కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేరుప్రతిష్ఠల కంటే శ్రేష్ఠమైనది

పేరుప్రతిష్ఠల కంటే శ్రేష్ఠమైనది

పేరుప్రతిష్ఠల కంటే శ్రేష్ఠమైనది

ఛాల్స్‌ సినుట్కో చెప్పినది

నాకు 1957లో అమెరికాలోవున్న నెవెడాలోని లాస్‌ వెగాస్‌లో 13 వారాలపాటు పాడే కాంట్రాక్ట్‌ లభించింది. దానికి నాకు వారానికి వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించబడుతుందని, ప్రదర్శనలు విజయవంతమైతే మరో 50 వారాలపాటు పాడే అవకాశం ఇవ్వబడుతుందని చెప్పారు. అంటే మరో 50,000 డాలర్లు లభిస్తాయి, ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తమే. అలాంటి లాభసాటి ప్రతిపాదన నాకు ఎలా లభించిందో, దాన్ని అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం ఎందుకు కష్టమనిపించిందో నన్ను వివరించనివ్వండి.

యుక్రెయిన్‌ వాసియైన నాన్నగారు 1910లో తూర్పు యూరప్‌లో జన్మించారు. ఆయన తల్లి 1913లో తన భర్తతో మళ్ళీ కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు ఆయనను అమెరికాకు తీసుకువెళ్ళింది. నాన్నగారు 1935లో పెళ్ళి చేసుకున్నారు, ఆ తర్వాతి సంవత్సరం పెన్సిల్వేనియాలోని ఆమ్‌బ్రిడ్జ్‌లో నేను జన్మించాను. అప్పటికి నాన్నగారి ఇద్దరు అన్నలు యెహోవాసాక్షులయ్యారు.

నేను, నా ముగ్గురు తమ్ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా కుటుంబం పెన్సిల్వేనియాలోని న్యూ కాసల్‌లో నివసించేది, అప్పుడు మా అమ్మ కొంతకాలంపాటు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసింది. కానీ మా అమ్మానాన్నలు యెహోవాసాక్షులు కాలేదు, అయితే మా నాన్న తమకు ఇష్టమైనది నమ్మే హక్కు తన అన్నలకు ఉందని విశ్వసించారు. నాన్నగారు మాలో దేశభక్తిని నాటినా, ఆయన ఎవరైనా తమకు నచ్చిన విధంగా ఆరాధించడాన్ని ఎప్పుడూ సమర్థించేవారు.

పాటలు పాడడం

నా తల్లిదండ్రులు నాకు చక్కగా పాటలు పాడే వరముందని నమ్మారు, అందుకే నా స్వర మాధుర్యానికి వన్నె తెచ్చేందుకు వాళ్ళు చేయగలిగినదంతా చేశారు. నాకు ఆరు ఏడు సంవత్సరాలున్నప్పుడు, పాట పాడుతూ గిటార్‌ వాయించడానికి నాన్నగారు నన్ను నైట్‌ క్లబ్బులోని బార్‌లో (మత్తుపానీయాలు అందజేయబడే) ఒక బల్ల మీద నిలబెట్టేవారు. నేను “మదర్‌” అనే పాట పాడేవాడిని. “మదర్‌” అనే పదంలోని ఆంగ్ల అక్షరాలతో ప్రారంభమయ్యే పదాలు ఆ పాటలో ఉండేవి. ప్రతి పదం నొక్కిచెప్పబడేది, అది ప్రేమగల తల్లికి ఉండే ఒక్కో లక్షణాన్ని వర్ణించేది. ఆ పాట ఇలా ముగిసేది: “ఆ అక్షరాలన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే M-O-T-H-E-R అనే పదం రూపొందుతుంది, అదే ప్రపంచంలో నాకు అన్నిటికంటే ఇష్టమైన పదం.” బార్‌కు వచ్చే పురుషులు తరచూ అతిగా తాగేవారు, వాళ్ళు నా పాట విని పరవశంతో కన్నీళ్లు విడుస్తూ, నాన్నగారి టోపీలో డబ్బులు వేసేవారు.

