌ ఫ్లోరీ మరియు ఆయన పరిశోధనా బృందం, మానవులపై ప్రయోగించి చూడడానికి కావలసినంత పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఫ్లెమింగ్‌, ఫ్లోరీకి ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించాడు, ఫ్లోరీ తనవద్ద ఉన్న పెన్సిలిన్‌ అంతా పంపించడానికి ముందుకువచ్చాడు. ఫ్లెమింగ్‌ తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అదే ఆఖరి అవకాశం.

పెన్సిలిన్‌ను ఇంజక్షన్‌ ద్వారా కండరాల్లోకి ఎక్కించడంవల్ల లాభం లేకపోవడంతో ఫ్లెమింగ్‌ దానిని నేరుగా తన స్నేహితుని వెన్నుపూసలోకే ఎక్కించాడు. పెన్సిలిన్‌ సూక్ష్మక్రిములను నాశనం చేసింది; కేవలం వారం రోజుల్లోనే ఫ్లెమింగ్‌ స్నేహితుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రినుండి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు యాంటిబయోటిక్‌ల యుగం ఆరంభమయ్యింది, వ్యాధులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో మానవాళి ఒక కొత్త మైలురాయిని చేరుకుంది.

యాంటిబయోటిక్‌ల యుగం

యాంటిబయోటిక్‌లు మొదట ఆవిష్కరించబడినప్పుడు అవి అద్భుతమైన మందుల్లా అనిపించాయి. బ్యాక్టీరియా, ఫంగస్‌ లేదా ఇతర సూక్ష్మక్రిములు కలుగజేసే అంటువ్యాధులకు అప్పటివరకూ చికిత్స లేదు, కానీ వాటినిప్పుడు విజయవంతంగా నయం చేయవచ్చు. కొత్త మందుల కారణంగా మెనింజైటిస్‌, నిమోనియా, స్కార్లెట్‌ ఫీవర్‌ (ఎర్రటి దద్దుర్లతో వచ్చే అంటుజ్వరం) వంటి వ్యాధులతో మరణించేవారి సంఖ్య నాటకీయంగా తగ్గడం ప్రారంభించింది. ఒక వ్యక్తి ఆస్పత్రిలో ఉండగా వచ్చే ఇన్ఫెక్షన్‌లు అంతకుముందు మరణశిక్షలా ఉండేవి, కానీ ఇప్పుడు అవి కొన్ని రోజుల్లోనే నయం చేయబడుతున్నాయి.

ఫ్లెమింగ్‌ కాలం నుండి పరిశోధకులు ఎన్నో అదనపు యాంటిబయోటిక్‌లను వృద్ధి చేశారు, కొత్త యాంటిబయోటిక్‌లను ఉత్పత్తి చేయడానికి పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 60 సంవత్సరాల్లో యాంటిబయోటిక్‌లు, వ్యాధులకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో తిరుగులేని ఆయుధాలుగా తయారయ్యాయి. నేడు జార్జ్‌ వాషింగ్టన్‌ బ్రతికి ఉంటే, డాక్టర్లు ఆయనకు వచ్చిన గొంతు ఇన్ఫెక్షన్‌ను ఒక యాంటిబయోటిక్‌తో నయం చేసేవారు, బహుశా ఆయన వారం రోజుల్లోనే కోలుకొనేవారు. దాదాపు మనమందరం ఏదోక విధమైన ఇన్ఫెక్షన్‌ను వదిలించుకోవడానికి యాంటిబయోటిక్‌లు సహాయం చేశాయి. అయితే యాంటిబయోటిక్‌లవల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది.

యాంటిబయోటిక్‌లు వైరస్‌ల కారణంగా వచ్చిన వ్యాధులపై అంటే ఎయిడ్స్‌, విష జ్వరం వంటి వ్యాధులపై పనిచేయవు. అంతేకాకుండా కొంతమందికి కొన్ని యాంటిబయోటిక్‌లు వికటిస్తాయి. బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ (ఎన్నో రకాల సూక్ష్మక్రిములను నాశనం చేసే) యాంటిబయోటిక్‌లు మన శరీరాల్లోని ఉపయోగకరమైన సూక్ష్మక్రిములను కూడా నాశనం చేసే అవకాశముంది. అయితే యాంటిబయోటిక్‌లతో ఉన్న అతిపెద్ద సమస్యేమిటంటే, వాటిని అతిగా వాడడం లేదా తగినంతగా వాడకపోవడం.

