కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?

యువత ఇలా అడుగుతోంది . . .

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?

“పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం నిజంగా అంత చెడ్డ పనా అని నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, ముఖ్యంగా నేను ఇంకా లైంగిక అనుభవం లేకుండా ఉన్నందుకు వింతగా అనిపించినప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది.”​జోర్డాన్‌. *

“లైంగికానందం చవిచూడాలనే ఒత్తిడి నాలో ఎక్కువగా ఉంటుంది. మనందరికీ సహజంగానే ఆ కోరిక కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా లైంగిక కోరికల గురించిన ప్రస్తావనే కనిపిస్తుంది!” అని కెల్లీ చెబుతోంది.

మీరు కూడా జోర్డాన్‌, కెల్లీల్లాగే భావిస్తున్నారా? ఎంతైనా, పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని ఒకప్పుడు తప్పుగా దృష్టించిన సాంప్రదాయాలు, విలువలు ఇప్పుడు కనుమరుగైపోయాయి కదా. (హెబ్రీయులు 13:4) ఆసియాలోని ఒక దేశంలో చేయబడిన సర్వే, 15 నుండి 24 సంవత్సరాల వయస్సున్న పురుషుల్లో అధికశాతం మంది పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం అంగీకారయోగ్యమైనది అనే కాక తాము అలా చేయాలని ఆశించబడుతోంది అని భావిస్తున్నట్లు వెల్లడి చేసింది. ప్రపంచమంతటా చాలామంది యౌవనస్థులు 19 సంవత్సరాల వయస్సుకు చేరుకోక ముందే లైంగిక సంబంధం పెట్టుకున్నారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

కొంతమంది యౌవనులు, లైంగిక సంపర్కానికి దూరంగానే ఉన్నా, లైంగిక ప్రత్యామ్నాయాలు అని పిలువబడే వాటిలో పాల్గొంటున్నారు అంటే ఒకరి లైంగిక అవయవాలతో మరొకరు ఆటలాడుకోవడం (ఇది కొన్నిసార్లు పరస్పర హస్తప్రయోగం అని పిలువబడుతోంది) వంటివి చేస్తున్నారు. ద న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురించబడిన వ్యాకులపరిచే ఒక నివేదిక, “నోటి ద్వారా లైంగిక కార్యకలాపాలు జరపడం లైంగిక సంపర్కానికి ముందు చర్యగా మారిందని, అది లైంగిక సంపర్కమంత సన్నిహితమైనది కాదనీ, దానికంటే తక్కువ ప్రమాదకరమైనదనీ . . . గర్భధారణను నివారించడానికి, తమ కన్యాత్వాన్ని కాపాడుకోవడానికి అది ఒక మార్గంగా చాలామంది యౌవనస్థులు పరిగణిస్తున్నారు” అని వెల్లడి చేసింది.

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని ఒక క్రైస్తవుడు ఎలా దృష్టించాలి? లైంగిక సంపర్కానికి ప్రత్యామ్నాయాలని పిలువబడుతున్న వాటి మాటేమిటి? అవి దేవునికి అంగీకారమైనవేనా? అవి సురక్షితమైనవేనా? అవి ఒకరి కన్యాత్వాన్ని నిజంగానే కాపాడతాయా? *

జారత్వంలో ఏమేమి ఇమిడివున్నాయి?

ఈ ప్రశ్నలకు అధికారపూర్వక సమాధానం కేవలం మన సృష్టికర్తయైన యెహోవా దేవుడే ఇవ్వగలడు. “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని ఆయన తన వాక్యంలో చెబుతున్నాడు. (1 కొరింథీయులు 6:18) అంటే దాని భావమేమిటి? “జారత్వము” అని అనువదించబడిన గ్రీకు పదం కేవలం లైంగిక సంపర్కానికే పరిమితం కాదు గానీ అశ్లీలమైన వివిధ కార్యాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇద్దరు అవివాహితులు ముఖరతిలో పాల్గొంటే లేదా ఒకరి లైంగిక అవయవాలతో మరొకరు ఆటలాడుకుంటే వాళ్ళు జారత్వం చేసినట్లే అవుతుంది.