నేను 1945లో న్యూ కాసల్‌లోని డబ్ల్యు.కె.ఎస్‌.టి. రేడియో స్టేషన్‌లో మొదటిసారిగా కార్యక్రమం ఇచ్చాను, అప్పుడు నేను జానపద సంగీతం పాడాను. ఆ తర్వాత నేను హిట్‌ పరేడ్‌ నుండి ప్రజాదరణ పొందిన పాటలు పాడేవాడిని, అది ప్రతీ వారం వచ్చే రేడియో నెట్‌వర్క్‌ కార్యక్రమం, పది అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ప్రసారం చేయబడేవి. నేను 1950లో పాల్‌ వైట్‌మాన్‌ ప్రదర్శనలో మొదటిసారిగా టీవీలో కనిపించాను. పాల్‌ వైట్‌మాన్‌ కోరిన మేరకు జార్జ్‌ గెర్‌ష్విన్‌ కూర్చిన “రాప్‌సోడీ ఇన్‌ బ్లూ” నేటికీ ప్రసిద్ధమైనదే. ఆ తర్వాత నాన్నగారు పెన్సిల్వేనియాలోని మా ఇంటిని అమ్మేశారు, నేను వృత్తిపరంగా ఇంకా ఎదగాలనే ఆశతో మేము కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌కు వచ్చాము.

నాన్నగారి పట్టుదల మూలంగా త్వరలోనే నాకు పసడెనాలో వారం వారం ఉండే రేడియో కార్యక్రమంలో, అలాగే హాలీవుడ్‌లో వారం వారం అరగంటపాటు ఉండే టీవీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. టెడ్‌ డేల్‌కు చెందిన వందమంది సభ్యుల ఆర్కెస్ట్రాతో కలిసి నేను కాపిటోల్‌ రికార్డ్స్‌ సంస్థ తరఫున నా పాటలు రికార్డు చేశాను, సి.బి.ఎస్‌. రేడియో నెట్‌వర్క్‌లో గాయకుడిని కూడా అయ్యాను. నేను 1955లో ఉత్తర కాలిఫోర్నియాలోవున్న టహోయీ సరస్సువద్ద ఒక సంగీత రూపకాన్ని చేశాను. అక్కడ ఉన్నప్పుడు జీవితంలో నా ప్రాధాన్యతలు నాటకీయంగా మారిపోయాయి.

క్రొత్త ప్రాధాన్యతలను పెంపొందించుకోవడం

ఆ సమయంలో నాన్నగారి అన్న అయిన అంకుల్‌ జాన్‌ కూడా పెన్సిల్వేనియా నుండి కాలిఫోర్నియాకు మారాడు. ఆయన నాకు “దేవుడు సత్యవంతుడై ఉండును గాక” * (ఆంగ్లం) అనే పుస్తకం ఇచ్చాడు. * దాన్ని నేను నాతోపాటు టహోయీ సరస్సుకు తీసుకువెళ్ళాను. మా చివరి ప్రదర్శన, దాదాపు మధ్యరాత్రి సమయంలో ముగిసిన తర్వాత, నిద్రకు ఉపక్రమించే ముందు ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నేను ఎంతోకాలంగా ఆలోచిస్తున్న ప్రశ్నలకు బైబిలు సమాధానాలు కనుగొని నేను ఎంతో పులకించిపోయాను.

అనతికాలంలోనే నేను పని పూర్తవగానే నైట్‌ క్లబ్‌లో కూర్చుని తోటి కళాకారులతో చాలా పొద్దుపోయే వరకూ మాట్లాడే వాణ్ణి. మరణం తర్వాత జీవితం, దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు, మానవుడు చివరకు తనను తాను నాశనం చేసుకుని భూమిని కూడా నాశనం చేస్తాడా వంటి విషయాల గురించి మేము చర్చించేవాళ్ళం. కొన్ని నెలల తర్వాత, 1955 జూలై 9న లాస్‌ ఏంజిల్స్‌లోని రిగ్లీ ఫీల్డ్‌లో జరిగిన యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో, యెహోవా దేవుణ్ణి సేవించాలని నేను చేసుకున్న సమర్పణకు గుర్తుగా బాప్తిస్మం తీసుకున్నాను.

ఆరు నెలలు కాకముందే, 1955లో క్రిస్మస్‌ ఉదయాన, తోటి సాక్షి అయిన హెన్రీ రస్సెల్‌ వినోద రంగంలోవున్న జాక్‌ మకాయ్‌ని కలవడానికి తనతో రమ్మని నన్ను అడిగాడు. హెన్రీ కూడా ఎన్‌.బి.సి.కి సంగీత దర్శకుడు. మేము అక్కడికి వెళ్ళేసరికి జాక్‌, ఆయన భార్య వాళ్ళ ముగ్గురు పిల్లలు, క్రిస్మస్‌ బహుమతులు తెరచి చూసుకుంటున్నారు, అయితే వాళ్ళు ఆ పని ఆపేసి, కూర్చొని మేము చెప్పింది విన్నారు. త్వరలోనే ఆయన, ఆయన కుటుంబం సాక్షులయ్యారు.