కొంతమంది రోగులు సూచించబడిన యాంటిబయోటిక్‌ చికిత్సనుబట్టి మందులను పూర్తిగా వాడరు. దానికి కారణం మధ్యలోనే వాళ్ళకు నయమయినట్టు అనిపించడం లేదా చికిత్స చాలా రోజులవరకూ కొనసాగడం. తత్ఫలితంగా ఆ యాంటిబయోటిక్‌ మందులు శరీరంలోని ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయకపోవచ్చు, అందువల్ల నాశనమవ్వకుండా మిగిలిపోయిన బ్యాక్టీరియా నిరోధక శక్తిని పెంపొందించుకొని వృద్ధి చెందుతుంది. టీబీ చికిత్స విషయంలో ఇలాగే జరిగింది.

ఈ కొత్త యాంటిబయోటిక్‌లను డాక్టర్లూ రైతులూ అతిగా వాడడం ప్రారంభించారు. “అమెరికాలో అవసరం లేకపోయినా యాంటిబయోటిక్‌లను వాడమని సలహా ఇవ్వబడుతోంది, ఇతర అనేక దేశాల్లో యాంటిబయోటిక్‌లు మరింత వివేచనారహితంగా వాడబడుతున్నాయి” అని మ్యాన్‌ అండ్‌ మైక్రోబ్స్‌ అనే పుస్తకం వివరిస్తోంది. “అవి వ్యాధులను నయం చేయడానికి కాదుకానీ పెరుగుదలను అధికం చేయడానికే పశువులకు పెద్ద మొత్తాల్లో తినిపించబడ్డాయి; సూక్ష్మక్రిములు నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇదే ముఖ్య కారణం.” తత్ఫలితంగా “రాను రాను మనకు కొత్త యాంటిబయోటిక్‌లు లేకుండా పోవచ్చు” అని ఆ పుస్తకం హెచ్చరిస్తోంది.

యాంటిబయోటిక్‌ నిరోధకతకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటి 20వ శతాబ్దంలోని చివరి సగభాగం వైద్యపరంగా ఎన్నో విజయాలను చవిచూసింది. వైద్య పరిశోధకులకు ఎలాంటి వ్యాధితోనైనా పోరాడేందుకు మందులు కనుక్కోగల సామర్థ్యం ఉందనిపించింది. టీకా మందులు వ్యాధులను నివారించే ఆశాభావాన్ని కూడా అందించాయి.

వైద్య శాస్త్రం సాధించిన జయాలు

“అంటువ్యాధుల నిరోధీకరణ చరిత్రంతటిలోను ప్రజారోగ్య సంక్షేమం వైపుగా సాధించిన విజయాల్లో అత్యంత గొప్పది” అని ద వరల్డ్‌ హెల్త్‌ రిపోర్ట్‌ 1999 పత్రిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించబడిన టీకా మందుల కార్యక్రమాలవల్ల ఇప్పటికే కోట్లాదిమంది ప్రాణాలు రక్షించబడ్డాయి. భూవ్యాప్తంగా జరిగిన నిరోధీకరణ కార్యక్రమం, 20వ శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నింటిలో మరణించినవారి కంటే ఎక్కువమంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక వ్యాధి అయిన మశూచిని తుడిచిపెట్టింది, అలాంటి కార్యక్రమమే పోలియోను దాదాపు పూర్తిగా నిర్మూలించింది. (“మశూచిపై, పోలియోపై సాధించబడిన విజయాలు” అనే బాక్సు చూడండి.) సాధారణమైన ప్రాణాంతక వ్యాధులనుండి రక్షించడానికి ఇప్పుడు చాలామంది పిల్లలకు టీకాలు ఇవ్వబడుతున్నాయి.