మరి వాళ్ళు దేవుని దృష్టిలో కన్యాత్వంగల వ్యక్తులుగా పరిగణించబడే అవకాశముందా? బైబిల్లో “కన్య” అనే పదం నైతిక స్వచ్ఛతకు గుర్తుగా ఉపయోగించబడింది. (2 కొరింథీయులు 11:2-6) అయితే అది భౌతిక భావంతో కూడా ఉపయోగించబడింది. బైబిలు రిబ్కా అనే యౌవనస్థురాలి గురించి చెబుతోంది. ఆమె “కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు” అని చెబుతోంది. (ఆదికాండము 24:16) ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆదిమ హీబ్రూలో, ‘కూడడం’ అనే మాటకు ఉపయోగించబడిన పదంలో సహజమైన స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాక ఇతర కార్యాలు కూడా ఇమిడి ఉన్నాయని స్పష్టమవుతోంది. (ఆదికాండము 19:5) కాబట్టి బైబిలు ప్రకారం, ఒక యౌవనస్థుడు లేక యౌవనస్థురాలు ఏ విధమైన జారత్వంలోనైనా పాల్గొంటే, అతను లేక ఆమె కన్యగా పరిగణించబడే ప్రసక్తే లేదు.

బైబిలు క్రైస్తవులను జారత్వం నుండి మాత్రమే కాక జారత్వానికి నడిపించగల అన్ని రకాలైన అశుద్ధ ప్రవర్తనకు దూరంగా ఉండమని ఉద్బోధిస్తోంది. * (కొలొస్సయులు 3:5) ఆ ఉద్బోధ ప్రకారం జీవిస్తున్నందుకు ఇతరులు మిమ్మల్ని హేళన చేయవచ్చు. “నేను హైస్కూల్లో చదివినంత కాలమూ, ‘నువ్వేమి పోగొట్టుకుంటున్నావో నీకు తెలీదు’ అనే మాటలు విన్నాను” అని కెల్లీ అనే క్రైస్తవ యౌవనస్థురాలు చెబుతోంది. అయితే పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం “అల్పకాలము పాపభోగము అనుభవించుట” తప్ప మరేమీ కాదు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 11:24) అది శారీరకంగా, భావోద్రేకపరంగా, ఆధ్యాత్మికంగా శాశ్వతమైన హాని చేస్తుంది.

గంభీరమైన ముప్పు

ఒక యౌవనస్థుడు పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రేరేపించబడడాన్ని సొలొమోను రాజు గమనించినట్లు బైబిలు మనకు చెబుతోంది. సొలొమోను ఆ యౌవనస్థుడిని ‘వధకు పోయే పశువుతో’ పోల్చాడు. వధించబడబోయే పశువుకు జరగబోయేదాని గురించి ఏమీ తెలియదు. పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునే యౌవనస్థులు తరచూ అదే విధంగా ప్రవర్తిస్తారు​—తమ చర్యలకు గంభీరమైన పర్యవసానాలు ఉంటాయని వాళ్ళకు తెలియనట్లు ప్రవర్తిస్తారు! ఆ యౌవనస్థుని గురించి సొలొమోను ఇలా చెప్పాడు: ‘అది తనకు ప్రాణహానికరమైనదని యెరుగడు.’ (సామెతలు 7:22, 23) అవును, మీ ‘ప్రాణం’ లేదా మీ జీవితం ప్రమాదంలో ఉంది.

ఉదాహరణకు, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది యౌవనస్థులకు ఏదోక సుఖవ్యాధి సంక్రమిస్తోంది. “నాకు సర్పి ఉందని తెలుసుకున్నప్పుడు ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. అది ఎన్నటికీ నయంకాని చాలా బాధాకరమైన వ్యాధి” అని లిడియా చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా క్రొత్తగా హెచ్‌ఐవి సోకుతున్న వారిలో (రోజుకు 6,000 మంది) సగానికిపైగా 15 నుండి 24 సంవత్సరాల వయస్సులోని వారే ఉన్నారు.

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల ప్రాముఖ్యంగా ఆడవాళ్ళే అనేక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి, సుఖవ్యాధులు (అలాగే హెచ్‌ఐవి) మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువగా సంక్రమించే ప్రమాదం ఉంది. ఒక యౌవనస్థురాలు గర్భం ధరిస్తే ఆమెకు, ఆమె గర్భంలోని బిడ్డకు మరిన్ని ప్రమాదాలు ఎదురుకావచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆ యౌవనస్థురాలి శరీరం సురక్షితంగా శిశువును ప్రసవించడానికి తగిన విధంగా ఇంకా ఎదిగి ఉండకపోవచ్చు.