ఆ సమయానికల్లా నేను అమ్మతో అధ్యయనం చేయడం ప్రారంభించాను, ఆమె బైబిలు సత్యాన్ని గ్రహించి, దానిని అంగీకరించింది. ఆమె చివరికి ఒక యెహోవాసాక్షి అయి పయినీరు అంటే పూర్తికాల సువార్తికురాలయ్యింది. కొంతకాలానికి, నా ముగ్గురు తమ్ముళ్ళు కూడా బాప్తిస్మం తీసుకుని కొంతకాలంపాటు పయినీరు సేవ చేశారు. నేను 1956 సెప్టెంబరులో, 20 ఏళ్ళ వయస్సులో పయినీరయ్యాను.

ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు

ఈ సమయానికల్లా నాకు ఏజెంటుగా పనిచేసిన వ్యక్తికి స్నేహితుడైన జార్జ్‌ మర్ఫీ నేను వృద్ధి చెందడానికి సహాయం చేసే విషయంలో ఆసక్తి చూపించాడు. జార్జ్‌ 1930లలో 1940లలో అనేక చిత్రాల్లో నటించాడు. మర్ఫీకి ఉన్న సంబంధాల ఫలితంగా 1956 డిసెంబరులో నేను న్యూయార్క్‌ నగరంలో సి.బి.ఎస్‌.-టీవీలో జాకీ గ్లీసన్‌ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది నా వృత్తికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది, ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని 2,00,00,000 మంది ప్రేక్షకులు చూస్తారని అంచనా వేయబడింది. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు నేను బ్రూక్లిన్‌లో ఉన్న, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని మొదటిసారిగా దర్శించాను.

నేను గ్లీసన్‌ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, ఎమ్‌.జి.ఎమ్‌. స్టూడియోలతో ఏడు సంవత్సరాలు పని చేస్తానని ఒక కాంట్రాక్టుపై సంతకం చేశాను. టీవీ వెస్టర్న్‌లో నాకు క్రమంగా పాత్రలు ఇవ్వబడేవి. అయితే కొంతకాలం తర్వాత, నా మనస్సాక్షి నన్ను గద్దించడం మొదలుపెట్టింది, ఎందుకంటే నేను జూదగాడిగా, తుపాకీని నైపుణ్యంగా ఉపయోగించేవాడిగా నటించవలసి వచ్చేది, ఆ పాత్రలు లైంగిక దుర్నీతిని, ఇతర క్రైస్తవేతర ప్రవర్తనను గొప్పగా చేసి చూపించేవి. కాబట్టి నేను నటించడం మానేశాను. వినోద రంగంలోవున్నవారు నాకు పిచ్చెక్కింది అనుకున్నారు.

ఆ సమయంలోనే, ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో పేర్కొన్నట్లుగా, లాస్‌ వెగాస్‌లో ప్రదర్శనలు చేయడానికి నాకు లాభసాటి ప్రతిపాదన లభించింది. నేను మా ప్రయాణ పైవిచారణకర్త సందర్శన జరిగే వారంలోనే నా ఉద్యోగాన్ని ప్రారంభించవలసి ఉంది. నేను ఆ ఉద్యోగాన్ని అప్పుడు చేపట్టకపోతే ఇక నాకు మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు. నాకు ఏమి చేయాలో తోచక ఎంతో మదనపడ్డాను ఎందుకంటే నేను చాలా డబ్బు సంపాదిస్తానని నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! నేను వృత్తిపరంగా ఉన్నత స్థితిలోకి రావడానికి ఆయన చేసిన దానంతటికీ ఆయన ప్రతిఫలం పొందడానికి అర్హుడని నేను భావించాను.