ఇతర వ్యాధులు వేరే పద్ధతుల్లో అదుపు చేయబడ్డాయి. నీటి ద్వారా వ్యాపించే కలరా వంటి అంటువ్యాధులు కావలసినన్ని పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన నీటి సరఫరా ఉన్న ప్రాంతాల్లో పెద్దగా సమస్యలు సృష్టించడం లేదు. చాలా దేశాల్లో డాక్టర్ల వద్దకు వెళ్ళడానికి సౌలభ్యత ఉండి వైద్య సహాయాన్ని అందించడానికి ఆస్పత్రులు ఉన్నందువల్ల ఎన్నో వ్యాధులను గుర్తించి అవి ప్రాణాంతకంగా మారకముందే వాటికి చికిత్స చేయడం వీలవుతోంది. మంచి ఆహారం, మెరుగైన జీవన పరిస్థితులతోపాటు ఆహార పదార్థాలను ముట్టుకోవడానికి వాటిని భద్రపరచడానికి సంబంధించి ఖచ్చితమైన నియమాలు అమలు చేయబడడం కూడా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడ్డాయి.

శాస్త్రజ్ఞులు అంటువ్యాధుల కారకాలను కనుగొన్న తర్వాత, ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా సంస్థలు మహమ్మారులు వ్యాపించకుండా ఉండడానికి అవసరమైన చర్యలను తీసుకోగలుగుతాయి. మచ్చుకు ఒక ఉదాహరణను పరిశీలించండి. 1907వ సంవత్సరంలో శాన్‌ ఫ్రాన్సిస్కోలో బుబోనిక్‌ తెగులువల్ల కొంతమందే చనిపోయారు, ఎందుకంటే ఆ నగరం వెంటనే ఆ వ్యాధిని వ్యాపింపజేసే త్రుళ్లు పురుగులను మోసుకెళ్లే ఎలుకలను నిర్మూలించే విస్తృతమైన చర్యలు చేపట్టింది. మరోవైపున, ఇండియాలో అదే వ్యాధి 1896 మొదలుకొని 12 సంవత్సరాల్లో కోటిమంది ప్రాణాలను బలిగొంది, ఎందుకంటే ఆ వ్యాధికి మూలకారణాన్ని గుర్తించలేకపోవడమే.

వ్యాధులతో చేసే పోరాటంలోని అపజయాలు

ఎన్నో గమనార్హమైన పోరాటాల్లో విజయం సాధించబడిందని స్పష్టమవుతోంది. అయితే ప్రజారోగ్యానికి సంబంధించిన విజయాలు కొన్ని కేవలం ప్రపంచంలోని సంపన్న దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కొన్ని దేశాల్లో సరిపడా నిధులు లేనికారణంగా, చికిత్సతో నయం చేయగల వ్యాధులు ఇప్పటికీ కోట్లాదిమంది ప్రాణాలను బలిగొంటున్నాయి. వర్ధమాన దేశాల్లో ఇప్పటికీ చాలామంది ప్రజలకు కావలసినన్ని పారిశుద్ధ్య సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, సురక్షిత నీరు లభించడం లేదు. వర్ధమాన దేశాల్లో ఎంతోమంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలను విడిచి మహానగరాలకు వలసవెళ్ళడంవల్ల ఆ కనీస అవసరాలను తీర్చడం మరింత కష్టమవుతోంది. ఇలాంటి కారణాలవల్ల ప్రపంచంలోని పేదవారే “సంపన్నులకంటే ఎక్కువగా వ్యాధులతో బాధపడుతున్నారు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కొన్ని దేశాలు ఇతర దేశాలకంటే ఎక్కువగా వ్యాధులతో బాధపడడానికి ముఖ్య కారణం ముందుచూపులేని స్వార్థమే. “ప్రపంచంలోని భయంకరమైన అంటువ్యాధులు ఎక్కడో ఉన్నట్లు అనిపించవచ్చు. అలాంటి అంటువ్యాధుల్లో కొన్ని లేదా అన్నీ పేదరికంలోవున్న ఉష్ణమండల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి” అని మ్యాన్‌ అండ్‌ మైక్రోబ్స్‌ అనే పుస్తకం నివేదిస్తోంది. అలాంటి దేశాలకు సహాయం చేయడంవల్ల తమకు ఒరిగేదేమీ లేదు కాబట్టి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు, మందుల కంపెనీలు ఆ వ్యాధులకు చికిత్స చేయడానికి నిధులను కేటాయించడానికి అంతగా ఇష్టపడవు.

బాధ్యతారహితమైన మానవ ప్రవర్తన కూడా వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతోంది. దానికి అతిపెద్ద ఉదాహరణ ఎయిడ్స్‌ వైరసే, అది ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. కొన్ని సంవత్సరాల్లోనే ఈ మహమ్మారి భూగోళమంతటా వ్యాపించింది. (“ఎయిడ్స్‌​—⁠మన కాలపు ఉపద్రవం” అనే బాక్సు చూడండి.) “ఎయిడ్స్‌ వ్యాపించడానికి మానవులే కారణం” అని ఎపిడెమ్యాలజిస్టు జో మెక్కార్మిక్‌ నొక్కి చెబుతున్నారు. “ఈ వ్యాఖ్యానం ప్రజల నైతిక విలువలను దుయ్యబట్టడానికి కాదుగానీ, అది కేవలం ఒక వాస్తవమని చెప్పడానికే.”

మానవులు అనాలోచితంగా ఎయిడ్స్‌ వైరస్‌కు ఎలా సహకరించారు? ద కమింగ్‌ ప్లేగ్‌ అనే పుస్తకం ఈ కారణాలను తెలియజేస్తోంది: సామాజిక మార్పులు అంటే ఒక వ్యక్తి అనేకులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే అలవాటు సుఖవ్యాధులు వ్యాపించడానికి కారణమయ్యింది, దానివల్ల వైరస్‌ నిలదొక్కుకోవడంతోపాటు, ఆ వ్యాధి సులభంగా ఒక వ్యక్తి నుండి అనేకులకు సంక్రమించింది. వర్ధమాన దేశాల్లో వైద్యపరంగా మందులివ్వడానికి లేదా నిషిద్ధ మాదకద్రవ్యాలను వాడడానికి కలుషితమైన, వాడిన సిరంజీలను ఉపయోగించడం కూడా అలాంటి ఫలితాలనే తెచ్చింది. వందకోట్ల విలువైన భూవ్యాప్త రక్త వ్యాపారం కూడా ఎయిడ్స్‌ వైరస్‌ ఒక దాత నుండి ఎంతోమందికి వ్యాపించడానికి కారణమైంది.

ముందు ప్రస్తావించబడినట్లు యాంటిబయోటిక్‌లను అతిగా వాడడం లేదా తగినంతగా వాడకపోవడం నిరోధక శక్తిని పెంచుకున్న సూక్ష్మక్రిములు పెరగడానికే దోహదపడింది. ఈ సమస్య గంభీరమైనది, అంతకంతకూ అది ప్రమాదకరంగా తయారవుతోంది. గాయాల ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే స్టాఫీలోకోక్కస్‌ బ్యాక్టీరియా ఇంతకుముందు పెన్సిలిన్‌ ఉత్పత్తులతో సులభంగా అరికట్టబడేది. కానీ ఇప్పుడు ఈ సాధారణ యాంటిబయోటిక్‌లు సమర్థవంతంగా పనిచేయడం లేదు. కాబట్టి డాక్టర్లు కొత్తవి మరింత ఖరీదైన యాంటిబయోటిక్‌లను ఉపయోగించాలి, కానీ వర్ధమాన దేశాల్లోని ఆస్పత్రులకు ఆ మందులు కొనే స్తోమత లేదు. సరికొత్త యాంటిబయోటిక్‌లు కూడా కొన్ని సూక్ష్మక్రిములను అరికట్టలేకపోవచ్చు, తత్ఫలితంగా ఆస్పత్రుల ద్వారా సోకే ఇన్ఫెక్షన్‌లు సర్వసాధారణమైపోయి మరింత ప్రాణాంతకం కావచ్చు. యు.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌కు మాజీ సంచాలకుడైన డా. రిచర్డ్‌ క్రౌస్‌ ప్రస్తుత పరిస్థితిని “సూక్ష్మక్రిముల నిరోధకశక్తి మహమ్మారి” అని నిర్మొహమాటంగా వర్ణిస్తున్నారు.

“నేడు పరిస్థితి మెరుగ్గా ఉందా?”

