కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యాధుల్లేని ప్రపంచం

వ్యాధుల్లేని ప్రపంచం

వ్యాధుల్లేని ప్రపంచం

“ఒక దేశంలోని ప్రజల ఆరోగ్యం ఇతర దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది, వాటికి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరి ప్రాథమిక ఆరోగ్యం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి దేశాలన్నీ సహకార స్ఫూర్తితో సేవా తత్పరతతో కలిసి పని చేయాలి.”​—ఆల్మా-ఆటా ప్రకటన, సెప్టెంబరు 12, 1978.

ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, భూమ్మీది ప్రజలందరి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కొందరికి సాధించగల లక్ష్యంగానే కనిపించింది. ప్రస్తుతం ఖజకిస్తాన్‌లోవున్న ఆల్మా-ఆటాలో జరిగిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ప్రతినిధులు, 2000వ సంవత్సరానికల్లా యావత్‌ మానవాళికి ముఖ్యమైన అంటువ్యాధుల నుండి రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అదే సంవత్సరానికల్లా భూమ్మీది ప్రజలందరికి కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షిత నీరు కూడా లభ్యమవుతాయని వాళ్ళు నిరీక్షించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని (డబ్ల్యుహెచ్‌ఓ) సభ్యదేశాలన్నీ ఆ తీర్మానంపై సంతకం చేశాయి.

ఆ లక్ష్యం నిస్సందేహంగా మెచ్చుకోదగినదే, కానీ ఆ తర్వాత జరగవలసిన పనులు నిరాశనే మిగిల్చాయి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ భూమిపై అందరికీ అందుబాటులో లేకపోగా అంటువ్యాధులు ఇప్పటికీ భూమిపైనున్న కోట్లాదిమంది జీవితాలకు ప్రమాదకరంగా దాపురించాయి. ఈ ప్రాణాంతకమైన వ్యాధులు తరచూ పిల్లలనూ, పెద్దలనూ వారివారి జీవితపు తొలిదశల్లోనే బలిగొంటున్నాయి.

ఎయిడ్స్‌, టీబీ, మలేరియా ఈ మూడు కలిసి మానవులపై విరుచుకుపడినా ‘సహకార స్ఫూర్తితో కలిసి పనిచేయడానికి’ దేశాలన్నీ ముందుకు రాలేదు. ఇటీవలే ఏర్పాటుచేయబడిన ‘ఎయిడ్స్‌, టీబీ, మలేరియాలతో పోరాడేందుకు భూవ్యాప్త నిధి,’ ఈ మహమ్మారులను సమూలంగా నిర్మూలించడానికి వివిధ దేశాల ప్రభుత్వాలను 61,000 కోట్ల రూపాయిలు కోరింది. అయితే 2002వ సంవత్సరం వేసవికల్లా కేవలం 9,400 కోట్లు మాత్రమే ఆ నిధికి అందజేయబడ్డాయి, కానీ అదే సంవత్సరంలో సైనిక అవసరాల కోసం 32,90,000 కోట్ల రూపాయిలు ఖర్చుచేయబడ్డాయని అంచనా! విచారకరంగా ఈ విభాగిత లోకంలో ప్రజలందరి ప్రయోజనార్థం దేశాలన్నింటిని ఐక్యపరచగల బెదిరించే శక్తి కేవలం కొన్నింటికి మాత్రమే ఉంది.

ఆరోగ్య సంరక్షణా అధికారులకు మంచి ఉద్దేశాలే ఉన్నా అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడకుండా వాళ్ళ చేతులు కట్టివేయబడుతున్నాయి. ప్రభుత్వాలు అవసరమైన డబ్బును మంజూరు చేయకపోవచ్చు. అలాగే సూక్ష్మక్రిములు చాలా మందులను నిరోధించగల శక్తిని పెంపొందించుకున్నాయి, ప్రజలు కూడా విడువక అత్యంత ప్రమాదకరమైన జీవన విధానాల్లోనే కొనసాగుతున్నారు. అంతేకాకుండా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైన పేదరికం, యుద్ధాలు, ఆహార కొరతలు వంటి సమస్యల కారణంగా సూక్ష్మక్రిములు కోట్లాది మందిపై దాడి చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మన ఆరోగ్యం విషయంలో దేవునికున్న ఆసక్తి

అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. యెహోవా దేవుడు మానవాళి ఆరోగ్యం విషయంలో చాలా ఆసక్తితో ఉన్నాడని మనకు స్పష్టమైన రుజువులున్నాయి. మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తే దానికి అత్యంత గొప్ప ఉదాహరణ. ప్రాచీన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన అనేక నియమాలు, వాళ్ళను అంటువ్యాధుల నుండి కాపాడాలనేది ఆయన కోరిక అని చూపించాయి. *

తన పరలోక తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే యేసుక్రీస్తుకు కూడా అదే విధంగా వ్యాధిగ్రస్తులపట్ల కనికరం ఉంది. యేసు, కుష్ఠ వ్యాధితో బాధపడుతోన్న వ్యక్తితో వ్యవహరించిన విధానాన్ని మార్కు సువార్త వర్ణిస్తోంది. “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు” అని ఆ కుష్ఠ రోగి వేడుకున్నాడు. ఆ వ్యక్తికున్న నొప్పిని బాధను చూసినప్పుడు యేసు అతనిపై ఎంతో కనికరపడ్డాడు. “నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము” అని ఆయన సమాధానం చెప్పాడు.​—మార్కు 1:40, 41.

యేసు అలా అద్భుతరీతిలో స్వస్థపరచడం ఏదో కొద్దిమందికే పరిమితం కాలేదు. ‘యేసు బోధించుచు, రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను’ అని సువార్త రచయిత మత్తయి వ్రాశాడు. (మత్తయి 4:​23) ఆయన చేసిన స్వస్థతలు కేవలం యూదయలోని, గలిలయలోని వ్యాధిగ్రస్తులకు మాత్రమే సహాయం చేయలేదు. యేసు చేసిన స్వస్థతలు, యేసు ప్రకటించిన దేవుని రాజ్యము మానవాళిపై నిర్విఘ్నంగా పరిపాలించినప్పుడు అన్ని విధాల వ్యాధులు ఎలా మటుమాయమైపోతాయనే విషయానికి సంబంధించిన పూర్వఛాయను మనకు చూపిస్తున్నాయి.

భూవ్యాప్త ఆరోగ్యం అసాధ్యమైన కల కాదు

భూవ్యాప్త ఆరోగ్యం అసాధ్యమైన కల కాదని బైబిలు మనకు హామీ ఇస్తోంది. ‘దేవుని నివాసము మనుష్యులతో ఉండే’ సమయాన్ని అపొస్తలుడైన యోహాను ముందుగానే చూశాడు. దేవుడు అలా చేయడంవల్ల ‘మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోతాయి.’ అది అసాధ్యమనిపిస్తోందా? ఆ తర్వాతి వచనంలో యెహోవా స్వయంగా ఇలా ప్రకటించాడు: “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి.”​—ప్రకటన 21:3-5.

వ్యాధులు అంతమవ్వాలంటే పేదరికం, ఆహార కొరతలు, యుద్ధాలు కూడా అంతం కావాలి ఎందుకంటే తరచూ ఈ విపత్తులకు అంటువ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మక్రిములకు దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి యెహోవా ఈ బృహత్తరమైన పనిని తన రాజ్యానికి అంటే క్రీస్తు పరిపాలించే పరలోక ప్రభుత్వానికి అప్పగించాడు. లక్షలాదిమంది చేస్తున్న ప్రార్థనలకు సమాధానంగా ఆ ప్రభుత్వం రావడమే కాక, మరింత నిశ్చయంగా దేవుని చిత్తం భూమిపై జరిగేలా చూస్తుంది.​—మత్తయి 6:9, 10.

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని మనం ఆశించవచ్చు? ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ యేసు, దేవుని రాజ్యం త్వరలోనే చర్య తీసుకుంటుందనడానికి సూచనగా ఈ లోకంలోని ప్రజలు ఒక దాని తర్వాత ఒకటి జరిగే గమనార్హమైన సంఘటనలను చూస్తారని చెప్పాడు. ఆ సూచనలో భాగంగా ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో ‘తెగుళ్లు వస్తాయి’ అని ఆయన చెప్పాడు. (లూకా 21:10, 11; మత్తయి 24:3, 7) “తెగులు” అని అనువదించబడిన గ్రీకు పదం “అన్ని విధాల ప్రాణాంతకమైన అంటువ్యాధులను” సూచిస్తోంది. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి సాధించినా 20వ శతాబ్దం భయంకరమైన తెగుళ్ళను చవిచూసిందనడంలో సందేహం లేదు.​—“1914 నుండి తెగుళ్లవల్ల మరణించినవారి సంఖ్య” అనే బాక్సు చూడండి.

సువార్తల్లోని యేసు మాటలకు సమాంతరమైన ప్రకటన గ్రంథంలోని ఒక ప్రవచనం యేసుక్రీస్తు పరలోకంలో అధికారాన్ని స్వీకరించినప్పుడు ఆయనతో వెన్నంటేవచ్చే అనేక గుర్రపు రౌతుల గురించి వివరిస్తోంది. నాలుగవ గుర్రపు రౌతు “పాండుర వర్ణముగల” గుర్రంపై కూర్చొనివున్నాడు, అతను ‘ప్రాణాంతకమైన తెగులు’ను వ్యాపింపజేస్తున్నాడు. (ప్రకటన 6:2, 4, 5, 8) 1914 మొదలుకొని విపరీతమైన అంటువ్యాధులవల్ల చనిపోయినవారి సంఖ్యను చూస్తే ఆ సూచనార్థకమైన గుర్రపు రౌతు నిజంగానే స్వారీ చేస్తున్నాడని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘ప్రాణాంతకమైన తెగులు’తో బాధపడుతున్నారనే విషయం కూడా దేవుని రాజ్యం సమీపంలో ఉందనడానికి మరో రుజువునిస్తోంది. *​—మార్కు 13:29.

కొన్ని దశాబ్దాలవరకూ అంటువ్యాధులు వ్యాపించకుండా నిరోధించడంలో వైద్య శాస్త్రం విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు ఒక కొత్త కెరటం మనల్ని బెదిరిస్తోంది. ఈ సమస్యను శాశ్వతంగా సమాధి చేయడానికి మానవాతీత పరిష్కారం అవసరమని స్పష్టమవుతోంది. మన సృష్టికర్త అలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని రాజ్యంలో ‘నివసించు వాడెవడును నాకు దేహములో బాగులేదని అనడు’ అని యెషయా ప్రవక్త మనకు హామీ ఇస్తున్నాడు. అంతేకాక “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన [దేవుడు] మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెషయా 25:8; 33:​22, 24) ఆ రోజు వచ్చినప్పుడు వ్యాధులపై శాశ్వతంగా విజయం సాధించబడుతుంది. (g04 5/22)

[అధస్సూచీలు]

^ మోషే ధర్మశాస్త్రంలో చెత్తను పడేయడానికి, పారిశుద్ధ్యతకు, ఆరోగ్య సూత్రాలకు, కడగా ఉండడానికి సంబంధించిన నియమాలు ఉండేవి. “బైబిల్లో ఇవ్వబడిన జీవిత వాస్తవాలు, వ్యాధులను గుర్తించడం, చికిత్స చేయడం, ఆనారోగ్యాన్ని నివారించే ఆచారాలు వంటివి హిపాక్రటీస్‌ సిద్ధాంతాలకంటే ఎంతో ఆధునికమైనవి, ఎంతో ఆధారపడదగినవి” అని డా. హెచ్‌.ఓ. ఫిలిప్స్‌ వ్యాఖ్యానించారు.

^ దేవుని రాజ్యం సమీపంలో ఉందని నిరూపించడానికి అదనపు వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 11వ అధ్యాయము చూడండి.

[12వ పేజీలోని బాక్సు]

1914 నుండి తెగుళ్ళవల్ల మరణించినవారి సంఖ్య

ఈ గణాంకాలు ఉజ్జాయింపుగా మాత్రమే ఇవ్వబడ్డాయి. 1914 నుండి తెగుళ్లు మానవజాతిని ఎలా వెంటాడుతున్నాయో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

మశూచి (30 కోట్ల నుండి 50 కోట్ల వరకు) మశూచిని నయం చేయడానికి సమర్థవంతమైన చికిత్స ఇప్పటివరకూ కనుగొనబడలేదు. ఒక బృహత్తరమైన అంతర్జాతీయ టీకా మందు కార్యక్రమం చివరకు 1980లో ఈ వ్యాధిని నిర్మూలించడంలో విజయం సాధించింది.

టీబీ (10 కోట్ల నుండి 15 కోట్ల వరకు) టీబీ ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపుగా 20 లక్షలమందిని బలిగొంటోంది, ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి టీబీ సూక్ష్మక్రిములు ఉన్నాయి.

మలేరియా (8 కోట్ల నుండి 12 కోట్ల వరకు) 20వ శతాబ్దంలోని మొదటి సగ భాగంలో మలేరియావల్ల చనిపోయినవారి సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలకు అటుఇటుగా ఉండేది. ఇప్పుడు ఆ వ్యాధివల్ల చనిపోయేవారు ముఖ్యంగా సహారాకు దక్షిణానవున్న ఆఫ్రికా దేశాలకు చెందినవారే, అక్కడ మలేరియావల్ల ప్రతి సంవత్సరం పది లక్షలకంటే ఎక్కువమంది చనిపోతున్నారు.

స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా (విష జ్వరం) (2 కోట్ల నుండి 3 కోట్ల వరకు) ఈ వ్యాధివల్ల చనిపోయినవారి సంఖ్య అంతకంటే ఎక్కువ అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతకమైన మహమ్మారి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే 1918 మరియు 1919లో ప్రపంచాన్ని కబళించివేసింది. “బుబోనిక్‌ తెగులు కూడా ఇంతమంది ప్రజలను ఇంత వేగంగా చంపలేదు” అని మ్యాన్‌ అండ్‌ మైక్రోబ్స్‌ అనే పుస్తకం చెబుతోంది.

టైఫస్‌ (దాదాపు 2 కోట్లు) టైఫస్‌ మహమ్మారులు తరచూ యుద్ధాలతో వెన్నంటే వస్తాయి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన టైఫస్‌ వ్యాధి తూర్పు యూరప్‌ దేశాల్లో విధ్వంసం సృష్టించింది.

ఎయిడ్స్‌ (2 కోట్లకు పైగా) ఈ ఆధునిక ఉపద్రవం ప్రతి సంవత్సరం 30 లక్షలమంది ప్రాణాలు బలిగొంటోంది. అమెరికా ఎయిడ్స్‌ కార్యక్రమం సూచించిన ప్రస్తుత అంచనాల ప్రకారం “దానిని నివారించడానికి, దానికి చికిత్స చేయడానికి విస్తృతమైన ప్రయత్నాలు చేయకపోతే 2000 నుండి 2020లోపు . . . 6.8 కోట్లమంది దానివల్ల చనిపోతారు.”

[11వ పేజీలోని చిత్రాలు]

దేవుని రాజ్యంలో ఇలాంటి వ్యాధుల భయం ఇక ఉండదు

ఎయిడ్స్‌

మలేరియా

టీబీ

[చిత్రసౌజన్యం]

ఎయిడ్స్‌: CDC; మలేరియా: CDC/Dr. Melvin; టీబీ: © 2003 Dennis Kunkel Microscopy, Inc.

[13వ పేజీలోని చిత్రం]

యేసు అన్ని రకాల వ్యాధులను, రోగాలను స్వస్థపరిచాడు