కాబట్టి నేను మా సంఘ పైవిచారణకర్త అయిన కార్ల్‌ పార్క్‌ దగ్గరకు వెళ్లాను, ఆయన సంగీతకారుడే కాక, 1920వ దశాబ్దంలో న్యూయార్క్‌ డబ్ల్యు.బి.బి.ఆర్‌. రేడియో స్టేషన్‌లో వయోలినిస్ట్‌గా కూడా చేశాడు. నేను ఒకవేళ ఆ కాంట్రాక్టును అంగీకరిస్తే, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితమంతా పయినీరు సేవ చేయగలనని ఆయనకు వివరించాను. “నువ్వేమి చేయాలో నేను నీకు చెప్పలేను గానీ, ఏదోక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సహాయం చేయగలను” అన్నాడు. “అపొస్తలుడైన పౌలు ఈ వారం మన సంఘాన్ని సందర్శిస్తే నువ్వు నీ ఉద్యోగాన్ని ప్రారంభించడానికి వెళ్ళేవాడివా?” అని అడుగుతూ, “నువ్వు ఏమి చేయాలని యేసు కోరుకునేవాడు అనుకుంటున్నావు?” అని మరో ప్రశ్న వేశాడు.

విషయం స్పష్టమైందని నేను భావించాను. నేను లాస్‌ వెగాస్‌లో ఉద్యోగానికి వెళ్లడం లేదని మా నాన్నకు చెప్పినప్పుడు, నేను నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానని ఆయన అన్నాడు. ఆ రాత్రి ఆయన .38 కాలిబర్‌ పిస్తోలు పట్టుకొని నా కోసం వేచివున్నాడు. ఆయన నన్ను చంపాలనుకున్నాడు కానీ, అతిగా త్రాగడం వల్లనేమో గాఢంగా నిద్రపోయాడు. ఆ తర్వాత ఆయన గ్యారేజిలో మోటారుకారు పొగవదిలి ఊపిరి ఆడకుండా చేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. నేను రక్షణ సిబ్బందిని పిలిచినప్పుడు, వాళ్లాయనను కాపాడగలిగారు.

కోపంతో చిందులుతొక్కే నాన్నగారి స్వభావం తెలిసిన చాలామంది సంఘ సభ్యులు ఆయనంటే భయపడేవారు, అయితే మా ప్రాంతీయ పైవిచారణకర్త రాయ్‌ డావెల్‌ అలా భయపడలేదు. రాయ్‌ నాన్నగారిని సందర్శించినప్పుడు, నాన్నగారు ఆయనతో మాట్లాడుతూ నేను పుట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అందరూ నేను బ్రతకనని అనుకున్నారని చెప్పారు. ఒకవేళ నేను బ్రతికితే దేవుని సేవకు నన్ను అంకితం చేస్తానని నాన్నగారు వాగ్దానం చేసినట్లుగా కూడా చెప్పారు. దానితో రాయ్‌, మీరు ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని దేవుడు ఎదురుచూస్తున్నాడేమోనని ఎప్పుడైనా ఆలోచించారా అని నాన్నగారిని అడిగారు. అది నాన్నగారిని ఆలోచింపజేసింది. ఆ తర్వాత రాయ్‌ ఇలా అడిగారు: “దేవుని కుమారునికే పూర్తికాల సేవ చేయడం తగినప్పుడు, అది మీ కుమారునికి ఎందుకు తగినదిగా ఉండదు?” దానితో నాన్నగారు నా నిర్ణయానికి ఒప్పుకున్నట్లు కనిపించింది.

ఇదిలా ఉండగా, 1957 జనవరిలో కెనడా నుండి షెర్లీ లార్జ్‌ తన పయినీరు సహచరితో కలిసి కొంతమంది స్నేహితులను సందర్శించడానికి వచ్చింది. ఆమెతో, ఆమె సహచరితో నేను ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు షెర్లీ నాకు పరిచయమైంది. ఆ తర్వాత కొద్దికాలానికే, షెర్లీ నాతోపాటు హాలీవుడ్‌ బోల్‌కు వచ్చింది, అక్కడ నేను పెర్ల్‌ బెయిలీతో కలిసి పాట పాడాను.

నిర్ణయానికి కట్టుబడి ఉండడం

నాకు 1957 సెప్టెంబరులో లోవా రాష్ట్రంలో ప్రత్యేక పయినీరు సేవచేసే నియామకం లభించింది. ఆ నియామకం చేపట్టాలని నేను నిర్ణయించుకున్నట్లు నాన్నగారికి చెప్పినప్పుడు, ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. నిజంగా ఏది విలువైనది అనే విషయంలో నా కొత్త దృక్కోణాలను ఆయన అర్థం చేసుకోలేకపోయారు. నేను హాలీవుడ్‌ వెళ్లి నా కాంట్రాక్టులన్నీ రద్దు చేసుకున్నాను. ఆ కాంట్రాక్టుల్లో నేను ప్రఖ్యాత వాద్యబృందం, గాయకబృంద సారథి ఫ్రెడ్‌ వారింగ్‌తో చేసుకున్న ఒప్పందం కూడా ఒకటి. నేను ఆ ఒప్పందానికి కట్టుబడకపోతే మళ్లీ గాయకునిగా పనిచేయడం కుదరదని ఆయన నాతో అన్నాడు. అందువల్ల, యెహోవా దేవుని సేవలో నా పరిచర్యను అధికం చేసుకోవడానికి నేను నా గాయక వృత్తిని వదిలిపెడుతున్నట్లు ఆయనకు వివరించాను.

నేను సవివరంగా మాట్లాడుతున్నప్పుడు వారింగ్‌ చక్కగా విని ఆ తర్వాత మృదువుగా, “చూడు నాయనా, ఇంత చక్కని వృత్తిని నువ్వు విడిచిపెడుతున్నందుకు నాకు బాధగానే ఉంది, అయితే సంగీతమే జీవితంగా గడిపిన నేను, జీవితంలో ఉన్నది సంగీతం మాత్రమే కాదని నేర్చుకున్నాను. నువ్వుచేసే సేవను దేవుడు ఆశీర్వదించు గాక” అని చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. యెహోవా సేవలోనే జీవితం గడిపే స్వేచ్ఛ నాకు లభించిందని తెలుసుకున్న నేను ఆనంద బాష్పాలతో ఇంటికి తిరిగి వెళ్లడం నాకింకా గుర్తుంది.

“నీ విశ్వాసమేమైంది?”

నేను లోవా రాష్ట్రంలో దాదాపు 1,200 మంది జనాభాగల స్ట్రాబెరీ పాయింట్‌ పట్టణంలో, నా పయినీరు సహచరుడైన జో ట్రిఫ్‌తోపాటు సేవ చేయడం ప్రారంభించాను. షెర్లీ కొందరు స్నేహితులను చూడ్డానికి వచ్చినప్పుడు మేము మా వివాహం గురించి మాట్లాడుకున్నాం. నా దగ్గర గానీ తన దగ్గర గానీ పొదుపు చేసుకున్న డబ్బేమీ లేదు. నేను సంపాదించిన డబ్బుపై మా నాన్నగారి అజమాయిషీ ఉండేది. కాబట్టి నేను, “నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ మనమెలా జీవితం గడుపుతాం? నా దగ్గర నాకు ప్రతి నెలా వచ్చే ప్రత్యేక పయినీరు అలవెన్సు 40 డాలర్లు మాత్రమే ఉన్నాయి” అని ఆమెకు వివరించాను. ఆమె తన సహజమైన ప్రశాంతతో, సూటిగా మాట్లాడుతూ, “ఛాల్స్‌, నీ విశ్వాసమేమైంది? మనం రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదికితే, మనకు అవసరమైనవాటిని తాను అనుగ్రహిస్తాను అని యేసు చెప్పాడు కదా” అని అంది. (మత్తయి 6:​33) దానితో సమస్య తీరిపోయింది. 1957 నవంబరు 16న మేము పెళ్ళి చేసుకున్నాం.

స్ట్రాబెరీ పాయింట్‌ శివార్లలో ఒక రైతుతో నేను బైబిలు అధ్యయనం నిర్వహించేవాడిని, అడవిలోవున్న ఆయన స్థలంలో కలపతో నిర్మించిన 3.6 X 3.6 మీటర్ల సైజు ఇల్లు ఉండేది. ఆ ఇంటికి విద్యుత్తు లేదు, నీటి సరఫరా లేదు, స్నానాల గది లేదు. ఒకవేళ మేము ఇష్టపడితే ఏమీ చెల్లించకుండానే అక్కడ ఉండవచ్చు. అది పాతకాలపు ఇల్లయినా పగలంతా మేము పరిచర్యలోనే ఉంటాం, రాత్రి పడుకోవడానికి మాత్రమే మాకు స్థలం కావాలి కాబట్టి మేము ఆ ఇంట్లోకి మారాము.

నేను ఆ ప్రక్కనేవున్న నీటి బుగ్గనుండి నీళ్లు తెచ్చేవాడిని. మేము ఆ ఇంట్లో వెచ్చదనం కోసం కర్రలపొయ్యి ఉపయోగించేవాళ్ళం, కిరోసిన్‌ దీపం వెలుతుర్లో చదువుకునే వాళ్లం; షెర్లీ కిరోసిన్‌ స్టౌ మీద వంట చేసేది. స్నానానికి మేము, బట్టలు ఉతికే పాత టబ్బును ఉపయోగించేవాళ్లం. రాత్రులు మాకు నక్కల అరుపులు వినబడేవి, అయితే మేము ఒకరి కోసం ఒకరు తోడుగా ఉంటూ క్రైస్తవ పరిచారకుల అవసరం అధికంగా ఉన్న ప్రాంతాల్లో యెహోవాను సేవించడం మాకు లభించిన ధన్యతగా భావించాం. ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్న బిల్‌ మాలెన్‌ఫాంట్‌, ఆయన భార్య సాండ్రా మాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో లోవా రాష్ట్రంలోని, డికోరెలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసేవారు. అప్పుడప్పుడు, వారు వచ్చి మాతోకూడా క్షేత్ర సేవ చేసేవారు. చివరకు, స్ట్రాబెరీ పాయింట్‌లో 25 మందిగల ఒక చిన్న సంఘం తయారయింది.

ప్రయాణ సేవకు వెళ్లడం

మేము 1960 మేలో ప్రాంతీయ సేవ చేయడానికి అంటే ప్రయాణ పరిచర్య పనికి ఆహ్వానించబడ్డాం. మా మొదటి సేవా ప్రాంతం ఉత్తర కరోలినా, దానిలో రాలీ, గ్రాన్జ్‌బరో, డుర్హామ్‌లాంటి నగరాలతోపాటు అనేక చిన్నచిన్న గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. మేము బస చేసిన చాలా కుటుంబాల ఇళ్లలో విద్యుత్తు, ఇంటిలోపలే మరుగుదొడ్లు ఉండడంవల్ల మా జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే ఇంటి బయట మరుగుదొడ్లు ఉన్న కుటుంబాల వారు ఇచ్చిన హెచ్చరికలు మమ్మల్ని కాస్త భయపెట్టాయి. మేమలా మరుగుదొడ్డికి వెళ్ళే దారిలో విషసర్పాలు ఉంటాయని వారు హెచ్చరించారు.

మేము 1963 ఆరంభంలో ఫ్లోరిడా అనే ప్రాంతానికి బదిలీ చేయబడ్డాం, అక్కడ నాకు గుండె పైపొర వాయడంతో దాదాపు చనిపోయే స్థితికి చేరుకున్నాను. టాంపా వాసులైన బాబ్‌, జిని మేక్‌ నన్ను ఆదుకోకపోతే నేను చనిపోయేవాణ్ణి. * నన్ను వాళ్ల డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి, ఖర్చులన్నీ కూడా వాళ్లే భరించారు.

నా తొలి శిక్షణను ఉపయోగించుకోవడం

నేను 1963 వేసవిలో, న్యూయార్క్‌లో జరగబోయే యెహోవాసాక్షుల పెద్ద సమావేశంలో పని చేయడానికి ఆహ్వానించబడ్డాను. లారీ కింగ్‌ నిర్వహించిన ఒక రేడియో చర్చకు యెహోవాసాక్షుల ప్రతినిధిగా మిల్టన్‌ హెన్షెల్‌తో నేను కూడా వెళ్లాను. కింగ్‌ ఇప్పటికీ ప్రముఖ టీవీ కార్యక్రమ నిర్వాహకునిగా ఉన్నాడు. ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆ చర్చ ముగిసిన తర్వాత దాదాపు ఒక గంటపాటు మేము చేసే సేవ గురించి చాలా ప్రశ్నలు అడిగారు.

అదే వేసవిలో కమ్యూనిస్టు చైనాలో ఖైదు నుండి విడుదల చేయబడిన మిషనరీ హెరాల్డ్‌ కింగ్‌ సాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి అతిథిగా వచ్చారు. ఒకరోజు సాయంకాలం ఆయన దాదాపు 700 మంది ప్రేక్షకులకు తన అనుభవాలను చెప్పి, నాలుగుకంటే ఎక్కువ సంవత్సరాల ఏకాంత కారాగార శిక్ష తన విశ్వాసాన్ని ఎలా బలపరిచిందో వివరించారు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు బైబిలుకు, క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన మూలాంశాలతో పాటలు రాశారు.

ఆ మరపురాని సాయంకాలం నేను ఆడ్రీ నార్‌, కార్ల్‌ క్లెయిన్‌, పాడడంలో స్వర శిక్షణ పొందిన దీర్ఘకాల సాక్షియైన ఫ్రెడ్‌ ఫ్రాంజ్‌తో కలిసి “ఇంటింట” అనే పాట పాడాం, ఆ తర్వాత ఆ పాట యెహోవాసాక్షుల పాటల పుస్తకంలో చేర్చబడింది. ఆ కాలంలో సాక్షుల సేవకు సారథ్యం వహిస్తున్న నాథన్‌ నార్‌, మరుసటి వారం యాంకీ స్టేడియంలో జరిగే “నిత్య సువార్త” అనే సమావేశంలో నన్ను ఆ పాట పాడమని అడిగారు, నేను పాడాను.

ప్రయాణ సేవలోని అనుభవాలు

మేము ఇల్లినోయిస్‌ రాష్ట్రంలోని, చికాగోలో సేవచేస్తుండగా రెండు మరపురాని సంఘటనలు జరిగాయి. మొదటిది, ఒక ప్రాంతీయ సమావేశంలో షెర్లీ, 1940వ దశాబ్దపు మధ్య సంవత్సరాల్లో కెనడాలో తనకు తన తల్లికి సాక్ష్యమిచ్చిన వెరా స్టివార్ట్‌ను చూసింది. అప్పుడు షెర్లీకి 11 సంవత్సరాలు, బైబిల్లోని దేవుని వాగ్దానాలు విని ఆమె పులకించిపోయింది. “ఆ నూతనలోకంలో నేను కూడా జీవిస్తానని మీరనుకుంటున్నారా?” అని షెర్లీ వెరాను అడిగింది. అప్పుడు వెరా, “షెర్లీ, నువ్వు తప్పకుండా జీవిస్తావనే అనుకుంటున్నాను” అని జవాబిచ్చింది. ఆ మాటలను వారిద్దరూ అలాగే గుర్తుంచుకున్నారు. వెరాను మొదటిసారిగా కలిసినప్పటి నుండి, షెర్లీ యెహోవాను సేవించాలని నిర్ణయించుకుంది.

రెండవది, 1958వ సంవత్సరం శీతాకాలంలో మీ వసారాలో 25 కిలోల ఆలుగడ్డల బస్తా ఉండడం మీకు గుర్తుందా అని ఒక సాక్షి నన్ను అడిగాడు. అవును, గుర్తుంది. ఒకరోజు సాయంకాలం మంచు తుఫానులో అతి కష్టమ్మీద ఇంటికి చేరుకున్న మేము దాన్ని చూశాం. అది ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియక పోయినప్పటికీ, అది యెహోవా దయచేసినదే అని మేము అనుకున్నాము. విపరీతమైన మంచువల్ల మేము ఐదు రోజులపాటు ఇల్లు కదల్లేక పోయాం, అయినప్పటికీ ఆలుగడ్డల పాన్‌కేకులు, ఉడక బెట్టిన ఆలుగడ్డలు, ఆలుగడ్డల వేపుడు, మెత్తగా రుబ్బిన ఆలుగడ్డలు, ఆలుగడ్డల సూప్‌లను ఆస్వాదించాం! మాకు వేరే ఆహారమేదీ లభించలేదు. ఆ సాక్షికి మేమెవరమో తెలియదు లేదా మేమెక్కడ నివసిస్తామో తెలియదు, ఆయనకు దగ్గర్లోని పయినీర్లు కష్టాల్లో ఉన్నారని మాత్రమే తెలుసు. ఆ యువ జంట ఎక్కడ ఉన్నారని ఆయన వాకబు చేసేలా తాను పురికొల్పబడ్డానని ఆయన చెప్పాడు. రైతులకు తమ ఇరుగు పొరుగువారి గురించి అంతా తెలుసు, అందువల్ల ఆయన వారి ద్వారా మేమున్న ఇల్లు తెలుసుకొని, మంచు పడుతున్నప్పుడే ఆ ఆలుగడ్డల బస్తా మోసుకొచ్చాడు.