ఒకవేళ యౌవనస్థురాలైన ఆ తల్లి గంభీరమైన ఆరోగ్య సమస్యలను తప్పించుకున్నా, ఆమె మాతృత్వం వల్ల వచ్చే గంభీరమైన బాధ్యతలను చేపట్టక తప్పదు. తనకు, తన బిడ్డకు కావలసినవి సమకూర్చుకోవడం తాను అనుకున్నంత సులభం కాదని చాలామంది అమ్మాయిలు గ్రహిస్తారు.

అంతేకాక ఆధ్యాత్మిక, భావోద్రేక పర్యవసానాలు ఉండనే ఉన్నాయి. దావీదు రాజు చేసిన లైంగిక పాపం దేవునితో ఆయనకున్న స్నేహానికి ముప్పు తెచ్చి, ఆయన ఆధ్యాత్మికంగా దాదాపు పతనమైపోవడానికి దారితీసింది. (51వ కీర్తన) దావీదు ఆధ్యాత్మికంగా కోలుకున్నా, ఆయన తన పాపానికి పర్యవసానాలను తన మిగతా జీవితమంతా అనుభవించాడు.

నేడు యౌవనస్థులు కూడా అదేవిధంగా బాధపడే అవకాశం ఉంది. ఉదాహరణకు, షెరీ 17 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయికి శారీరకంగా దగ్గరయ్యింది. అతను తనను ప్రేమిస్తున్నాడని ఆమె అనుకుంది. అలా జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆమె ఇప్పటికీ తన చర్యలను బట్టి ఎంతో విచారిస్తోంది. ఆమె ఇలా విలపిస్తోంది: “నేను బైబిలు ప్రమాణాలను తేలికగా తీసుకున్నాను, ఫలితంగా పర్యవసానాలు అనుభవించాను. నేను యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయాను, అది ఎంతో ఘోరమైన విషయం.” అలాగే త్రిష్‌ అనే యౌవనస్థురాలు కూడా ఇలా అంగీకరిస్తోంది: “పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. మళ్ళీ కన్యగా మారడానికి నేను ఏమైనా చేస్తాను.” అవును, భావోద్రేకపరమైన గాయాలు సంవత్సరాలపాటు అలాగే ఉండి ఎంతో ఒత్తిడిని, హృదయవేదనను కలిగిస్తాయి.

నిగ్రహాన్ని అలవరచుకోవడం

యౌవనస్థురాలైన షాండా ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగింది, “పెళ్ళయ్యేవరకు లైంగిక సంబంధం పెట్టుకోకూడదని చెబుతూనే దేవుడు యౌవనస్థులకు ఎందుకు లైంగిక కోరికలను ఇచ్చాడు?” ప్రాముఖ్యంగా “ఈడు” వచ్చినప్పుడు లైంగిక కోరికలు బలంగా ఉంటాయన్నది నిజమే. (1 కొరింథీయులు 7:36) వాస్తవానికి, యౌవనస్థులకు కారణమేమీ లేకపోయినా హఠాత్తుగా లైంగికంగా ప్రేరేపించబడినట్లు అనిపించవచ్చు. అయితే అది తప్పు కాదు. పునరుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో అది సహజమైన భాగమే. *

లైంగిక సంబంధాలు ఆనందాన్నిచ్చేవిగా ఉండేలా యెహోవా రూపొందించాడన్నది కూడా నిజమే. అది, మానవులు భూమిని నింపాలన్న ఆయన ఆది సంకల్పానికి అనుగుణంగా ఉంది. (ఆదికాండము 1:28) అయితే మనం మన పునరుత్పత్తి శక్తులను దుర్వినియోగపరచాలని మాత్రం ఆయన ఎన్నడూ ఉద్దేశించలేదు. ‘మీలో ప్రతివాడును పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో యెరిగియుండవలెను’ అని బైబిలు చెబుతోంది. (1 థెస్సలొనీకయులు 4:4) ఒకవిధంగా చెప్పాలంటే లైంగిక కోరిక కలిగిన ప్రతీసారి దాన్ని తీర్చుకోవాలనుకోవడం, మీకు కోపం వచ్చిన ప్రతిసారి ఎవరినైనా కొట్టడంలా మూర్ఖంగా ఉంటుంది.