ఇప్పుడు, 21వ శతాబ్ద ఆరంభంలో కూడా వ్యాధుల బెడద వదిలిపోలేదని స్పష్టమవుతోంది. భయంకరంగా వ్యాపిస్తున్న ఎయిడ్స్‌, మందులను ప్రతిరోధించే వ్యాధి కారకాలు వృద్ధి చెందడం, ఎంతోకాలంగా ప్రాణాలు బలిగొంటున్న టీబీ, మలేరియా వంటి వ్యాధులు మళ్ళీ విజృంభించడం వంటి వాస్తవాలు మనం వ్యాధులతో చేస్తున్న యుద్ధంలో ఇంకా విజయం సాధించలేదని నిరూపిస్తున్నాయి.

“ఒక శతాబ్దం ముందుకంటే నేడు పరిస్థితి మెరుగ్గా ఉందా?” అని నోబుల్‌ బహుమతిని గెల్చుకున్న జాషువా లెడర్బర్గ్‌ ప్రశ్నించారు. “చాలా విషయాల్లో మన పరిస్థితి మునుపటికంటే ఘోరంగా ఉంది” అని ఆయన అన్నారు. “మనం సూక్ష్మక్రిముల విషయంలో అజాగ్రత్తగా ప్రవర్తించాము, అవి మనల్ని పీడించడానికి మళ్ళీ తలెత్తుతున్నాయి.” వైద్య శాస్త్రమూ, ప్రపంచంలోని అన్ని దేశాలూ కలిసి ధృడ సంకల్పంతో కృషి చేస్తే ప్రస్తుత అవరోధాలను అధిగమించవచ్చా? ముఖ్యమైన అంటువ్యాధులు మశూచిలాగే చివరకు సమూలంగా నిర్మూలించబడతాయా? మా చివరి ఆర్టికల్‌ ఈ విషయాలను పరిశీలిస్తుంది. (g04 5/22)

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

మశూచిపై, పోలియోపై సాధించబడిన విజయాలు

1977 అక్టోబరు ఆఖరుకల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మశూచి సోకిన ఆఖరి వ్యక్తిని కనుగొంది. సొమాలియాలో నివసించే ఆస్పత్రి వంటవాడైన అలీ మావో మాలెన్‌కు ఆ వ్యాధి తీవ్రమైన స్థాయికి ఇంకా చేరుకోలేదు, కొన్ని వారాల్లోనే ఆయన దానినుండి కోలుకున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళినవారందరికీ టీకాలు ఇవ్వబడ్డాయి.

రెండు సంవత్సరాలవరకూ డాక్టర్లు ఆత్రుతతో వేచి చూశారు. “మశూచిగల వ్యక్తి” గురించి తెలియజేసినవారికి 50,000 రూపాయిలు బహుమతిగా లభిస్తాయని ప్రకటించబడింది. ఎవ్వరూ ఆ బహుమానాన్ని గెలుచుకోలేకపోయారు, 1980వ సంవత్సరం మే 8వ తేదీన, “ఈ ప్రపంచంలోని ప్రజలందరూ మశూచినుండి విముక్తి పొందారు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటనకు దశాబ్దం ముందు మశూచి ప్రతి సంవత్సరం 20 లక్షలమంది ప్రాణాలను బలిగొంది. చరిత్రలో మొదటిసారిగా ఒక ముఖ్యమైన అంటువ్యాధి నిర్మూలించబడింది. *

చిన్నతనంలో వచ్చి కృంగదీసే పోలియో అంటే పోలియోమిలైటిస్‌ను కూడా నిర్మూలించగల అవకాశాలు కనిపించాయి. 1955లో జోనాస్‌ సాల్క్‌ పోలియో కోసం ఒక సమర్థవంతమైన టీకా మందును కనుగొన్నాడు, పోలియో రాకుండా రక్షణ కల్పించడానికి అమెరికాలో మరియు ఇతర దేశాల్లో విస్తృత కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత నోట్లోవేసే మందు వృద్ధి చేయబడింది. 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియోను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

“1988లో మేము పోలియోను నిర్మూలించడానికి కృషి చేయడం ప్రారంభించినప్పుడు, ప్రతి రోజు పోలియోవల్ల 1000 మంది పిల్లలు వికలాంగులయ్యేవారు” అని అప్పటి డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ అయిన డా. గ్రో హార్లెమ్‌ బ్రెంట్లాన్‌ నివేదించారు. “2001వ సంవత్సరమంతటిలో 1000 కంటే తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.” ఇప్పుడు పోలియో పది కంటే తక్కువ దేశాలకు మాత్రమే పరిమితమయ్యింది, ఆ దేశాలు కూడా పోలియోను నిర్మూలించడానికి సహాయపడేందుకు అదనపు నిధులు కావాలి.

[అధస్సూచి]

^ అంతర్జాతీయ టీకా కార్యక్రమంతో నిర్మూలించబడగల వ్యాధులకు మశూచి ఒక చక్కని ఉదాహరణ ఎందుకంటే ఎలుకలు మరియు పురుగులు వంటి రోగవాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల్లా కాకుండా మశూచి వైరస్‌ బ్రతికి ఉండడానికి మానవ శరీరాన్నే ఆశ్రయంగా చేసుకుంటుంది.

[చిత్రం]

నోట్లో పోలియో మందు వేయించుకుంటున్న ఇథియోపియా బాలుడు

[చిత్రసౌజన్యం]

© WHO/P. Virot

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఎయిడ్స్‌​—⁠మన కాలపు ఉపద్రవం

ఎయిడ్స్‌ ఇప్పుడు సరికొత్త భూవ్యాప్త ప్రమాదంగా తయారయ్యింది. ఇప్పటికే అంటే అది గుర్తించబడి దాదాపు 20 సంవత్సరాలు గడిచేసరికే అది ఆరు కోట్లకంటే ఎక్కువమందికి సంక్రమించింది. ఎయిడ్స్‌ మహమ్మారి ఇంకా “తొలి స్థాయిలోనే ఉంది” అని ఆరోగ్య సంక్షేమ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ వ్యాధి సోకిన ప్రజల సంఖ్య “మునుపు ఆ సంఖ్యకు చేరుకోవడం అసాధ్యం అని భావించిన దానికంటే ఎక్కువవుతోంది,” ఆ వ్యాధి ఎక్కువగా వ్యాపించిన ప్రాంతాల్లో అది విధ్వంసాన్ని సృష్టిస్తోంది.

“ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో బాధపడుతున్న ప్రజల్లో అధికశాతం మంది ఉద్యోగాలు చేసుకుంటున్న వయోజనులే” అని ఐక్యరాజ్య సమితి నివేదిక వివరిస్తోంది. తత్ఫలితంగా 2005వ సంవత్సరానికల్లా దక్షిణ ఆఫ్రికాలోని అనేక దేశాలు 10 శాతం నుండి 20 శాతం వరకూ తమ ఉద్యోగులను కోల్పోతాయని విశ్వసించబడుతోంది. ఆ నివేదిక ఇంకా ఇలా చెబుతోంది: “సహారాకు దక్షిణానవున్న ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ప్రస్తుతం సగటు 47 సంవత్సరాలు జీవిస్తున్నారు. ఎయిడ్స్‌ లేకుండా ఉంటే వాళ్ళు 62 సంవత్సరాలు జీవించివుండేవారు.”

ఎయిడ్స్‌ను నివారించడానికి టీకా మందులను కనుక్కోవడానికి చేయబడుతోన్న ప్రయత్నాలు నిరర్థకంగానే ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎయిడ్స్‌తో బాధపడే 60 లక్షల మందిలో కేవలం 4 శాతం మందికి మాత్రమే మందులు లభిస్తాయి. ప్రస్తుతం ఎయిడ్స్‌కు చికిత్స లేదు, ఆ వైరస్‌ సోకిన ప్రజల్లో చాలామందికి ఆ వ్యాధి వస్తుందని డాక్టర్లు కలవరపడుతున్నారు.

[చిత్రం]

హెచ్‌ఐవి వైరస్‌ సోకిన టి లింఫోసైట్‌ కణాలు

[చిత్రసౌజన్యం]

Godo-Foto

[7వ పేజీలోని చిత్రం]

ప్రయోగశాలలో పనిచేసే వ్యక్తి అదుపు చేయడానికి కష్టమైన బ్యాక్టీరియాను పరీక్షిస్తున్నాడు

[చిత్రసౌజన్యం]

CDC/Anthony Sanchez