నా నిర్ణయాల విషయంలో నేను కృతజ్ఞుడను

ప్రయాణ సేవలో 33 సంవత్సరాలు గడిపిన తర్వాత 1993కల్లా నా ఆరోగ్యం ఎంతగా పాడయ్యిందంటే నేను ఆ సేవాధిక్యతను వదులుకోవలసి వచ్చింది. నేను, షెర్లీ వ్యాధిగ్రస్తుల లిస్టులో ఉన్న ప్రత్యేక పయినీర్లయ్యాము, ఇప్పటికీ అలాగే పరిగణించబడుతున్నాం. ప్రయాణ సేవలో కొనసాగే శక్తి లేదే అనే చింత ఉన్నప్పటికీ, నేను కోరిన విధంగా నా శక్తిని ఉపయోగించగలిగినందుకు నాకు సంతోషంగానే ఉంది.

నా ముగ్గురు తోబుట్టువులు వివిధరకాల నిర్ణయాలు తీసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ భౌతిక సంపదలే లక్ష్యంగా జీవించడానికి తీర్మానించుకున్నారు, వారిలో ఎవ్వరూ ప్రస్తుతం యెహోవాను సేవించడం లేదు. 1958లో నాన్నగారు బాప్తిస్మం తీసుకున్నారు. చాలామంది యెహోవాను తెలుసుకొని, ఆయనకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడానికి అమ్మానాన్నలు సహాయం చేశారు. వారు 1999లో మరణించారు. ఆ విధంగా, పేరుప్రతిష్ఠలను నేను తిరస్కరించడం మా నాన్నకు అలాగే అమ్మానాన్న కలిసి బైబిలు సత్యాన్ని పంచిన అనేకులకు నిత్యజీవ నిరీక్షణనిచ్చింది. “ఒకవేళ నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే, నేను యెహోవాను సేవించడంలో కొనసాగేవాణ్ణా?” అని నేను తరచూ ఆలోచిస్తుంటాను.

ప్రాంతీయ సేవ మానేసిన దాదాపు ఐదు సంవత్సరాలకు, నా ఆరోగ్యం కుదుటపడింది దానితో నేను నా పరిచర్యను విస్తృతం చేసుకోగలిగాను. నేనిప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని డిసర్ట్‌ హాట్‌ స్ప్రింగ్స్‌ సంఘంలో సంఘ పైవిచారణకర్తగా సేవచేస్తున్నాను. అలాగే నాకు ప్రాంతీయ సేవలో ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా, ప్రత్యేక కమిటీల్లో సభ్యునిగా, అప్పుడప్పుడు పయినీరు సేవా పాఠశాలలో బోధకునిగా పనిచేసే ఆధిక్యత కూడా లభిస్తుంది.

నేటికీ షెర్లీ నాకు మంచి స్నేహితురాలు. ఆమె సహచర్యాన్నే నేను కోరుకుంటాను. మేము ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక పురికొల్పునిచ్చే విషయాలు చర్చించుకుంటాం, మేము చర్చించుకునే బైబిలు సత్యాలను బట్టి ఎంతో ఆనందిస్తుంటాం. 47 సంవత్సరాలకు ముందు ఆమె ప్రశాంతంగా “ఛాల్స్‌, నీ విశ్వాసమేమైంది?” అని అడగడం నాకింకా గుర్తుంది. క్రైస్తవ యౌవన జంటలు ఆ ప్రశ్నే వేసుకుంటే, మేము మా పూర్తికాల పరిచర్యలో ఆస్వాదించిన ఆనందం, ఆశీర్వాదాలను వారిలో ఎంతమంది అనుభవించవచ్చో అని నేను ఆలోచిస్తుంటాను. (g04 8/22)

[అధస్సూచీలు]

^ యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పడు ముద్రించబడడం లేదు.

^ జాన్‌ సినుట్కో 1996లో తన 92వ ఏట మరణించే వరకు యెహోవాకు నమ్మకమైన సాక్షిగా కొనసాగారు.

^ పక్షవాతంతో పోరాడిన బాబ్‌ మేక్‌ ప్రత్యక్ష కథనం తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 22, 1975, 12-16 పేజీల్లో ఉంది.

[20వ పేజీలోని చిత్రం]

1935లో అంకుల్‌ జాన్‌, ఆ సంవత్సరంలోనే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు

[22వ పేజీలోని చిత్రం]

మా కలప ఇల్లు

[23వ పేజీలోని చిత్రం]

మా తల్లిదండ్రులు 1975లో తీయించుకున్న ఫొటో, వాళ్ళు మరణపర్యంతం నమ్మకంగా నిలబడ్డారు

[23వ పేజీలోని చిత్రం]

నేడు షెర్లీతో