లైంగిక సంబంధాలు దేవుడిచ్చిన బహుమానం, ఆ బహుమానాన్ని తగిన సమయంలోనే అంటే పెళ్ళయ్యాకే ఆనందించాలి. పెళ్ళికి ముందు మనం లైంగిక ఆనందం పొందడానికి ప్రయత్నిస్తే దేవుడెలా భావిస్తాడు? మీరు ఒక స్నేహితుని కోసం ఒక బహుమానం కొన్నారనుకోండి. మీరు ఆ బహుమానాన్ని మీ స్నేహితునికి ఇవ్వకముందే అతను దాన్ని దొంగిలించాడనుకోండి! మీకు కోపం రాదా? ఒక వ్యక్తి దేవుడిచ్చిన బహుమానాన్ని దుర్వినియోగం చేస్తూ పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే దేవుడెలా భావిస్తాడో ఒకసారి ఊహించండి.

మీరు మీ లైంగిక కోరికల విషయంలో ఏమి చేయవచ్చు? టూకీగా చెప్పాలంటే, వాటిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి. ‘యెహోవా యథార్థముగా ప్రవర్తించువారికి యే మేలును చేయక మానడు’ అని గుర్తుచేసుకోండి. (కీర్తన 84:11) “పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం అంత తప్పేమీ కాదని నాకు అనిపించినప్పుడు, నేను ఆధ్యాత్మికపరంగా రాగల చెడు పర్యవసానాల గురించి ఆలోచిస్తాను, యెహోవాతో నా సంబంధాన్ని కోల్పోయేలా చేసే ఏ పాపమైనా అంత ఆహ్లాదకరమైనదేమీ కాదని నేను గ్రహిస్తాను” అని గార్డన్‌ అనే యౌవనస్థుడు చెప్పాడు. అదుపులో ఉంచుకోవడం అంత సులభం కాకపోవచ్చు. కానీ యౌవనస్థుడైన ఏడ్రియన్‌ మనకు గుర్తు చేస్తున్నట్లుగా, “అది మీకు నిష్కల్మషమైన మనస్సాక్షిని, యెహోవాతో మంచి సంబంధాన్ని ఇస్తుంది, గత చర్యలనుబట్టి విచారించకుండా మరింత ప్రాముఖ్యమైన విషయాలపై మనస్సు కేంద్రీకరించడానికి మీకు స్వేచ్ఛ ఉండేలా చేస్తుంది.”​—కీర్తన 16:11.

అన్ని విధాలైన ‘జారత్వమునకు దూరముగా ఉండడానికి’ మీకు అనేక మంచి కారణాలున్నాయి. (1 థెస్సలొనీకయులు 4:3) అయితే అలా చేయడం ప్రతీసారి అంత సులభం కాదని ఒప్పుకోవలసిందే. ‘మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోవడానికి’ ఆచరణాత్మకమైన మార్గాల గురించి తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.​—1 తిమోతి 5:22. (g04 7/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ ఇక్కడ కన్యాత్వం అనే పదం స్త్రీలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది.

^ వ్యభిచారం, అశుద్ధ ప్రవర్తన, అశ్లీల ప్రవర్తన వంటివాటి గురించిన చర్చ కోసం తేజరిల్లు! ఫిబ్రవరి 8, 1994 సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .‘చాలా దూరం’ అంటే ఎంతదూరం?” అనే ఆర్టికల్‌ చూడండి.

^ తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1990 సంచికలోని, “యువత ఇలా అడుగుతోంది . . . నా శరీరానికి ఎందుకిలా అవుతోంది?” అనే ఆర్టికల్‌ చూడండి.

[17వ పేజీలోని బ్లర్బ్‌]

ఒక యౌవనస్థుడు లేక యౌవనస్థురాలు ఏదోక విధమైన జారత్వంలో పాల్గొంటే, అతను లేక ఆమె దేవుని దృష్టిలో కన్యలుగా పరిగణించబడగలరా?

[17వ పేజీలోని చిత్రం]

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం దైవభయంగల యౌవనస్థుల మనస్సాక్షిని గాయపరుస్తుంది

[18వ పేజీలోని చిత్రం]

పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునేవారికి సుఖవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది